top of page

సృష్టిలో స్త్రీ ఒక బహుమతి

      -నిరుపమ

 

 రంగనాయకమ్మ గారి నవలల్లో నాటి ‘జానకి విముక్తి’ నుండి నేటి ‘కళ్యాణి కథ’ వరకు స్త్రీల జీవితాల్లో సాధారణంగా జరిగిపోతున్న సందర్భాల్లో ఆ సాధారణత నుండి బయటి పడి తనకంటూ ఓ విశిష్ట వ్యక్తిత్వం ఏర్పరచుకోవాలంటే ఎలా వివిధ పరిస్థితుల్లో ప్రవర్తించాలో,ఆ పరిస్థితులను ఆధారంగా చేసుకుని కథను నడిపించడం గమనించవచ్చు. కులాంతర ప్రేమలు సంభవించినప్పుడు,బాధ్యత పేరుతో స్త్రీ సతమవుతున్నప్పుడు ఎలా ప్రవర్తించాలో అన్న అంశాలను ఆధారంగా చేసుకుని రంగనాయకమ్మగారు రాసిన నవల ‘స్త్రీ.’

ఈ నవలలో  ప్రధాన పాత్రలు పద్మజ,పార్వతి. పద్మజ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. పద్మజ కన్నా ముందు శాస్త్రి. తర్వాత సుజాత. ఈ ముగ్గురు సంతానంలో పద్మజ బాల్యం నుండో ఎంతో చురుగ్గా,తెలివిగా ఉండేది. పద్మజకు బాల్య స్నేహితురాలు పార్వతి. పార్వతి తల్లి సావిత్రి. తండ్రి పాఠశాలలో మామూలు ఉపాధ్యాయుడు. పార్వతి ఆ ఇంటికి పెద్ద కూతురు.ఆమె తర్వాత రుక్మిణి,సూర్యం. పద్మజ,పార్వతి పాఠశాలలో చదువుకుంటున్న సమయంలో పార్వతి ఇంటి ఎదురుగా రఘుబాబు కుటుంబం దిగుతుంది. రఘుబాబు వీరిద్దరి కన్నా వయసులో పెద్దవాడు. అంతకు ముందు సంవత్సరం రఘుబాబు చెల్లెలు మరణించింది. రఘుబాబుకు అంతకు ముందు తలకు దెబ్బ తగలడం వల్ల నరాలు బలహీనపడటం వల్ల  అతను పాఠశాలకు వెళ్ళడానికి ఆసక్తి చూపకపోవడం వల్ల అతనికి ఇంట్లోనే పాఠాలు ట్యూషన్ ద్వారా చెప్పిస్తున్నారు. 

 రఘుబాబు పిరికివాడు. ఏ నిర్ణయం తీసుకోలేనివాడు. దేన్నైనా సూటిగా ప్రశ్నించే పద్మజ రఘుబాబుకి నచ్చలేదు.సౌమ్యంగా ఉండే పార్వతి నచ్చింది. రఘుబాబు,పార్వతీల ఇల్లులు పక్క పక్కనే ఉండటం, రఘుబాబుకి పాఠాలు చెప్పడానికి పార్వతి తండ్రినే కుదుర్చుకోవడం వల్ల ఆ రెండు కుటుంబాల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అప్పటి నుండే రఘుబాబు తల్లి అన్నపూర్ణ మరియు తండ్రి చలపతిరావు పార్వతినే  తమ కోడలిని చేసుకుంటామని అనడం, ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్న ఆ మాట అటు రఘు బాబు, ఇటు పార్వతి మనసుల్లో తాము భవిష్యత్తులో కాబోయే భార్యాభర్తలమనే భావనను బలపడేలా చేస్తుంది. 

పార్వతి పాఠశాల విద్య పూర్తయ్యేసరికి ఆమె తల్లి ఇంకో బిడ్డకు జన్మనిచ్చినా ఆ బిడ్డ మరణించడం,ఆ తర్వాత కొన్నాళ్ళకు తల్లి కూడా అనారోగ్యంతో మరణించడం జరుగుతుంది. పార్వతి తండ్రి ఆరోగ్యం కూడా క్రమేపీ క్షీణిస్తూ ఉంటుంది. ఇక చదువుకునే అవకాశం లేక కుటుంబం కోసం ఓ గుమాస్తా ఉద్యోగంలో చేరుతుంది పార్వతి. అదే సమయంలో ఓ ధనవంతుడి కూతురితో రఘుబాబుకు పెళ్లి తల్లిదండ్రులు నిర్ణయిస్తారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న పొలం అమ్మేసి కొంత కట్నం ఇచ్చి రఘుబాబుకి కూతురిని ఇచ్చి వివాహం చేయాలని  తండ్రి అనుకున్నా పార్వతి దానిని వ్యతిరేకిస్తుంది. రఘుబాబు పార్వతి దగ్గరకు వచ్చి కొంత కట్నం ఇచ్చి ఈ పెళ్లి జరిగేలా చూడమని చెప్తాడు. పార్వతి పట్ల ఇష్టమున్నా తన సొంత ఇష్టాన్ని ధైర్యంగా చెప్పలేని పిరికివాడు రఘుబాబు. అటువంటి వ్యక్తిత్వం లేని వ్యక్తిని భర్తగా వద్దనుకుని,పెళ్లి అనే ఆలోచనను పక్కన పెట్టి తన తమ్ముడు సూర్యాన్ని చదివించడం మీద దృష్టి పెడుతుంది. పార్వతి తండ్రి కూడా అనారోగ్యంతో మరణించడంతో పూర్తిగా కుటుంబ భారాన్ని తన మీద వేసుకుంటుంది పార్వతి. 

 పద్మజ తండ్రిని ఒప్పించి మెడిసిన్ చదివి డాక్టర్ అవుతుంది. పద్మజ తండ్రికి పద్మజ అభిప్రాయాలూ,స్వంతంగా ఆలోచించే తెలివితేటలు అంటే ఎంతో గర్వపడేవాడు.అలానే కూతురిలా తాను ఎప్పటికీ అలా ఆలోచించలేనని దానికి కారణం తాము పుట్టి,పెరిగిన వాతావరణం,నేపథ్యం అని ఆయన అనుకునేవాడు.కాలంతో పాటు మారుతున్న కూతురు ఆయనకి ప్రగతిభావాలు ఉన్న వ్యక్తిగా అనిపించినా,ఆయన మారలేనితనం వల్ల ఆ రెండు తరాలకు మధ్య వ్యత్యాసం అలానే ఉండిపోయింది. హౌస్ సర్జన్ గా ఉన్న సమయంలో పద్మజ ఆంగ్లో ఇండియన్ జార్జ్ విలియమ్స్ ను ప్రేమిస్తుంది. అతన్నే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. అప్పటికే ఇంట్లో ఆమెకు ఓ సంబంధం ఖాయం చేసే ప్రయత్నంలో ఆమె తల్లిదండ్రులు ఉన్నారు. తన ప్రేమ విషయం తండ్రి అర్ధం చేసుకుంటాడని,ఆయన ద్వారా కుటుంబాన్ని ఒప్పించవచ్చునన్న ఆశతో పద్మజ ఇంటికి వస్తుంది. 

 పద్మజ తండ్రితో తన ప్రేమ విషయం గురించి చెప్తుంది. ఆయన పద్మజ నిర్ణయ శక్తి మీద తనకు నమ్మకం ఉందని,కానీ తను తన ఆచారాల నుండి,వాటిని అనుసరించి ఉన్న జీవన పరిధిని దాటలేనని,కానీ ఆమెను తమతో సమాజ సాక్షిగా ఆమోదించలేకపోయినా ఆమె సుఖంగా ఉండటం కోసం ఆమె వివాహం తనకేమి అభ్యంతరం కాదని,ఆ విషయం ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపొమ్మని చెప్తాడు.అలా వెళ్ళిన ఆమె వివాహం అయ్యాక పేపర్లో ఆ వివాహ ఫోటో పడ్డాక అందరితో పాటు కుటుంబానికి కూడా తెలుస్తుంది. అందరూ ఆ వివాహాన్ని వ్యతిరేకించడమే కాకుండా,ఆమె చేసింది క్షమించలేని తప్పుగా భావిస్తారు. ఆ తర్వాత ఆరోగ్యం క్షీణించి పద్మజా తండ్రి మరణిస్తాడు. 

 ఇక పార్వతి ఉద్యోగం చేస్తూనే సూర్యాన్ని డిగ్రీ దాకా చదివించింది. చెల్లెలోలో మేనరికంలో వివాహం చేసింది. అత్తవారింట్లో  ఉన్న రుక్మిణి తనకు కావాల్సినవి అక్క నుండి ఎలా తీసుకోవాలో బాగా  తెలుసు. ఉద్యోగం చేస్తున్న అక్క నుండి  అన్నీ బాగానే రాబట్టుకునేది. సూర్యం డిగ్రీ అయ్యాక పార్వతి పెట్టించిన ఉద్యోగంలో చేరాడు. సూర్యానికి ఆ ఉద్యోగం ఏ మాత్రం సంతృప్తికరంగా లేదు. సూర్యం ధనవంతుల అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకుని ఇల్లరికం వెళ్ళిపోతాడు. సూర్యం,రుక్మిణిల కోసం పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన పార్వతిని కేవలం ఆమె తోడబుట్టిన వారు తమ జీవితాలు స్థిరపరచుకోవడానికి మాత్రమే వినియోగించుకున్నారు. రఘుబాబు భార్య సుశీల. వివాహం అయ్యాక భార్యను పట్టించుకోకుండా తాను కూడా దిగులు లోనే ఉండిపోయాడు రఘుబాబు. అతని భార్య సుశీల మానసికమైన ఈ వైవాహిక ఇబ్బందుల వల్ల చివరకు మరణిస్తుంది. 

 పద్మజ జీవితంలో ఎదుగుతుంది. ఆమెకు ఆడపిల్ల పుడుతుంది. వరల్డ్ టూర్ కి ఆ భార్యాభర్తలు వెళ్తున్న వార్త పేపర్ లో వస్తుంది. పద్మజ తల్లి తన కూతురిని బహిరంగంగా అసహ్యించుకున్నా మనసులో ఆమె మీద  ప్రేమ ఉంటుంది. పద్మజ చెల్లెలు సుజాత పద్మజను బాల్యం నుండే అభిమానించినా,ఆమె తెలివితేటల పట్ల ఎంతో నమ్మకం ఉన్నా,ఆమె చేసుకున్న వివాహంతో ఆమె మీద పూర్తి ద్వేషాన్ని పెంచుకుంటుంది. అక్క చేసింది తప్పని ఆమె వల్ల కుటుంబ పరువు పోయిందని,తాను ఎప్పటికీ అలా చేయనని అనుకుంటూ ఉంటుంది సుజాత. కానీ ఆమె వదిన జానకి స్నేహితురాలు వసుంధర పెళ్ళికి వెళ్లినప్పుడు అక్కడ వసుంధర అన్నయ్యతో ప్రేమలో పడుతుంది. అతను లేకపోతే బ్రతకలేని దశకు వస్తుంది. కానీ తల్లిని,కుటుంబాన్ని బాధ పెట్టడం ఇష్టం లేకపోవడం వల్ల,తాను అక్క కన్నా విభిన్నమైన వ్యక్తినని భావించడం వల్ల ఆమె మొదట ఆ ప్రేమను ఒప్పుకోకపోయినా ఆ తర్వాత ఆ ప్రేమలో పడ్డాక ఆమెకు అక్క చేసింది సరైనదే అనిపిస్తుంది.కానీ సుజాత బాధను అర్ధం చేసుకున్న ఆమె తల్లి సుజాత వివాహానికి ఒప్పుకుంటుంది. ఓ కూతురిని దూరం చేసుకున్న ఆమెకు సమాజం పట్టింపులు కన్నా కూడా వ్యక్తి జీవితంలో అతని నిర్ణయాలకే ప్రాధాన్యత ఉందని అర్ధం చేసుకుంటుంది. 

 సుశీల మరణించిన తర్వాత రఘుబాబు పార్వతిని వెతుక్కుంటూ వచ్చినా అతన్ని తిరస్కరిస్తుంది పార్వతి.ఓ పాపను పెంచుకోవాలని నిర్ణయించుకుంటుంది. దీనితో నవల ముగుస్తుంది. 

 ఈ నవలలో  ఓ వ్యక్తిత్వం ఏర్పడని పాత్ర రఘుబాబుది.బాల్యం నుండే తనదైన ఆలోచనలతో తన వ్యక్తిత్వం ప్రత్యేకంగా ఏర్పరచుకున్న పాత్ర పద్మజది. పరిస్థితులకు తగ్గట్టు తన వ్యక్తిత్వాన్ని మార్చుకుని, తన వ్యక్తిత్వ విలువలను ఆ మార్చుకున్న పరిస్థితుల పర్యావసానాన్ని బట్టి ఆ వ్యక్తిత్వ విలువను తెలుసుకున్న పాత్ర పార్వతిది. తన చుట్టూ ఉన్న సమాజాన్ని అనుసరించి తన వ్యక్తిత్వాన్ని నిర్మించుకుని,తనకు నచ్చిన జీవితాన్ని స్వీకరించే నిర్ణయ శక్తిని సంపాదించుకోలేని పాత్ర సుజాతది.

 ఈ నవలలో జీవితాలను గమనిస్తే నిజానికి సంతోషంగా ఉన్న పాత్ర పద్మజ. ఆమె ప్రేమించి వివాహం చేసుకున్నప్పుడు,కుటుంబ వ్యతిరేకత ఏర్పడినప్పుడు కూడా ఆమె తాను చేస్తుంది సరైనదే అని నమ్మింది. వృత్తి పరంగా ఆమె జీవితంలో ఎదిగింది. ఆమె జీవితంలోని ఏ దశలోనూ కూడా తనకు నచ్చిన వాటిని వదిలివేయలేదు. సమాజం ఆమెను తల్లిదండ్రులను బాధ పెట్టిన కూతురిగా భావించినా,తప్పు చేసిన వ్యక్తిగా పరిగణించినా అవేమీ ఆమె వ్యక్తిత్వాన్ని మార్చలేకపోయాయి. నిజానికి పిల్లల సుఖాన్ని గురించి ఆలోచించవలసిన తల్లిదండ్రులు తమ సంతృప్తిని పిల్లల జీవితాలను ప్రభావితం చేయడంతో పొందవచ్చు. ఆ సంతృప్తిని తల్లిదండ్రులు సమాజంలో తమ పిల్లలకు ఏర్పడే వైవాహిక విలువను బట్టి పొందుతారు.తమ పిల్లల వివాహాల వల్ల ఆ విలువ వారికి దక్కనప్పుడు ఆ పిల్లలు తమకు ద్రోహం చేసినట్టుగా భావిస్తారు. 

 ఈ నవలలో పద్మజకు విరుద్ధంగా ప్రవర్తించిన పాత్ర పార్వతి. ఆమె కుటుంబం కోసం జీవించడం మానేసింది. కానీ అదే కుటుంబం తమ స్థిరత్వాన్ని చూసుకుని ఆమెను ఒంటరిదానిని చేశారు. పద్మజ చేసింది తప్పని భావించిన పార్వతి ఆమెకు వ్యతిరేకమైన దిశలో కేవలం కుటుంబాన్ని చూసుకోవడమే ఉత్తమమైన జీవనం అని ఆమె అనుకుంది. కానీ  మనిషి జీవితంలో తన జీవిత పరిమితి వరకు మాత్రమే ఆలోచిస్తాడు.  మనిషిలో కృతజ్ఞత అన్నది అవసరంకు సంబంధించిందిగా ఉంటుంది.కేవలం కుటుంబంలోని వారు తనకు చూపించే ప్రేమ,తన పట్ల వారికి ఉండే కృతజ్ఞత వల్ల తన జీవితంలో ప్రేమ-పెళ్లికి ప్రత్యామ్నాయం అవుతుందనే భ్రమలో తమ వ్యక్తిగత జీవితానికి,వ్యక్తిత్వానికి సమాధి కట్టేసి,బాధల్లో -బాధ్యతల్లో తమ జీవన సార్ధకతను వెతుక్కునే ఎక్కువ శాతం పాత్రలకు ప్రతీక పార్వతి. 

 ప్రగతికి అర్ధం సామాజికమైనమైనదా లేక వ్యక్తికి కూడా వర్తిస్తుందా అన్నది నేటికి ఓ ప్రశ్నే. సామాజికంగా ఇంకొకరి కోసం తన గురించి ఆలోచించుకోకపోవడమే మంచి వ్యక్తికి ఉండాల్సిన లక్షణంగా ఇంకా భావించబడుతున్న సంస్కృతి నుండి మనిషి ఈ సామాజిక వలయంలో వివిధ రకాల మనుషులతో మెలిగేటప్పుడు తన జీవితాన్ని వ్యర్ధం చేసుకుని ఇంకొకరిని బాగు చేయడం కూడా ఓ రకమైన వ్యక్తిగత తిరోగతి అని గుర్తించి,ఆహ్వానించేలా ఆలోచించడం కూడా మనుషులు నేర్చుకోవాలి.అప్పుడే ఈ సమాజంలో బాధలు-బాధ్యతలు-అవకాశవాదాల మధ్య మనిషి తన జీవితాన్ని కోల్పోకుండా బ్రతకగలడు. ఇది స్త్రీ కేంద్రీత నవల అయినప్పటికి,ఈ నవలలో ఉన్న పరిస్థితుల ప్రభావం పురుషులను కూడా అదే స్థాయిలో ప్రభావితం చేస్తుంది. ఈ సమస్యను మారిన కాలం దృష్ట్యా గమనిస్తే స్త్రీ-పురుషులు ఇద్దరి కోణం నుండి ఆలోచించడం వల్ల పాఠకులకు ఓ విస్తృత పఠన పరిధి ఏర్పడుతుంది

©2021 © 2021 Bahula International Magazine

bottom of page