
బహుళ కథలు
కొన్ని మంచి తెలుగు కథలను చదవండి

పల్లీబుట్ట
ఆచార్య సూర్యాధనంజయ్
"ప్రయాణికులకు విజ్ఞప్తి ట్రైన్ నెంబర్ 25790 విజయవాడ నుండి సికింద్రాబాద్ వెళ్ళవలసిన శాతవాహన ఎక్స్ ప్రెస్ మరికొద్ది సేపట్లో ఫ్లాట్ ఫామ్ నెంబర్ 02 మీదికి రానున్నది" అంటూ తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో అనౌన్స్ మెంట్ వినిపిస్తుంది.
పూల్ సింగ్ తన భార్య సక్కుతో పాటు తాను పరుగెత్తుతూ "రోజు నీకు ఇది అలవాటై పోయింది. గాడి టైం అవుతున్నా కూడా ఇంట్లో ఏదో ఒకటి సర్దుతూనే ఉంటవ్. ఎందుకే నువ్వు. నీకు ఎన్ని సార్లు చెప్పాల్నే. నేను చెబితే ఎన్నడన్నా విన్నావా. రోజు నీతో గిట నన్ను ఊరికిస్తున్నావ్" అంటూ సక్కును తిడుతున్నాడు. ఆమె అవేం పట్టించుకోవట్లేదు. తన గంపలోంచి ఏది కిందపడకుంటే అంతే చాలు అనుకుంటోంది. ఏదైతేనేం ఎట్టకేలకు మహబూబాబాద్ రైల్వేస్టేషన్ కు చేరుకున్నారు. ఎక్స్ ప్రెస్ ట్రైన్ ఒకటి అప్పుడే ఫ్లాట్ ఫామ్ కి వస్తుంది. "యాడియే *దాస్ దాస్..." అంటూ సక్కు పూల్ సింగ్ లు పరుగెత్తుతూ స్టేషన్ చేరుకున్నారు. సింకిద్రాబాద్ నుండి గుంటూరు వెళ్లే ట్రైన్ అప్పుడే అక్కడినుంచి కదిలింది. స్టేషన్ ఖాళీగా కనిపించింది. "హమ్మయ్య వెళ్ళింది గుంటూరు గాడి. ఆపన్ గాడి ఇంకా రాలేద"ని ఊపిరి పీల్చుకున్నారిద్దరు. అంతలోనే నగరంలోని పక్షులను చెట్లమీదినుండి అదిలిస్తున్నదా, వాహనాల చప్పుళ్లను మింగుతున్నదా అన్నట్లు పెద్ద పెద్దగా కూ... కూ...అంటూ హార్న్ సైరన్ తో సింకిద్రాబాద్ వెళ్లే ట్రైన్ వచ్చి రెండవ నెంబరు ఫ్లాట్ ఫామ్ పై ఆగింది. ప్రయాణికులందరూ ఎక్కాక గంపలోంచి మూడు బుట్టలు లోపల పెట్టాడు పూల్ సింగ్. వాటి మూతులు కాటన్ గుడ్డలతో చుట్టబడి ఉన్నాయి.
"జత్తన్ సక్కు . వచ్చిన పైసలు ఖర్చు చేయకుండా తీసుకురా. పిల్లల ఫీజు కట్టాలి మర్చిపోకు. నాస్తా కూడా చెయ్యలే నువ్ కాజీపేట స్టేషన్ల సమోసా తిని చాయ్ తాగు" అంటూ పూల్ సింగ్ సక్కును ట్రైన్ ఎక్కించాడు. పూల్ సింగ్ మహబూబాబాద్ మార్కెట్లో కూరగాయలు హోల్ సెల్ కి కొని ఊరూరా తిరిగి అమ్ముతుంటాడు. ఇద్దరూ పనిచేస్తేనే ఇల్లు గడిచేది. తండాలో భూమి లేకపోవడం,తన తల్లి క్యాన్సర్ తో ఈ లోకాన్ని వీడిపోవడంతో పిల్లలు, తండ్రితో కలిసి మహబూబాబాద్ వచ్చేశాడు. తాము కష్టాలు పడ్డా పర్వాలేదని పిల్లలు తమలా కష్టం చూడకూడదని పిల్లల్ని మంచి పేరున్న పబ్లిక్ స్కూల్ లో చేర్పించాడు. చదువుకొని మంచి స్థాయిలో తమ పిల్లలుండాలని వారిద్దరి ఆరాటం.
బోగికి బోగికి మధ్య ఉండే సందులో నాలుగు బుట్టల్ని సర్దింది సక్కు. కిక్కిరిసిపోయిన ట్రైన్ లో కూర్చున జాగాలేక చాలామంది నిలబడే ప్రయాణిస్తున్నారు. బోగీ సందులో కూర్చున్న ఒక ముసలయ్యకు బుట్టల్ని చూడమని చెప్పి ఒక బుట్టను చంకలో పెట్టుకొని " ఫళి ఫళి వేయించినవి, ఉడక బెట్టినవి" అంటూ జనాల్ని కదిలిస్తూ ముందుకు సాగింది. కొంతమంది విసుక్కుంటూ "ఏమిటమ్మా ఇది. నిలబడనీకే జాగా లేదు. మధ్యలో నీ లొల్లి ఏంది" అంటూ జరగలేక జరిగారు. ఎవరు విసుక్కున్నా, ఏమన్నా తానేమీ అనకుండా పల్లిలు అమ్ముతుంది.
కే సముద్రం దాటిన ట్రైన్ ఇంతలోనే వరంగల్ స్టేషన్ పరిసరాల్లోకి వచ్చింది. ఒక బుట్ట పల్లీలు అమ్మేసింది సక్కు సికింద్రాబాద్ వెళ్లేలోగా మూడు బుట్టలు అమ్మేయ్యాలి. రోజూ ఇదే ఆమె దినచర్య.
ట్రైన్ కాసేపట్లో ఫ్లాట్ ఫార్మ్ మీదికి చేరుతుందనే సమయంలో టీసి ఒకడు తాను అమ్ముతున్న బోగి లోకి వచ్చాడు. టికెట్ లేని ప్యాసింజర్లు కొందరు అతని వెనకాల దీనంగా "సార్ సార్ మమ్మల్ని వదిలేయండి సార్"అంటూ వస్తున్నారు. సక్కు రోజు చాలామంది టీసీలను చూస్తుంది. తనలాంటి పల్లీలమ్ముకునే వారిని ఇప్పటివరకూ ఎవ్వరూ ఏమి అన్న దాఖలాలు కనబడలేదు.ఇతనేవరో కొత్తగా డ్యూటీలోకి ఎక్కినట్టున్నాడు. బండి వేగాన్ని ఫ్లాట్ ఫార్మ్ పగ్గం వేసి లాగేసిందా అన్నట్టు ఒక్క కుదుపు కుదిపి ఆగింది రైలు. వస్తూ వస్తూనే "ఏయ్ నీకు లైసెన్స్ ఉందా ట్రైన్ లో వ్యాపారం చేసుకోడానికి. నువ్వు ముందు బండి దిగు" అంటూ ఆమెను కిందికి నెట్టేస్తున్నాడు. "సారు బతకనీ సారు. బీదదాన్ని సారు. ఇద్దరు పిల్లలు ఉన్నారయ్యా. ఇస్కూల్ పీజు కట్టాలి సారు. నేను పల్లిలమ్మి తీసుకపోయే పైసలే మా బతుకు దెరువు సారు. వదిలేయండి సారు. వదిలేయండి సారు" అని పొట్టను చూపుతూ వేడుకుంది. "ఏం మాట్లాడుతున్నావ్. చల్ చల్ కిందికి దిగు, రోజు మీకు ఇదొక ఆట అయిపోయింది. నువ్వు ముందు దిగు" అంటూ టీసి ఆమెను కిందికి తోసేశాడు. "సారు నా బుట్టలు లోపల ఉన్నాయి దింపుకుంటా సారు" అంటూ సక్కు ప్రాధేయపడింది. కానీ టీసి వినలేదు పైగా సెక్యూరిటీని పిలిచి స్టేషన్ బయటకు గెంటించాడు. ఆమె వద్ద ఇప్పుడు ఒక బుట్ట పల్లీలమ్మిన 200 రూపాయలు మాత్రమే ఉన్నాయి. అయినా ఆమెలోని ఆశ చావలేదు. ట్రైన్ ఇంకా కదలలేదు. డబల్ క్రాసింగ్ పడినట్టుంది. వెంటనే మళ్ళీ స్టేషన్ లోకి వెళ్లాలని ప్రయత్నించింది. కానీ లాభం లేకపోయింది.
ఆ చండశాసనుడు ఫ్లాట్ ఫామ్ మీదనే ఉన్నాడు. ఇంతలో క్రాసింగ్ బండి వెళ్ళిపోయింది. ట్రైన్ కదులుతుంది. ఆ టిసి సెకండ్ క్లాస్ బోగిల వైపు వెళ్లడం గమనించిన సక్కు వేగంగా పరిగెత్తి తన బుట్టలున్న బోగీలోకి ఎక్కేసింది. ఈ ప్రయత్నంలో ఆమె కాలుకు బోగి తలుపు
తగులుకొని గాయం అయి రక్తం ధారాపాతంగా కారుతుంది. గాయం చేసిన నొప్పికి ప్రాణం పోయినట్లయింది. వెంటనే తేరుకొని కొంగు భాగాన్ని కాస్త చింపి కాలికి కట్టుకుంది. బాధను పంటికింద దాచుకుంది.
ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షులైన ప్యాసింజర్ లు ఒకరిద్దరు "పాపం కడుపు కష్టం. ఏం జేస్తాం. ఎవరి కర్మ ఎలా ఉందో" అనుకున్నారు. ఖాళీ బుట్టను మిగిలిన బుట్టల కింద పెట్టి మరో బుట్ట తీసుకొని కుంటుకుంటూనే మరో బోగీలోకి వెళ్ళింది సక్కు. రిజర్వేషన్ బోగిని కలుపుతూ ఒకే కారిడార్ పరుచుకుని ఉంటుంది. అలా ఆమె ముందుకు కదులుతూ ఐదు బోగీలు దాటి ఆరో బోగీలోకి ప్రవేశించింది.
ఫళి ఫళి అనే స్వరాన్ని, ఆ స్వరంలోని బంజారా యాస సుగంధాన్ని వినగానే ఆమె ఎవరో తమ జాతికి చెందిన స్త్రీయే అనుకున్నాడు హీరానాయక్. తన పక్కనే కూర్చున్న తన చెల్లి పద్మతో "వస్తున్నది ఎవరో మన అమ్మాయిలాగే ఉంది. పల్లీలు కొందాం"అన్నాడు. ఆమె సరేనని తల వూపింది. హీరానాయక్ , అతని చెల్లి డోర్నకల్ లో ఉండే తమ బంధువుల ఇంట్లో *వాయా ఉంటే వెళ్లి తిరిగి హైదరాబాద్ వెళ్తున్నారు. ఇందాకా సక్కుతో జరిగిన సంగతి గురించి వీళ్ళకేం తెలియదు. ఆ బోగికి వీరు ప్రయాణిస్తున్న బోగికి చాలా దూరం ఉంది. దీనికి తోడు ప్రయాణికులు, చాయ్,సమోసా వాలాల గోల ఒకటి. దానితో కనీసం టీసి అరుపులు కూడా వినబడలేదు .
సక్కు వీళ్ళున్న కంపార్టుమెంట్ కి రాగానే "ఏ *బాయి బీస్ రూపాయార్ పల్లీ ద." అన్నాడు హీరానాయక్. ఆమె దీనంగా ముఖం పెట్టి కాగితాల్లో తన కష్టాన్ని పల్లీలుగా చుట్టి అందించింది. ఆమెను చూడగానే హీరానాయక్ చెల్లి పద్మ "*భీయా ఈమెనెవరో కొట్టినట్టున్నారు. పాపం కాలికి గాయం కూడా అయింది. కుంటుతుంది. ఆమెను ముందు కూర్చోమను. ఆకలితో ఉన్నట్టుంది పులిహోర తింటుందేమో అడుగు" అన్నది. ముందు కడుపు చూసి తర్వాత హృదయం చూడాలంటారు బంజారా పెద్దలు. ఆమె తన తండ్రి చెప్పిన మాటల్ని తన అక్క చెబుతుంటే విన్నది. అందుకే ఆమె పరిస్థితి చూడగానే ఆమె ఆకలిని కూడా పసిగట్టేసింది. హీరానాయక్ ఆమెను కూర్చోమన్నాడు. సీటుపై కూర్చోకుండా కిందనే కూర్చుంది సక్కు. "కాయి బాయి కూనస్ తండో తార్. అన్నాడు హీరానాయక్. భియా తూ థం రే. బాయి తూ ముందుగా యే పులిహోరా ఖాల" అన్నది పద్మ. సక్కు సున్నితంగా వద్దని సైగ చేసింది. కానీ పద్మ బలవంతం ఆమె ప్రయత్నాన్ని విఫలం చేసింది. సక్కు ఎంతో కృతజ్ఞతతో ఆమె ఇచ్చిన పులిహోరా తిన్నది. ఆమె అనుభవిస్తున్న గాయం తాలూకు పీడనకు తోడు పిండేస్తున్న ఆకలిని పద్మ పెట్టిన పులిహోరా మాయంచేసింది.
దీనంగా ఉన్న సక్కును చూసి హీరానాయక్ "ఏం జరిగింది ఎందుకలా ఉన్నావ్ బాయి"అని అడిగాడు. ఇందాక జరిగిన వృత్తాంతం మొత్తం చెప్పి చీరకొంగుతో జలజలా కారిపోతున్న కన్నీటి సెలయేటికి అడ్డుకట్ట వేసింది సక్కు. ఆమె పరిస్థితికి హీరా,పద్మలిద్దరూ కదిలిపోయారు. పద్మ వెంటనే 2000 రూపాయలు తన హ్యాండ్ బ్యాగ్ లోంచి తీసి ఉంచమని చెప్పింది. ఆమె మొహమాటం పడుతుంటే చేయి లాగి మరీ ఆమె చేతిలో పెట్టింది. ఆమె వారి దాతృత్వానికి చలించిపోయి పద్మ కాళ్లకు దండం బెట్టబోయింది. కానీ పద్మ ఆమెను వారించి "పెద్దదానివి బాయి. తప్పు. అట్లా మొక్కద్దు" అంది. వారిద్దరికీ కళ్ళతోనే కృతజ్ఞతలు తెలియజేసి వేరే బోగీలోకి వెళ్ళిపోయింది సక్కు. చూస్తుండగానే అప్పుడే ఘనపురం వచ్చింది.
చాలామంది ట్రైన్ దిగారు. కొందరు ఎక్కారు. అందులో ఒక పదిమంది దాకా యువకులు ఉన్నారు. అంతా కాలేజీ పిల్లలే. వాళ్లలో ఇద్దరు పల్లీలు ఇమ్మని సక్కును అడిగారు. పది రూపాయల పల్లీలకు వంద నోటు ఇచ్చారు. ఆమె బొడ్డుకున్న * కోత్లి లోంచి చిల్లర తీసి ఇచ్చింది. అప్పుడు ఆ యువకుల కండ్లు జిగేల్ మన్నాయి. వారిద్దరి కండ్లకు పదుల సంఖ్యలో నోట్లు కనబడడంతో వారిద్దరి బుద్ది పక్కతోవ పట్టింది. ఎలాగైనా ఆమె డబ్బు కాజేయాలనుకున్నారు. దూరం నుంచే ఆమెను అనుసరిస్తున్నారు. ఇంతలో ఆలేరు వచ్చింది. చాయ్ వాలాల సందడి మొదలైంది. బుట్ట పూర్తిగా అమ్మిన లాలి మూడో బుట్ట కోసం మునుపటి బోగికి వెళ్ళింది. ఈ పిల్లలిద్దరూ ఆమెను గమనిస్తూనే ఉన్నారు. ఆమె ఎక్కడైనా దిగిపోతుందేమోనని కనిపెట్టుకొని ఉన్నారు. ట్రైన్ స్టార్ట్ అయింది. అప్పటివరకు తీరిక లేకుండా పల్లీలమ్మిన సక్కు కాసేపు బుట్టలున్న సందులో కూలబడింది. చూస్తుండగానే బండి ఘటకేసర్ దాటి సికింద్రాబాద్ పరిసరాల్లోకి వచ్చింది. కొద్ది నిమిషాలు ఫ్లాట్ ఫామ్ కోసం ఆగిన బండి మెల్లిగా ముందుకు కదిలింది.
"దయచేసి వినండి విజయవాడ నుండి సికింద్రాబాద్ రావాల్సిన శాతవాహన ఎక్స్ ప్రెస్ మరి కొద్ది సేపట్లో ఫ్లాట్ ఫామ్ నెంబర్ 08 మీదికి రానున్నది" అనౌన్స్ స్టేషన్ లో వినిపిస్తున్నది. ఇటు రైలులో ప్రయాణికులు అందరూ లేచి నిలబడ్డారు. ఇంతలో అనౌన్స్ మారింది బండి "ఫ్లాట్ ఫార్మ్ మీదికి వచ్చియున్నది" అంటూ స్టేషన్ లో, ట్రైన్ లో ఉన్న అందరినీ అలర్ట్ చేస్తున్నది. ట్రైన్ వేగం తగ్గి మెల్లగా ఆగిపోయింది. కిక్కిరిసిపోయిన ట్రైన్ లోంచి ప్రయాణీకులు ఒకరిని ఒకరు తోసుకుంటూ దిగిపోతున్నారు.
సికింద్రాబాద్ చేరిన ఈ బండి రూటు మారి నిజామాబాద్ వెళ్తుంది. దిగేవాళ్లకు తోడు ఎక్కేవాళ్ళ సందడి అంతా ఇంతా కాదు జేబు రుమాళ్లు తీసుకొని కిటికీ కిటికీకి తిరుగుతూ సీటు పట్టుకుంటున్నారు. కొందరు అత్యవసరపు కిటికీలోంచి బలవంతంగా లోపలికి దూరి సీట్లు ఆపుకుంటున్నారు. సక్కు బోగి సందులో తన బుట్టల్ని సర్దుతోంది. ఇంతలో యువకులిద్దరు ఆమె సర్దుతున్న చోటు నుండి కిందికి దిగుతూ ఆమె నడుముకున్న సంచిని లాగేసుకొని జనాల్ని తోసుకుంటూ ముందుకు దిగి స్టేషన్ లోని జనాల్లో కలిసిపోయారు. వారిద్దరి హడావిడికి చిన్నపాటి తోపులాటే జరిగింది. ఈ తోపులాటలో సక్కుకి తన సంచి జారిపోయినట్టు అనిపించి ఒక్కసారిగా నడుముకు చెక్కుకున్న డబ్బు సంచి(కోత్లి) వైపు చూసుకుంది. సంచి మాయమైంది. జనం తోపులాటలో కింద ఎక్కడైనా పడిందేమో అని చూసుకుంది. కానీ ఎక్కడా తన కోత్లి కనిపించలేదు. ఆమె లబోదిబోమంటున్నా ప్యాసింజర్ లు ఆమె గోడు పట్టించుకోలేదు. ఆమె ఏడుస్తూనే ట్రైన్ దిగిపోయింది.
ఏం చేయాలో తోచలేదు. ఇక్కడ ఎవరూ తెలియదు. పోనీ రైల్వే పోలీసులకు కంప్లైంట్ ఇద్దామంటే తనకు లైసెన్స్ లేదు. రెండు చేతులు పైకెత్తి గుండెల్ని బాదుకుంటూ ఏడ్చేసింది. ఖాళీగా ఉన్న మూడు బుట్టల్లో ఆమె జీవితం కనిపించింది. ఆమె దగ్గర కనీసం ఫోన్ కూడా లేదు. భర్తతో విషయం చెబుదామంటే. పైనుంచి భర్త ఎంత తిడతాడోనన్న భయం ఆమెను దహించివేస్తుంది. ఆమె చీరకొంగు కన్నీళ్ళ ఉప్పుతో తడిసి ఎండిపోయింది.
చేతిలో పల్లీలతో నిండిన ఒక బుట్ట మాత్రమే ఉంది. సాయంత్రం ఆరింటికి విజయవాడ బండి ఉంది. ఒక్కసారిగా తన పిల్లలు, భర్త తన కళ్ళముందు కనిపించారు. వెంటనే కన్నీటి ప్రవాహానికి ఆనకట్ట కట్టేసింది. మనసు దిటువు చేసుకొని ఉన్న ఒక్క బుట్టను ఫ్లాట్ ఫామ్ పై అమ్మేసింది. సాయంత్రం బండికి తిరుగు ప్రయాణం అయింది. ట్రైన్ కదిలిపోతుంటే ఆమె గుండె చప్పుడు రైలు బండి చప్పుడును అనుసరించింది. రైలు ఇప్పుడు పట్టాల మీద పరుగెత్తడం లేదు ఆమె గుండె గదుల్ని పట్టాలుగా చేసుకుని లబ్ డబ్ మంటూ వేగాన్ని పెంచుకుంది.
సక్కు తనలో తాను లేదిప్పుడు. ట్రైన్ కారిడార్ లో బుట్టలపై తలపెట్టి విషాద సాగరపు లోతుల్ని మ్రింగుతోంది. ఒకరిద్దరు రైలు కదలికలకు కాళ్ళు చేతులు తొక్కినా ఆమెలో చలనం లేదు. స్టేషన్లు మారిపోతున్నాయి. దిగేవాళ్ళు దిగుతున్నారు. ఎక్కేవాళ్లు ఎక్కుతున్నారు. ఆమె మాత్రం అచలనపు అంధకారంలో బండబారిపోయింది. ఇంతలో చాయ్ వాలా ఒకడు ఈమె మహబూబాబాద్ అమ్మాయి అని గుర్తుపట్టి ఆమెను తట్టి లేపాడు. "పల్లీలన్నీ అమ్మేసినట్టున్నావ్. మళ్ళ ఏమైంది గట్లున్నవ్. ముందుగాళ్ల గీ చాయ్ తాగు" అన్నాడు. ఆమెకు మనస్కరించలేదు. చెంపలమీది నుండి కన్నీళ్లు కారిపోతున్నాయి. "ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావ్" అన్నాడు చాయ్ వాలా. తల అడ్డంగా వూపి ఏమీలేదంటూ మౌనంగా సమాధానమిచ్చింది. చాయ్ వాలాకు పరిస్థితి అర్ధమైంది. తాను ఇలా కష్టాన్నీ చేజార్చుకున్న వారిని ఎందరినో చూశాడు. ఇంతలో మహబూబాబాద్ స్టేషన్ వచ్చేసింది.
పగలును ఎప్పుడో మింగేసింది రాతిరి. సమయం తొమ్మిది గంటలవుతున్నది. ఫ్లడ్ లైట్ కాంతుల్లో మహబూబబాద్ రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫార్మ్ మీద పూల్ సింగ్ భార్య కోసం ఎదురుచూస్తున్నాడు. ట్రైన్ ఆగి ప్రయాణికులు దిగుతున్నారు. కానీ తన భార్య కనిపించలేదు. దీనితో అతనికి దిగులు మొదలయ్యింది. ట్రైన్ కదలబోతుంటే లేని శక్తిని కూడబెట్టుకొని కదులుతున్న ట్రైన్ లోంచి దిగింది సక్కు. పట్టుతప్పి ఫ్లాట్ ఫామ్ మీద పడిపోయింది. భర్త పూల్ సింగ్ ఈ దృశ్యాన్ని చూసి హడలిపోయాడు. సక్కుని లేపి కూర్చోబెట్టి ఆమె గడ్డం పట్టుకొని "కాయి వెగో, నీ హాలత్ ఇట్లా ఎందుకయింది. కాలికి ఆ గాయం ఏంది. ఏమైంది" అని కంగారుగా అడిగాడు. అతని మనసు భయంతో వణికిపోయింది. ఆమె ఏమి మాట్లాడలేదు. మౌనమే ఆమె సమాధానమైంది. భర్త భయానికి ఆమె పెదవి విప్పలేదు. వారిద్దరూ ఇంటికి చేరారు. భర్త చేతిని వదిలి గోడకు ఒక పక్కన వాలిపోయింది సక్కు. "బుట్టలు ఖాళీ అయ్యాయి. నువ్వు మాత్రం సోయి లేకుండా ఉన్నావ్. కాలికి ఆ గాయం ఎట్ల అయింది. ఏం జరిగింది" అన్నాడు పూల్ సింగ్. ఆమె స్థణువు లెక్క ఉండిపోయింది. పిల్లలిద్దరూ ఆమెని చుట్టుముట్టారు. తల్లినలా చూసి తల్లడిల్లిపోయిన వారి వెచ్చని కన్నీళ్లు సక్కుని ఈ లోకంలోకి లాక్కొచ్చాయి. భర్త ప్రేమతో అడుగుతుంటే భయాన్ని పక్కకునెట్టి విషయం చెప్పింది. పూల్ సింగ్ "అయ్యో" అంటూ ఒక్కసారి తల బాదుకున్నాడు. కానీ తన భార్య పడ్డ వేదనకు కరిగిపోయి ఆమె కనీళ్లను పంచుకున్నాడు. మూలకు పెట్టిన ఖాళీ పల్లీల బుట్టల వైపు చూశాడు. అవి అతని జీవితాన్ని వెక్కిరిస్తున్నట్టనిపించింది....
ఆచార్య సూర్యాధనంజయ్
అధ్యక్షులు,తెలుగుశాఖ.
ఉస్మానియా విశ్వవిద్యాలయం,
హైదరాబాద్
******************************************************************************

వివక్ష
నాంపల్లి సుజాత
సాయంత్రం ఐదు కావొస్తుంది.. పొలం పనులకెళ్లిన వాళ్ళు తిరుగుముఖం పట్టారు. ఎన్నడూ లేనిది మాపక్కింటోళ్ళింటి ముందు అంతమంది ఎందుకు గుమిగూడారో ఏమో..!?
అందరిముఖాల్లో ఏదో ఆందోళన కొట్టొచ్చినట్టు.. కనబడుతోంది
చీమ చిటుక్కుమన్నా పల్లెల్లో అందరూ పట్టించుకుంటారు ఏమయిందో ఏందో నని ఆరాటం.
ఊరువూరంతా ఓ పెద్ద కుటుంభమే. ఒకరినొకరు వరుసలతోనే ఆత్మీయంగా పిలుచుకుంటారు..ఒకరి కష్టాన్ని ఇంకొకరు పంచుకుంటారు. ఏదో జరిగినట్టుంది.. లేకుంటే ఇంతమంది ఇక్కడెందుకాగుతారు.
ఇక ఉండబట్టలేక ఆ వేపు నడిచాను. ఆ ఇంటి వాళ్ళమ్మాయి కనిపించటం లేదని గుసగుసగా అనుకుంటుంటే తెలిసింది.
" ఇంతకీ ఆమె ఎక్కడి కెళ్లిందో ఏమైనా తెలిసిందా..!?"
లోగొంతుకతో పక్కనున్న భార్గవిని అడిగాను.
"ఇంకా లేదక్కా.. ఏమ్ తెల్వలేదు"
అప్పట్నుంచీ వెతుకుతానే వున్నారు బాధగా
జవాబిచ్చింది భార్గవి.
వాడకట్టు మహిళలు విచారంగా, నిశ్శబ్దంగా, వాళ్ళింటి గేటు బయట నిలబడి ఉత్కంఠంగా... 'ఏమైందో.. ఏమో..!! పాపం చిన్నపిల్ల' అనుకుంటూ ఆందోళనగా ఎదిరిచూస్తునే ఉన్నారు.
అసలా పాపని ఎవరైనా ఏమైనా అన్నారా.. చెప్పకుండా ఎటు వెళ్ళింది.. ఎంత సేపటినుంచి కనబడలేదో తెలుసుకుందామని ముందుకి కదిలాను.
"వెళ్లకు.. వెళ్లకు లోపల పోలీసులు మాట్లాడుతండ్రు ఎవ్వరినీ రావొద్దన్నరంటా" ప్రమీలమ్మ నాతో గుసగుసగా..!
" ఇంతకీ ఈ అమ్మాయి ఎప్పటినుంచి కనబడుతలేదు!?"
ఎటెల్లివుంటుంది.. ఎప్పుడూ ఇల్లు దాటని పిల్ల ఏమయ్యుంటుంది..! అందరి ముఖాల్లో ఆందోళన.
వాళ్ళ స్కూల్ దోస్తుల ఇంటికి ఏమైనా వెళ్లిందేమో కనుక్కున్నారా.!! ఎవరికివారు పలుపలు విధాలుగా ఆలోచిస్తున్నాము. అందరి మనసులూ కీడునే శంకిస్తున్నాయి. నిజమే ఆడపిల్ల బయట ఒంటరిగా కనబడితే బతకనిచ్చే రోజులా ఇవ్వి!?
నిమిష నిమిషానికి ఊరందర్లోనూ..
ఏదో ఆందోళన జరగకూడనిది జరిగిందేమోనని భయం..
అయ్యయ్యో.. మధ్యాహ్నం మూడునుంచీ కనబడలేదంటే.. ఇప్పుడు టైం ఏడవుతుంది.. అంటే నాలుగుగంటలు.
అమ్మో..! చీకటి పడుతోంది..ఓ వైపు కటికచలి, అందరిలోనూ ఓ తెలియని భయం. పొద్దున్నే పనిమీద బయటకెళ్లి ఇప్పుడిప్పుడే ఇంటికి చేరుకున్నాను అందుకే.. పక్కింట్లో ఇంత జరిగినా నాకిప్పటిదాకా తెలియనేలేదు..!
వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేసాకే, అందరినీ విచారించాకే, అంతటా వెతికాకే పోలీస్ కంప్లైంట్..
ఇచ్చినట్టున్నారు.
ఈ మధ్య దరిద్రపు కరోనా వల్ల బడులు మూసేసిరాయే. పిల్లలు ఇంటిదగ్గరే ఆగమాగం..
యాడాది నుంచీ ప్రపంచమంతా ఇదే సంక్షోభం. ఎప్పుడు మునుపటి రోజులొస్తాయో తెలియదు.
పెద్దోళ్లకేమో వ్యవసాయం పనులు. వాళ్ళకా వెళ్ళక తప్పది..! పిల్లలను ఇంటికాన్నే విడిచిపెట్టి.. కొందరైతే.. పిల్లల్ని గూడా పనులకు.. తోలుకపోతాండిరి..
చదువూ సంధ్యలు... ఎప్పుడో ఎగిరిపోయినయి.. అన్నీ ఆంబుక్క పెట్టిన్రు.. మాయదారి కాలం.
బల్లు బందైన మాట ఇంతకుముందు ఎప్పుడన్నా ఎరుగుదుమా..! ఎప్పుడు పోతదో..ఏమో..!
చక్కగా బడుంటే.. ఇవ్వేమీ జరిగేవి కాదుకదా..!
ఆ పాపకు ఓ పదమూడేళ్ళు ఉంటాయనుకుంటా అసలే మితభాషి..!
ఎవరితోనూ ఎక్కువ కలవదు మాట్లాడదు.. ఆడిగినంతే చెపుతుంది.. ఇంటిపక్కిల్లే అయినా నేనే ఓ రెండు మూడు సార్లు తనతో మాట్లాడినట్లు జ్ఞాపకం.. అవీ స్కూల్ విషయాలు అంతే..! అసలు తను ఇల్లు వదిలి బయిటికే రాదు.. ఇన్ని గంటలూ.. సైకిల్ పై ఎటు వెళ్లుంటుంది..!?
ఎట్లా మిస్ అయ్యిందీ..! పల్లెల్లో కూడా కిడ్నాప్ లుంటాయా, లేకుంటే ఇంటినుంచి అలిగి వెళ్లిపోయిందా, పేరెంట్స్ ఏమన్నా కోప్పడ్డారా, ఎవరన్నా ట్రాప్ చేశారా.. ప్రతీ వారి అంతరంగంలో పలుపలు ప్రశ్నలు.. ఊల్లెకు ఎవరైనా కొత్తవాళ్ళు వచ్చారా..!?ఎవరికి వాళ్ళు గాలిస్తూనే ఉన్నారు
వీళ్ళింటి తలుపులు దగ్గరగా పెట్టున్నాయి. లోపల్నుంచి పెద్దగా ఏడుపుల శబ్దం.. పోలీసుల ప్రాథమిక విచారణ ముగిసినట్టుంది.
వీళ్ళింట్లోళ్ళు బంధువులూ కలిసి పాపని వెతికేందుకు వేగంగా వాహనాల్లో దూసుకుపోయారు..
వెళుతూ వెళుతూఎక్కడెక్కడ సిసి కెమెరా లున్నాయో అక్కడక్కడ.. ఫుటేజీ చూస్తూ
ముందుకు సాగిపోతున్నారు..
"ఆంటీ పాపని ఇంట్లో ఏమన్నా తిట్టారా"
అంటూ మెల్లగా వాళ్ళని ఓదార్చాలని ప్రయత్నిస్తున్న..
" అక్కా తమ్ముడూ ఏమన్నా పొట్లాడుకున్నారా మరి."..
"లేదు రా..!"
మా బంగారు తల్లిని ఎంత బాగా చూసుకుంటామో.. నీకు తెల్వదా..!?
ఇప్పుడు నా మనవరాలు నాగ్గావాలంటూ.. శోకం పెట్టుకొని ఏడుస్తూనే ఉంది.. పాప నాయనమ్మ
ఎవరి ఫోన్లో నుంచి కూడా ఎలాంటి అపరిచిత నంబర్లూ.. రాలేదూ.. పోలేదూ..
అంతా ఓ వింత లాగే ఉంది..
"ఓ బిడ్డో..! నా బిడ్డా..!" పాపతల్లీ, నాయినమ్మా గుండెలవిసేలా రోధిస్తున్నారు.
ఎందరు వారించినా ఆగని దుఃఖం.. కట్టలు తెంచుకొస్తూంది.. కడుపు తీపి కదా..!
హమ్మయ్య..! ఈ ఊరు మెయిన్
రోడ్డుమీది సి.సి కెమెరాలో ఓ ఆధారం దొరికిందట.
సైకిల్ మీద కరీంనగర్ వైపు వెళుతున్న అమ్మాయి దృశ్యం.. కనిపించింది..
పాప.. ఆచూకీ తెలుస్తోంది..
ప్రాణాలతోనే ఉంది.. వెంట ఇంకెవరూలేరు.
కానీ ఎటు వెళ్తోంది.. తన దగ్గర ఫోన్ కూడా లేదు.. ఒక్కతే వేగంగా వెళుతోంది.. అందరి మనసుల్లో దిగులు!
ఆపైన వచ్చే పల్లెపల్లెలోని ఫుటేజీలు చూస్తూ.. ఒక్కోపల్లె దాటిపోతున్న పాపనీ, ఆ సమయాన్నీ బేరీజు వేసుకుంటూ.. ముందుకు సాగిపోతూనే ఉన్నాయి.. విచారణా వాహనాలు పాపకీ వీళ్ళకి నాలుగ్గంటల తేడా..
ఎన్నడూ గడపన్నా దాటని అమ్మాయి అంతదూరం ఒక్కతే ఎట్లా వెళుతుంది.. అందరికీ ఆశ్చర్యం.. అదోలాంటి భయం
మూడేళ్ళ పాపకే రక్షణ లేని లోకం..
మొన్నీనడుమే 'దిశ' ఘటన.. ఊరు ఊరంతా
విచారంతో వీళ్ళింటిముందే.. క్షణమొక యుగంగా ఎదిరిచూస్తున్నం.
రాత్రి పది దాటింది.. ఇరవై మైళ్ళ ఆవల పెట్రోల్పంపు.. ఫుటేజీ దృశ్యాలూ.. చెప్తున్న మాట
అమ్మాయి... వెల్తూనే ఉంది వేగంగా..!
అమ్మాయికి ఏమైంది.!? చేతబడి గానీ చేశారా... గాలి పట్టిందా.. మతి స్థిమితం లేదా.. ఎవ్వరి ఆలోచనల్లో వాళ్ళు..
అమ్మాయి సేఫ్ గా రావాలని.. ప్రతీవాళ్ళూ దేవుల్లకి మొక్కుల మీద మొక్కులు
రాత్రి పన్నెండు.. దాటింది.. అంతటా అందరూ నిద్రించారు.. ఫుటేజీ ప్రయత్నాలు.. పాస్వర్డ్ దొరకక విఫలం.. ఇక చేసేదేం లేక గాలింపు చర్యల్ని తాత్కాలికంగా విరమించారు
ఊర్లో ఎవరికీ కంటిమీద కునుకులేదు
అమ్మాయి కోసమే..అందరి ఆరాటం..!
* * *
ఇప్పుడు లోకం స్వరూపం తెలిసిపోతుంది
ఎందరు మంచివాల్లో మరెందరో దుష్టులో తేలిపోతుంది.. పాప పరిస్థితిని బట్టి.!
తెల్లారగట్ల ఓ పెద్దమనిషి నుంచి
ఫోను.. "హలో..! మీరు వెంకట్ గారేనా..
మీ అమ్మాయి కోసం వెతుకుతున్నారా..!?" ఆందోళన పడకండి ఇక్కడే ఉంది, మా ఊళ్ళో హనుమాండ్ల గుడిలో ఏడుస్తూ ఉంది. పొద్దున్నే కార్తీకమాస పూజలకు వెళ్లిన మా దంపతులకు భయపడుతూ, వనికిపోతూ కనబడింది.. వివరాలను అడిగితే ఏడుస్తూనే చెప్పిందట ..దారితప్పి వచ్చిందంట.. తిరిగి వెల్దామంటే చీకటయ్యిందంటా..!"
"హాల్లో..హాల్లో..!!ఆ..ఆ..ఆమె మా పాపే, అవునవును..ఆమె మాపాపే..అంజలి..
ఎట్లుంది.. ఇప్పుడే వస్తున్నాం..మీ వూరెక్కడ ఏ ఊరు...!?" అందోళనగానే...
అవతలనుంచి..,
"ముల్కనూర్ దగ్గరనే..రాన్ద్రి" అవతలి గొంతు
"మా బిడ్డ ఎట్లుంది..! మీరక్కణ్ణే ఉండండ్రీ ప్లీజ్.."పదినిముషాల్లో అక్కడుంటాం.. వస్తున్నాం.. ఇక్కడికి ఇరవై ఐదు కిలోమీటర్లు. మీ ఊరు మాకు" అంటూ... ఏడుస్తూనే.. బయలెల్లి పాపని ఇంటికి తెచ్చుకున్నరు.. పోలీసుల సహాయంతో...!
విచారణలో భాగంగా కూపీ లాగిన పోలీసులు..ఇంత జరగడానికి కారణం
'డిజిటల్ క్లాస్ ల కోసం ట్యాబ్..!'తనకు కొనివ్వకుండా
తన కన్నా చిన్నోడైన తమ్మునికే ఇప్పించారనీ మనస్తాపంతో.. ఎవరికీ చెప్పకుండా ఇంటినుంచి అలిగి వెళ్లిందట. అయితే బాట తప్పి వెనక్కి రాలేకపోయిందిట.
హమ్మయ్య..!! ఎలాగోలా చివరకు
కథ సుఖాంతమే... కానీ పిల్లల పట్ల వివక్ష ఎంతమాత్రం తగదు. ఇంటికి వారసుడూ మొగపిల్లాడంటూ వాడి గొంతెమ్మ కోర్కెలు తీర్చి ఆడపిల్లలని పట్టించుకోకపోవడం సరికాదనిపించింది.!
నాంపల్లి సుజాత
+91-9848059893
******************************************************************************

నమ్మకం
నిరుపమ
"నో బేటా అల్లరి చేయద్దు. కరోనా లాక్డౌన్ కదా. మమ్మీ ఏమీ చేయలేదు. నీకు బర్తడే ఫ్రాక్ ఈసారి కుదరదమ్మా. వచ్చే పుట్టినరోజుకు రెండు డ్రెస్సులు.." అంటున్న తండ్రిని ఆపి.
"నో డాడీ మీకు తెలవదు, మమ్మీ కెన్ డూ, నాకు మంచి డ్రెస్ వస్తుంది, మమ్మీ తెప్పించ గలదు డోంట్ వర్రీ. ఐ హావ్ హోప్స్" అంటుంది సమీర.
తెల్లారితే సమీర పుట్టినరోజు రాత్రి భోజనాల తర్వాత వంటిల్లు సర్దుతూ తండ్రీ కూతుళ్ళ మాటలు వింటూన్నది, సమీర తల్లి అనిత.
ఆరేళ్ళ సమీరకు తల్లిమీద ఎక్కడ లేని నమ్మకం. లాక్డౌన్ కఠినంగా అమలౌతున్న ఏప్రిల్ నెలలో సమీర పుట్టినరోజు. షాప్స్ మాల్స్ బంద్, ఆన్లైన్ మార్కెట్ కూడా బంద్ ఏమిచేయలో తోచట్లేదు అనుకున్నారు భార్యాభర్తలు. అందుకే బిడ్డకు సర్ది చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు సమీర తండ్రి. కానీ సమీర వినేట్టు లేదు.
ఆలోచనలలో ఉన్న సమీర దగ్గరకు పరిగెత్తుకొచ్చి "నాకు రేపు పుట్టినరోజు డ్రెస్ వస్తోంది కదా మమ్మీ" అన్నది ఆశగా.
"ఔను తల్లీ వస్తుంది. ఇప్పుడు వెళ్ళి హాయిగా పడుకో" అన్నది సర్ది చెప్తూ. ఓకే అంటూ పరిగెత్తింది.
ఏమి చేయలో తోచట్లేదు అనితకు, తండ్రీ బిడ్డలు నిద్రపోతున్నారు, ఆమెకు నిద్రపట్టడం లేదు. తేదీ కూడా మారింది. చివరికి ఒంటిగంటప్పుడు లేచి బీరువా తెరిచి తనకిష్టమైన నారింజ రంగు పెళ్ళి చీరను తీసుకుని, మిషన్ ముందు కూచుంది, ఎలక్ట్రిక్ మిషన్ శబ్దం లేకుండా గంట నడచింది. రెండింటికి నిద్రకుపక్రమించింది అనిత.
పొద్దున్నే ఏడింటికి లేచిన సమీర టేబుల్ మీద పింక్ రిబ్బన్ కట్టిన ప్యాకేజీ అందుకుని తండ్రి దగ్గరకు పరిగెత్తింది.
"డాడీ నా బర్త్ డే డ్రెస్" అంటూ లేపింది. ఆశ్చర్యంగా కళ్ళు నులుముకుంటున్న తండ్రిని వదలి, సంతోషంగా తల్లి దగ్గరికి వచ్చి "థాంక్యూ మమ్మీ" అంటూ తల్లిని హగ్ చేసుకుంది. ఆరెంజ్ రంగు పట్టులంగాలో బుట్టబొమ్మలా తిరుగుతున్న సమీర కళ్ళలో మెరుపులు చూసి, అనిత ధంపతులు తృప్తిగా నవ్వుకున్నారు.
******************************************************************************

ఏది మా ఇల్లు ?
తులసీ గుగులోతు.
సుధా వంటగదిలో పనులు అన్నీ పూర్తి చేసుకొని ఎక్కడివి అక్కడ సర్ది పెడ్తుంది.వివేక్ వచ్చి , ఓయ్....మీ ఇంటికి వెళ్ళాకా నన్ను నెగ్లేట్ చెయ్యకు.త్వరగా వచ్చేయి.పుట్టిల్లు అంటే చాలా ఆనందం కళ్ళల్లో ఇక్కడ ఏం కష్టం అనో!...అనుకుంటూ ఆఫీస్ కి వెళ్ళిపోయాడు.
అత్త,మామా అందరూ వున్న ఉద్యోగ రీత్యా ఒంటరి జీవితాలు నేడు..ఇంటికి లాక్ వేసి పుట్టింటికి వెళ్ళింది...
పుట్టి నిల్లు.... వెళ్ళి వెళ్ళగానే అమ్మ అడిగిన ప్రశ్న "మీ ఇంట్లో అందరూ కులసాయేనా" .ఆ అమ్మ అందరూ బాగున్నారు..అని చెప్పి ఇల్లంతా చూడలనీపించి వెళ్ళింది సుధా.గుమ్మానికి రెండు తలపులు ఒకటి మూసిన ఒకటి తెరిచేవారు.ఎత్తు తక్కువ వున్న ప్రహరీ గోడ ,ఎన్ని ఊసులో ...
ఏడిస్తే రెండు చేతులు గోడ మీద పెట్టి చేతుల మీద తలపెట్టి ఏడిచిన రోజులు.అదే గోడ మీదకు మల్లె తీగను ఎక్కించి పూలు కోసిన రోజులు.స్నేహతురాలితో కలిసి గోడ దుకిన రోజులు..తెలిసి తెలియని పరువంలో అడ్రస్ లేని ఎన్ని బహుమతులు ప్రత్యక్షం అయ్యేవో.ఆ గోడ మీద..ఆ గోడ ఇప్పుడు చిన్నపోయి కనిపించింది.
ఇంటి లోపల బావి నీళ్ళు చేది చేది చేతులు సున్నితత్వాన్ని కోల్పోయాయి..ఒక రోజు ఎవరో అన్నట్లు గుర్తు నీ చేతులు సున్నుతం గా వుండవెందుకు..? అని .నవ్వే సమాధానం .
బయటకు వచ్చి చూసింది...
ఇంటి ముందు అంతా తారు రోడ్డు..పండుగలు వస్తె శుభ్రంగా కళ్ళాపి చల్లి ముగ్గు వేస్తే ఇంటి ముందు ఆగి ,ముగ్దులు అయిన వారి పొగడ్తలు అన్నీ ఆ రోడ్ క్రింద పుడుకు పోయాయి.
ఇంటి చుట్టూ పెద్ద ,పెద్ద అపార్ట్ మెంట్ లో ఎక్కడో గాలి కూడా చొరపడని గదులు...ఎంతగా మారిపోయింది కాలం.
లోపలకు వచ్చి కూర్చుంది అమ్మ కాఫీ తీసుకోమని ,మీ ఇంటి సంగతులు చెప్పు అని అడిగింది.
మాదెంవుందిలే గానీ అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్దామా ఎప్పుడైనా అని అడిగిన సుధా కు వాళ్ళమ్మ మా పుట్టిల్లు అని చెప్పడం మొదలు పెట్టింది...
అమ్మ!
సుధా నవ్వుకుని బయలు దేరుతా అమ్మ అని ఇంటికి పయనం అయింది...ఇంటికి వచ్చి సింగిల్ డోర్ ఓపెన్ చేసింది..
కూతురు అనంత స్కూల్ నుండి వస్తు, వస్తు మా ఇంటికి రండి అని ఫ్రండ్ తో చేపడం వినపడింది...
సుధా నవ్వుకుంటూ పనిలో నిమగ్నం అయింది....
ఇది నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను.
ఊరు:భద్రాచలం
భద్రాద్రి కొత్త గూడెం జిల్ల
******************************************************************************

నరలోకంలో..... రచయిత్రి
యడవల్లి శైలజ ప్రేమ్
" హెడ్ లైన్స్ ఫ్లాష్ .... ప్లాష్ అవుతున్నాయి. ప్రముఖ నవలా రచయిత్రి ' తరంగిణి ' ఆత్మహత్య ప్రయత్నం చేశారు.
ఐదు నిమిషాల కొకసారి ఈ విషయమే చూపించి ఆమె ఆవేదనను మరింత పెంచుతున్నారు. పేపర్
వాళ్ళు , మీడియా వాళ్ళు.
అసలు కారణం ఏమై ఉందంటారు?
' ఆకలి ' నవల ఇతివృత్తంతో పేరు వస్తుందనుకున్న ఆమె ఆత్మహత్యకు ఎందుకు ? పాల్పడింది. ఈ నవలలో రాగిణి పాత్రకు తరంగిణి జీవితానికి ఏమైనా దగ్గర సంబంధం ఉందా? రకరకాల ప్రశ్నలు చుట్టుముడుతున్నాయి .
మరొక అర్థగంట పోయిన తర్వాత ' ఆరోగ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మన తరంగిణి గారు స్లీపింగ్ పిల్స్ తీసుకున్నారు అంటున్నారు ఆమెను మొదటిగా చూసినవారు . ఆమె కోలుకున్న తర్వాత మరిన్ని వివరాలను అడిగి తెలుసుకుందాం" అంటూ కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా టైపులో చెప్పారు.
మీడియా, న్యూస్ చానల్స్ వాళ్ళు'.
' ఎవడి గోల వాడిది సురేఖా! నువ్వు ఒక్క విషయం గమనించాలి ఆమెను చూడటానికి వాళ్ళ ఇంట్లో ఒక్కరూ కూడా ఇంతవరకు రాలేదు అంటే ఆ ఇంటితో సంబంధాలు తెగతెంపులు అయ్యాయా? కనీసం ఆమె పిల్లలు కూడా రాలేదంటే......!!!!!?
ఆకర్షణీయంగా గుర్తులు, ఎమోజీలు పెట్టి మరీ వార్తలు వినిపిస్తున్నాయి . వారికి టి. ఆర్.పి రేటు
పెరిగిపోతోంది .
కవి సమ్మేళనాలు, పురస్కారాలు , ఉత్తమ రచయిత్రిగా ఎంపిక అయినప్పుడు తీసుకున్న అవార్డులు రివార్డులు చాలా సంతోషాన్ని మిగిల్చాయి. ఒక రచయిత రాసే రచనలు తన జీవితంపై ప్రభావం చూపుతుందని అప్పటివరకు తెలియదు. సమాజంలో మార్పు రావాలని అందరి బాధలు తన బాధలుగా భావించి సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలుపంచుకునే రచయిత్రిగా తరంగిణికి మంచి పేరుంది.
ఆడంబరాలకు పోకుండా సాదాసీదాగా ఉండటానికే ఇష్టపడతారు ఆమె. అందరి రచయితల్లాగానే కష్టాలు, కన్నీళ్లు , ఛీత్కారాలు, అవమానాలు ఎదుర్కొనే ఈ సమాజంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. వృత్తి రీత్యా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేస్తున్నది. ఆమె పనిచేసే డిపార్ట్మెంట్ వాళ్ళు తమ ఆఫీసుకు కవులను ఆహ్వానించారు అప్పుడు తను కూడా తన భావాలు
కవితగా వాళ్ళకు వినిపించింది. అందరూ కవిత విని చాలా బాగుంది, మీరు కవితలు ఎప్పడి నుంచి వ్రాస్తున్నారు ? అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.
అదిగో అప్పటి నుంచి కవితలు రాయడం మొదలు పెట్టి నవలా రచయిత్రి అనుకునే స్థాయికి చేరుకుంది.
" చలం రచనల ప్రభావం వల్ల కూడా ఈ సమాజం లో ఆమెకు ఆ... విషయం లో స్వేచ్ఛ స్వాతంత్య్రం ఎందుకు ఉండకూడదు అని అడిగింది ".
ఆమెకు తెలిసిన విషయాలు చెప్పారు ఆమె స్నేహితురాలు కమల.
.............................................
ఈ నవలా నాయికలు అని కాదు కానీ ఈ సమాజంలో ఎంతోమంది లేరు.
' మంజరి' చిన్న వయసులోనే తనకన్నా వయసులో పెద్దవాడైన ' రామప్ప' కిచ్చి పెండ్లి చేసారు.
వయస్సు తేడా ఎక్కువ ఉన్నా యుక్తవయసులో ఉండడం వల్ల దాంపత్యం సజావుగా సాగేందుకు
ఏ ఆటంకాలు రాలేదు. పెళ్ళి, పిల్లలు ఉన్నారు.
ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది.
మంజరి భర్త తాగడం , కంటికి నచ్చిన అమ్మాయితో కోరిక తీర్చుకోవడం, జల్సాలు చేయడం.
మంజరి పక్కన చేరడం ఎప్పటికో!
మంజరి కి కూడా కొన్ని ఆశలు ఉంటాయి ఎంతైనా ఉప్పు కారం తినే శరీరం కదా!
పిల్లలు నిద్రపోయాక మొగుడు పంచన చేరినా బయట కడుపునిండా తినొస్తే ఇంట్లో కమ్మంగ వడ్డించినా ఎందుకూ పనికి రాదు అన్నట్లు గుర్రుపెట్టి నిద్ర పోతుంటే నాలుగు కన్నీటి బొట్లు కార్చి పడుకునేది.
ఆ సందర్భంలో పక్కింటి యువకుడితో శారీరక సంబంధం ఏర్పడింది. అతనికి డబ్బు అవసరాలు
తీర్చడంలో ఈమె సహాయపడింది. ఎంతైనా అతడు మగాడు కదా.ఈ విషయం గర్వంగా తన
స్నేహితులతో పంచుకోవడంతో వాళ్ళు ఈమెను కోరుకుంటారు. ఆ పక్కింటి యువకుడితో ఉన్నట్టు
తన స్నేహితుడితో ఉండమని కోరాడు .మంజరి నిరాకరించడంతో ఆమెను చీదరించుకుని ఏదో
అనబోయేంతలో నువ్వు నాకు అవసరం లేదు అని ముఖం మీదే చెప్పింది. ఇన్నాళ్లు వాడుకున్నానని కూడా ఆలోచించకుండా వెంటనే అతడు తన మగ బుద్దిని చూపించుకున్నాడు.
ఇన్నీ జరిగినా కొంతలో కొంత మొగుడికి తెలియకుండా జాగ్రత్త పడింది మంజరి.
కాపురం కూలిపోలేదు అలాగని ఆనందం పొంగి పోలేదు.
జీవితంలో అతడు మళ్ళీ ఎదురు పడితే మంజరి ఏం చేస్తుంది?
పాత ప్రేమను పంచుకోవాలని అనుకుంటుందా?
మునిపటిలా ఆమె మారిపోతుందా?
తన కోరికలు అణుచుకుంటూ కాపురం నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నిస్తుందా?
అన్ని ప్రశ్నలను సంధిస్తూ ముగించిన నవల.
విడుదల అయ్యిందో లేదో రచయిత్రిని చిత్రవధ చేస్తూ అందరూ బాణాలు విసిరితే ఆమెకు మరో మార్గం లేకపోయింది.
ఆసుపత్రిలో ఉన్నప్పుడు తరంగిణి తనలో తాను తర్కించుకుంది.
ఛీ.....ఛీ.... తను ఎంత తప్పుడు నిర్ణయం తీసుకుంది.
తను చేసిన పనికి చచ్చిపోయి మూడు రోజులు అయి ఉండేది.
సమాధానం చెప్పడానికి భయపడితే రచనలు ఎందుకు చేయాలి?
అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా?
మనసు గిజగిజ కొట్టుకుంటుంది.
తనకంటూ ఒక బాధ్యత ఉన్నదని భావించబట్టే కదా మార్గదర్శకపు బాటలని ప్రేరణా దాయకంగా
రాసింది.
సమాజంలో మార్పు రావాలని ప్రయత్నించడం కూడా తన తప్పా!?
మంజరి లాగా ఎంతోమంది లేరు.
తనెందుకు చావాలి? ....!!!!!
అవును తనెందుకు చావాలి?
ధైర్యంగా వెంటనే ప్రెస్ మీట్ పెట్టింది తరంగిణి.
అందరికి నమస్కారం . నా ఆకలి నవల చదివిన మీకు ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.
నన్ను మీరు మంజరి పాత్రతో ముడిపెట్టి చిత్రవధ చేస్తూ మాట్లాడారు.
అదే మీ అక్కో, చెల్లో ఆ పొజిషన్లో ఉంటే ఏం చేస్తారు? ఆమెను కూడా ఇలాగే చంపుకునేవారేమో!
పితృస్వామిక వ్యవస్థలో మగవాడు ఏం చేసినా కరెక్ట్ ఆడదానికి ఆ కోరిక తీర్చుకోవాలని ప్రయత్నిస్తే?
నా నవల మొత్తం మంజరి పాత్రనే కనిపిస్తుంది కానీ ఎన్ని విషయాలు ఇందులో ఉన్నాయో మీకు
కనిపించలేదా?
కడుపాకలి తెలియని వారు ఇంతకంటే గొప్ప ఆలోచనలు ఎలా చేయగలరు. వీలైతే సమస్య అర్థం చేసుకోవచ్చు లేదా ఎవరి బతుకు వారిదని వదిలేయవచ్చు. ఒకరి సమస్యలు మరొకరికి తేలికగా కనిపించవచ్చు. అది అనుభవించిన వారికే అర్థమవుతుంది.
రచయిత్రి, రచయిత రాసేవన్ని స్వీయ అనుభవాలు కానవసరం లేదు. ఒకవేళ తాను రాసినా మీకేం నష్టం. ఆమె జీవితం మరొకరికి ఉపయోగపడుతుంది అని రాస్తుందేమో! ఈ సమాజంలో ఉన్నవారు అందరూ స్వచ్చంగా బతికేవాళ్ళేనా?
మిమ్మల్ని నొప్పిస్తే నన్ను మన్నించండి. పిలవగానే వచ్చిన మీకు కృతజ్ఞతలు.
మీరు నన్ను వెలివేయడం కాదు. నేనే మిమ్మల్ని వెలివేస్తున్నాను.
తరంగిణి ..... తరంగంలా ధైర్యంగా కదిలిపోయింది.
ఖమ్మం
+91-9394171299
******************************************************************************

'కాపీలు తాగారా.. టిపినీలు తిన్నారా'
ఎన్నెల
మా పెద్దక్క పెళ్ళప్పుడు మధ్యవర్తి ఒక మాట మోసుకొచ్చాడు. ఆ మాట విని పెళ్ళి పెద్దలకు కాళ్ళూ చేతులూ ఆడలేదు. అసలు ఇదేం కోరిక అంటూ ఇటువైపు మధ్యవర్తి విరుచుకుపడ్డాడు. అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ కూడా పెళ్ళిలో ఉపాహారమంటే ఉప్మానే కదా. పెళ్ళి అవగానే భోజనాలే గనుకనూ, బ్రేక్ఫాస్టు బ్రేవుమనేలా తినేస్తే వండిన వంటలకి న్యాయం జరగదు కనుకనూ....పెళ్ళివారికి ఫోను, ఇంట్లో ఉన్నవారికి తలో పిడికెడూ వచ్చేట్లు పలుచటి ఉపమాలంకార ఉప్మా అనే ఉపాయాన్ని కనిపెట్టారుట మహర్షులు. అంతటి మహర్షులను కాదని ఈ కోరికలేంటట..అడిగొస్తా అంటాడాయన. "పెళ్ళి వారు చీరలడిగారా తారలడిగారా పూరీ కూరా అంతేగా.. పెళ్ళి తంతు మొదలవకుండానే గొడవలెందుకు చేయించేద్దా"మంటారు నాన్న.. "ఇదెక్కడ గోల ..అంబట్లో కుంభంలా ఇవి పెట్టుకుంటే ఆదివారంలో సోమవారమయేట్టుంద"ని ఆదుర్దాగా చూస్తున్న వంట వాళ్ళు .
జూన్ నెల.. ఈదురు గాలులు, .. వర్షం.. ఇంటిముందు ఉండనా ఊడనా అంటూ ఊగిసలాడుతున్న టెంటు.. ఆ మధ్యన చిన్న కొబ్బరాకుల పందిరి... దాని చుట్టూ పిల్లల పరుగులు !! తర్జన భర్జనలయ్యాక వంటవాళ్ళ బెదురు కంటే పెళ్ళి వారి నదురే ముఖ్యం కాబట్టి "అలాగే కానిద్దాం" అన్నారు నాన్న. మా ఇంట్లోనూ, పక్క వాళ్ళ ఇళ్ళల్లోనూ ఉన్న గొడుగులన్నీ గాడి పొయ్యి మీద తెరుచుకున్నాయి. ఇంట్లో వత్తిన పూరీలు తడవకుండా పొయ్యి దగ్గరికి తేవడం గగనమవుతోంది. కూర చేసేసారు కానీ, నూనెలో నీళ్ళ చుక్కలు పడడంతో పూరీలు ఎక్కువ మొత్తంలో చేయలేకపోయారు . అందువల్ల యుధ్ధ ప్రాతిపదికన మా ఊరి రేషను షాపు గోవర్ధన్ లాగా యమా స్ట్రిక్ట్ గా ఉండే మా పిన్నిని ఏకగ్రీవంగా టిఫినీల సెక్షనుకి హెడ్డు గా ఎన్నుకున్నారు. పెళ్ళివారికి మాత్రమే దండిగా కావలసినన్ని పూరీలు వడ్డించే ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లో పిల్లలకి పూరీలు అంటే మహా ప్రాణం కదా..అందరం గుటకలు వేస్తూ చూస్తుండగా వాళ్ళందరూ తిని వెళ్లే వరకు గుడ్లురిమి ఆపిన పిన్ని, మిగిలిన చల్లారిన పూరీలని లిమిట్ లిమిట్ అంటూ ఒకటీ అరా పిల్లలకి తినిపించి ఆటకి తోలేసింది. అప్పటినుంచీ నాకు పెళ్ళి లో బ్రేక్ఫాస్టు అనే మాట వింటే మా పిన్ని లిమిట్ గుర్తొచ్చి నవ్వొస్తుంది . అసలు మా ఊర్లో పెళ్ళి కొడుకు వైపు బలగం పెళ్ళికి కొన్ని గంటల ముందు వచ్చి, ఆంజనేయ స్వామి గుడిలో కూచుంటే ,బామ్మర్దులొచ్చి బతిమాలి బామాలి తీసుకెళ్ళి పెళ్ళి చెయ్యటమే తప్ప నాష్టాల నష్టాలు కష్టాలు మాకెర్కనే లెవ్వు. అయితే కొన్ని సార్లు దూరాభారాల లెక్కలో బ్రేక్ఫాస్టులు పెట్టిన సందర్భాలూ ఉన్నాయి. ఉదాహరణకి. మా చుట్టాల పెళ్లి కి మహబూబ్ నగర్ వెళ్ళినప్పుడు పొద్దున పొద్దున్నే వేయించిన అటుకులు బ్రేక్ ఫాస్ట్ గా పెట్టారు. అయితే మరీ పెద్ద వాళ్ళు ఎవరూ ఆ బ్రేక్ ఫాస్ట్ తినలేక కేవలం కాఫీ తాగి, పెళ్లి అంతా అయ్యాక మూడింటి వరకు పస్తు ఉండేటప్పటికీ మరి నీరసం వచ్చి ఎక్కడికక్కడే ఒరిగిపోయారు తినడానికి కూడా ఓపికలేక!
అసలు మగపెళ్ళివారు బ్రేక్ఫాస్ట్ ఇంట్లోనే తినేసి పెళ్లికి ఒక గంట ముందుగా వస్తేనే మంచిదేమో .. .ఎందుకంటే.. మరీ పెళ్ళివారు ముందుగా అడిగితే తప్ప తెలుగు వాళ్ళ పెళ్లిళ్లలో బ్రేక్ ఫాస్ట్ కి పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదని చెప్పుకోవచ్చు.
కొందరు పెళ్ళి లో మొక్కుబడులు ఉద్యాపనలూ చేసుకుంటూ బ్రేక్ ఫాస్ట్ అన్న పదాన్ని పూర్తిగా తీసేస్తూ ఉంటారు . దేవుని కల్యాణాలకి అయితే చెప్పనే అక్కరలేదు. అరే పెళ్ళి కదా టిఫిన్ తిని వెళదామంటే ఎవరూ ఒప్పుకోరు . మరీ మందులూ, మాకులూ వేసుకోవలసిన సీనియర్లు కూడా ఏ బిస్కెట్ లో ఏర్పాటు చేసుకోవాల్సిందే తప్ప తినేసి వెళ్ళే సవాలే ఉండదు మరి. పెళ్లి కొడుకు, పెళ్ళి కూతురూ సంగతి సరేసరి! పెళ్ళి తతంగం ఎంత లేట్ అయినా సరే... వాళ్లు అలా ఉపవాసం ఉండి నీరస పడి పోయి, అగ్నిహోత్రం దగ్గర కళ్ళు మంటలు పెట్టేస్తూ మొహం వేలాడేసుకుని ఎప్పుడో ఏ నాలుగింటికో అందరూ తిన్నాక భోజనం చేయడమే తప్ప ,చక్కగా కడుపునిండా తిని పెళ్లి చేసుకోవడం అనేది ఉండనే ఉండదు.
మన దక్షిణం వైపేనేమో ఇదంతా..
ఇక్కడి కెనడాలో మనలా కనబడిన వారందరినీ " బంధుమిత్ర సపరివార సమేతంగా వచ్చెయ్యమని " పెళ్ళి కి పిలవరు . చాలా క్లుప్తంగా పాతిక యాభై మంది అంతే!
ఇక పంజాబీ వారికి గుడిలోనూ, బడిలోనూ భోజనాలుంటాయి కదా! "భోజనం కోసం వచ్చినా సరే ..గుడికి రావడం ముఖ్యం" అంటారు వారి మత పెద్దలు. మరి వంట ఎవరంటారా? మొక్కు పెట్టుకున్నట్టు రోజూ గురుద్వారాకి తెల్లవారుజామున వెళ్ళి వందలకొలది రొట్టెలు చేస్తుంటారు కొందరు. సేవ చేయడానికి ఇష్టమైతే మనని కూడ గురుద్వారాకి ఆహ్వానిస్తారు. అలా ఆహ్వానించినప్పుడు అప్పటికే అక్కడ పనిచేస్తున్న వాళ్ళు "ముందుగా కాళ్ళు చేతులు కడుక్కుని ప్రసాదం (ఫుల్లు మీలే) తినేసి రమ్మని ఆదేశము లాంటి అభ్యర్థన చేస్తారు. వారి ఉద్దేశ్యం ఏంటంటే మనము కడుపునిండా తిన్నప్పుడు మాత్రమే శ్రద్ధ ,భక్తితో ఇంకొకళ్ళకి సేవ చేసే మనసు కలిగి ఉంటామని. సరే మా అమ్మనిప్పుడు గుర్తు చేసుకోవడం అవసరమా? పోనీ చేసుకుందాం లెండి " చద్దన్నం తిన్నమ్మ మొగుడాకలి ఎరగదని చెప్తూ.. అందరూ తిన్నాక మాత్రమే తినాలి, కనపడిందని ముందు తినెయ్యకు అసలే పెద్ద కోడలివి అని చెప్పి పంపింది లెండి.. కానీ, మనకు కడుపు నిండి నప్పుడు మనము నిదానంగా తృప్తిగా ఇంకొకళ్ళకి చక్కని సేవచేసే అదృష్టం కలుగుతుంది కదా ! నాకు ఈ అభిప్రాయం సరియైనది అనిపిస్తుంది. కానీ మా అమ్మ శిక్షణ ఇచ్చింది కదా అలవాటయిపోయింది అలా. . సరే , మన పంజాబీలకి గుడిలోనే ఇంత ఉందంటే ఇంక పెళ్ళిలో ఊహించండి. స్నాక్సే చాలు ..పసందుగా పాతిక రకాలు. అందరూ తింటే కానీ పని మొదలెట్టరు.
ఈ మధ్య ఆఫీసులో పెళ్ళి అనే అంశం మీద మాట్లాడుకుంటుంటే ఒక సహోద్యోగి " బాబోయ్ వీళ్ళ ఇళ్ళలో పిల్లలని పెళ్ళి చేసుకునేరు తల్లోయ్.. పెళ్ళి పీటలమీదే నిరాహారదీక్షతో హత్యకు పాల్పడతారు. అబ్బాయికి, అమ్మాయికి, వారి తల్లిదండ్రులకీ ఉపవాస దీక్ష... ఏమీ పెట్టకుండా పెళ్లి చేస్తారుట "అని చెపుతూ "కదా ? " అంది నా వైపు చూస్తూ. నేను అవునని చెప్పనా కాదని చెప్పనా అని ఆలోచిస్తూ ఉండగా " మరి ఆకలితో నకనకలాడుతూ పెళ్లి ని ఎలా ఎంజాయ్ చేస్తారు?" అని అడిగింది . నాకు ఆ పాయింట్ సరిఅయినదే అనిపించింది. కానీ అందరిలో ఏమనాలో తెలియక " ఏదో మంచికారణం చేత పెట్టి ఉంటార”ని సమర్థించడానికి ప్రయత్నం చేసా. ఈ అమ్మాయి అందుకుని " మాలో ఏ పరిస్థితిలోనైనా సరే ఆకలిగా ఉండడం నిషిద్ధం. పెళ్ళి, పేరంటం ,చావు, దినం ఏదయినా సరే..లోపలికి వస్తుండగానే గడపలో ఒక వ్యక్తి మనని స్నాక్స్ ఉన్న వైపు తీసుకువెళ్తారు. తిన్నాకే ఏదైనా" అంది. " మాలోనూ అంతే ..కానీ " అనబొయ్యా..
" నాకు కతలు చెప్పకు.. నా చిన్నప్పటి ప్రాణ ప్నేహితురాలు ప్రియ తెలుగమ్మాయే . ఆ అమ్మాయి పెళ్ళికి కుటుంబం మొత్తం రావాలని మరీమరీ చెప్పింది. ఆదివారం పెళ్లి. అసలే అందరూ ఆలస్యంగా లేచిన మూలాన పిల్లల్ని రెడీ చేసి భర్త అత్తమామలతో వివాహానికి హాజరయ్యాను. వెళ్ళి చూస్తే అక్కడ మా ఇళ్ళలో పెళ్ళికి మల్లే బ్రేక్ ఫాస్ట్ కు సంబంధించిన విషయాలేవీ కనబడలేదు. కాసేపు పలకరింపులు అయ్యాక మాకు సుఖాసీనులు అవమని స్థలం చూపించిన ప్రియ అన్నయ్య మాయమయ్యాడు. తర్వాత ఇంక తెలిసిన వాళ్ళు ఎవరూ కనబడలేదు . పిల్లలు ఆకలి అని అల్లరి మొదలెట్టారు. అత్తమామలు కూడా ఆకలి అనడంతో ఏమీ పాలుపోక నెమ్మదిగా చుట్టుపక్కల ఏమైనా చిన్న చిన్న రెస్టారెంట్స్ కానీ దుకాణాలు కానీ ఉన్నాయేమో ఏదైనా తినేసి వద్దామని బయటికి వెళ్ళబోయాము. ఆ పెళ్ళి హాలు రెండు మూడు సెక్షన్లుగా ఉంది. అంటే మూడు సెక్షన్లూ విడిగా అద్దెకిస్తారన్నమాట. ఆ రోజు అక్కడ ఒక వైపు తెలుగు పెళ్ళి, ఇంకొకవైపు పంజాబీవాళ్ల పెళ్లి అవుతోంది. మేము ఇలా బయటికి వెళ్లామో లేదో ఒక చుట్టాలతను కనబడి ఎక్కడికి వచ్చారని అడిగాడు. ఇలా సౌత్ ఇండియన్ ఫ్రెండ్ పెళ్లికి వచ్చామని, బ్రేక్ ఫాస్ట్ గట్రా ఉన్నట్లు లేవని, పిల్లలు, అత్తమామలు ఆకలిగా ఉన్నారు కాబట్టి బయట ఏమైనా తినడానికి బయలుదేరామని చెప్పాము. దానికతను " భలే వారే! ఇటు మన పంజాబీ కుటుంబమే ! మనకి బాగా తెలిసిన వాళ్లే ఇటు రండి అని చెప్పి , స్నాక్స్ తినడానికి అటువైపు తీసుకుని వెళ్ళాడు. మొహమాటపడుతూనే కొన్ని స్నాక్స్ పిల్లలకి ఇప్పించి వెనక్కి తిరిగి వస్తుండగా పెళ్లి కూతురు తల్లి ఏదో తేవడానికి వెనక్కి వెళుతూ ఎదురైంది .పట్టుబడి పోయిన దొంగల లాగా మేము చాలా మొహమాటం పడిపోయాము. ఆవిడ అదోరకంగా చూస్తూ "ఎక్కడికి వెళ్లారు "అని అడిగింది. పిల్లలు చేతుల్లో కొన్ని స్నాక్స్ ఉండనే ఉన్నాయి. ఇంకనిజం చెప్పక తప్పిందికాదు. ఇలా పక్కన స్నేహితుల పెళ్లి జరుగుతోందని , పిల్లలు ఆకలి తట్టుకోలేకపోతుండడంతో స్నాక్స్ తినడానికి వెళ్లామని, ఇలా వెళ్లినందుకు ఏమీ అనుకోవద్దు అని చాలా మొహమాటంగా చెప్పుకొచ్చాము. ఆవిడ " మంచి పని చేశారు. అసలు...నాదీ అదే పరిస్థితి. కడుపులో నక నక లాడిపోతోంది. మా పెద్దవాళ్ళు కన్యాదానం చేస్తున్నామని నిన్న రాత్రి నుంచి ఉపవాసం ఉంచారు . నాకా షుగరు. నేను ఇంక ఒక్క నిమిషము దాటినా ఏ పనీ చేసే పరిస్థితిలో లేను. కళ్ళు తిరిగి పోతున్నాయి. మా పెళ్ళి తంతు జరిగి భోజనాలు అయ్యేటప్పటికి ఇంకో గంట పైగా పట్టే ఉంది. అందుకే ఏమైనా దొరుకుతాయేమో అని నేను ఇటు వచ్చాను మీరు ఏమి అనుకోకపోతే నాకు కూడా ఏమైనా చిన్న స్నాకు తెచ్చి పెట్టగలరా అక్కడినుంచి "అని అడిగింది . ఆశ్చర్యపోవడం మా వంతయ్యింది. అప్పుడు కానీ తెలిసింది కాదు మాకు. వామ్మో ! ఆ ఉపవాసాలేమిటో....తిండిలేని పెళ్ళి ఏమిటో !" అంది. ఈ స్టోరీ విన్న తర్వాత మా ఇంట్లో ఏ పెళ్లి పేరంటం జరిగినా మొదట " స్నాక్స్ బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ బ్రేక్ఫాస్ట్ అంటూ పాట పాడి ..కాపీలు త్రాగారా టిపినీలు తిన్నారా అని అడగడానికి ప్రత్యేకంగా అరవై మందిని అమర్చాలని డిసైడ్ చేస్కున్నాను. ఇండయాలో కాసిని రోజులు తిరిగొచ్చిన నా పిల్ల మాత్రం...అలా పస్తులుంచే పెళ్ళి ఇండియాలో చూడనేలేదనీ , అన్ని చోట్లా పోటీలు పడి బోలెడు ఐటెమ్స్ పడుతున్నారని చెప్పింది. ఏదిఏమైనా' మీరు కూడా తగిన తిండి ఏర్పాట్లు చేయండి. లేకపోతే నాలాంటి వాళ్లు చెక్కరొచ్చి పడిపోతే మళ్ళీ ఆంబులెన్స్ ఖర్చులు ఆస్పత్రి ఖర్చులు మీవే అని పత్రం రాసి ఇయ్యాల్సిందే...
******************************************************************************

ఏదిజరిగినా మన మేలుకే !
దామర ాజు.విశాలాక్షి
నాలుగు రోజులై పనమ్మాయి రావడం లేదు .
ఇల్లు వెతుక్కొని వెళ్ళాను నన్నుచూసి గుండెలు బాదుకొని ఏడవసాగింది ఆదమ్మ ..
ఏమయిందాదమ్మా ? ఎందుకిలా ఏడుస్తున్నావంటే! పక్కన మంచంలో పడున్న పాతికేల్ల కొడుకుని చూపిస్తూ, మళ్ళీ ఘొళ్ళుమంది ఆదెమ్మ....!
"ముందునుండి దూకుడొద్దురా బాబూ !
చెడ్డవాళ్ల స్నేహాలొద్దు. వ్యసనాలు మనిషిని ఒంచిస్తాయి , ప్రమాదమని సెప్తనే ఉన్నానమ్మా ! నామాట పెడసెవిని పెట్టాడు.. ఎదిగిన పిల్లలముందు ఎదవ్వేసా లేసిన నామొగుడి మాటంటే ఆడికసలే కాతర్నేదు ఏదేమయితే నేమమ్మా . ఈ రోజు అశ్రద్ధ వలన. అవిటితనమొచ్చి , అలో లక్ష్మణా! అని ఏడుస్తున్నాడమ్మా !
స్నేహితులతో పార్టీ అని వెళ్ళి , మితి మీరిన వేగంతో, తాగి బళ్లు నడుపుతూ , అర్ధరాత్రివస్తుంటే, ఏక్సిడెంటయి, బైక్ నడుపుతున్న ఫ్రెండు స్పాట్ లో చచ్చిపోతే, వీడికి కుడి కాలు మొదలులోనికి. విరిగి పోయిందమ్మా!" అంది వెక్కి వెక్కి ఏడుస్తూ ..
ఆదమ్మనెలా ఓదార్చాలో నాకు. అర్ధం కాలేదు ..
ఇంటెర్మీడియెట్. ఇన్స్టాల్మెంట్స్లో అయిందనిపించి , ఇంట్లో గోల పెట్టగా పెట్టగా, ఆటో మొబైల్ కంపెనీలో మెకానిక్ గా చేరాడు ఆదెమ్మకొడుకు . తండ్రీ , కొడుకూ ఇద్దరూ సంపాదించినదల్లా తాగడం జల్సాచెయ్యడం పనిగా పెట్టుకున్నారు . నామొగుడి సంగతొదిలేయండమ్మా! కనీసం నాకొడుకైనా బాగుపడతాడనుకున్నాను . వీడికిప్పటినుండే చెడుస్నేహాలు ... అలవాట్లు... తిరుగుళ్ళు ... మాటవినడు . నారాతంతేనమ్మా !ఆడపిల్ల అన్యాయం అయిపోతాదని బతుకుతున్నాను . దాని కోసమే కష్టపడతన్నాను . అది చాలా బాగా చదువుతాదమ్మా ! దాన్ని హాస్టల్ లో పెట్టి చదివిస్తున్నాను . సెలవులిస్తే మా అమ్మ ఇంటికి పంపి, నేనే పోయి చూసి వస్తున్నా . ఎదిగిన పిల్ల.. మాఇంటి పరిస్థితి బాగాలేదని... చెప్పుకు ఏడ్చింది ఈమధ్య .... ఆదెమ్మ చాలా నమ్మకస్తురాలు . ఒక్క మాటలో చెప్పాలంటే.. నా కుడి భుజం... కుమిలి పోతున్న ఆదెమ్మను ఓదార్చి , కిరాణాదుకాణం పెట్టించు , గవర్నమెంటు ఆర్ధిక సాయం చేసేలా చూస్తాను ...
మన ప్రభుత్వం అందరినీ అన్ని విధాలా ఆదుకుంటోంది, ఫుట్టుకతో అంగవైకల్యం వచ్చిన వారెందరో నాకు తెలిసి ఆత్మ ధైర్యంతో బతుకు తున్నారు . చెప్పిన మాటవినక చేజేతులా బ్రతుకు చిద్రం చేసుకుంటున్నారు చాలామంది. సాహసంపేరుతో మొండితనానికి పోయి యువకులు ప్రమాదాలకోరల్లో చిక్కి బంగారు భవిష్యత్తును దుర్భరం చేసుకుంటున్నారు .. ఆదమ్మకొడుకు ఒకటే ఏడుపు చచ్చిపోతానమ్మగారూ ! నేనీ అవిటి బ్రతుకు బ్రతకలేనమ్మా ! అందరి దగ్గరా అవమానంగా ఉంటుంది అని..
దైవలీల సరిగ్గా అదే సమయంలో నా స్నేహితురాలి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. ఆమె కూతురు నారాయణమ్మ పుస్తకం ఆవిష్కరిస్తోంది .ఆపుస్తకం గురిండి మాటాడాలని .. వెంటనే, ఆదమ్మ కొడుక్కి ఆ ఫోటో చూపెట్టాను . నాస్నేహితురాలు అనేక సమస్యలు అధిగమించింది. ఈమె కూతురు. అంధురాలు . ఆత్మవిశ్వాసం అంటే. ఆ అమ్మాయి నుండే నేర్చుకోవాలి . కష్టపడి చదువుకుంది .. ఇష్టపడి పాడుతుంది .
అనర్ఘలంగా ప్రసంగిస్తుంది .. వైకల్యం అనదు అననీయదు .. విపరీతమైన దైవభక్తి. .అనాదలందరినీ చేరదీసి ఆసరాగా ఉండి హాయిగా ఒక పాఠశాలలో ఉపాధ్యాయినిగా చేస్తుంది . సంగీతంలో అన్ని అర్హతలున్నాయి గదా ! సంగీత ఉపాధ్యాయనిగా. చేయొచ్చు కదా అంటే ,కళ్ళు లేని వారు ,పాడడానికి తప్ప దేనికీ పనికిరారనే అపప్రధ. నాకెందు కండీ , హాయిగా బి.ఇ.డి. చేసాను. సోషల్ టీచరుగా. చేస్తున్నాను . నేను చెప్పే పిల్లలకు మంచిమార్కులొస్తున్నాయంది . ఆమెతో పాటు పని చేస్తున్న ఒక మాష్టారు అదేమాట చెప్పి ఆవిడ దగ్గరనుండి ఆత్మగౌరవంతో బ్రతకడం నేర్చూ కోవాలన్నారు . నీకో ముఖ్యమైన విషయంచెప్పనా బాబూ! పదునాలుగేళ్ళకే. ఈ నారాయణమ్మ బ్రేయిలీ లిపిలో భగవద్గీత వ్రాసి ఆనాటి రాష్ట్రపతి చేతుల మీదుగా స్వర్ణపతకం తీసుకుంది.ఆడవాళ్ళు ఏమి చెయ్యగలరంటే అసలు. ఒప్పుకోదు. కేవలం. ఆడవాళ్ళు మాత్రమే అన్నీ చెయ్య గలరంటుంది. అనుక్షణం బాధ పడితే అంగ వైకల్యం శాపమే నాంటీ.... ఏ వైకల్యం లేని వారెవరుంటారండీ? కాకపోతే కొన్ని వైకల్యాలు కనబడతాయి. కొందరివైకల్యాలు కనబడవు. అంటుంది అన్నాను .
అంతా ఆశ్చర్యంగావిని. ఆలోచిస్తున్నవాడికి కాలిన ఇనుం మీద దెబ్బ పడితేనే సాగుతుందన్నట్లు .
ఈసారి నాకు తెలిసిన ప్రభ గురించి చెప్పాను నీలాగే నిర్లక్ష్యం కారణంగా నిండు బ్రతుకు కష్టాల పాల్జేసుకుంది .గూడ్సు బండి ఆగి ఉందని అర్జెంటని, పాలపేకట్లు తెచ్చు కోడానికి
రైలుపట్టాలుదాటుతూ , పాదం అందులో ఇరుక్కుపోయి అదేసమయంలో గూద్స్ కదలడంతో కాలు చెయ్యి పోగొట్టు కుంది .పిల్లలకోసం బ్రతకాలని చక్కగ్గా అన్ని పనులూ చేస్తూ ,జైపూర్ కాలు చేయి సహాయంతో చక్కగా బ్రతుకుతోంది .
నేనుచాలాసేపు కూర్చొని ధైర్యం చెప్పి వచ్చాను .. పట్టుదల కలిగించాను . ప్రతీవారం కొన్నాళ్ళు వెళ్ళాను ... తర్వాత చెప్పిన విధంగా సాయం చేసాను ..
ఇప్పుడు ఆదమ్మ కొడుకు బడ్డీ పెట్టుకొని చక్కగా వ్యాపారం చేస్తున్నాడు .ప్రైవేటుగా దిగ్రీకి వ్రాస్తున్నాడు ... ఆదమ్మమొగుడు కూడా ఆసంఘటనతో బాగామారాడు . ఇల్లు పిల్లలను పట్టించుకుని కష్ట పడుతున్నాడట ..కూతురు కూడా చదువు పూర్తిచేసుకొని ఉద్యోగంలో చేరింది .. ఇప్పుడు ఆదమ్మ ఆనందంగా ఉంటొంది .నన్ను తల్లిలా చూసుకుంటుది ...
కాసింత ఆదరణ .. కూసింత ఓదార్పు లభిస్తే కూలిపోయిన బ్రతుకులైనా కూడగట్టుకు నిలబడతాయి అనుకున్నాను.
+91- 9010902794
******************************************************************************

నవనీతం
్ రోహిణి వంజారి
హఠాత్తుగా మెలకువ వచ్చింది. కిటికీ అద్దంలోనుంచి మసక మసకగా వెలుతురు. కిటికీ కి అవతల ఉండే కానుగ చెట్టు కొమ్మల మధ్య నుంచి తొలిపొద్దు భానుడి కిరణాలు లేలేత కనకాంబరం పూల రంగులో కిటికీ అద్దంలో నుంచి ఏటవాలుగా గదిలో పడుతున్నాయి. నా కళ్ళు అప్రయత్నంగా గోడ గడియారం వైపు మళ్ళాయి. సమయం ఆరుంపావు అని గడియారం ముళ్ళు నన్ను వెక్కిరిస్తున్నాయి ఈ రోజు తాము గెలిచామని.
దిగ్గున లేవాలని చూసాను. పక్క మీద నుంచి అంగుళం కూడా కదలలేకపోయాను. తల అంతా దిమ్ముగా ఉంది. ఈ రోజు నుంచి స్కూల్లో యూనిట్ పరీక్షలు. పిల్లల సీటింగ్ అరేంజ్, నంబరింగ్ పని బాధ్యతను నాకు, తెలుగు మాస్టర్
సోమశేఖరంగారికి అప్పజెప్పారు మా ప్రిన్సిపాల్ మేడం సుభాషిణి గారు. నిన్న సాయంత్రమే కొంత పని పూర్తి చేసి మిగిలినది రాత్రి భోజనాల తర్వాత కూర్చుని పూర్తి చేసి మాస్టర్ కి ఆ పేపర్స్ వాట్సాప్ లో పంపేసరికి రాత్రి పదకండు అయింది.
బాగా తలనొప్పిగా ఉండి డిస్ప్రిన్ మాత్ర నీళ్లలో కలిపి తాగి పడుకుంటే ఇప్పటికి మెలుకువ వచ్చింది. బాబోయ్... ఈ రోజు లేవడం ఆలస్యం అయిపోయింది. ఇప్పుడు వంట మొదలు పెడితే ఎప్పటికి అయ్యేను. మళ్ళీ లేవాలని ప్రయత్నించాను కానీ లేవలేకపోయాను. తలంతా సూదులు గ్రుచ్చినట్టు విపరీతంగా నొప్పి. పొత్తికడుపు దగ్గర పేగులను మెలితిప్పినట్టు విపరీతంగా బాధ. నా పరిస్థితి నాకు అర్ధం అయింది. ప్రతినెలా ఉండేదే అయినా ఈ మూడు రోజుల బాధ ఇప్పుడే రావాలా!?
పక్కకి తిరిగి చూసాను. శ్రీవారు గాఢ నిద్రలో ఉన్నారు. లేపి కాస్త పనిలో సాయం చేయమందామనుకున్నాను. సాయం అడిగితే స్కూలుకి సెలవు పెట్టమంటారు కానీ సాయం అందదు అని ఆ ప్రయత్నం విరమించుకున్నాను. 'నొప్పి చాల ఎక్కువగా ఉంది. పోనీ సెలవు పెడితే' అనుకునే లోగానే సెల్ మోగింది. ఐదవ తరగతి స్టూడెంట్ " కైలాష్ " వాళ్ళ అమ్మ ఫోన్ చేసి " గుడ్ మార్నింగ్ మేడం.. డైరీలో ఎగ్జామ్స్ పోర్షన్ రాసుకోవడం మర్చిపోయాడు కైలాష్. కాస్త ఈ రోజు పరీక్ష జరిగే తెలుగు, మాథ్స్ సిలబస్ చెప్పండి. కైలాష్ ని చదివించాలి " అంది. "ఒక్క ఐదు నిముషాలు ఆగండి. నేను కాల్ చేస్తాను" అని చెప్పి జన్మనెత్తితిరా, అనుభవించితిరా అనుకుంటూ భారంగా మంచం మీది నుంచి దిగాను. మెల్లగా లేచి టేబుల్ మీద ఉండే బుక్ తెరచి సిలబస్ చూసి కైలాష్ వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి పరీక్షల పోర్షన్ చెప్పి సెల్ టేబుల్ మీద పెట్టేసాను.
ఇంకాసేపు పడుకోవాలనిపించింది. ఆ వెనువెంటనే స్కూల్ కి ఆలస్యంగా వెళితే , అదీ ఎగ్జామ్స్ మొదటి రోజు మా ప్రిన్సిపాల్ మేడం తీక్షణమైన చూపులు, ఉగ్ర రూపం గుర్తుకు వచ్చి 'ఇష్టమైనంత సేపు హాయిగా పడుకునే అదృష్టం నాకు లేదులే ' అనుకుంటూ నా అత్యాశకు విరక్తిగా నవ్వుకుని, కబోర్డులో నల్ల కవర్లో దాచివుంచిన సానిటరీ పాడ్, టవల్, డ్రెస్ తీసుకుని వాష్ రూంకి వెళ్ళాను.
సమయం 8.30 అయింది. ఇంకో పది నిముషాల్లో స్కూల్లో ఉండాలి నేను. దొండకాయ కూర కలిపిన అన్నం లంచ్ బాక్స్ లో పెట్టుకున్నాను. బాబు గదిలో చదువుకుంటున్నాడు . వాడు తొమ్మిదింటికి హడావిడిగా రెడీ అయి కాలేజీ కి వెళ్తాడు. ఓ పక్క తల తుడుచుకుంటూ, ఇడ్లి నోట్లో కుక్కుకుంటున్నాను. ఆయన ఇడ్లీలు తిని సింకులో ప్లేట్ వేసి నీళ్ళు తాగుతూ నా వంక చూసాడు.
" ఏంటి లతా ఇప్పుడు తలకి స్నానం చేసావు". అన్నాడు. " అది అదీ కడుపు నొప్పిగా ఉందండీ" అన్నాను.
అర్ధమైనట్టు తల పంకించాడు.
" మీ స్కూటీ లో నన్ను " నా మాట పూర్తి కాకముందే " నాకు ఆఫీస్ కి టైం అయింది. నువ్వు ఆటోలో వెళ్ళు. నేను వెళుతున్నా" అంటూ స్కూటీ స్టార్ట్ చేసి మరోసారి నా వైపు చూసాడు. మళ్ళీ నాలో ఆశ ఊపిరి పోసుకుని కాస్త దీనంగా ఆయన వంక చూసాను, రమ్మంటారేమో అని.
" కడుపు నొప్పి మరీ ఎక్కువగా ఉంటే స్కూల్ కి రాలేనని మీ మేడంకి ఫోన్ చేసి చెప్పి రెస్ట్ తీసుకో " మరో మాటకు చోటివ్వకుండా వెళ్ళిపోయాడు . అంతకంటే ఆయన నుంచి ఎక్కువ ఆశించడం నా అత్యాశ. ఓ పక్క కడుపు నొప్పి. మరోపక్క స్కూలుకి ఆలస్యం అవుతోందని కంగారుతో తినే ఇడ్లి గొంతులోకి దిగలేదు. ఇక తినలేక నీళ్ళు తాగి లంచ్ బాక్స్ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని బాబు కి చెప్పి ఇంటి నుంచి బయట పడ్డాను.
రహ్మత్ నగర్ చౌరస్తా దగ్గర ఆటో కోసం ఎదురు చూస్తున్నా. నాలుగు షేర్ ఆటోలు వచ్చివెళ్లాయి. ప్రతి ఆటోలో పదిమందికి తక్కువలేకుండా జనం ఉన్నారు. సమయం ఎనిమిదీ నలభై అయింది. రిజిస్టర్ లో సంతకం పెట్టాల్సిన సమయం అయిపోయింది. ఇక ఈ రోజు లేట్ కమర్ లెక్కే. మేడం దగ్గర ఎలాగూ అక్షింతలు తప్పవు. ఏడుపు వస్తోంది నాకు. దీనంగా నిల్చున్న నా ముందుకు ఒక ఆటో వచ్చి ఆగింది. దాంట్లో కూడా దాదాపు ఎనిమిది మంది దాక ఉన్నారు.
ఇంకా ఎక్కించుకోవాలని ఆటోవాలా "బోరా బండ బోరా బండ " అంటూ దీర్ఘం తీస్తూ ఒక వింతైన రిథంలో అరుస్తున్నాడు. బస్సు కూడా ఇప్పట్లో వచ్చేటట్టు లేదు. ఇక ఉపేక్షిస్తే లాభం లేదనుకుని ఆటో ఎక్కి అంగుళం చోటు కూడా లేని సీట్ మీద అవతల వారిని నెట్టుకుంటూ కూర్చున్నాను. ఏం దయ తలచాడో కానీ ఆటోవాలా ఇక ఆలస్యం చేయక ఆటోని ముందుకు ఉరికించాడు. రహ్మత్ నగర్ చౌరస్తా నుంచి మెలికలు తిరిగిన కొండచిలువల్లా ఉన్న గల్లీల నుంచి ఆటో నేలమీది రాకెట్ లా దూసుకు పోతోంది. గుంతలు, మిట్టలు, స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడల్లా ఆటో ఎగిరెగిరి పడుతోంది. ఆటో ఎగిరినప్పుడల్లా నా కడుపు నొప్పి తారాస్థాయికి చేరి పేగులు లుంగచుట్టుకు పోతున్నట్టు అవుతోంది. బాధని పంటిబిగువున అణుచుకుంటున్నాను. ఆటోని కార్మికనగర్ చౌరస్తాలో ఆపాడు డ్రైవర్. అక్కడ దిగేవాళ్ళు, ఎక్కేవాళ్ళు. ఐదు నిముషాలు అయింది.
ఆటోవాలా ఇంకా "బోరబండ బోరబండ "అని అరుస్తూనే ఉన్నాడు. నా అసహాయత కోపంగా రూపాంతరం చెంది " భాయ్, జర ఆటో పోనీయ రాదు ఇక. స్కూల్ కి లేట్ అవుతుంది " ఎంత కోపంగా అందామనుకున్నా అంతకంటే కఠినంగా మాటలు రాలేదు నాకు.
" ఇంకోలని ఎక్కనీయండి మేడం" నిర్లష్యంగా జవాబిచ్చాడు ఆటోవాలా.
ఇక అతనికి చెప్పడం అంటే' చెవిటివాని ముందు శంఖం ఊదినట్టే' అని కిమ్మనకుండా కూర్చున్నాను ఆటో కమ్మి పట్టుకుని. ఆటో లోపల రకరకాల మనుషులు. చెమట, జర్దా కిల్లి, సారా వాసనలు కలగలసి కడుపులో తిప్పేస్తున్నాయి. "హు.. ఈ షేర్ ఆటోలో ప్రయాణం అంటేనే డైరెక్టుగా నరకానికి పోవడమే. ఎన్నో సార్లు ఈ ప్రైవేట్ స్కూల్స్ లో జాబ్ మానేద్దాం అనుకున్నాను. ఆయనది చిన్న ఉద్యోగం. బాబు చదువు పూర్తయి వాడు ఓ దారికొచ్చేదాకా ఆయన సంపాదనకు, నా సంపాదన వేడినీళ్ళకు చన్నీళ్ళలా కాస్త ఆసరాగా ఈ జాబ్ చేయాల్సివస్తోంది. ప్రైవేట్ స్కూల్స్ లో టీచర్ అంటే అక్కడ చాకిరీ బారెడు. జీతం మూరెడు. అయినా తప్పదు. బి.ఎడ్. చేసిన నాకు ప్రభుత్వ ఉద్యోగం రాలేదు. నా చదువుకి ఇంతకంటే పెద్ద జాబ్ ఎక్కడ వస్తుంది. ఇంకెన్నాళ్ళో నాకీ బాధ.
తీరుబడిగా ఆలోచించడానికి కూడా నీకు అర్హత లేదు అంటూ ఆటో బోరబండ చౌరస్తా లో ఆగింది. చేతిలో ఉన్న చిల్లర పైసలను ఆటోవాలా చేతిలో పెట్టి పరుగు లాంటి నడకతో స్కూల్ లోకి వెళ్ళాను. చేతిలో హాజరు పుస్తకం వంక, మరోవైపు గోడ గడియారం వంక మార్చి మార్చి చూస్తూ ఉంది ప్రిన్సిపాల్ మేడం సుభాషిణి.
" గుడ్ మార్నింగ్ మేడం " అన్నాను మేక పోతూ గాంభీర్యాన్ని ముఖంలో ప్రదర్శిస్తూ.
" ఎగ్జామ్స్ సమయంలోనే మీకందరికీ ఆలస్యం అవుతుందా? కట్టగట్టుకుని అంతా లేటుగా వస్తున్నారు " అన్న ఆమె భీకరమైన చూపులకు శక్తి ఉండే నేను అక్కడే మాడి మసైపోయుండేదాన్ని.
" మేడం పీరియడ్ వచ్చింది. బాగా కడుపు నొప్పిగా ఉంటే పనులు తొందరగా చేయలేక పోయాను " నీళ్ళు నములుతున్నట్టు వచ్చాయి మాటలు నాకు.
" అదేం కొత్తనా. ఎప్పుడూ ఉండేదేగా. నాకింకేం చెప్పొద్దు. స్టాప్ రూమ్ లో శోభారాణి టీచర్, సోమశేఖరం మాస్టర్ ఉన్నారు. వెళ్ళి ఎగ్జామ్స్ సీటింగ్ అరేంజ్మెంట్ విషయం చూడండి " తల తిప్పేసి ఎవరో పేరెంట్స్ తో మాట్లాడటం మొదలెట్టింది మేడం.
"బతుకు జీవుడా " అనుకుంటూ రెండు ఫ్లోర్లు ఎక్కలేక ఎక్కి సెకండ్ ఫ్లోర్ స్టాప్ రూమ్ లోకి వెళ్ళాను.
అక్కడ శోభారాణి టీచర్ నన్ను చూస్తూనే " రండి శ్రీలతా టీచర్. నేను ఇప్పుడే వచ్చాను. మేడం ఉగ్రావతారం చూసారా. మీకెందుకు లేట్ అయింది..? " అంటుంటే చిన్నగా నిట్టూర్చి బల్ల మీద కూర్చుని మెట్లెక్కిన అలుపు కాస్త తీర్చుకుని గట్టిగా ఊపిరి పీల్చి వదిలి
" శోభారాణి టీచర్ ఈ రోజు పొద్దున్న లేస్తూనే నాకు పీరియడ్ వచ్చింది. బాగా తలనొప్పి, కడుపు నొప్పి. ఇంటి పని సరిగా చేయలేక పోయాను. వంట అయి, తలంటు స్నానం చేసేసరికి బాగా లేట్ అయింది. ఆటో కూడా త్వరగా దొరకలేదు. ఇదుగో వచ్చేసరికి ఈ టైం అయింది. మేడం దగ్గర అష్టోత్తర శత, సహస్రనామాలు కూడా అయినాయి టీచర్"
అంటు నా ధోరణిలో చెప్తున్న దాన్ని హటాత్తుగా ఆగిపోయాను. స్టాప్ రూమ్ లో ఉన్న పెద్ద టేబుల్ చుట్టూ వేసి ఉన్న బల్లల్లో మా ఎదురు వైపు ఉన్న చివరి బల్ల మీద 'సోమశేఖరం ' సార్ కూర్చుని ఉన్నారు. ఆయన్ని గమనించకుండా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆయన మా మాటలను విన్నారో లేదో తెలియలేదు కానీ నాకు ఏదో గిల్టీగా అనిపించి చిన్నగా
" గుడ్ మార్నింగ్ సార్ ". "ఈ రోజు రావడం కాస్త ఆలస్యం అయింది. రాత్రి మీ వాట్సాప్ కి సీటింగ్ అరేంజ్మెంట్ రాసిన పేపర్ మెసేజ్ చేశాను. చూసారా సార్. అంతా ఓకే కదా " అన్నాను
ఓ చూపు నా వైపు చూసి తల ఊపి ఊపనట్లు ఆడించి మళ్ళీ పుస్తకం లోకి తల దూర్చారు ఆయన. ఇంతలోనే ఉపేంద్ర ఆయమ్మ ప్లాస్క్, డిస్పోజబుల్ గ్లాసులు తీసుకుని స్టాప్ రూంలోకి వచ్చి
" శోభమ్మ టీచర్, లతా టీచర్ ఈ రోజు నుంచి పిల్లోల్లకి పరీక్షలని హెడ్ మేడం టీచర్లందరికి 'ఛాయా ' నాచేత తెప్పిచిర్రు . ఇందాక పొట్ట నొచ్చుతోందని మేడంకి చెప్పినవు కదా లతమ్మా . అందుకే ముంగడ మీ ఫ్లోర్ కే "ఛాయా " తెచ్చిన. ఇదుగో తాగుర్రి. స్కూల్ బస్సు తుడవడానికి రమ్మని డైవర్ "సాయిలు " అన్న పిలిచిండు. మల్లా ఇంటర్వెల్ లోగా నేను పైకొచ్చియాలా దారాలు పంచనీకి" అంటు వెళ్ళిపోయింది ఉపేంద్ర ఆయమ్మ.
" అబ్బా ! ఈ రోజు మేడం కి మన మీద ఈ ప్రేమ ఏంటో, పొద్దున టిఫిన్ కూడా సరిగా తినలేదు టీచర్. టీ ' తాగితే కాస్త రిలీఫ్ గా ఉంటుంది " అంటూ నేను మూడు గ్లాసులలో టీ పోసి ఒకటి శోభారాణి టీచర్ కి ఇచ్చాను. రెండో గ్లాసును " సార్ టీ తీసుకోండి " అంటూ సోమా శేఖరం సార్ కి అందించాను.
రెప్ప పాటులో ఆయన లేచి నిలబడి " బైట చేరాను అని ఇందాకే కదా చెప్తున్నావు. ఓ మూల కూర్చుని ఉండక తగుదునమ్మా అంటూ ఇల్లు వాకిలి ఏకం చేస్తూ అన్ని ముట్టుకోవడం ఎందుకు. పైగా నీ చేత్తో నాకు టీ ఇస్తావా.." అంటూ విసురుగా స్టాప్ రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు.
ఒక్క క్షణం పాటు ఏం జరిగిందో తెలియలేదు నాకు. శోభారాణి టీచర్ కూడా విస్తుపోయింది ఆయన ప్రవర్తనకి .
" అయ్యో ! సార్ ఏంటి అలా అనేసారు " అంది.
టీచర్ మాటలు నాకు వినపడలేదు. పొద్దున్న నుంచి నొప్పి, నా పరిస్థితి తెలిసి కూడా మా వారు నన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేయకపోవడం, స్కూలుకి లేటుగా రావడం, మేడం దగ్గర తిట్లు, ఇప్పుడు సార్ దగ్గర ఈ అవమానం వెరసి గుండెల్లోని బాధ అంతా కట్టలు తెంచుకుని కన్నీటి రూపంలో బయటకు వచ్చింది నాకు.
" అయ్యో లతా టీచర్..! బాధ పడకండి. సార్ మాటలను లైట్ తీసుకోండి. ఇలాంటివి చాల సార్లు ఎదుర్కొన్నాను నేను. ఇప్పుడు సార్ అన్నారు. ఇంతకు ముందైతే సీనియర్ టీచర్లు కొందరు ఈ విషయంలో నన్ను, ఇంకొందరిని చాల బాధ పెట్టారు. మన ఆడవాళ్ళే మన సమస్యను అర్ధం చేసుకోకుండా ఇదేదో మనం స్వయంగా చేసిన నేరం అన్నట్టు చూస్తారు" అంది శోభారాణి టీచర్ నా వైపు ఓదార్పుగా చూస్తూ.
నా బాధ, శోభారాణి టీచర్ మాటలు విని శ్రావణి, సుజాత టీచర్ లు కూడా స్టాప్ రూమ్ లోకి వచ్చారు ఏం జరిగింది అంటూ.
సోమశేఖరం సార్ ఆ స్కూల్లో చాల సీనియర్ టీచర్. దాదాపు రిటైర్మెంట్ కి దగ్గర వయసు. సనాతన సంప్రదాయంలను బాగా వంటబట్టించుకున్న వారు. రోజు టీచర్లలందరితో, నాతో సహా బాగా మాట్లాడుతారు. అడగక పోయిన 'ఇదిగో అమ్మాయి ఈ పాఠం ఇలా చెప్పాలి, ఈ పని ఇలా చెయ్యాలి ' అంటూ సలహాలిచ్చేవారు. అటువంటిది ఈ రోజు నా పట్ల ఆయన చూపిన ఏహ్య భావం నన్ను నా కడుపు నొప్పి కంటే ఎక్కువ బాధ పెట్టింది. అందరు టీచర్లు తలోమాట అంటుండగానే ఇంటర్వెల్ గంట మ్రోగింది.
లోపలి గంట కొట్టడంతోనే ప్రిన్సిపాల్ మేడం టీచర్లను వాళ్ళకి అలాట్ చేసిన రూంలకి పంపించింది ఎగ్జామ్స్ ఇన్విజిలేషన్ కోసం. పొద్దున ఓ పరీక్ష, మధ్యాహ్నం లంచ్ తర్వాత మరో పరీక్ష పూర్తైయేసరికి సాయంత్రం నాలుగయింది. ఆ తర్వాత ఓ గంట స్టడీ అవర్. అప్పటివరకు ఒక్క నిముషం కూడా కూర్చోవడానికి కుదరలేదు నాకు.
రిజిస్టర్ లో సాయంత్రపు సంతకం చేసి బయట పడేసరికి ఐదున్నర అయింది. రహ్మత్ నగర్ వైపు వెళ్ళేది నేను, సోమశేఖరం మాస్టర్. మేమిద్దరమే. ఆయన రహ్మత్ నగర్ దాటి యూసుఫ్ గూడ బస్తి అవతల ఉన్న మథురా నగర్ వెళ్ళాలి. రోజు పాత మోపెడ్ బండిలో ఆయన, షేర్ ఆటోలో నేను వెళ్ళేవాళ్ళం.
ఎంతసేపు బోరబండ చౌరస్తాలో నిలబడ్డా ఎందుకో ఈ రోజు ఒక్క షేర్ ఆటో కానీ, బస్సు కానీ రాలేదు. పొద్దున నుంచి జరిగిన అవమానాలు, తలనొప్పి నిలబడలేకపోతున్నాను నేను. ఇక లాభం లేదని కార్మిక నగర్ వరకు నడుచుకుంటూ పోయి అక్కడ ఆటో ఎక్కుదాం అనుకుని మెయిన్ గల్లీ నుంచి కాస్త పక్కకు ఉన్న సైడ్ గల్లిలో చిన్నగా నడుచుకుంటూ పోతున్నాను. గల్లిలో ఎక్కడా జనసంచారమే లేదు. సోమశేఖరం సార్ కూడా వెళ్లిపోయారేమో. ఆయన తీరు తలచుకుంటేనే మనసంతా బాధతో నిండిపోతోంది. గల్లిలో అంతా అడుగడునా పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. వాటిలో నీరు నిండి మురుగు వాసనా వస్తోంది. జాగ్రత్తగా అడుగు వేయక పొతే గుంటలో పడడం ఖాయం. ఆ గల్లిలో పెద్దగా ఇళ్ళు కానీ, షట్టర్లు కానీ లేవు.
అడుగులో అడుగేసుకుంటూ మెల్లగా నడుస్తున్నాను. అప్పటికే చీకటి "నా డ్యూటీకి నేను వచ్చేస్తున్నా" అంటూ బొగ్గు రంగు పులుముకుని చిక్కగా అల్లుకుంటోంది. వాహనాల ట్రాఫిక్ ఉండదని ఈ గల్లీ లోకి రావడం నా పొరపాటైంది. చీకట్లో ఎక్కడ గుంటలో అడుగు వేస్తానో అని భయంగా మెల్లిగా నడుస్తున్నాను.
ఉన్నట్టుండి వెనుక నుండి దబ్బున ఏదో పడ్డ చప్పుడైంది. వెనువెంటనే " అమ్మా" అన్న అరుపు గాల్లో ప్రతిధ్వనించింది. దిగ్గున వెనక్కి తిరిగి చూసాను నేను. నాకు కాస్త దూరంలోనే గుంటలో పడ్డ సోమశేఖరం మాస్టర్ కనిపించారు. ఆయన మోపెడ్ బండి పక్కకు పడిపోయి ఉంది. పరీక్ష పేపర్లు అన్ని చెల్లా చెదురుగా పడిపోయాయి. గుంత అంచు బలంగా నుదుటికి కొట్టుకున్నట్లు ఉంది. నుదుటి నుంచి ధారగా రక్తం కారి మాస్టారి తెల్ల చొక్కాని ఎర్రగా తడిపేస్తోంది. గుంటలో నుంచి లేవడానికి విఫల ప్రయత్నం చేస్తూ నా వైపు చేయి చాచి రమ్మని సైగ చేస్తున్నాడు ఆయన.
" అయ్యో సార్, పడిపోయారా..! " అప్పటి దాకా ఆయన మీద ఉన్న కోపం, బాధ ఎగిరిపోయాయి
******************************************************************************

మరో మార్గం కథ
జయంతి వాసరచెట్ల
బయట జోరుగా వర్షం కురుస్తుంది.
సాయంత్రం ఐదు గంటలు కావస్తోంది!
వృద్ధాశ్రమంలోని పెద్దలంతా ఒకే దగ్గర కూర్చుని వేడివేడిగా సుబ్బయ్య తెచ్చిన పకోడీలు తింటూ ఆనందంగా కాలక్షేపం చేస్తున్నారు.
వారు ఆనందంగా ఉన్నారో….నటిస్తున్నారో….
ఆదుర్దాగా ఉన్నారో ….కానీ ఏ భావనా బయటకు కనిపించడంలేదు.
అందరికళ్ళూ మళ్లీమళ్లీ గేటు వైపు చూస్తున్నాయి.
ఈరోజు ఆదివారం కావడమే అందుకు కారణం.
తమ కుటుంబ సభ్యులు వాళ్లని చూడడానికి వస్తారు.వస్తూ వస్తూ వాళ్ళ మనవలనూ మనవరాళ్ళనూ తీసుకుని వస్తారు.వాళ్ళతో కాసేపు ఆడుకోవచ్చు కబుర్లు చెప్పుకోవచ్చు తమ కొడుకులను కానీ బిడ్డలను కానీ ఎవరూ లేకపోతే గార్డియన్లుగా ఉన్నవారిని కానీ కలుసుకుంటారు.వారితో వారి మనసులోని బాధను ఉన్నకాసేపట్లో చెప్పుకుని తృప్తి పడతారు.
కానీ పొద్దున్నుంచీ ఈ వర్షం పడుతూనే ఉంది.
మనవాళ్ళు వస్తారా రారా అని అందరి మనసుల్లో బాధ ఆదుర్దా తొంగి చూస్తుంది.
ఒక్కో నిమిషం సమయం గడిచినకొద్దీ కళ్ళల్లో నీళ్ళు నిండుతున్నాయి.
ఎవరికి వారు వాటిని కనిపించనీయకుండా చేయడానికి తెగ ఆరాటపడుతున్నారు.
అది "మరో మార్గం" వృద్ధాశ్రమం అక్కడ దాదాపు గా వందమంది దాకా వృద్దులు ఆశ్రయం పొందుతున్నారు.
వాళ్ళు ఆర్థికంగా ఎదుగూబొదుగూ లేనివాళ్ళు కాదు.అందరూ మంచి ఉన్నతస్థాయి లో ఉన్న కుటుంబాల వాళ్ళే …...భర్త లేని భార్యలు, భార్యలు లేని భర్తలు, సంతానం లేని దంపతులు , విధిలేని పరిస్థితుల్లో ఆశ్రయం కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు.
ఇష్టపడి ఉంటున్నవాళ్ళెవరూ లేరు విధి లేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళే అందరూ. ఇక్కడి కి వచ్చిన తర్వాత అందరూ ఒకే కుటుంబం లా కలిసీమెలిసీ ఒకరికి ఒకరం అన్న చందంగా ఉంటున్నారందరు.
అది ఆదివారం కావడంతో ...సాయంకాలం తమ వాళ్ళు వస్తారనే ఆనందం ఒకవైపూ వర్షం వల్ల ఎక్కడ రాకుండా పోతారోననే భయం ఒకవైపు అందరిలో కనిపిస్తూనే ఉంది.
ఎవరికివారు తోచింది మాట్లాడుతూనే ఉన్నారు కానీ ….
అందులో ఆఖరి వరుసలో సోఫాలో వెనక్కి ఆనుకుని కూర్చున్న పెద్దావిడ వరలక్ష్మి వయసు 68 సంవత్సరాలు సరిగ్గా వినలేదు, నడవలేదు, ఆమెకు షుగర్, బిపి ,ఉన్నాయి. మాటలు స్పష్టంగా మాట్లాడడం రాదు.తనకున్న ఒక్కగానొక్క కొడుకు ఆరునెలల క్రితం మరోమార్గం వృద్ధాశ్రమం లో వదిలి
వెళ్ళాడు.
" ఒక్కగానొక్క కొడుకు వాడిని ఎంత ప్రేమగా పెంచింది"
కొడుకు పుట్టిన రెండు సంవత్సరాలకే భర్తను కోల్పోయింది వరలక్ష్మి .
అప్పటినుండి వాడే తన ప్రాణానికి ప్రాణంగా పెంచి పెద్ద చేసింది. మంచి చదువులు చెప్పించింది. దాయాదుల దాడి నుండి తనను తాను కాపడుకుంటూ కొడుకు పై ఎవరి కన్నూ పడకుండా పెంచింది.
భర్త చనిపోయాక అతని ఉద్యోగం తనకు ఇస్తే ఎలాంటి అనుభవం లేకపోయినా పని నేర్చుకుని భర్త స్థానం లో తన పేరు ను నిలుపుకుంది.
"చిన్న వయసే మరో పెళ్ళి చేసుకోమ్మని చాలా మంది సలహా ఇచ్చారు."
కానీ తనకు అలాంటి ఆలోచనే లేదని మరోసారి తనవద్ద అలాంటి ప్రస్తావన తీసుకు రావద్దని తెగేసి చెప్పింది.
మనసును రాయిగా చేసుకుని జీవించింది.
కొడుకు కోసం వాడి భవిష్యత్తు కోసం తను శ్వాసించింది.
ఆస్తి అంతస్తులు సమకూర్చి మంచి కుటుంబానికి చెందిన అమ్మాయి తో పెళ్లి చేసింది. ఇప్పుడు వారికి ఇద్దరు పిల్లలు వాళ్ళతో ఆడుకోవాలనీ
మంచి మంచి కథలు చెప్పాలని, నానమ్మా నానమ్మా అంటూ వాళ్ళు తనచుట్టూ తిరగాలనీ బుంగమూతి పెట్టుకుని అలిగితే తానే ఓదార్చి అడిగినవన్నీ కొనివ్వాలనీ ఎన్నో కోరికలు మనసులోనే పెట్టేసుకుంది.
ఏనాడూ తను వృద్ధాశ్రమంలో చేరాల్సి వస్తుందని తన జీవిత చరమాంకంలో ముక్కూ ముఖం తెలియని ప్రదేశంలో ఉండాల్సొస్తుందని
ఊహ కైనా అందని విషయం.
అనుకోకుండా ఒకరోజు బీపీ ఎక్కువైంది.
ఆరోజు కొడుకు కోడలు ఇంట్లోనే ఉన్నారు. కుర్చీలో కూర్చున్నది కూర్చున్నట్లే కిందపడిపోవడమే గుర్తుంది
"ఆతరువాత కళ్ళుతెరిచిచూస్తే హాస్పిటల్ ఐసియూ వార్డులో ఉంది."
మూతి వంకరగా పోవడం వల్ల ఇకముందు మాటలు స్పష్టం గా రావని నడవడం చాలా కష్టం అనీ ఒక గాజు బొమ్మలాగా తనను చూసుకోవాలనీ డాక్టర్ తన కొడుకు తో చెప్పడం తనూ విన్నది.
భార్యా భర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తారు.తన బాగోగులు చూడడానికి ఇబ్బంది అవుతుంది అని నచ్చజెప్పి "మరోమార్గం" వృద్ధాశ్రమం లో తన స్నేహితుడి తల్లికూడా ఉంది అని ఇక్కడ జాయిన్ చేసారు.
ఇదే నా నేనుకోరుకున్న జీవితం ….?
ఈ స్థితిలో కన్నకొడుకు దగ్గర లేకపోవడం ఇంత బాధగా ఉంటుందని అనుకోలేదు…..?
ఎంత ప్రేమ గా పెంచాను వాడిని …?
"ఒంటరి మహిళ కు ఈ సమాజంలో ఎలాంటి గౌరవం ఉంటుందో..,? "అందరి చూపులు తప్పించుకొని మౌనంగా ఎదగాలంటే ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కోవలసి వచ్చిందో కొడుకుకు తెలియదా ….?
అయినా ..
వాళ్ళదీ నిజమే వాడు ఆఫీస్ కు వెళ్ళినప్పుడు తనకేమన్నా అయితే ….వాడు తట్టుకోగలడా…?
ఎవరినైనా మనిషిని పెట్టి చేయించాల్సింది కదా ….?
డబ్బుకు ఏమైనా కొదువా….? కాదుకదా…?
వృద్ధాశ్రమం లో వదిలితే ఈకన్నపేగు ఎంతలా విలవిల లాడుతుంది….?
అని పరధ్యానం ఎక్కడో శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తుంది వరలక్ష్మి .
నిశ్శబ్దాన్ని ఛేదిస్తున్నట్లు "ఏమండోయ్ వరలక్ష్మి గారు ఇంకా మీ కొడుకు వచ్చినట్లు లేదు.." అంది 80 సంవత్సరాల సత్యమ్మ
ఇంకా రాలేదమ్మా వర్షం పడుతుంది కదా అందువల్లే రాలేదేమో లేకపోతే వచ్చే వాడే అంది వరలక్ష్మి.
మధ్యలో కల్పించుకుని " అంతేలెండి మనం మన పిల్లలను వెనకేసుకుని రావాలి లేదంటే మరోవారం వాళ్ళు రాకపోవచ్చు... లేదంటే శాశ్వతంగా మనల్ని మర్చిపోవచ్చు "
అన్నాడు అక్కడే మంచంపై కూర్చున్న 61 ఏళ్ల లక్ష్మయ్య .
"లక్ష్మయ్య గారు అలా నిష్ఠూరంగా మాట్లాడతారేంటీ అంది వరలక్ష్మి."
ఇందులో నిష్ఠూరం అనే విషయంఏమీ లేదమ్మా అనుభవం తో చెప్తున్నా.
నావిషయమే తీసుకోండి నేను ఎంతో కష్టపడి ఆస్తులు కూడ బెట్టాను.
పిల్లలందరి పెళ్లిళ్లు చేశాను.
నా అంత అదృష్టవంతులు ఎవరూ లేరని అనుకునేవాన్ని ఉన్నట్టుండి ఒకరోజు ఒళ్లంతా వాపులు వచ్చాయి. లేవడం పనులు చేసుకోవడం సాధ్యం కాలేదు. డాక్టర్ ఇది బోధవ్యాధి తగ్గేట్లు లేదు అన్నారు.
నా కుటుంబ సభ్యులు వచ్చి చూసారు.
ముఖం తిప్పుకున్నారు.అంతవరకూ నేనంటే గౌరవం చూపించే నా కోడళ్ళు నాకెక్కడ సేవచేయవలసి వస్తుందోనని తప్పుకు తిరుగుతున్నారు.
నా భార్య ఉంటేనన్నా నన్ను చూసుకునేదేమో….!!
కానీ అది నన్ను వదిలి నా కంటే ముందే వెళ్ళిపోయింది.
నా దర్జా దర్పం అన్నీ నావ్యాధి రావడం తోటే మాయమయ్యాయి.
" మనం ఒక్క నిమిషంలో కోటీశ్వరులం కావచ్చు ,మరు నిమిషంలో బిచ్చగాళ్ళ మై పోవచ్చు, కానీ జీవితం అనేది ఎవరికోసమూ ఆగదు కదా …."
అందుకే నా పిల్లలకు భారంగా ఉండదల్చుకోలేదు.
మూడు సంవత్సరాలుగా ఇక్కడే ఇదే గదిలో నా జీవితం అన్నాడు లక్ష్మయ్య.
మరోపక్క చివరగా ఆసనం వేసుకుని టేప్ రికార్డరు లో పాటలు వింటున్న సుశీలమ్మ వీరి మాటలకు టేప్ రికార్డరు ఆపేసి చేతితో తిప్పుతున్న జపమాలను పక్కనే ఉన్న డబ్బాలో వేసి ఇలా అంటుంది.
"మీరు ఏం కోల్పోయారని బాధ పడుతున్నారు. మనం ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు మనం ఏమైనా తెచ్చామా…? తీసుకొని పోవడానికి ..?"
"ఇప్పుడు ఈ క్షణం ఇక్కడ ఒకే కుటుంబం లాగా ఉన్నాము రేపు స్మశానం లోకి జారుకుంటాము అంతే కదా …?"
"మనం పోయాక మనవాళ్ళు వచ్చి పిడికెడు మట్టి వేస్తారో లేదో తెలియదు"
వాళ్ళు వస్తే మన ఆత్మ శాంతిస్తుంది. లేదంటే ఈ ఆశ్రమంలో వస్తువు రూపంలో ఒక జ్ఞాపకం గా మిగిలిపోతాం.
ఇదిగో ఈ టేప్ రికార్డర్ లక్ష్మి అనే ఆమెది. ఆ వాల్ క్లాక్ కూడా ఆమెదే వాటిని చూసినప్పుడు ఆమె గుర్తొస్తుంది.
పోయిన సంవత్సరం ఆమె మరణిస్తే అంత్యక్రియలకు బంధువులు ఎవరూ రాకపోతే ఆశ్రమ నిర్వాహకులు అంత్యక్రియలు నిర్వహించారు.
తరువాత కూడా ఎవ్వరూ ఆమెకోసం రాలేదు.
ఇప్పుడు ఆమె లేదు ఆమె గుర్తుగా ఈ టేప్ రికార్డర్ , గడియారం మిగిలాయి. ఆమె ఎప్పుడూ అంటూ ఉండేది.
" నాకు ఇక్కడ ఉండాలని ఇష్టం లేదు అయినా ముసలితనం వచ్చాక ఎక్కడో ఒకచోట ఉండాలి కదా..!" అందుకే ఉంటున్నాను అనేది.
మధ్యలో మరో వ్యక్తి మాటకలుపుతూ ... నాకు నవలలు చదవడం అన్నా ఆధ్యాత్మిక పురాణ గ్రంథాలు చదవడం అన్నా చాలా ఇష్టం అందుకే ఇక్కడ ఉన్న పుస్తకాలు చదువుతూ
తీరికలేకుండా మనసు పిల్లలపైకి మళ్లకుండా ఉంటూ ….
మనసులోకి చెడు ఆలోచనలు రాకుండా చూసుకుంటున్నాను. అంది మరో మహిళ శాంతమ్మ.
మధ్య లోనే కేశవయ్య అనే వృద్దుడు కల్పించుకుని "ఇప్పుడు మనం ఈకాస్తన్నా జీవితం అనుభవించి చివరిదశలో ప్రశాంతత కోసం వెతుకుతున్నాం కానీ ...ఆ కానీ అన్నారు మరొకరు.
పుట్టగానే పసిపిల్లలను చెత్తకుప్పలో పడేసి చేతులు దులుపుకుని ఏమీ ఎరుగనట్లు కొత్త జీవితం మొదలు పెడతారే కొందరు కిరాతకులు….అలా అనాథలైపోయిన పసివాళ్ళ పరిస్థితి ఏంటీ….?
మనకు ఆర్థిక స్థోమత బాగానే ఉంది. ఎంతో కొంత జీవితాన్ని అనుభవించాము.ఎక్కడెక్కడి వాళ్ళమో ఇక్కడ సొంతవాళ్ళకన్నా ఆత్మీయులు గా ఉంటున్నాము.
మనలో ఎవరికి ఏమి జరిగినా మన హృదయాలు తల్లడిల్లుతాయి.
అన్నాడు కేశవయ్య.
అయితే ఏమంటారు మనవాళ్ళు రాకపోయినా ఆలోచించవద్దనా మీ ఉద్దేశం అంది సత్యమ్మ .
అలానేనేమీ అనలేదే….! ఎక్కువ బెంగ పడవద్దు అంటున్నాను అన్నాడు.
కొన్ని క్షణాలు ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు.
వరలక్ష్మి కి ఏదో ఆలోచన ఊపిరి పోసుకుంది.
వరలక్ష్మి గారు గొంతు సవరించుకుంటూ అందరినీ ఉద్దేశించి ఏదో మాట్లాడింది అందరూ ఆశ్చర్యపోయారు. నిజమే అనుకుని సంతోషంగా చప్పట్లు కొట్టారు.
కానీ మనం మా...అంటే రెండేళ్ళో….మూడేళ్ళో….. మరి ఆతరువాత
పరిస్థితి ఏంటీ…? అన్నారొకరు.
మనకు మన నిర్వహణ కోసం ఇచ్చే డబ్బులే ఖర్చు పెడుతున్నాం కదా..
అదీకాక కొంత మొత్తాన్ని బ్యాంకు లో డిపాజిట్ చేస్తాను.
నా తరువాత కూడా నిర్వహించడానికి మీరందరూ లేరా…?
ఉన్న ఈ చివరి రోజుల్లో నైనా తృప్తి గా జీవిస్తాం కదా….అంది వరలక్ష్మి.
అంతలోనే నిర్వాహకులు వచ్చి సర్ ఈరోజు మీవాళ్ళు వచ్చేటట్లు గా లేరు
బయట చల్లగా గాలి వీస్తోంది...చాలా చీకటి కూడా అయ్యింది రూం లోకి పదండి అన్నారు.
భారమైన హృదయంతో అందరూ వాళ్ళవాళ్ళ రూంలోకి వెళ్ళిపోయారు.
"మరో మార్గం "నిర్వాహకుల సహాయం తో ఖాళీగా ఉన్న ఒకహాలును యాబై పడకలతో సిద్దం చేయించారు.వారి స్వంత డబ్బులతో బెడ్లు ఏర్పాటు జరిగింది.
ప్రభుత్వం వారితో మాట్లాడ్డం వెల్ఫేర్ అసోసియేషన్ వారితో కలిసి
"జువైనల్ హోం" నుండి కొందరు పిల్లలను ఇక్కడికి తీసుకొచ్చి వారి రక్షణ బాధ్యత చేపట్టడం. వారి చదువు లు ఆ వృద్దులు స్వయంగా చేస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఆలోచన తనదే కాబట్టి ఓపెనింగ్ వరలక్ష్మి గారితో చేయిద్దామని నిర్ణయం చేసుకుని అంగరంగ వైభవంగా మొదలు పెట్టారు.
నెలరోజులు గడిచాయి.
పిల్లలతో ఆడుకుంటున్న వరలక్ష్మి దగ్గరికొచ్చి ప్యూన్ "అమ్మ మీ కొడుకు కోడలు వచ్చారమ్మా మిమ్మల్ని చూడటానికి అనే పిలుపు వచ్చింది. అనగానే ముఖంలో సంతోషం రెట్టింపైంది.
ఇక్కడికి రమ్మని చెప్పండి అంది.
ఉద్విగజ్ఞతతో కళ్ళల్లో నిండిన నీళ్ళు తుడుచుకుంది వరలక్ష్మి .
మనవడు మనవరాలు పరుగెత్తుకుంటూ వచ్చి ఆమెను చుట్టుకున్నారు.
అయ్యో తలంతా తడిచిపోయింది వర్షం తగ్గాక రావచ్చు కదా బంగారు అంటూ తన చీర కొంగుతో తలను తుడుస్తూ అంది.
ఎంతైనా తన రక్తం కదా …..అని మనసులోనే అనుకుంటూ
కొడుకు ని దగ్గరకు రమ్మని నుదుటన ముద్దు పెట్టుకుంది. కోడలి తలని నిమిరింది.
మాట్లాడుతున్నంతలోనే ఆశ్రమం లోని పిల్లలు నానమ్మా అంటూ కొందరు అమ్మమ్మా అంటూ కొందరు వచ్చి తలా ఒక చేయి పట్టుకొని లాక్కుపోసాగారు.ఒరేయ్ ఒరేయ్ నాకు నడవడం సరిగా రాదు కిందపడతానురా .,..బడవా అంటూ వాళ్ళల్లో కలిసిపోయింది.
నెలరోజుల్లో ఆపిల్లలకు బంధాలు బంధుత్వాలు ఎవరిని ఏమని పిలవాలి అనే విషయాలను బోధించారు.
తల్లి అలా వెళ్ళిపోయే సరికి
"కొడుకు మనసు కలుక్కుమంది"
"తన తల్లి మనసు ఇలాంటి సుతోషాన్నే కోరుకునుంటుంది కదా….!"
నేనెందుకు ఆలోచించ లేకపోయాను ….?
తనను తాను ప్రశ్నించుకున్నాడు…
అమ్మ తనను ఎంత ప్రేమగా పెంచింది…!
తనే లోకంగా బ్రతికింది.
చివరి రోజుల్లో అమ్మను ఇక్కడ వదలడం సరికాదు కదా…?
తనేం చేస్తున్నాడు….
అని తనలో తానే మధన పడుతున్నాడు.
అక్కడ కాసేపు గడిపి తల్లిని చూస్తూ తనుచేసిన తప్పును తెలుసుకున్నాడు.
అమ్మా ……
ఒక్కసారి ఇలారా...అంటూ చేతులు పట్టుకుని ఆమె గదిలోకి తీసుకెళ్ళాడు.
రెండు చేతులు పట్టుకుని...
నన్ను క్షమించమ్మా ఇంటికెళ్దాం పదా ….!
నీ మనవడు మనవరాలు తో ఆడుకుంటూ నీకు నచ్చినట్టు ఉందువు గానీ అన్నాడు.
నన్నుకూడా క్షమించండి అత్తయ్యా ….మీ ఆరోగ్యపరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది కదా ఇక్కడైతే క్షేమంగా ఉంటారని అనుకున్నాం కానీ పిల్లలతో గడపడమే మీకు ఆరోగ్యం అని గ్రహించలేకపోయాము అన్నారిద్దరూ ….
రా నానమ్మా అంటూ పిల్లలు చేయిపట్టి లాగారు.
వారి తలపై నిమురుతూ బంగారుకొండలు రా మీరు నా వరాలమూటలు.
నుదుటన ముద్దుపెట్టుకుని….
మీరు ప్రతీవారం ఆడుకోవడానికి ఇక్కడికి రండి అప్పుడప్పుడూ చూసి వెళ్ళండి. ఇక్కడ బోలెడు మంది అన్నలు అక్కలు ఉన్నారు...వాళ్ళదగ్గర బొమ్మలు కూడా ఉన్నాయి.అంది వరలక్ష్మీ. ముఖాలు మాడ్చుకున్నారిద్దరూ.
కొడుకు దిక్కు తిరిగి నన్ను బలవంతపెట్టకండి నాన్నా….
నిర్ణయం తీసుకున్నాను. ఒక బాధ్యత తలకెత్తుకున్నాను.
నిన్ను పెంచి పెద్ద చేయడం లో అనుభవం సాధించాను.
మీరు ఎప్పడూ ఆనందంగా ఉండాలి. మా అంటే రెండేళ్ళో నాలుగేళ్ళో అంతేగా నేను జీవించేది. నాకెలాగూ పెన్షన్ వస్తుంది.
దానితో ఈనాలుగురోజులు ఇక్కడే గడిపేస్తాను.నన్ను ఇబ్బంది పెట్టకండి బాబూ...అంది.
తన వల్ల తల్లి హృదయం ఎంతలా గాయపడిందో అర్థం చేసుకున్నాడు కొడుకు.
ఇక్కడే నా ఆనందం దాగివుంది ఒక నిర్ణయం జరిగిపోయింది.
జీవితం ఆనందమయం చేసుకోవడానికి" మరో మార్గం" వెతుక్కున్నాను అని స్థిరంగా అంది వరలక్ష్మీ.
హైదరాబాద్
+91-9985525355