
బహుళ కవితలు
కొన్ని మంచి తెలుగు కవితలను చదవండి

Shajahana
Morning saga
నేను పిలవను
తనే వస్తుంది
శూన్యానికి కొన్ని
రంగులు అద్దుతుంది
నా కను దోయితో
కాసేపు ఆటలాడుతుంది
సీతాకోక
పట్నంలో నాలుగు
కుండీలే తోట..
బద్దకంగా నిద్రపోతున్న మొక్కల్ని తట్టి
నిద్ర లేపుతాను
కలలు చెదిరినన పిల్లాడు
పొద్దున్నే పేపర్ ని దర్వాజకిచ్చి వెళ్తుంటడు..
ఇంట్లోకి వెళ్ళే సరికి
నెత్తి మీద పల్లు వేసుకుని
ఆమె ఏదో ఒకటి చేస్తూ కనిపడుతుంది.
ఆమె మెడల మాసిన
ఒంటి పోస
నల్ల పూసల దండ..
ఒంటరిగ దిక్కులు చూస్తుంటుంది..
నీరు పట్టిన చార్మినార్
రాళ్ళ గాజులు
ఆమె వెలసిన జీవితాన్ని ..
ప్రతిబింబిస్తుంటయ్..
నుదుటి మీది బొట్టుతో బాల్కనీ కడుగుతున్నప్పటి నీటి చుక్కలు సావాసం చేస్తాయి కొద్ది సేపు...
పక్కింటి పాలిష్డ్ బండ మీద ముగ్గును అతికిస్తుంది...
ఎప్పటి వలెనే..
ఆమెరకరకాలుగా కనిపిస్తుంది..
ఆమెకు అనేక రూపాలు
ఆమె రాని రోజు
ఆపార్టీ మెంట్ లోని
ఆడవాళ్ళం
ఎవరింట్లో వాళ్ళం ఆమె గా మారిపోతాము
ఇంకెవరూ ఆమె రాలేదేమని వాకబు చేయరు..
ఆ వీధిలోని ఆమె లకు
ఏమయిందో..
ఎవరూ వాకబు చేయరు..
ఆమె మాకు
పని ఉన్నంత సేపే..
అనంతరం
మరుపు లో భాగం..
అవసరంలో భాగం..
సీతాకోక ఏ రోడ్ మీద ఎక్కడ చోటు వెతుక్కుని నిద్ర పోతుందొ..
రోజు వలె చెట్లకు నీళ్ళు తాగించి జోల పాడి నిద్ర పోతాను..
దునియాను
సౌకర్యం వంతంగా
గోడకు తగిలించి..
గాఢ సుషుప్తి లోకి..
అపుడు అనేక మంది
నిద్రను పక్కన పడేసి
పని కోసం
బయల్దేరుతారు...!