(నేడు 16- జూన్ అంబేడ్కర్ సతీమణి రమాబాయ్ వర్ధంతి)
అంబేద్కర్ వెనుక ఆమె!
యం.రాం ప్రదీప్, తిరువూరు
'ప్రతి పురుషుడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుంది "అంటారు.భార్య సహకారం లేకుండా ఏ భర్త కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించలేరు.డా. బి.ఆర్.అంబేద్కర్ జీవితంలో కూడా ఆయన సతీమణి రమాబాయి కీలక పాత్ర పోషించారు.కుటుంబంలో భార్య స్థానం ఎంత గొప్పదో చెప్పటానికి రమాబాయి గారి జీవితం ఒక ఉదాహరణ.
కుటుంబ ఆర్థిక అవసరాలు, సంపాదన ఎరిగి జాగ్రత్తగా తన భర్త సంపాదన ఖర్చుచేసే ఉత్తమ ఇల్లాలుగా శ్రీమతి రమాబాయి అంబేద్కర్ జీవితం మనకితెలియజేస్తుంది.అంబేద్కర్ లక్ష్యాన్ని తెలుసుకుని కుటుంబ భారం తనమీద వేసుకుని సంతోషంగా పైచదువులకి పంపారు. పిడకలు అమ్మి వచ్చిన డబ్బుతో కుటుంబ అవసరాలు తీర్చి, బాబాసాహెబ్‌కు కూడా మనీ ఆర్డర్ చేసేవారు. అంబేద్కర్‌లాంటి ప్రపంచ మేధావుల్లో ఒకరిని మనకి అందించిన త్యాగశీలి రమాబాయి.
భర్త బారిస్టరైనా రమాబాయి జీవితం పూలపాన్పుమాత్రం కాదు. అంబేద్కర్ మాటల్లో *"తన జీవితభాగ స్వామి రమాబాయి జీవితం త్యాగాలమయం.
సాత్వికమైన ఆమె మనసు, ఆమెలోని మానసిక సద్భావనతో, పవిత్రమైన సదాచారాలతో దు:ఖభరితమైన దినాల్లో కూడా నాకు అండగా నిలబడింది. భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్.అంబేద్కర్. ఆయన చేసిన ప్రతి కార్యం వెనుక ఆయన భార్య రమాబాయి అంబేద్కర్ సహకారం ఎంతో ఉంది. ఈ విషయం వీరి జీవితాన్ని గమనిస్తే అర్థమవు తుంది.
రమాబాయి 1897, మే 7న బికువలదకరాకు రెండవ కుమార్తెగా వాలంగ్ గ్రామంలో దపోలో దగ్గర జన్మించారు. వీరిది చాలా పేద కుటుంబం. తండ్రి కూలిపనిచేసేవాడు. బుట్టలో చేపలు పట్టుకొని సముద్రపు తీరంలో ఓ బారులో అమ్మేవారు. అతని సంపాదన వారి తిండికి కూడాసరిపోయేది కాదు. అన్న కూలి పనిచేసేవారు. చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. కొంతకాలానికి తండ్రి కూడా మరణించాడు. తర్వాత బొంబాయిలో ఉండే మేనమామ వీరిని పోషించారు. రమాబాయికి తొమ్మిది ఏళ్ల వయసులో, అప్పటికే పదో తరగతి పూర్తి చేసిన పదిహేను సంవత్సరాల అంబేద్కర్‌తో పెళ్లి జరిగింది. వారి వివాహం జరిగిన విధానం ఆకాలంలో పేద జీవితానికి అద్ధం పడుతుంది. వారి వివాహం బైకుల్లా చేపల మార్కెట్ (బొంబాయి)లో మార్కెట్ మూసిన తర్వాత, రాత్రి పూట ఓపెన్‌షెడ్‌లో జరిపించారు.
రమాబాయి చాలా తెలివిగా బాధ్యతగా వ్యవహరించేవారు. కడుపేదరికంలో ఉన్నప్పటికీ, ఎప్పుడూ ప్రశాంత వదనంతో ఉండేవారు. వివాహ సమయంలో ఆమెకు చదువురాదు. అంబేద్కర్ ఆమెకు చదవడం, రాయడం నేర్పించారు. అంబేద్కరంటే ఆమెకు అమితమైన ప్రేమ. అనురాగంతో కూడిన గౌరవం ఉండేది. నమ్మకం, త్యాగం, అర్థం చేసుకునే గుణం వీరిరువురినీ జీవితాంతం ఆనందంగా ఉండేటట్లు చేసింది. అంబేద్కర్ ఆమెని రాము అని పిలిచేవారు. ఆమె తన భర్తని సాహెబ్ అని పిలిచేవారు.
నిరంతర అధ్యయనంతో జ్ఞానసముపార్జనతో నిమగ్నమైన తన భర్తని చూసి ఆమె చాలా గర్వపడేవారు. ఆయన అభివృద్ధి కోసం నిత్యం తపించేవారు. అంబేద్కర్ ఇంటి కోసం అసలు సమయం కేటాయించేవారు కాదు.
అయినా ఆమె సంసార బాధ్యతల్ని చక్కగా నిర్వహించేవారు.
అంబేద్కర్ పైచదువులకు అమెరికావెళ్లాలనుకున్నప్పుడు ఇంటి దగ్గర స్త్రీలంతా రమాబాయికి పంపవద్దని చెప్పారు. ఆమె అలాచేయక అంబేద్కర్ అమెరికా వెళ్లడానికి సహకరించారు. ఇది ఆమెకు అతనిపై ఉన్న అచంచల విశ్వాసం, ప్రగాఢమైన నమ్మకానికి నిదర్శనం.
భర్త బారిస్టరైనా రమాబాయి జీవితం పూల పాన్పుమాత్రం కాదు. ఆమె జీవితం త్యాగాల మయం. అంబేద్కర్ చదువు, ఉద్యమాలతో బిజీగా ఉండటంతో కుటుంంబ భారమంతా రమాబాయి చూసుకోవాల్సి వచ్చింది.
అంబేద్కర్ ఉన్నత చదువులు చదవాలి అని ఆమెకు ఆశగా ఉండేది. బాబాసాహెబ్ డా. అంబేద్కర్ చదువులు కోసం లండన్ వెళ్లినప్పుడు రమాబాయినే కుటుంబ అవసరాలు తీర్చారు. కుటుంబ జీవితంలో ఎన్ని కష్టాలు, నష్టాలు జరిగినా ఆమె ఏరోజు చలించిపోలేదు, సమస్యలకు లొంగిపోలేదు. అంబేద్కర్ ఎన్నో డిగ్రీలు పొందారు. అవన్నీ రమాబాయి త్యాగనిరతికి ప్రతీకలు.
రమాబాయి జీవితం ఎన్నో విషాదాలు చూసింది. వీరికి ఐదుగురు పిల్లలు. కొడుకులు రమేశ్, గంగాధర్, యశ్వంత్, రాజరతన్, కూతురు ఇందు. ఒక్క యశ్వంత్ తప్ప మిగిలిన వారందరూ మరణించారు. పిల్లల మరణం ఆ దంపతుల్ని కుంగ తీసింది.
నలుగురు పిల్లలు మరణం, భర్త ఎప్పుడూ ఇంటి పట్టున ఉండకపోవటం, సమాజంలో రాజకీయ ఉద్రిక్తతలు ఆమెను ఆందోళనకు గురిచేశాయి. భర్త ఆరోగ్యం కోసం ప్రార్థించేది. అంబేద్కర్‌కి ఆరోగ్యం సరిగా లేకపోయినా ఆమెకు తెలియనిచ్చేవారు కాదు. ఆమె మరింత ఆందోళన చెందడం అంబేద్కర్‌కి ఇష్టముండేది కాదు.
రమాబాయి ఆరోగ్యం రోజు రోజుకు క్షీణించిపోయింది. ఆమె రోజురోజుకినీరసించిపోసాగింది. ముఖం కళావిహీనంగా మారిపోయింది. అయినా ఆమె ఆలోచనలన్నీ అంబేద్కర్ మీద ఉండేవి. రమాబాయి అనారోగ్యంతో ఉన్నప్పుడు అంబేద్కర్ సాన్నిహిత్యం కోరుకునేది.
అంబేడ్కర్ రమాబాయితో గడిపిన ఘడియలు తక్కువ. అంత అరుదైన ఆమె సాన్నిహిత్యాన్ని కోల్పోయిన అంతులేని బాధని అంబేడ్కర్ ఒక వ్యాసంలో ప్రస్తావించారు. అలాంటి మమతామూర్తి అయిన సామాన్య స్త్రీతో రోజులోని 24 గంటల్లో అర్ధగంట కూడా గడపలేకపోయాను’’ అన్నారాయన.
పరిసరాలు మారితే మానసిక స్థితిలో మార్పు వస్తుంది ఏమో అని అంబేద్కర్ అప్పుడపుడు పక్క ఊర్లకి పంపేవాడు. పూనా ఒప్పందం మీద తీవ్రమైన చర్చలు జరుగుతున్నా అంబేద్కర్ వాతావరణం మార్పు కోసం ఆమెను ధార్వార్ తీసుకెళ్లారు. అయినా ఆమె ఆరోగ్యం కుదుటపడలేదు. దాంతో రమాబాయి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. చివరకు 1935 మే 27న ఆమె తుదిశ్వాసవిడిచారు.పవిత్రమైన నిర్మలమైన మనసు మూగబోయింది. ఆమె మరణించిన తర్వాత అంబేద్కర్ కన్నీరు మున్నీరుగా విలపించారు. చివరకు సన్యాసం తీసుకోవాలని భావించారు. ఎంతోమంది మిత్రులు నచ్చచెప్పి అంబేద్కర్‌ని మామూలు మనిషిగా మార్చారు.
ఈవిధంగా కటికదారిద్య్రంలో జీవితం కొనసాగించిన రమాబాయి ఏ రకమైన ప్రలోభాలనూ తన దరిదాపుల్లోకి రానివ్వలేదు. ఎంతో ఆత్మగౌరవంతో, మానసిక నిబ్బరంతో జీవించారు. ప్రపంచమేథావి అయిన అంబేద్కర్ జీవన గమనంలో ఆమె రహదారిగా మారారు. ఇలాంటి ధన్యజీవి రమాబాయి అంబేద్కర్ జీవితం అందరికీ ఆదర్శం.
నేడు అంబేద్కర్ని పైకి అందరి వాడు అంటూనే, ఆయనను కొందరి వాడిని చేసే కుట్ర జరుగుతుంది.ఆయన వ్యక్తిగత ఆరాధననివ్యతిరేకించారు.ఆయన వ్యక్తిత్వం ఆయన విగ్రహాల్లో లేదు.ఆయన రచించిన పుస్తకాలలో ఉంది.ఇప్పటికైనా అంబేద్కర్ అభిమానులు ఆయన రచించిన పుస్తకాలకి మరింత ప్రాచుర్యం కల్పించాలి.అప్పుడే అంబేద్కర్ భావజాలం మరింతగా ప్రజల్లోకి వెళ్తుంది.