
బహుళ వ్యాసాలు
ఉత్తమ వ్యాసాలు

లైంగిక రాజకీయార్థిక కుల శాస్త్రం - మన సమాజం
అనిశెట్టి రజిత
మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ సమాజంచేత స్త్రీగానో పురుషునిగానో మలచబడతారు. పుట్టగానే సమాజం మొదట లైంగిక వేర్పాటుకు గురిచేస్తుంది. వ్యవస్థ నేపధ్యం నుండి ప్రారంభమవుతుంది. అధికం, అల్పం అనే భావనల రూపకల్పన. పుట్టుకతోనే ఎక్కువవారూ తక్కువవారూ అనేది ఏర్పడుతుంది. ఆడ పనులు మగ పనులని శ్రమ విభజన కేటాయింపులు అప్పటికప్పుడే జరుగుతాయి. ఇది మహిళా లోకానికి మొదటి వెన్నుపోటు. కోల్పోయిన హక్కులకు చెందిన తొలి ఓటమి. మాతృస్వామ్యం వంచనకు గురైన ప్రధమ ఘాతుకం. మగ రాజకీయం వేసిన రాజకీయార్థిక అసమానత్వపు తొలి ఎత్తుగడ. రాజకీయార్ధిక శాస్త్రాలు రూపొందిన క్రమం ఇక్కడి నుండే జరిగింది.
మానవజాతి ఆవిర్భవించిన ప్రధమ దశలో మగవాళ్ళు ఆటలు ఆటలుగా వేటలో గడిపితే, పిల్లలను కంటూ సంరక్షిస్తూ, ఇంటికి కాపలాగా ఉండి వ్యవసాయం, చేతి పనులు, గృహనిర్మాణం, గృహవైద్యం, పనిముట్లను, వంటకు ఇంటికి అవసరమైన పరికరాలను కని పెట్టడం, పశుపోషణలాంటి ఎన్నో ఉత్పత్తి పనులను కని పెట్టి నిర్వహించిన ఘనత స్త్రీది. అయినా అది చరిత్రలో నిక్షిప్తం చేయబడిన వాస్తవం. వెలుగు చూడని నిజం. వేట యుద్దాలకు మార్గమయితే, గృహనిర్వహణ గృహబానిసత్వానికి మూలం అయ్యింది. “ఆశ, ఉష, నిశల" గుంపు నాయకత్వం క్రమంగా పురుషుని నాయకత్వంలోకి చేజారిపోయింది. మాతృత్వం - పిల్లల రక్షణ బాధ్యత ఇంత పనీ చేసింది. వరం కావాల్సింది మాతృత్వం శాపమైంది. ఇది రెండవ అతి పెద్ద ఓటమి స్త్రీ జాతికి. ఇంటిపట్టునే ఉండాల్సి రావడం ఇంటి పనుల నిర్వహణ స్త్రీని చాకిరి యంత్రంగా మార్చి గృహ నిర్భందానికి గురిచేసింది. గర్వించాల్సిన పునరుత్పత్తి ప్రక్రియ అణిగిమణిగి ఉండేందుకు దోహదం చేసింది. గృహనిర్వహణ చేస్తూ పిల్లల్ని కని పెంచే ఆడది అసమర్ధురాలని నిందలకు బందీ అయ్యింది.
దంపతి వివాహాల పద్ధతి వచ్చేసరికి పాతివ్రత్య సతివ్రతాలను, వంశం, వంశవృక్షాలను నెలకొల్పుకోవటం మొదలయ్యింది. రక్త సంబంధాల పవిత్రత ప్రాముఖ్యత పెరిగింది. శీలానికీ, పాతివ్రత్యానికి స్త్రీ ధర్మాలు వ్యాప్తిచేసారు. వీటితో ఇప్పుడు స్త్రీ వ్యక్తిగతమంతా రాజకీయం (సమాజమయం) అయిపోయింది. స్త్రీ నడక, నడత, దృష్టి, సేవలు, కర్తవ్యాలు, ప్రవర్తన, ఆలోచనల మీద శతకాలూ, ధర్మశాసనాలూ రూపొందాయి. మతం వీటికి ఆజ్యం పోస్తూ రగిలిస్తూ కాఠిన్యతను ప్రయోగిస్తూ శక్తివంతమైన పాత్ర నిర్వహిస్తూపోయింది. మత జోక్యంలేని సామాజిక నియమం లేకుండా పోయింది. విభజనలు చెందిన పనులు, వృత్తులు, మతం కలిసి కులాల్ని పుట్టించాయి. కులాలు బలపడిన కొద్దీ సమాజం చీలిపోయింది. చిన్నాభిన్నమైనది. కులాల దొంతరలు క్రమేపీ కరుడుకట్టిన వర్ణ వర్గ వ్యవస్థలుగా ఏర్పడి స్థిరపడటం మొదలయ్యింది. దీనికి 'దైవం' ఎంతో తోడ్పడింది. ప్రాకృతికంగా ఉద్భవించిన ఆడదేవుళ్ళ ప్రాముఖ్యతను తగ్గిస్తూ పురాణాలు పుట్టుకొచ్చాయి. ప్రాకృతిక శక్తులుగా కొలువున్న దేవతలను అనాగరికమని అంచులకు తోసేసారు . శక్తిని నిశ్చేష్టనూ, శక్తిహీనమైన అబలగా మార్చారు. అన్నీ అంతా కుట్రలతోనే.
యజమానులు - బానిసలు - మధ్యవర్గంవారు. నిచ్చెనమెట్ల కుల నిర్మాణం జరిగింది. పై మెట్టు మీది వారు దైవాంశులు, ఉన్నతులు, పూజనీయులు. రెండవ మెట్టుమీదివారు పాలకులు రక్షకులు, రాజులు, గౌరవనీయులు. మూడవ మెట్టు మీదివారు వ్యాపారులు. నాలుగవ మెట్టున ఉత్పత్తి కులాల వర్గాల (సమస్త చేతి వృత్తులు) జనసామాన్యం . చివరన అన్ని మెట్లకింద నలుగుతూ అందరి బరువును మోస్తూ అంటరాని పారిశుధ్యపు పనులు చేసే పంచములు. వీరే దస్యులనీ, చండాలురని, అంటరానివారనీ నిందించబడేవారు.
నిచ్చెనమెట్ల కుల వర్గీకరణ స్పష్టత సంతరించుకునే క్రమంలో బానిసకొక బానిసగా స్త్రీ స్థానం కుదించబడింది. ఇక్కడే లైంగిక రాజకీయార్థిక కులశాస్త్రం జమిలిగా తన ప్రతాపం చూపించడం ఆరంభమయ్యింది. సామాజికంగా ఎలాంటి ఉన్నత హోదాలేని గుర్తింపులేని నిమ్నకుల స్త్రీల పై నిచ్చెనమెట్ల భారంపడి నిలువునా అణగదొక్కింది. నీతి, స్మృతి, ధర్మ, కుల శతకాలు సామాజిక సూత్రాలను నియంత్రిస్తూ క్రూరంగా అమల్లో కొచ్చాయి. నేటికీ అదే పంథాలో పనిచేస్తున్నాయి.
వివాహ - కుటుంబ వ్యవస్థల నిర్మాణాకృతులు వేయిగడపల లక్షగోడల చెరసాలగా జరిగింది. భార్యాత్వంలో ఇనుపకచ్చడాలు ధరించడం తప్పనిసరి నియమమయ్యింది. స్త్రీ శీలపవిత్రత లైంగిక కట్టుబాట్లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భరృత్వం అనేది ఒక లక్షణంగాగాక అతి పెద్ద నియంతృత్వపు వ్యవస్థగా రూపాంతరం చెందింది.
అతని ఇల్లు, అతని ఆస్తి, అతని భార్య, అతని పిల్లలు, అతని సుఖం, అతని హాదాలు, పొందాయి. అతను ప్రత్యక్ష దైవం ఆమె పతిని ఎదురించక తలవంచి కొలిచే సేవించే భక్తురాలు, సేవిక. భయభక్తులు ప్రచారంలోకి వచ్చాయి. స్త్రీకి తన గురించిన అవగాహన, స్పృహ అడుగంటినాయి. ఆమె భర్త వంశాన్ని నిలబెట్టేందుకు సంతానాన్ని కనివ్వడం, పెంచడం, అతని హోదాను ప్రతిబింభించే అలంకరణ, ఆభరణాలు ధరించడం ముఖ్య విధులయినవి. శీలాన్ని కాపాడుకోవడం, పతివ్రతగా నిరూపించుకుంటూ ఉండటం, కన్యత్వం, భార్యత్వం, విధవత్వం అనే స్థితిగతులను విధేయంగా పాటించే మనస్తత్వమే జండర్ స్పృహగా ఉండేది. పెళ్ళి కాపురాలు నిలబడాలంటే ఆడది ఈనాటికీ కూడా కనిపించేవి, కనిపించనవీ అనేక అహేతుకాలను హింసాఘాతుకాలను నిశ్శబ్దంగా భరించాల్సిందే. ఏ కొంచెం గాలిసోకినా కుప్పకూలిపోయే పేకమేడలు మన ఇండ్లు సంసారాలు. అలా వీచకుండా తనను తాను కుదించుకునే స్త్రీ ఆదర్శ గృహిణి. అసలు ఆడది నోరు తెరిచి మాట్లాడితేనే కుటుంబం మేడిపండు' మెరుపులు, లోపలి డొల్లతనం వికృతంగా బయటపడిపోతాయి. వాటిని ఎదిరిస్తే ఆమె తిరుగుబాటుదారు, తిరుగుబోతు, గయ్యాళి, చెడు ప్రవర్తనగలది, సంసారానికి పనికిరాని కోవలోనిది.
స్త్రీకి ఇల్లే స్వర్గం, పెళ్ళే గమ్యం, మాతృత్వమే సార్థకం. సంపూర్ణ జీవితమంటే పూర్తిగా లొంగిపోయి జీవించడం. గడపదాటితే గౌరవంలేదు. పెళ్ళికాని బాలిక, కన్య ఒక గుదిబండ, గుండెల మీద కుంపటి. పెళ్ళని తిరస్కరించి స్వతంత్రంగా జీవించాలనుకునే ఒంటరి స్త్రీ సృష్టికీ సమాజానికి వ్యతిరేకం. సంసారాలు కూల్చే వినాశిని. విప్లవకారిణి. సంఘం దృష్టిలో ఒంటరి స్త్రీలు సంఘ విద్రోహులు, లైంగిక విశృంఖలత కలిగిన వాళ్ళు.
పెళ్ళికాని బాలికలను, యువతులను కన్యలనీ, వృద్దకన్యలనీ హేళనలు. అసలు స్త్రీలంటే బాలికలు, కన్యలు/యువతులు, వృద్ధులు వెరసి ఆధారితులుగా వర్గీకరణ చెందుంటారు. వివాహిత స్త్రీ అందంగా అలంకరించుకుని భర్తను ఆహ్లాదపరుస్తూ పూజలు, నోములు, వ్రతాలు ఉపవాసాలతో ఊపిరి నిలుపుకుంటూ భర్త అడుగులకు మడుగులొత్తుతూ మళ్ళీ తోడునీడగా మసలుకునే అసలైన భారతీయ స్త్రీ! ఈ లక్షణాల్లో ఏది తగ్గినా సంపూర్ణ స్త్రీ కాదు ఆదర్శ గృహిణీ కాదు. పిల్లల్ని కనివ్వలేని స్త్రీ గొడ్రాలని వేధింపులకు గురికాబడుతుంది. మగపిల్లల్ని (వారసుల్ని) కనివ్వలేకపోయినా ఆమె పనికిరాని యంత్రంగా ఈసడింపబడుతుంది.
ఇక భర్త మరణించిన స్త్రీ విధవత్వం పాటిస్తేనే పతివ్రత. విధవత్వం ఆపాదించబడిన ఆ అబలలపై ఇంటిలోపల జరిగే లైంగిక అత్యాచారాలు, శ్రమదోపిడి గురించిన అభ్యంతరాలు, ఆందోళనలు ఏమీ ఉండవు. వాటిని అరికట్టే విధానం అవసరమే కనిపించదు పైగా “తలలు బోడులైన తలపులు బోడులవునా” అని వెకిలి సామెతలు. మరి ఆడదాన్ని చూస్తే ముసలి “బ్రహ్మకైనా పుట్టు రిమ్మ తెగులు" అని సరిపెట్టుకోరెందుకో.
ఇవన్ని లైంగిక రాజకీయాలు, లింగ నియంత్రణలు, ఆర్థిక ఆలంబన లేకుండా స్వతంత్రంగా ఆర్జించుకుని దాన్ని వినియోగించుకునే స్థాయిలో లేని స్త్రీ ఆర్థిక బానిస. ఆస్తిలేక, అధిక కట్నం తేలేక సంపాందించే అర్హతలు లేక భార్యగా భరింపబడునదిగా బతికే స్త్రీ జీవితం దుర్భరం. ఎతృస్వామ్య రాజకీయాలు, ఆర్థిక కుతంత్రాలు, కులం మెట్లు అన్నీ ముప్పేట దాడితో జండర్ అణిచివేతను నిరంతర యుద్దంలా సాగిస్తున్నాయి. జండర్ న్యాయం సంక్షోభంలో చిక్కుకుంది.
స్త్రీ కబేళాలో బలిపశువులా 'అనేక ఖండిత'గా నశించిపోవాల్సిందే అన్నట్లుగా ఉంటుంది సమాజ ధోరణి. ఈ సమాజం నీచత్వానికీ, మోసాలకీ మొదటా చివరా బలియ్యేది స్త్రీయే. హద్దుల్లేని హింస, ఎల్లలులేని వివక్షత అడుగడుగునా ఆమెను పడగొట్టే జిత్తులమారితనం ఇదీ మన ప్రేమ శాంతి సహజీవనం సందేశం!?
ప్రపంచంలోని అతి ప్రాచీన భారతీయ సమాజం మూలాలు మనుధర్మ శాస్త్రంతో ప్రభావితమై ఉన్నవి. సంప్రదాయం, సంస్కృతి అనే పదాలు మంత్రాక్షరాలు. మతం యధాతధ వ్యవస్థ స్థితిని కాపాడుతుంది. కులం పుట్టుకతోనే మనిషి నుదిటి మీద కాలిన మచ్చలో వెంటాడుతుంది. జండర్ జన్మ తక్కువతనాన్ని రెండవ శ్రేణి హోదాని ఆపాదిస్తుంది. లెక్కలేనన్ని చిక్కు ముళ్ళతో మెలికలు పడిన దారపుండలాంటి చట్టాలుంటాయి. ఇదంతా చేసింది చేస్తున్నది పితృస్వామ్య చట్రమే. కులం తంతెలతో మానవజాతిని చీల్చినా, స్త్రీ లైంగికత పై అధికారం చెలాయిస్తున్నా, రాజకీయ ఆర్థిక రంగాల పై దురాక్రమణ చేసినా అంతా పితృస్వామ్యం దుండగీతనమే.
కానీ నేడు స్త్రీ స్ప్పహలో కొస్తున్నది. ఎంతో తెగింపుతో బరి తెగించి అవలక్షణాల వ్యవస్థ మురుగు ప్రవాహానికి ఎదురీదుతున్నది. అన్ని వ్యవస్థల్నీ పడగొట్టే దిశగా పయనిస్తున్నది. మత, మౌఢ్య సాంస్కృతిక విశ్వాసాల్నీ విలువల్నీ ధిక్కరిస్తున్నది. అన్యాయాలను, కాలం చెల్లిన ఆచారాలను కుళ్ళిన సంప్రదాయాలనూ సవాల్ చేస్తున్నది.
“అన్నమూ పెట్టేటితల్లి / లాలనా జేసేటితల్లి
లాలనా జేసేటితల్లి | ఆలనా జూసేసి తల్లి
ఆలనా జూ సేటి తల్లి / పాలనాజే సేటి తల్లి
ఆడదంటూ లేకపోతే ఆగమవ్వును లోకమంతా
ఆడదాని శక్తి తోటే నిలిచి ఉన్నది లోకమంతా"
ఈ నిజం వెలుగులో రేపటి ప్రపంచంలో రేపటి రాజ్యంలో స్త్రీదే నాయకత్వం. శ్రమలో తడిసి శ్రమలో పూసి శ్రమ సౌందర్యంతో జీవించే స్తీదే రానున్న యుగం. మేకతోలు కప్పుకోని పులిలా జులుం చేస్తున్న మన సమాజం తొడుగుల్ని విడిచేసి ముసుగుల్ని చీల్చేసిన వెలుగులో జరగాలి సమాజ నిర్మాణం. అదీ సమానత్వం దిశగా మానవత్వం నిండుగా. అప్పుడే జండర్ వివక్షత స్థానే జండర్ న్యాయం నెలకొల్పబడుతుంది.

తెలంగాణా పోరాట నవలలో స్త్రీ చైతన్యం
డా. తిరునగరి దేవకీ దేవి
ప్రపంచ చరిత్రలోనే తెలంగాణ పోరాటం ప్రత్యేకత సంతరించుకున్నది .తర్వాత పోరాటాలకు మార్గ దర్శనమైంది . ఈ పోరాటంలో పురుషులతో బుజం బుజం కలిపి పోరాడిన స్త్రీల చరిత్ర మరువ లేనిదే కాదు చిరస్మరణీయమైనది.వాళ్ళు ఆ పోరాటాన్ని వెన్నంటే ఉన్నారు. పోరాటంతో వారికి గల సంబంధం అవినాభావం.
ప్రపంచంలో జరిగిన పోరాటాలలో స్త్రీలు భాగస్వాములై తమ హక్కులను సాధించుకొని ఫలితాలను పొందిన సందర్భాలనేకం.అనంతర కాలంలో మహిళాభ్యుదయానికి మరింత కృషి చేశారు.
పితృస్వామిక అలవాట్లలో మార్పు తెచ్చుకున్నారు.స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న స్త్రీల చొరవ తెగువ అపూర్వమైనప్పటికీ తెలంగాణ పోరాట స్త్రీలతో పోల్చినపుడు అంతరం అధికమే. సంఘంగా మారిన ఈ పోరాట తీరుతెన్నులే వేరు. ఆ స్థాయిని ఏ పోరాటంతోనూ పోల్చలేము.
పోరాటాన్ని అర్థం చేసుకోవడానికి దానికి సహకరించడానికి అందులో పాల్గొనడానికి చదువులేనితనం వారికి అడ్డుకాలేదు.ప్రపంచ పోరాటాలతో దీనికి పోలిక కొంత ఉన్నా, ఈ పోరాటం పునాదిగా అనేక ఉద్యమాలు ఉదయించి ఫలించినా వీళ్ళు పోరాడిన విధానంలో, చేసిన త్యాగంలో,
చూపిన తెగువలో,పొందిన అవమానంలో,అనుభవించిన శిక్షలో దీనికో ప్రత్యేకత ఉంది. అది మరువలేనిది మరుపురానిది.స్త్రీలు పోరాటానికి సహకరించడంతోపాటు పోరాటంలో పాల్గొనవలసిన అవసరాన్ని పార్టీ గుర్తించి ప్రోత్సహించినప్పటికీ పోరాట లక్ష్యాన్నే కేంద్ర బిందువు చేసుకోవడం వల్ల స్త్రీల మనోభావాలు కొన్ని దెబ్బతిన్నాయి.పార్టీ ఉద్యమానికి స్త్రీల అవసరాన్ని గుర్తించింది కాని అదే ఉద్యమం లో స్త్రీల అవసరాలను పట్టించుకోలేదు.
అకస్మాత్తుగా 1952 లోపోరాటం విరమిస్తూ ఆయుధాలు అప్పగించిన సమయంలో ముఖ్యంగా స్త్రీలే దిక్కు తోచని పరిస్థితులకు నెట్టివేయబడ్డారు.ఇల్లు పిల్లలు సంసారాలను వదిలి వచ్చిన స్త్రీలు తాము కలగన్న సమాజాన్ని చూడలేక ఎంతో ఆవేదనకు గురయ్యారు. పోరాటంలో ఆయుధం
పట్టిన చేతులు తిరిగి వంట పనికి పరిమితమయ్యాయి.ఈ అనేక కారణాలతో ఆ స్త్రీలు మానసిక వేదనను క్షోభను అనుభవించడమే కాక పడరాని పాట్లు పడ్డారు.ఇప్పటికీ పడుతూనే ఉన్నారు.(బతికి ఉన్నవాళ్ళు) పోరాటం వల్ల సామాజిక మార్పు కొంత వచ్చినా వారి ఆర్థిక పరిస్థితులు పెద్దగా మెరుగు పడలేదు.కుటుంబ పనిభారం తగ్గలేదు.లింగపర వివక్షలో చెప్పుకోతగిన మార్పులేదు.అందువల్ల బ్రతుకు భారమై దుర్భరంగా జీవించాల్సిన పరిస్థితి తప్పలేదు.
తెలంగాణా పోరాటం సాగుతున్న కాలంలో స్వాతంత్ర్య పోరాటమూ కొనసాగింది.ఆ ఉద్యమ
నేపథ్యంతో కూడా విలువైన సాహిత్యం వెలువడింది. ఆక్రమంలో నవలలూ వెలుగు చూసాయి.ఆ నవలలో స్త్రీల చైతన్య స్థాయి ఉన్నతంగానే ఉన్నప్పటికీ తెలంగాణ స్త్రీల చైతన్యస్థాయితో పోల్చలేము.
ఈ ఉద్యమ నేపథ్యంతో అనేక ప్రజాకళారూపాల ద్వార ఎంతో విలువైన సాహిత్యం వెలువ డింది. సమాంతరకాలంలో వచ్చిన నాట్లు ఉయ్యాల జోల పాటలలో ఐలమ్మ వంటి వీరవనితలు బందగీ దొడ్డి కొమురయ్య వంటి వీరులు స్థానం సంపాదించుకున్నారు.ఆ సాహిత్యంలోని వీరుల సాహసం ధైర్యం చొరవ సమకాలీన ప్రజలకుఎంతో స్ఫూర్తి నిచ్చాయి.అందువల్ల పోరాటం మరింత
ముందుకు తీసుకపోయాయి..
తెలంగాణా పోరాట నవలలో స్త్రీలు అనేక రూపాలలో లైంగికంగా వేధించబడటంతోపాటు వివక్షకు గురికావడాన్ని గమనించాలి.అభ్యుదయం ముసుగులోఉదారవాదులైన పురుషులను పితృస్వామ్య భావజాల చట్రంలోని స్త్రీలనూ చూడొచ్చు. అనల్ మాలిక్ నినాదం ప్రచారంలో ఉన్న నిజాం
భూస్వామ్య రాజ్యంలో భూస్వాముల వేధింపులకు ముస్లిం స్త్రీలు మినహాయింపు కాకపోవడం ఆ వ్యవస్థలోని వర్గ స్వభావం మనలను ఆలోచింపచేస్తుంది.రోజుకో రుచి మరిగిన భూస్వాములకు వివాహేతర సంబంధాలు సర్వసాధారణం కావడంతో లైంగికతలో నిరాదరణకు గురైన వాళ్ళ భార్యలు
మానవ సహజమైన వారి కోరికలకు దూరం కాలేక అక్రమ సంబంధాలు సాగించిన సన్నివేశాలు, అక్రమ సంబంధాలలోని ద్వంద్వనీతిని ఈ నవలలు అద్దంపట్టాయి. వెట్టి చాకిరీ దోపిడీ వెన్నెముకగా జీవించిన
దొరలకుటుంబాలలోని స్త్రీలు ఆ దొరల మార్గంలోనే దుర్మార్గాలకు పాల్పడడం , మానవీయ దృక్పథంతో
పోరాటంలో పాల్గొనడానికి సుముఖత చూపించిన ..భూస్వామ్య కుటుంబాలకు చెందిన కొందరి స్త్రీలను
పార్టీలో చేర్చుకోవడానికి నిరాకరించడం, పోరాటంలో పాల్గొన్న స్త్రీలను పోరాటం విరమించిన అనం తరం పార్టీ వాళ్ళ అతీగతీ పట్టించుకోకపోవడంతో ఆ స్త్రీల జీవితం వక్రమార్గం పట్టడం వంటి అంశాలు
రచయితల దృష్టి నుండి తప్పించుకోలేక పోయాయి.
స్త్రీలు తమ జీవితాలను అర్థవంతంగా తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేయడం , అనేక అత్యాచారాలను , దుర్మార్గాలను ప్రతిఘటించడమేకాక జీవన క్రమంలో తమ ఉనికిని కాపాడుకోవడానికి
భూపోరాటాలు చేయడం, సంఘం చేపట్టిన పోరాటానికి అనేక విధాలుగా సహకరించడం, అందు బాటులో ఉన్న ఆయుధాలతో శతృవులను ప్రతిఘటించడం, దెబ్బతీయడం వంటి అంశాలను రచయితలు ఈ నవలలో న్యాయంగానే పొందుపరచారు .ఈ విధంగా చైతన్యం పొందిన వారిలో భూ
స్వామ్య కుటుంబాలకు చెందిన స్త్రీలను , వ్యక్తిగత జీవితానికన్నా వ్యవస్థలో మార్పుకే ప్రాధాన్యమిస్తూ
ప్రేమ,వైవాహిక మాతృత్వబంధాలను త్యాగం చేసిన వారి జీవితాలకు రూపకల్పన ఈ నవలలో కనపడుతుంది.
పోరాటాన్ని సఫలీకృతం చేసుకునేక్రమంలో స్త్రీలు తమ శక్తినంతా కూడతీసుకొని పితృస్వామ్యం బిగించిన చట్రంలోని పవిత్రతా భావాలను పట్టించుకోకుండా పనిచేయడం , పురుషాధిక్య భావజాలంతో పార్టీ స్త్రీలతో వ్యవరించిన రీతి, అనుమానించిన తీరు, ఏక పక్షంగా వాళ్ళు
తీసుకున్న నిర్ణయాలు, పోరాటకార్యకర్తల పట్ల ప్రవర్తించడంలో వారి ద్వంద్వనీతిని , పోరాటానంతర కాలంలో వాళ్ళు అనుభవించిన క్షోభ , ఆవేదన మొదలైన అంశాలను ఏ రచయితలూ ఈ నవలలో పొందుపరుచలేదు.
అనేక నవలలో స్త్రీలను సహకారపాత్రలుగానే చూపించే ప్రయత్నం జరిగింది. ఉద్యమకారులైన స్త్రీలను కొందరు రచయితలు నామ మాత్రంగానే ప్రస్తావించారే తప్ప వాళ్ళ పోరాటాన్ని చిత్రించే ప్రయ త్నం చేయలేదు.స్త్రీలు భూమికగా లేకుంటే పోరాటమేలేదనే విషయాన్ని అంచులకు నెట్టివేసారనే అభి ప్రాయం కలుగకపోదు.ముదిగంటి సుజాతారెడ్డి మలుపు తిరిగిన రథచక్రాలు,దాశరథి జన పదం నవలలో పార్టీ నిర్లక్ష్యం కారణంగా స్త్రీలకు జరిగిన అన్యాయాలు సరిగా రికార్డు కాలేదనిపిస్తుంది.
గత అర్ద శతాబ్ది కాలంగా ఎన్నో ఉద్యమాలు ముందుకు వచ్చి స్త్రీల అస్తిత్వం నిరూపించుకోవడా నికి, హక్కులు సాధింకోవడానికి వీలు కల్పించాయి. ఆ ఉద్యమాలకు తెలంగాణ పోరాటం ప్రేరణనిచ్చిం ది. ఐనా అంతటి విశిష్టత కలిగిన ఈ పోరాటంలో పాల్గొన్న మహిళల అస్థిత్వం ఈ సాహిత్యంలో పరి
పూర్ణంగా చిత్రించలేకపోయారనే అభిప్రాయం కలుగుతున్నది.
సమాజంలోని అసమానతలు , పక్షపాతాలు,దుర్మార్గాలు, కాఠిన్యాలు చవిచూసిన స్త్రీ విద్యావకాశాలకు దూరమైన పరిస్థితులలో రచనలకు మరింత దూరంకావడంలో విశేషమేమున్నది ?
ఐనప్పటికీ స్త్రీ తనను తాను నిరూపించుకుంటూ ఎంతోకాలంగా రచనావ్యాసాంగంలో ఎంతోకొంత ప్రవేశాన్ని కలిగిఉన్నది.తాళ్ళపాక తిమ్మక్కతో మొదలుకొని సంస్కరణోద్యమం వచ్చే వరకు వచ్చిన స్త్రీల రచనలన్నీ పితృస్వామ్య భావజాల చట్రంలోనే బిగించబడినప్పటికీ ఆ యా సందర్భాలలో కాలాలలో
తమను రచయిత్రులుగా నిరూపించుకోవడానికి తమ మనోభావాలను వ్యక్త పరుచుకోవడానికి ఎంతో
శ్రమ పడవలిసి వచ్చింది.ఈ సాహిత్యంలో స్త్రీవాద ధోరణి క్రమవికాసం కనపడుతుంది. స్త్రీ సమస్యల
పట్ల సంస్కరణ దృష్టితో , అభ్యుదయ దృక్కోణంలో, ఉదారవాదంతో పురుషులు ఎంతో సాహిత్యాన్ని
సృజించారు. ఐనప్పటికీ వాస్తవాల,అనుభవాల ప్రాతిపదికపై స్త్రీల అణచివేతను , సమస్యలను స్త్రీలు
విశ్లేశించడం ద్వారా న్యాయం జరుగుతుందనేది నూటికి నూరుపాళ్ళ సత్యం.
ఈ క్రమంలో స్త్రీ విమర్శకులు సాహిత్యంలోని స్త్రీని అచ్చుగా అద్దంపట్టి చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఏది ఏమైనప్పటికీ ఒక వైపు స్త్రీల రచనలు మరోవైపు స్త్రీల పరిశోధనలు
నిరంతరంగాను సమాంతరంగా సాగుతూనే ఉండాలి.అప్పుడే సాహిత్యంలోనే కాదు సమాజంలోనూ
స్త్రీ సముచిత స్థానం పొందకలుగుతుంది

వయొలెన్స్... సైలెన్స్
జి. విజయ లక్ష్మి, ఎమ్. ఏ., ఎమ్ ఫిల్
“అవనిలో సగం
ఆకాశంలో సగం
అంతరిక్షంలో ఘనం
అవమానాల్లో నిరంతరం
అత్యాచారాలతో భయం భయం”
కఠిన చట్టాలకోసం, క్రూరమైన శిక్షలకోసం నగర రహదారులు ర్యాలీల రిబ్బన్లవుతున్నాయి. కొత్త చట్టాలు భద్రమైన సమాజాన్ని సృష్టిస్తాయని మధ్యతరగతి కలలు కంటున్నది. యాదృచ్చికంగా పెల్లుబికే ఆవేశాల అణచివేతకు తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో కేంద్రప్రభుత్వం దారుణ శిక్షల చట్టాల చిట్టాను వెలుపలికి తీసింది.
స్త్రీ ఆదిశక్తి, భరతమాత, జగన్మాత, మహాకాళి, మాతృ దేవత.... ఇది ఒక కోణంలో. మరో కోణంలో స్త్రీ బానిసకొక బానిస. ఈ బానిసత్వం ఒకనాటితో వచ్చింది కాదు. ఆదిమసమాజంలో మానవుడు తండాలుగా వేటమీద ఆధారపడి జీవించే దశలో, నీది నాది అనే స్వంత ఆస్తి భావన లేని రోజుల్లో పురుషులు వేటకి వెడితే స్త్రీలు పోడు, సమానశ్రమ విభజన వున్న వ్యవసాయం, పిల్లల సంరక్షణ చేస్తూ ఇంటి దగ్గరే ఉండే వారు. ఈ దశలో స్త్రీ, పురుష సంబంధాల మధ్య ఎలాంటి ఆంక్షలూ లేవు. ఆస్తి లేదు. కాబట్టి ఆడ, మగ మధ్య సంపూర్ణమైన సమానత్వం ఉండేది. అంతేకాదు, ఈ మాతృస్వామ్య దశలో మానవజాతి సృష్టికి కారకురాలుగా ఆమె అత్యున్నతంగా గౌరవించబడింది. ఆహార సేకరణ దశ, ఆహారోత్పత్తి దశకి చేరిన తర్వాత వ్యక్తిగత ఆస్తి ఏర్పడి క్రమంగా నీదీ, నాదీ అనుకునే దశలో స్త్రీని ఇంటిపనికి కుదించి పురుషుడు వ్యవసాయాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఏకభర్తృత్వం ద్వారా వ్యక్తిగత ఆస్తి పుట్టుకకు ముందే పితృస్వామిక సమాజం ఆవిర్భవించడంతో స్త్రీపై మొదటి అణచివేత ప్రారంభమైంది. చరిత్రలో మొదటి అణచివేత ఇదే. ఆ తర్వాత మిగులు ఉత్పత్తికి, ఆస్తికి పురుషుడు హక్కుదారుడయ్యాడు. వ్యక్తిగత ఆస్తి ఏర్పాటు కారణంగా తండా పద్దతి నశిస్తూ కుటుంబ వ్యవస్థ గట్టిపడటం ప్రారంభమైంది. మాతృస్వామిక వ్యవస్థ స్థానంలో పితృస్వామిక వ్యవస్థ ఏర్పడింది. స్వంత ఆస్తి పుట్టుక స్త్రీని పురుషుడికి శాశ్వతంగా బానిసగా చేసింది.
స్త్రీని దశలవారీగా తండ్రి, భర్త, కుమారుల ఆధీనంలో నిర్బంధించి, సాంఘిక కట్టుబాట్లు ఏర్పరిచి గృహ కృత్యాలకు కట్టిపడేసి స్త్రీని ఈనాటి నికృష్ట జీవితానికి గురిచేసింది. దోపిడికి గురయ్యే పీడితులను అణచివేతను సైతం సహజమైనదిగా, దైవ సమ్మతమైనదిగా భ్రమింపచేయడంలో మతం కీలకపాత్ర వహించింది. అందులో భాగంగానే స్త్రీలపై పురుషాధిక్యత దైవసృష్టి అని ప్రచారం చేసి చిన్నప్పటినుంచే స్త్రీల మెదళ్ళలో పాతివ్రత్యాన్ని నూరిపోసి ఇలా నడవకూడదు, అలా నవ్వకూడదు అని ఆంక్షలు విధించారు. బాల్యం నుంచే స్త్రీని బలహీనురాలిననే ఆత్మన్యూనతా భావానికి గురిచేసి అబల అన్నారు. ఏ మతమైనా స్త్రీని అణచివేయడంలో ప్రధానపాత్రే వహించింది.
స్త్రీలపై జరిగే లైంగిక అత్యాచారాలు, తిట్లు, తన్నులు, ఆంక్షలు, సూటిపోటి మాటలు, లైంగికత్వంపై దాడి ఇవన్నీ స్త్రీలు ప్రతిరోజూ ఎదుర్కొంటున్న సంఘటనలు. ఇవి కనిపించేవైతే గుట్టుచప్పుడు కాకుండా జరిగేవి కొన్ని ఉన్నాయి. ఇంటి చాకిరీ, పిల్లల పెంపకం లాంటి ఆదాయం లేని పనులు వాళ్ళకి అప్పగించి, వాళ్ళ శ్రమకి విలువ లేకుండా చేసి వాళ్ళకి ప్రత్యేకమైన వ్యక్తిత్వం లేకుండా చేశారు. అసలు కుటుంబమే ఇప్పుడున్న రూపంలో హింస. దానిని నిలబెడుతున్న పితృస్వామ్య వ్యవస్థ ఈ హింస అంతటికీ మూలకారణం. రాజకీయ వ్యవస్థలకంటే బలమైనది కావడం వల్లనే ఇది మారకుండా అవిచ్చిన్నంగా కొనసాగుతుంది. స్త్రీలకు హక్కులివ్వడం, వాళ్ళకోసం చట్టాలు చెయ్యడం, కేవలం కాలానుగుణంగా చేసే మేకప్ మాత్రమే.
మహిళలపై హింసను నిరోధించటానికి పదహారు అంశాల కార్యాచరణను ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించింది. చట్టాలు అమలు చేసి రూపొందించటమే కాదు జాతీయ స్థాయిలోనూ, స్థానికంగానూ పటిష్ట కార్యాచరణ వ్యూహాల్ని చెపుతోంది. మహిళా హక్కుల్ని తొక్కిపట్టే కాలం చెల్లిన చట్టాలు ఇంకా రాజ్యాంగంలో అనేకం ఉన్నాయి అని జాతీయ మహిళా సంఘం ఏనాడో ప్రస్తావించింది. ఇటీవల తెచ్చిన పని ప్రదేశాల్లో వేధింపుల నిరోధక చట్టం వంటివి, కొన్నేళ్ళ క్రితం నాటి గృహహింస చట్టం వంటివి మాత్రమే స్త్రీలకు రక్షణ కవచాలు కాలేవు. అత్యాచార కేసుల్లో నేరం రుజువైతే శిక్షలు పడుతున్నవి కేవలం 24 శాతమే. సమస్య మూలం ఎక్కడున్నది అనూహ్యం కాదు. ఇండియాలో 2010 కంటే 7.1 శాతం అధికంగా 2011లో మహిళలపై 2,28,650 నేరాలు జరిగినట్లు జాతీయ నేర నమోదు సంస్థ లెక్కతేల్చింది. అభాగ్య స్త్రీలను వ్యభిచారంలోకి నెట్టడంలో ప్రపంచంలో ఇండియా రెండోస్థానంలో ఉంది.
టాటా వ్యూహాత్మక నిర్వహణ బృందం తాజాగా బహుళ అధ్యయనాలను విశ్లేషించి (వెల్ బీయింగ్ ఇండెక్స్) మహిళా రక్షణ సూచీలను వెలువరించింది. పంజాబ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, హర్యానాలు అగ్రస్థానంలో ఉంటే మహిళా రక్షణ సూచీలు హర్యానా, మధ్యప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్లు అట్టడుగు స్థానాల్లో వుంటున్నాయి. స్త్రీలపై సాధారణంగా జరిగే లైంగిక అత్యాచారాలకు అంతేలేదు. ఆరేళ్ళ పసివారినుండి అరవై ఏళ్ళ వృద్ధురాలి వరకూ అత్యాచారాలకు గురవుతున్నారు. ఇంటినుండి బయటికి వెళ్ళిన మహిళ క్షేమంగా ఇల్లు చేరుతుందో లేదో తెలియదు. అసలు తన ఇంట్లో తానే సేఫ్ గా ఉండగలదా అనే ప్రశ్న.
రాణి రుద్రమ నుంచి మదర్ థెరిస్సా వరకు మహిళలు కేవలం వంటింటి కుందేళ్ళు మాత్రమే అనే దృక్పధాన్ని తప్పని ఏనాడో నిరూపించాం. నేటి ఆధునిక మహిళ అన్ని రంగాల్లో తన ఉన్నతిని చాటుతుంది. కొన్ని రంగాల్లో పురుషులను కూడా అధిగమించి ముందుకు వెపన్లో దూసుకుపోతోంది. ఆర్థిక, సాంఘిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో అగ్రభాగాన నిలచి విజయపతాక ఎగురవేస్తుంది. మహిళలను గత చరిత్ర నీడలు భయపెట్టినా వర్తమాన భవిష్యత్ చిత్రపటంలో తన హక్కులు నిలబెట్టుకోవడానికి నిరంతరం పోరాటాలు చేస్తూనే ఉంది. ఆకాశంలో సగం కాకుండా అనంతమంతా నేను అంటుంది.
నాణానికి రెండోవైపు చూస్తే అదే సమయంలో ఎంత విద్యావంతురాలైనా ఎన్ని ఉన్నత పదవులు నిర్వహించినా ఏదో హింసకు ప్రతి నిత్యం గురవుతోంది. వయోపరిమితి, వరసవావి లేకుండా ఇంటాబయటా అనేక హింసను ఎదుర్కొంటుంది. ప్రతిరోజు మన సమాజంలో ప్రతి ముగ్గురు స్త్రీలలో ఒకరు ఏదో ఒక హింసకు బలవుతున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం ప్రతి 26 నిముషాలకు ఒక మహిళ వేధింపులకు గురౌతుంది. ప్రతి 34 నిముషాలకు ఒక మహిళపై అత్యాచారం జరుగుతోంది. ప్రతి 42 నిముషాలకు ఒక మహిళపై లైంగిక వేధింపులు, అలాగే వరకట్నం కోసం ప్రతి 99 నిముషాలకు ఒక వధువు బలి అవుతోంది.
ఇక వివాహమైన మహిళలకు కొందరి జీవితంలో పెళ్ళంటే నూరేళ్ళపంట అనేకంటే బ్రతుకంతా మంట అనవలసి వస్తుంది. కన్యాశుల్కం నాటి నుండి వరకట్నం దాకా ఇది కొనసాగుతూనే ఉంది. ఎవరైనా చైతన్యవంతురాలైన మహిళ సాటి మహిళలకు సలహా ఇవ్వబోతే భర్తె ప్రత్యక్ష దైవం అంటూ వారిని ఎంత హింసించినా సతీసావిత్రి సతీఅరుంధతి లాంటి పతివ్రతలను తలుచుకొని నా మొగుడు గాక నన్ను ఇంకెవరు కొడతారు తిడతారు అనే వారు ఉన్నారు. మహిళ అయితే చాలు చిన్నారి అయినా, పిచ్చిదైనా వికలాంగురాలైనా అఖరికి వృద్ధురాళ్ళని కూడా అత్యాచారాలకు గురిచేస్తున్నారు. పెట్టుబడిదారులు వారి వారి వ్యాపార ప్రకటనల్లో, సినిమాల్లో, టీవీ సీరియల్స్ లో మహిళల్ని కేవలం వ్యాపారం అభివృద్ధి వస్తువుగా చూపిస్తున్నారు. సెక్స్ సింబల్ గా, జుగుప్సాకరంగా, విలన్లుగా చూపిస్తున్నారు. చదివిన దానికంటే కూడా చూసిన దృశ్యమే సమాజంపై ఎక్కువ ప్రభావం చూపుతోంది. ఆ విధంగా చెడు ప్రభావానికి గురై లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు, హత్యలకు, నేర ప్రవృత్తికి దారితీస్తోంది.
అత్తగార్ని కోడలు తల్లిలా ఎలా గౌరవించాలి, కోడల్ని అత్తగారు కూతురులా ఎలా అభిమానించాలి, చిన్నపిల్లల్ని ఎలా ప్రేమగా చూసుకొని ప్రేమతత్వాన్ని నేర్పాలి, వృద్దుల మనోభావాలు దెబ్బ తినకుండా ఏ విధమైన పద్దతులు ప్రవేశపెట్టాలి, ఏ వయసు వారికి ఆ వయసుకు తగిన వ్యక్తిత్వం ఎలా ఉండాలి - ఇలాంటి విషయాల పట్ల కనీస అవగాహన కల్పించే సామాజిక స్పృహ, బాధ్యతలు ఈ పెట్టుబడిదారులకుగానీ, ప్రభుత్వానికి గానీ, రాజకీయ నాయకులకు గానీ లేవు. కేవలం తమ తమ లాభనష్టాలు, స్వార్థ ప్రయోజనాలు మాత్రమే వారికి ముఖ్యం.
స్త్రీలను కేవలం మార్కెట్ సరుకుగా, సెక్స్ సింబల్ గా చూపిస్తున్న అన్ని వాణిజ్య ప్రకటనలు రద్దు చేయాలి. స్త్రీలు కేవలం లైంగిక సుఖాన్ని ఇచ్చే యంత్రాలుగా చూసే భావజాలం మారాలి. స్త్రీనా పురుషుడా అని కాకుండా మనుషుల్ని ఉన్నత వ్యక్తిత్వం ఉన్నవారిగా గౌరవించే సంస్కృతి రావాలి. అప్పుడు మాత్రమే అత్యాచారాల్ని హత్యల్ని ఆపగలుగుతాం. మహిళలపై జరుగుతున్న అన్ని దాడులకు ప్రభుత్వమే కారణం కాబట్టి మహిళలపై జరుగుతున్న హింసకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
మహిళలపై అత్యాచారాలకు, హత్యలకు, యాసిడ్ దాడులకు పాల్పడిన నేరస్తులను ఎన్‌కౌంటర్లు చేయడం, సామాజిక అత్యాచారాలు జరిగినప్పుడు మరణ శిక్షలు విధించటం సమస్యకు పరిష్కారం కాదు. ప్రజాస్వామ్య విలువలకై పోరాడుతూ, రేపటి తరం యువతను సామ్రాజ్యవాద విష సంస్కృతినుండి రక్షించుకోవడం మనందరి బాధ్యత. వ్యవస్టే నేరమయమైనపుడు వ్యక్తులు ఎలా నేరస్తులవుతారు. ఈ వ్యవస్థను తయారుచేస్తున్న ప్రభుత్వాలు రాజకీయపార్టీలే అసలు సిసలు నేరస్తులు. మహిళల వ్యక్తిత్వాల్ని దెబ్బతీస్తూ వారిని అంగడి సరుకుగా మారుస్తున్న మీడియా, పెట్టుబడిదారులు, ప్రభుత్వమే మహిళలపై జరిగే హింసకు కారణం.
ఫ్యాక్టరీల్లో యజమానుల లైంగిక వేధింపులు, కూలికెళ్తే కామందుల కామానికి బలి కావడాలు, మైనర్ బాలికల్ని పనుల్లో పెట్టుకొని తండ్రి వయసున్న యజమానులు వారిపై అత్యాచారాలు చేయడం, కులం పేరుతో కింది కుల మహిళలపై అగ్రకుల పురుషులు గ్యాంగ్ రేట్లు, హత్యలు చేయడం, గురువుల కామాగ్నికి బలయ్యే విద్యార్థినులు, ప్రేమను కాదన్నందుకు యాసిడ్ దాడులు, హత్యలు, కట్నం కోసం కిరోసిన్ బాత్ లు, భ్రూణ హత్యలు, బాల్య వివాహాలు, మాతంగులు, ఆడపిల్లల అమ్మకాలు, బలవంతంగా వ్యభిచారంలో దించడం, కులాంతర వివాహాలు చేసుకున్నందుకు కన్నవారే కసాయిలుగా నరకటం ఈ జాబితాకు అంతే లేదు. ఇక పోలీసుల చేతుల్లో బలైన చిత్తాయి, సిలకమ్మలు ఎంతోమంది ఉన్నారు.
పిచ్చిదైనా, పసిదైనా, ముసలిదైనా, వికలాంగురాలైనా ఎవరైనా సరే, మహిళ అయితే చాలు ఈ మృగాళ్ళకు. విషపురుగుల్ని, హానిచేసే జంతువుల్ని గుర్తించవచ్చు గానీ మేక వన్నె పులుల్ని గోముఖ వ్యాఘ్రల్ని గుర్తించడం ఎలా? వాటినుంచి లేడికూనల్ని రక్షించడం ఎలా? కూలి చేసే మహిళనుండి రాజ్యాన్ని ఏలే మహిళ వరకు ఈ లైంగిక వేధింపులకు, హింసకు గురవుతున్నారు. మహిళల్ని వేధింపులకు గురిచేసే వాళ్ళ లిస్టులో రాజకీయ నాయకులు మినహాయింపు కాదు.
దేశంలో రోజురోజుకీ స్త్రీలలో చైతన్యం అభివృద్ధి చెందుతోంది. స్త్రీలు తమ చరిత్రని తాము నిర్మించుకునే ప్రయత్నం చేస్తున్నారు. చరిత్రలో, సమాజంలో, రాజకీయాలలో కుటుంబంలో తమ స్థానంకోసం పోరాటం చేస్తున్నారు.
నిరంతరం మగపెత్తనానికి, పితృస్వామిక హింసకు గురవుతున్న భారత స్త్రీలకు తమపై అమలవుతున్న హింసను, ఆధిపత్యాన్ని వ్యక్తిగత స్థాయిలోను, సమాజస్థాయిలోను ప్రతిఘటించడంతో పాటు కరుడుగట్టిన పురుష దృక్పథంతో రూపుదిద్దుకున్న భారత న్యాయచట్టాల్లో స్త్రీలకు అనుకూలంగా మార్పులు తీసుకురావడానికి భారత స్త్రీలు పోరాడాలి. స్త్రీలపై జరుగుతున్న హింసాకాండను, మగపెత్తనాన్ని అత్యంత సహజమైన విషయాలుగా స్థిరీకరించిన పితృస్వామిక భావజాలాన్ని రూపుమాపేందుకు మహిళలు పిడికిలి బిగించాలి. స్త్రీమూర్తుల్ని సమర్థ మానవ వనరులుగా తీర్చిదిద్దకుండా సమానత్వం, సాధికారత రావు.
వాణిజ్య ప్రకటనల్ని, అందాల పోటీల్ని, మద్యపానాన్ని నిషేధించాలి. మానవ సృష్టికి మూలమైన సమాజంలో, సహజీవనంలో సగమైన స్త్రీ వ్యక్తిత్వాన్ని కాపాడేలా ప్రభుత్వాలు పనిచేయాలి. మగపిల్లలకు చిన్ననాటినుండే తమ తల్లి అక్క చెల్లిలానే ఎదుటి స్త్రీని గౌరవించే సంస్కారాన్ని తల్లిదండ్రులు నేర్పించాలి. స్త్రీల సమస్యలపై అవగాహన కల్పించాలి. అవసరం వచ్చినపుడు మాత్రమే నేర్పించడం కాకుండా ప్రాథమిక విద్య నుంచే ఆడపిల్లలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలి. సంగీతం, డ్రాయింగ్, క్రాఫ్ట్ క్లాసుల్లాగానే స్కూళ్ళలో మార్షల్ ఆర్ట్స్ క్లాసులు నిర్వహించాలి. కార్యాలయాల్లో కంప్లెయింట్ బాక్సులు, కళాశాలల్లో అవగాహనా సదస్సులు ఏర్పాటు చేయాలి. చట్టాల్లో మార్పు కన్నా సమాజంలో మార్పు, భావజాలంలో మార్పు కోసం ప్రభుత్వాలు కృషి చేయాలి. థమిక స్థాయి నుంచి నైతిక విద్యాబోధన జరగాలి. దుశ్శాసన సంతతిపై కఠిన శిక్షల కొరడా పడాలి. అశ్లీలతకు అడ్డుకట్ట వేయాలి. వీటన్నింటికోసం సమాజంలో ప్రతి ఒక్కరిలో చైతన్యం పురివిప్పాలి.
దాదర్ ఎక్స్ ప్రెస్ నుంచి ఢిల్లీ బస్సులో నిర్భయ ఉదంతం వరకూ అత్యాచారాల చిట్టా పెరుగుతూనే ఉ ంది. నిర్భయ ఉదంతం జాతి గుండెలను కలచివేసినా పరమ జుగుప్సాకరంగా అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయన్నది మనం మరవకూడదు. జస్టిస్ జెఎస్ వర్మ సూచనల్ని కొన్నింటిని తోసిపుచ్చి అత్యవసర ఆదేశాన్ని జారీచేసిన కేంద్ర ప్రభుత్వం సామాజిక విలువలు పెంచటంలో తన వంతు ప్రయత్నం ఏం చేసిందో... ఇంకా ఏం చేస్తుందో వేచి చూడాలి.
తలవంచుకుపోతున్నా గుచ్చి గుచ్చి కాల్చే చూపులు,
ఒంటరిగా కనిపిస్తే చాలు రేటెంతనడిగే బిజినెస్మన్లు
బస్సుల్లో రద్దీ ముసుగులో రుద్దేసే వెకిలి గాళ్ళు
ఢిల్లీ నుండి గల్లీ దాకా...
అమ్మకూ, అక్కకూ, చెల్లికీ, చెలికీ
అడుగడుగునా అవమానాలెన్నో, ఎన్నెన్నో
ఇవన్నీ ఎక్కడా నమోదు కాని వేదనలు!
మగజాతికి అనుభవం లేని అర్థం కాని నగ్నసత్యాలు.
ఇంకా ఎన్నాళ్ళు... ఎన్నేళ్ళు....
ఈ బాధలూ భయాలూ గాధలూ గారడీలూ
అవమానాలు అత్యాచారాలు
మా కడుపున పుట్టి మా పాలు తాగి పెరిగి మా పైనే అత్యాచారాలా?
మగాళ్ళూ ... మీరు ఎన్నటికీ మృగాళ్ళు!
రచయిత్రి, జర్నలిస్టు

"మట్టితో చెలిమి-ప్రకృతి మాలిమి"
కొల్లాపురం విమల
“చలి కాలంలో నేనొక గొడ్డుని
వసంతకాలంలో ఒక మొక్కని
వేసవిలో ఒక పురుగుని
శిశిరంలో ఒక పిట్టని
మిగిలిన కాలంలో
నేనొక స్త్రీని” (వెరపావ్లోవా, తెలుగు : చరణ్)
మొన్న పొద్దున్నే ఉస్మానియా యూనివర్సిటీ వాట్సప్ గ్రూప్ తెరవగానే కన్పించిన పై కవిత చూసినప్పుడు నాలో చెప్పలేని ఉద్వేగం కల్గింది. నాలోకి నిస్తేజాన్ని విదిల్చి ఒక్క వూపున రాత్రంతా నా యీ ఆలోచనలను విత్తనాలుగా సాలు పోసేందుకు పురికొల్పింది. ఎంత అద్భుతమైన కవిత!! తనకు అర్థమైన వాస్తవ ప్రపంచం మొత్తాన్ని కేవలం ఐదు పాదాల్లో ఇమిడ్చి మనకందిచ్చిన ఆ కవి అవగాహన నేరుగా మనకు చేరుతుంది. అంతేకాదు, ప్రకృతికీ - స్త్రీలకీ మధ్య తెగిపోని బొడ్డు సంబంధాన్ని తెల్పే మన బతుకమ్మ పండుగను సైతం గుర్తుచేస్తుంది. యే నాగరికితకైనా సాలు పోసేది ప్రకృతీ, దాన్ననుసరించిన వ్యవసాయ సంస్కృతే. అందుకేనేమో ప్రకృతి బిడ్డలుగా లోతట్టు ప్రాంతాల సమూహాలుగా ఆదివాసీ సమాజాలు మలిచిన సాంస్కృతికభావనలూ-పండుగలూ-ఆహార సంస్కృతులూ తరాలు గడిచినా ఈనాటికీ మనకందుతూనే వున్నై. పురా నాగరికతను గుర్తుచేసే ఇలాంటి సాంస్కృతిక ఆచరణలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచీన నాగరికతా కేంద్రాలైన భూభాగాల్లో కొనసాగుతూనే వుండటం చూడొచ్చు. ఉదాహరణకి మన ప్రాంతాన్నే తీసుకుంటే సింధూ నాగరికత పరిఢవిల్లుతున్న కాలంలో పండించిన ఓ రకం 'గోధుమ' వంటి ధాన్యం ఇప్పటికీ నల్లమల ప్రాంత పరిసరాల్లోనిరైతులు పండించడం చూడొచ్చు. వేల సంవత్సరాల ధాన్య సంస్కృతికీ, విత్తన వినిమయ జ్ఞానానికీ ఇది నిదర్శనం. స్థానికులు 'యువలు' అని పిలుచుకునే ఈ ధాన్యం మా అమ్మమ్మ వాళ్లూరైన కొన్నాగుల (కొండనాగుల్) అనే పాలమూరు ఆదివాసీ గ్రామం పరిసరాల్లో ఈ ధాన్యాన్ని పండించడం, పండుగపూట వాటిని విసిరి 'బచ్చాలు'(బక్ష్యాలు) చేసుకోవడం గురించి మా అమ్మ చెప్పగా విని తెలంగాణా స్థానిక జీవజాతులు-పంటల గురించి తెల్సుకోవాలనే ఆసక్తి నాలో కల్గింది. అందులో భాగంగా మౌఖిక కథనాలు సేకరించడం మొదలు పెట్టిన. ఆ అన్వేషణకు నాకు కావాల్సిన అవగాహనలను మాత్రం కొల్లాపురంలో పుట్టి పెరిగిన నా గతం అందిచ్చిందనే నాభావన. 60-70ల నాటి నా చిన్నతనంలో ఎవరింటికి కావాల్సిన కూరగాయలు వాళ్లే పండిచ్చుకునేది. బీర, కాకర, అనప, చిక్కుడు, దొండ, పొట్ల, గుమ్మడి, తమాట,మిరప, ముల్లంగి, మునగ, చెమ్మకాయ, చెవులకాయ వంకాయ వంటి ఇంకెన్నో రకాల కాయగూరలూ, పుంటికూర, సుక్కకూర, తోటకూర, దొగ్గలి కూర, మెంతి, పొన్నగంటి, కరియాపాకు వంటిఎన్నో రకాల ఆకుకూరలూ వున్న చేరెడు జాగాల్లో వేసుకొనేది.మా స్నానాలూ పానాలతో చెట్టు చెట్టును అవ్వ-అయ్య పేర్లతో బతికించుకునేది. దొడ్లో ఓ మూల పెంటగా పోగుపడిన మా వంటింటి వ్యర్థాలు రైతుల చేన్లకి ఎరువయ్యేవి. ‘ఇంటికి వంటిల్లు ఎట్లనో పెంటకుప్ప అట్ల' అన్నట్లు ప్రతి ఇంటి దాపున్నో, దొడ్లనో పెంటకుప్ప ఉండేది. యే గుడిసె చూసినా పచ్చగ పూసిన గుమ్మడి, బీర పువ్వులతో కళకళలాడుతుండేది. మాక్కావాల్సిన గుడ్లు, మాంసం మేం పెంచుకునే కోళ్ళూ, బాతులూ, సీమకోళ్లూ క్రమం తప్పకుండా అందిచ్చేవి. నెమిళ్లూ, పావురాలూ, చిలుకలూ, కుందేళ్లూ, అడవి మేకలూ, కొండ గొర్రెలూ, సీమ పందులూ వంటి జీవులను జంతుప్రేమికులు సాక్కుంటే మేకలు, గొర్లు, బర్లు, ఆవులు, ఎద్దులు, వ్యవసాయదారుల ఇండ్లల్ల వుండేవి. గాడిదలు, గుర్రాలు, పందులు, కుక్కలు, పిల్లులు, కొండకచో కోతులు ఊరుమ్మడి సభ్యుల్లా బజార్లలో ఠీవిగా తిరుగుతూ కన్పించేవి. ఇంటి చూర్లకు ఊరపిచ్చుకల గూళ్లు, గోరింకలు వాలిన పొగడచెట్లు, వేపచెట్లపై పువ్వుల్లా పరుచుకున్న కొంగలు, చిలుకలు వాలే జామచెట్లు, రేగిచెట్టు మీది నుంచి కిందపడి ఎగరలేనిపిల్ల కోసం గుంపుగ కదిలే కాకుల గుంపులూ, వేప తీపి మెక్కి తీయగ పాడే కోకిలలూ, గిజిగాళ్లు, గువ్వలు, కవ్వర, వడ్రంగి, లకుముకి, పికిలి పిట్టలు, తోక పిట్టలు, తేనె పిట్టలు, పాలపిట్టలు, కండ్ల కపటి, పైడికంట్లు, సీత్వలు, గద్దలు ఇంకా ఎన్నెన్నో పక్షులూ, చెట్లూ -జంతువులూ వైవిధ్య ప్రపంచ దూతలుగా కన్పించేవి. చిటిమిటి పండ్లు,జానపండ్లు, కలింపడ్లు, తుత్తూరు పండ్లు, సింతోల పండ్లు, మావిడి, బాదం, నేరేడు, సీమచింత,జామ, దానిమ్మ, తాటి, ఈత, రేగులు, గేగులు, బొంతకాకర, ద్యావదారు కూర, చింత చిగురు లాంటి ఎన్నో రుచులను నల్లమల మాకు మురిపెంగా తినిపిచ్చేది. కృష్ణమ్మ దాపున్నే వున్నా తాగేనీళ్లకు కష్టమైనా పాడి వున్న వాళ్ల ఇంటికితూగు పట్టుకొని పోతే నిండ 'సల్ల' పోసి దీవించేది. పాలు కరువైనా 'సల్ల' మమ్మల్ని ఎండతాపం నుంచి కాపాడేది. మేక పొదుగులు చప్పరించి అప్పుడప్పుడైనా పాలరుచి తెలుసుకునేది. కొర్రన్నం,జొన్న రొట్టె, ఆర్కబువ్వ, అంబలీ, ఇంట్లగాసే కూరగాయలూ ఇవీ మా రోజువారీ ఆహారం. పండుగలప్పుడే వరన్నం పొలావు వండేది. ఐదు రోజులు పాఠాలు చెప్పే పంతులుగా, ఆదివారం నాడు రైతుగా మా నాన్న పొలం బాటపట్టేది. మాయింటి మందం వరి పండిచ్చేది. ఇంటికి తరిగిపోని భరోసాగా దొడ్లపచ్చగ పాకే కూరగాయ మొక్కల్ని సవరిస్తూనో, బొగ్గు గుర్తుపెట్టిన పొదిగేసిన గుడ్లను ప్రతిరోజు తిప్పి పెడుతూ 'తల్లికోడి' కి సాయపడుతూనో మా అమ్మ విరామం లేకుండా గొడ్డూ-గోదాతో సహా మా అందరి తిండీ తిప్పలు చూసుకునేది. మా వంతుగా పిల్లలందరం పంటల కాలంల ధాన్యం ఇంట్లకు చేరేయడంలోనో, సంతకెల్లి ఉప్పుపప్పు దినుసులు తేవడంలోనో అమితోత్సాహంతో పనిచేసేది. ఇట్లా సమతుల ఆహారం యే ప్రచార్భాటాలు లేకుండానే మాకు చేరేది.
కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. నాలుగు లేన్ల రహదారి కోసం మా వూరు ఎడారైంది. వందేండ్ల చెట్లు ఒక్క రోజునే సామూహికంగా మరణించినై. యవల ధాన్యం అయ్య అవ్వల జ్ఞాపకాల్లోనే కన్పించే పంటైంది. మారిన ఆహార సంస్కృతి వల్లా, కొర్ర బియ్యం ఆడించే మిల్లులు అందుబాటులో లేకా, గిట్టుబాటు లేదా, విత్తనాలను భద్రం చేసుకోకపోవడం వల్లా కొర్రలు పండే భూముల్లో అనువుగాని పంటలు వేస్తున్నారు చాలామంది రైతులు. లోతట్టునున్న 'సోమశిల' చుట్టుపక్కలున్న ఊళ్లల్లో కొద్దిమంది రైతులు మాత్రమే ఇప్పుడు కొర్రలు పండిస్తున్నరు. రుచీకీ, ఆరోగ్యానికీ, శ్రేష్టమనే స్త్రీల భావన వల్ల 'యవలు' ఒకటి రెండు మళ్ళలోనైనా కొనసాగుతున్నై. అట్లే కొర్రన్నమే తమకు 'కడుపాసర' ఇస్తుందనే నమ్మకంతో కొంతమంది రైతులు తమ ఇంటి మందం మాత్రమైనా పండిస్తుండడం వల్లే ఇప్పటికీ కొర్ర ధాన్యం ఉనికి నిలబడింది. స్త్రీలూ, రైతులూ ఇట్లా విత్తన సంపద భద్రం చేయడంలో, వాటిని తరాలుగా పంచుకొనిపెంచుకోవడంలో కావొచ్చు, జీవ వైవిధ్య పోషణకై కావొచ్చు, వెచ్చిస్తున్న శ్రమకీ, జ్ఞానాలకీ ఇది ఓ చిన్న ఉదాహరణ మాత్రమే. ఇది కొంత ఓదార్పు కల్గించే విషయమే అయినప్పటికీ మనం పోగొట్టుకున్న లేదా పోగొట్టుకుంటున్న పంటలూ - జీవజాలం తక్కువేమీ కాదు. నిజానికి మనం నిలబెట్టుకున్న వాటికంటే పోగొట్టుకున్నదే ఎక్కువ. ఇదే విషయాన్ని గుర్తు చేసుకుంటూ గనపురం సాంబలు వంటి మేలురకం వొడ్లు కండ్లకు 'కానాకుండా' పోయిన విధానాన్ని ఓ అమ్మ ఇలా పాడింది.
“ఆ పెద్ద సెరువెనుక ఉయ్యాలో - యేమేమి పండు ఉయ్యాలో
సాంబ వరి బియ్యమ్ము ఉయ్యాలో - సాయ కొమ్ముల పసుపు ఉయ్యాలో
అవే మంగమ్మకు ఉయ్యాలో - ఒడి బియ్యమమ్మ ఉయ్యాలో
అవీ తలువాలు కావు ఉయ్యాలో - అవి మంచి ముత్యాలే ఉయ్యాలో’’
మంచి ముత్యాలంత 'సొక్కమైన' బియ్యం మన గనపురం సాంబలు. ఇప్పుడు మనకు అందుబాటులో వున్న అనేక హైబ్రిడ్ వంగడాలకు గనపురం సాంబలు మాతృకగా వాడారని విన్నప్పుడు ఆశ్చర్యపోవడం నా వంతైంది. ఆ సొక్కమైన రకం ఇప్పుడుయే అమెరికా జీన్ బ్యాంకుల్లోనో మాత్రమే ఉంటుందని తెల్సుకోవడం ఈనాటి విషాదం. జీవ వైవిధ్యం ప్రకృతి ఆరోగ్యానికి సూచిక. అట్లే తల్లి ఆరోగ్యమే బిడ్డకు రక్ష అన్నట్లు ప్రకృతి ఆరోగ్యమే మన ఆరోగ్యం. ఆహార గొలుసు ద్వారా మనం ప్రకృతితో బొడ్డు సంబంధం వున్నవాళ్లం. ఇట్లా చూసినప్పుడు జీవవైవిధ్యాన్ని కోల్పోవడమంటే కొన్ని రకాల వృక్ష, జంతు, కీటక జాతులు అంతరించిపోవడమే కాదు, వాటితో పాటుగా విశ్వం కోల్పోతున్న ప్రాణశక్తి నష్టం యే సైన్సూ పూడ్చలేనిదని ప్రకృతి అధ్యయనాలు చెబుతున్నై. కొన్ని రిపోర్టుల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికి మనం 10,000 రకాల జీవజాతులను కోల్పోయినం. కొన్ని వందల రకాల వరి పంటలు పోగొట్టుకున్నాం.భారతదేశ విషయాన్నే తీసుకుంటే 14,000 సంవత్సరాల క్రితం నుంచే 'వరి' పండిచ్చే నాగరికత కన్పిస్తుంది. పోయిన 10,000 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా దాదాపు 1,10,000 రకాలైన వరి పంటలను మన రైతులు వృద్ధి చేసారు. కాని ప్రస్తుతం వాటిలో 6,000 మాత్రమే మనుగడ కొనసాగిస్తున్నై. స్థానిక వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా, పరిణామ క్రమంలో అధిక సహిష్టత, పోషకాలున్న పంటలుగా పాలు పోసుకునేందుకు స్థానిక జాతులకు తోడై నిల్చినవాళ్లు మట్టిని నమ్ముకున్న మన రైతులు. ప్రకృతిని కొల్లగొట్టకుండా మనుగడ సాగించడం ఎలాగో తెలిసిన శాస్త్రవేత్తలు. వేల ఏండ్ల వ్యవసాయ నాగరికతలోంచి నడచివచ్చిన తాత్వికులు. తెలంగాణాలో సైతం మన సమీప గతంలోనే పైన ప్రస్థావించిన గనపురం సాంబలతో పాటు ఎన్నో 'వడ్ల' రకాలుండేవని ఓ బతుకమ్మ పాట గుర్తుచేస్తుంది. దున్నడం దగ్గర్నుంచి ఎన్నిరకాల వొడ్లు ఎవరెవరు (కులాల వారీగా) తినేవారు వరకు విపులంగా వివరిస్తుందీ పాట. మచ్చుకి
“నల్లరేగడి భూమి ఉయ్యాలో-సక్కంగా దున్నారు ఉయ్యాలో
కాలితోని పదును ఉయ్యాలో-తన్ని చూసేరు ఉయ్యాలో
అంటూ మొదలు పెట్టి పంట చేతికొచ్చే వరకు సాగే క్రమాన్ని వివరించి "పెద్ద వరి ధాన్యాలు ఉయ్యాలో -కాపోళ్లు తిన్నవీ ఉయ్యాలో” అంటూ ఎన్నో రకాల స్థానిక వడ్లను పేర్కొంటుంది. పెద్ద వరి, వెల్లంకణాలు, తెల్ల బాలోరీ, గవిరి వజ్జాణాలు, ముతక వజ్జాణాలు, శామంచనాలు, వాయిలపాటి సన్నాలు, మల్లి సన్నాలు, దూది బోగములు, కాకిమూతి సన్నాలు, యర్రబాలు, కాయిరి ధాన్యాలు, బలరామ బోగాలు, రక్తసరి ధాన్యాలు, సన్న సూద్రుల్లు, బంగారు తీగెలు, దాళవా ధాన్యాలు, సత్తికపు ధాన్యాలు, గుత్తు బాసికాలు, బుడమ ధాన్యాలు, మడి రాసికాలు, చేమంచనాలు, యెల్లంకణాలు అమృత పాణీలు, రాజునాలు- ఇలా వివిధ రకాల వడ్ల గురించి ఈ పాట ద్వారా మనకి తెలుస్తుంది. వీటిలో ఏ ఒకటి రెండో తప్ప తెలిసిన వాళ్లు ఈ తరంలో అరుదు. మరో ఉయ్యాల పాట జొన్నలు, పికిలి కుంచెలు, నకిలికుంచెలు, కొర్రలు అంటూ నవధాన్యాల సాగును కైగడుతుంది. వీటిల్లో మనకున్నవి ఎన్నో పోగొట్టుకున్నవి ఎన్నో తెల్సిన వాళ్లు మరింత అరుదు. ఇలాంటి విషయాలను అందరికీ ఎరుకపర్చాల్సిన మన వ్యవసాయ విశ్వవిద్యాలయాలూ - పరిశోధనా సంస్థలూ "అధిక ఫలసాయం” ఇచ్చే పంటల ప్రచారంలో కొట్టుకుపోతున్నై. "Our focus is on the overall development of improved varieties .... with an objective to improve 'profitability' of farmers!" (18th April 2016, Deccan Chronical) అంటూ మన వ్యవసాయ విశ్వవిద్యాలయ సైంటిస్ట్ అన్న మాటలు అందుకు దాఖలా. ఈలాంటి ధోరణుల వెనుక 'హరిత విప్లవం' పేరున 60ల నుంచి మొదలై ఇప్పటి ప్రపంచీకరణ నేపథ్యంలో మరింత బలపడిన వలసవాద ధోరణులున్నై.లాభాపేక్షే ధ్యేయంగా వ్యవసాయ రంగాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న కార్పొరేట్ సంస్థలున్నై. హరిత విప్లవం మొదలైతున్న నాటికి మనదేశంలో దాదాపు 42,000 స్థానిక జాతులైన పంటలు వుండేవని Dr. Deb నిర్ధారించిండ్రు. ప్రస్తుతం అవి వందల్లోకి కుంచించుకపోయినై. అధికోత్పత్తి పేరున గుప్పించిన ఏకరూప హైబ్రిడ్ పంటల వల్లా, సంరక్షణ పేరుతో వాడే రసాయనాల వల్లా, క్రిమి నాశకాల వల్లా ఇట్లా జరుగుతున్న నష్టాలకు ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న 'ఆరోగ్య విపత్కర' పరిస్థితే దాఖలా. గ్రీన్ గ్యాసెస్ ఉద్గారాలతో ఉడుకుతున్న భూమే సాక్ష్యం. పోగొట్టుకుంటున్న జీవ వైవిధ్యమే నిదర్శనం. కొన్ని అంచనాల ప్రకారం మనదేశంలో 95% స్థానిక వొడ్ల రకాలను పోగొట్టుకున్నాం. అంతేకాదు, ఆయాజాతులమనుగడపై పెరిగిన వొత్తిడి వివిధ వడ్ల జన్యు సంచయం (gene pool) పై ప్రభావం చూపడం మూలంగా మరిన్ని జాతులు అంతరించి పోయే ప్రమాదం వుందని పరిశోధనలు చెబుతున్నై. వలసవాద చదువుల దన్నుతో స్థానిక జ్ఞానాలను 'వెనకబడిన' భావనలుగా తోసివేయడంతో మొదలైన 'ప్రపంచీకరణ' ప్రస్థానం ఇట్లా స్థానిక ఆహార సంస్కృతులను, వ్యవస్థలను చెదరగొట్టడంతోనే ఆగిపోలేదు. భూమి, నీరు, అడవులు, గుట్టలు అన్నింటిని వనరుల కింద కుదించేసి ధ్వంస రచనకు పూనుకున్నది. స్థానిక వాతావరణ పరిస్థితులనూ, ఆహార సంస్కృతులనూ బేఖాతరు చేసే పాలసీలతో ఇప్పుడు మరెన్నో వేల లక్షల జీవజాతులకు మరణశాసనాలు రచిస్తున్నది. 2021 సెప్టెంబరు 23న న్యూయార్క్ లో కలిసిన UN Food Systems Summit (UN FSS) ఇందుకు నిదర్శనం. ఈ క్రమానికి మరో సాక్షి దక్కను నల్ల గొర్రె. ఎటువంటి పరిస్థితులైనైనా తట్టుకోగల్గే జీవ లక్షణాలతో వెచ్చని, నల్లని ఉన్నిని గొంగడిగా, తెలంగాణా ఆత్మ గౌరవ పతాకగాఅందిచ్చిన మన దక్కను నల్లగొర్రెను రూపులేకుండా చేసే 'పాలసీ' చంద్రబాబునాయుడు కాలంలోనే మొదలైంది. అడవులు నాశనమవడానికి మేకలూ, ఆదివాసీలూ కారణం అన్న 'తెలివి' ఆనాటి పాలకులది. ప్రాచీన భూఖండంలో భాగంగా తెలంగాణాకే ప్రత్యేకమైన నల్లగొర్రె వంటి జీవజాతులు మరెన్నో కన్పిస్తే. నల్లమలలో కన్పించే అమ్రాబాదు ఆవులూ; కొన్ని రకాల అడవికోడి జాతులూ; నీటి కుక్కలూ; మెదక్ పరిసరాల్లో కన్పించే ప్రత్యేకమైన మేకజాతీ (పంచోది చెట్టుని మేసే ఈ జాతి మేకల్లోని 'మేకరాళ్ల’ ను విలువైనవిగా భావిస్తారు); కొన్నివేలరకాల వృక్షజాతులూ; (టయాసిక్ కాలం మంచీ కొనసాగుతున్న వందల రకాల పూల జాతి మొక్కలూ, అరుదైన శిలలూ, రాళ్లూ, రప్పలూ వంటివి తెలంగాణా అందుకున్న అపురూప ప్రకృతి కానుకలు. అంతేకాదు, ఎన్నో రకాల తృణధాన్యాలకు ఈ పీఠభూమి పుట్టినిల్లు. గోండ్వానా నాగరికత అందిచ్చిన 'నవధాన్య' ఆహార సంస్కృతికి కేంద్రం. ఇదే విషయాన్ని రికార్డు చేసిన బతుకమ్మ పాటలు ఎన్నో వున్నై. వలసపూర్వ, వలసానంతర తెలుగు సాహిత్యంలో సైతం ఈ విషయాలను ఆనవాలు పట్టొచ్చు ఉదాహరణకి గంగుల శాయిరెడ్డి అనే రైతు 1937 సంవత్సరంలో రాసిన పద్యకావ్యంలో మన 'నవధాన్య' ఆహార సంస్కృతిని కళ్లకు కట్టినట్లు చూపిస్తరు. బంగారం, వెండి, రాగి, ఇనుము రంగుల్లో మెరిసిపోయే నవధాన్యరాసుల గురించి వివరించే పద్యంలో రంగులను బట్టి ఇలా విభజించి చూపిస్తరు. బంగారం వన్నె ధాన్యాలు సెనగలు, పసుపు, ధనియాలు, పుట్నాలు, మెంతులు; వెండిరంగు ధాన్యాలు-సీత తలంబ్రాలు (తెల్లజొన్నలు), పత్తి, వెల్లుల్లి, కుసుమలు; రాగి రంగుధాన్యాలు - బెబ్బర్లు / అలచందలు, కందులు, ముసికపట్టిన జొన్నలు, యవలు, రాగులు, అవిసెలు, మిరపకాయలు; ఇనుపరంగు ధాన్యాలు - అనుములు, ఆవాలు, నల్ల నువ్వులు, ఆముదాలు, లంకలు, మినుములు, ఉలువలు, పెసర్లు మొదలైనవి. ఇక పసరు రంగులో వుండే పెసళ్లు, చామరంగులో మెరిసిపోయే సజ్జలు, చామలు, వరిగెలు వంటి ధాన్యాలన్నీ భూదేవి మెడలో మెరిసిపోతున్నాయి అంటూ పంట పొలాలను చూసిన పరవశంతో పద్యాలు రాసిండు. అంతేకాదు "శ్రేష్టమౌ బీజముల్ సేకరింపకపోతే” చేసిన కష్టం మంటిలో కలిసిపోతుందని తోటి రైతులను హెచ్చరిస్తడు. అదివరకే దాచి పెట్టుకున్న విత్తనాలకు (జొన్నలు, కొర్రలు వంటివి) కలెగలుపు ధాన్యం (దోస వంటివి) కలిపి విత్తనం తతికి (కోస్తా ప్రాంతంలో ఏరువాక అంటరు) బైల్దేరడం గురించిన వర్ణన మన 'మిశ్రపంటల' సంస్కృతిని చెబుతుంది. ఇక 'విత్తనం వున్న వాళ్లదే పెత్తనం', 'విత్తనాలుంటేనే పెత్తనాలు' వంటి జనం నోళ్లలో నానిన ఎన్నో సామెతలు సైతం మనకు 'విత్తన' ప్రాముఖ్యతను నిత్యంగుర్తు చేస్తూనే వున్నై. అందుకే ఈనాటి కవి కత్తిపద్మారావు గారు “విత్తనం జీవన సౌధం” అని ఒక్క మాటలో తేల్చి చెప్పడం చూడొచ్చు. ఇక ఇప్పుడు 'విత్తనం నాగరికతకు తరగని భరోసా' అన్న మన ఆర్గానిక్ మేధావుల మాటలను గుర్తు చేసుకోవాల్సిన అనివార్య సందర్భం వచ్చింది. మట్టిపొరలను చీల్చుకొని పిడికిలి ఎత్తే విత్తనం మన ఆహార సార్వభౌమత్వానికీ, స్వేచ్ఛా సమానత్వాలకు ప్రతీక అని గుర్తుచేసుకోవాల్సిన సందర్భమిది. 'విత్తనం నాటడమంటే సామాజిక న్యాయానికి పునాదులువేయడమే' అంటాడు జరాత్రుస్ట అనే తాత్వికుడు. ఇప్పుడు ఆయన మాటల్ని మనం 'Who sows local seeds sows justice' అని తిరగరాసుకోవాల్సిన సమయం వచ్చింది. నాటు విత్తనాలే నేటి అవసరం అంటూ మన నవధాన్య సంస్కృతిని ఉద్యమ స్థాయిలో ఎలుగెత్తి చాటాల్సి వుంది. 'ఇలాంటి అత్యవసర సందర్భంలో, ఇంతటి వైవిధ్య భరిత స్థానిక నవధాన్య సంస్కృతిని కాదని 'ఈనాటి' ప్రభుత్వం 'ఆర్థిక భద్రత' పేరిట పత్తి, చెరుకు వంటి వ్యాపార పంటలు వేయమని నిర్దేశించడం, పెద్ద చారిత్రక తప్పిదం. 'రేగడి విత్తులు' అనే ఓ తెలుగు నవల ఇలాంటి వలసవాద ధోరణలను ఎత్తిపట్టడాన్ని తెలంగాణ సమాజం తీవ్రంగా వ్యతిరేకించింది. తెలంగాణా విత్తన చట్టం తేవాలనీ, ప్రకృతి సేద్య రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలనీ 'తెలంగాణ మహిళల మానిఫెస్టో 2013 సం||లో డిమాండు చేయడాన్ని ఈ నేపథ్యంలో చూడొచ్చు. వ్యాపార పంటలను ప్రోత్సహించే ఇలాంటి ప్రభుత్వ నిర్ణయాల వెనుక 'గ్రీన్ రెవల్యూషన్' నుంచి 'మెకనైజేషన్' మీదుగా ఈనాడుఊపందుకున్న జన్యుమార్పిడి పంటల వరకు బలపడిన విధ్వంసకర వలసవాదధోరణులున్నై. 'దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్' అన్న ఆధునిక పోకడలను ఇంకా 'వల్లె వేస్తున్న' మధ్య తరగతి విద్యావంతుల తరం వుంది. కేవలం 'మనుష్య' కేంద్రంగా ఇట్లా ఆలోచించడం వల్ల సమస్త జీవావరణాన్ని జడంగా గుర్తించే విపరీత ధోరణులున్నై. ఫలితంగా పండే భూమిపై, ఆడదానిపై ఆధిపత్యానికై పోటి మరింత పెరిగింది. భూమిని తమ సొంత ఆస్థిగా ప్రకటించుకునే పురుష దురహంకారాలు భూమి ఉసురు తీసే కర్బన ఉద్గారాలై చెలరేగినై. చివరాఖరికి విజ్ఞాన శాస్త్రాలను సైతం పితృస్వామ్య ధోరణులు ఆక్రమించినై. సైన్సు పెత్తందారుల సిఇఒగా కుంచించుకుపోయింది. ఇలాంటి కల్లోల కరోనా సందర్భంలో ఇప్పుడు మనం ఉన్నాం. ఈ విషయాలను ముందే పసికట్టిన 'మహాశ్వేతాదేవి' వంటి మేధావులు Social forestryలో భాగంగా విచక్షణా రహితంగా యూకలిప్టస్ పెంపకాన్ని ప్రొత్సహించడం చూసి Letojádosãojogo "I am concerned with the India I know. My India is of the poor, starring and helpless people.... To cover (This land) with encalyptus, will be to rob my India of drinking and irrigation water” అంటూ నీటి ఎద్దడికి కారణమైన తప్పుడు ప్రభుత్వ నిర్ణయాలను తీవ్రంగా ఖండించింది. ఇక ఇప్పటిప్రకృతి ప్రేమీ, మేధావీ అయిన వందనా శివ మాటల్లో చెప్పాలంటే "Many of the economic probles of the poorest of mankind are rooted in the ecological distruction caused by excessive demands on the natural resources by the elites of the world" అని చెప్పొచ్చు. ఐతే ప్రకృతిపై కనిపించని యుద్ధాన్ని ప్రకటించిన ఈలాంటి విధ్వంసకర శక్తులను కొంతైనా నిలువరించి మన ప్రాంత జీవ వైవిధ్యాన్ని, ప్రకృతి ఆరోగ్యాన్ని కాపాడుతున్నది బహుజనుల జీవన విధానాలే. లోటు (Scarcity) అన్న భావనను తమ తాత్విక పరిధిలోకి తీసుకొనని ఈ బహుజన సమాజాల వల్లే ప్రకృతే దాన్ననుసరించిన వ్యవసాయం ఇంకా కొనసాగుతోంది. ఈ విషయాలను ప్రపంచ దృష్టికి తేవడం కూడా ప్రకృతీ వ్యవసాయాన్ని కొనసాగించడంలో భాగంగా గుర్తించాలి.
మన పంటలు - వంటలు, మన చెట్టూ-చేనూ, మన చేనూ-చెల్క, మన గొడ్డూ-గోదా, సమస్త జీవావరణంతో కలిసి పనిచేసే మన తత్వం, భూమిని కొల్లగొట్టకుండా బతికే విలువలూ - వీటన్నిటి గురించి విస్తృతంగా చర్చించుకోవాలి. మాట్లాడాలి. రాయాలి. ఆచరించాలి. అందులో భాగంగానే నా (మన) చిన్నతన అనుభవాల దగ్గర్నుంచినేటి బతుకమ్మ పాటలు చెప్పే పాఠాల వరకు చదువరులతో పంచుకున్న తప్పితే ఈ విషయాలు చదువరులకి తెలియదని కాదు. భూమీ-నీరు-గాలి వంటి పాంచ భౌతిక ప్రాణశక్తులను ఆదరవులుగా గుర్తించి గౌరవించుకోవడం మన 'మట్టి సంస్కృతులు' (Soil cultures) మనకందించిన గొప్ప విలువ. ఈ విషయాలను మన సంవిధాన రచయితలు గుర్తించిండ్రు కాబట్టే భూమీ, నీళ్లూ, గాలి వంటి ప్రకృతి శక్తులపై గుత్తాధిపత్యం ఉండకూడదని నిర్దేశించిండ్రు. ఆదేశిక సూత్రాల్లో మన సంవిధానం ఈ విషయాలను చాలా స్పష్టంగా చెప్పింది. ఐనా యే మాత్రం ఖాతరీ చేయకుండా దేశం యావత్తూ కరోనాతో గజగజలాడుతున్న ఈనాటి సందర్భంలో సైతం మన పాలసీకర్తలు సమతుల ఆహారహక్కు, ఆరోగ్యంగా జీవించే హక్కు వంటి ప్రాథమిక హక్కులను కాలరాయడం చూస్తున్నాం. 'మానిటైజేషన్' పేరజాతి సమిష్టి సంపదలను అమ్ముకోవడాన్నీ, అనుంగులకు అద్దెకిచ్చుకోవడాన్ని చట్టబద్ధం చేసే ప్రణాళికలు సిద్ధమైనై అని నిన్నటికి నిన్న వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు చెబుతున్నై. అందరికీ అన్నం పెట్టే రైతులు ఢిల్లీ వీధుల్లో తుపాకీ నీడన పస్తులతో నినదించడం ఇప్పటి ఆ సందర్భానికి పరాకాష్ఠ.
ఇట్లా అంతులేని లాభాపేక్షతో జలగల వంటి గ్లోబల్ కార్పొరేట్ సంస్థలూ - ఆ సంస్థలకు దాసోహం అయిన ప్రభుత్వాలూ కల్గించే నష్టం కోవిడ్ సృష్టించిన విలయం కంటే పదింతలు ఎక్కువ. కరోనా వైరస్ కేవలం 'మనుషుల' ఆరోగ్యాన్ని పణం కోరుతున్న పెడధోరణులను దృష్టికి తెచ్చింది. కానీ అభివృద్ధి పేరున ప్రకృతి పరిసరాలపై చెలరేగిన కన్పించని యుద్ధంలో కొన్ని వేలకోట్ల పక్షి, జంతు, వృక్ష, కీటక జాతులూ, మన్నూ-మిన్నూ నీళ్లూ ప్రాణాలు విడుస్తున్న వాస్తవాలు తెరమరుగున్నే వుండిపోయినై. యే జీవికైనా మరణం విషాదమే. బతుకు సంరంభమే. ఐతే 60ల నుంచీ కొన్ని లక్షల ఎకరాల వృక్షాలు కూలిపోతున్నప్పుడూ, వేల రకాల కీటక పక్షి జంతుజాలం ప్రాణాలు కోల్పోతున్నప్పుడూ అంతర్జాతీయ సమాజం నోరెత్తలే. "అనారోగ్య శరీరం ఆలోచించే శక్తినీ వివేచననూ కోల్పోతుంది” అని బుద్దుడు చెప్పినట్లు చదువు 'కొన్న' మధ్య, ఉన్నత తరగతుల విద్యావంతులు ఆలోచించే శక్తి, తెగువా కోల్పోయి 'అమ్నీషియా' లో భద్ర జీవితం గడుపుతున్నరు. విచక్షణ లేని ప్రణాళికలతో నగరాలు 'విశ్వ' రూపమెత్తుతుంటే, బాధ్యతలేని నిస్తేజంలో పౌరులు కార్పొరేట్ సంతానంగా మట్టినీ, గాలినీ, నీటినీ చిదిమేస్తున్నరు. ప్లాస్టిక్ సమాధులపై వెలసిన మురికివాడల్లో ఒకవైపు పట్టణ పేదలు మగ్గుతుంటే ఇంకోవైపు నకిలీ విత్తనాలతో విషతుల్యమైనరసాయనాలతో సాయం దొరకని వ్యవసాయం చేతికీ నోటికీ రాక పల్లె రైతులు పురుగుల మందులు తాగి జీవితాలు కడతేర్చుకుంటున్నరు. చివరాఖరికి వలసవాద అభివృద్ధి ధోరణులు స్థానిక సేద్య రీతులను పూర్తిగా కమ్మేసినై. అధిక ఫలసాయం యావకి 'మట్టి' లోని ప్రాణం శక్తికి తూట్లు పడింది. నవధాన్య సంస్కృతి రద్దైంది. మాదకద్రవ్యాల తర్వాత అంత పెద్ద ఆర్థిక నేర వ్యవస్థ' గా బలపడిన environmental crimes వల్ల సమస్త జీవావరణం చిన్నాభిన్నమైంది. జిడిపిలు పెంచుకునే ప్రపంచదేశాల మధ్య పోటీలో ప్రాణాలు విడుస్తున్న జీవజాలం గురించిన లెక్క ఇంకా తేలాల్సే వుంది. వ్యవసాయంలో కార్పొరేటీకరణ, పారిశ్రామికీకరణ ధోరణుల వల్ల చిద్రమౌతున్న 'మట్టి సంస్కృతులెన్నో' మాట్లాడుకోవాల్సే వుంది. మొత్తానికి ఇప్పుడు వ్యవసాయ రంగంలోకి చొచ్చుకు వచ్చిన జీవ వైవిధ్యాన్ని రద్దుచేసే లాభాపేక్ష ధోరణుల వల్లా, మట్టిలో జీవించే వేలకోట్ల మైక్రోబ్స్ ని పొట్టన పెట్టుకునే రసాయన ఎరువుల వల్లా, అధిక ఫలసాయం కోసమని సృష్టించే జన్యుమార్పిడి పంటల వల్లా మనుష్య జాతికి వొరిగిందేమీ లేదు. నిజానికి తరిగిందే ఎక్కువని ఈ మధ్య వెలువడిన రిపోర్టులు చెబుతున్నై. ఉదాహరణకి ఇండస్ట్రియల్ అగ్రికల్చర్ ప్రపంచవ్యాప్తంగా 70-90 % అడవుల నరికివేతకు కారణమైంది. ప్రపంచంలోని 75% జీవ వైవిధ్యాన్ని బలితీసుకుంది. కార్పొరేట్ వ్యవసాయమూ ప్రపంచ ఆహార వ్యాపారసంస్థలూ 40% గ్రీన్ హౌస్ ఉద్గారాలకి కారణమైనై. 'అందరికీ ఆహారం' అంటూ గొప్పగా ప్రచారం చేసుకునేగ్లోబల్ ఆహార వ్యవస్థల వల్ల ప్రపంచ 'ఆకలి సమస్య’ తీరలేదు. పైగా 2020 నాటికి 815 మిలియన్ల జనాభా ఆకలి కేకలకు కారణమైనవని అధ్యయనాలు చెబుతున్నై. ఈనాటి విధ్వంసకర పద్ధతులు గనుక ఇలాగే కొనసాగితే 2050ల నాటికి క్లైమేట్ చేంజ్ వల్ల దాదాపు 500,000 మంది మనుషులు చనిపోయే అవకాశం వుందనీ, ప్రతి మనిషికీ ఆహార లభ్యత 3.2% పండ్లు, కూరగాయల లభ్యత 4% వరకు పడిపోతుందని పరిశోధనలు చెబున్నై. ఉత్పత్తి కంటే వ్యర్థాల భారం ఎక్కువైన కార్పొరేట్ ఆహార వ్యవస్థ "negative productivity" పునరుత్పత్తి చేస్తుందనీ, ఆ మూల్యాన్ని చెల్లించాల్సిన భారం తిరిగి మనవంటి "అభివృద్ధి” చెందుతున్న దేశాలపైనే పడుతుందనే అంచనాలున్నై. ఒకే రకం పంటలను ప్రోత్సహించే గ్లోబల్ ధోరణుల వల్ల ప్రస్తుతం 96% ప్రపంచ జనాభా ఆకలి తీర్చే భారం కేవలం 30 రకాల మొక్కజాతుల పైనే పడుతోంది. 4 రకాల ఆహారపంటలపైనే అత్యధిక ప్రపంచ జనాభా ఆధారపడుతున్నరు. ఈ మధ్య తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయం బతుకమ్మ, తెలంగాణ సోన,కూనారం సన్నాలు పేర్లతో కొత్త వంగడాలను, మార్కెట్లో ప్రవేశపెట్టింది. సంతోషం కానీ ఇప్పుడు 'కనిపెట్టే' కొత్త విత్తనాలలోని పోషకాలతో పోలిస్తే మనం పోగొట్టుకుంటున్న స్థానిక విత్తనాల్లోని పోషక విలువలు ఎన్నోరెట్లు ఎక్కువ. మనదేశంలో కోల్పోయిన వరి, గోధుమ, మక్కల్లోని రకాల వల్ల మన ఆహారంలో 60% కాలరీలు, 56%ప్రొటీన్ల లభ్యత కొరవడుతోంది. మరి మనం కోల్పోయిన మరిన్ని పంటల వల్ల ఎంత పోషకాహారాన్ని నష్టపోయి వుంటం!? ఎవరైనా ఆ దిశగా పరిశోధనలు చేస్తే గానీ లెక్క కట్టలేం. 'World Watch Studies' ప్రకారం ఇప్పుడు మనకు ఆహారంలో 10-25% కంటే తక్కువ ఐరన్, జింక్, ప్రొటీన్, కాల్షియం, విటమిన్-సి-అందుతున్నై. సమతుల ఆహారం కరువై 2025 నాటికి ఊబకాయం, సంతానలేమి వంటి ఆరోగ్య సమస్యలపై బిలియన్ల ట్రిలియన్ల డాలర్లు ఖర్చుచేయాల్సి వుంటుందని ఓ అంచనా.
ఐతే ఈ క్రమానికి సరిగ్గా భిన్నంగా ఎన్ని కరువు కాటకాలెదురైనా ఈనాటికీ 70% ప్రపంచ జనాభాకి ఆహారం అందిచ్చేది మాత్రం చిన్న, మధ్య తరగతి గ్రామీణ రైతులే అన్న విషయం నేటి పరిశోధనలు నిర్ధారించినై. ఎన్నో ఏండ్ల క్రితమే సువాసన ఇచ్చే వొడ్లను పండించగల్గిన మన భారతీయ గ్రామీణ రైతుల వృక్షశాస్త్ర జ్ఞానాన్ని ఈనాటి విశ్వవిద్యాలయ, పరిశోధనా సంస్థల్లోని శాస్త్రజ్ఞులు అందుకోలేక పోయారని డా|| డెబ్ సాక్ష్యాలతో నిరూపించిండ్రు. మన దేశంలో జుగాల్ అన్న పేరున్న రెండిత్తుల వొడ్లు' సతీర్ అని పిలుచుకునే 'మూడిత్తుల వడ్ల' ను తన అన్వేషణలో భాగంగాతెలుసుకున్న ప్రకృతి పరిశోధకునిగా డా|| డెబ్ రైతుల జ్ఞానాలను గుర్తించడం గౌరవించడంలో ఇప్పటి శాస్త్రజ్ఞులు వెనకబడ్డారని వ్యాఖ్యానించిండు. ఇక నిన్నటికి నిన్న periodic labour force survery (2019-20) చెప్పిన ప్రకారం భారతదేశంలో లేబర్ మార్కెట్లో సంక్షోభం కరోనా కంటే ముందునుంచే నెలకొని వుంది. కరోనా 'లాక్ డౌన్' సమయంలో ఉన్న కాస్త ఆధారాలు కూడ కరువై 'దెబ్బ తగిలిన బిడ్డ తల్లి వొడికై వెతుక్కున్నట్లు వలస కార్మికులందరూ తమ సొంతూళ్లకు మళ్లడం చూసినం. వందల మైళ్లు కాలినడకన ఊళ్లకు మళ్లిన వలస కూలీల రక్తం వోడిన పాదముద్రలకు మనం ప్రత్యక్ష సాక్షులం. అట్లా 'అమ్మా' అంటూ వెనక్కొచ్చిన జనాన్నందరినీ అక్కున చేర్చుకొని, జీవనోపాదులను అందించింది ఒక్క వ్యవసాయ రంగమే. కల్లోల కోవిడ్భారత సందర్భంలో వ్యవసాయమే "employer of last resort" అని PLF surveryఅభివర్ణించింది. అంతేకాదు, ఆనాటి నుంచీ ఈనాటి వరకూ మనదేశంలో ఎక్కువ మంది స్త్రీలకు జీవనోపాధి అవకాశాలను అందిచ్చేది కేవలం వ్యవసాయరంగమే."The penetration of capitalism has often withnessed the removal of women from their means of production and from their productive functions. It has further brought about a change in the sexual division of labor to their disadvantage" అంటూ bulletin of concerned Asian scholors-1980 ల్లోనే హెచ్చరించడం చూడొచ్చు. పెట్టుబడిదారీ సమాజం స్త్రీలను మరింత అస్వతంత్రత లోకి తోస్తే వ్యవసాయ రంగం మాత్రం స్త్రీలకు తమ కాళ్లపై తాము నిలబడగలిగే సైర్యాన్నిస్తోంది.
ఈ నేపథ్యంలో మనం చిక్కుకున్న విషవలయం లోంచి బైటపడాలంటే ప్రకృతి వ్యవసాయమే ఆచరణ యోగ్యమైన పరిష్కారం. ప్రకృతి వ్యవసాయమంటే స్థానిక జీవావరణం పట్ల పూర్తి అవగాహనతో భూమిని కొల్లగొట్టకుండా బతకడం. మనతో పాటు నలుగురిని బతికించడం. సమస్త జీవావరణాన్ని ధ్వంసం చేసే వలససాద ధోరణులను తిరస్కరించడం. విషతుల్య రసాయనాలను గుప్పించే అశాస్త్రీయ వ్యవసాయ ధోరణులను నిలువరించడం. కార్పొరేట్ చెరలో వున్న భూవమ్మ ను విడిపించుకోవడం. మట్టికోతనూ, నీటి ఎద్దడినీ, మందుల వాడకాన్ని అడ్డుకోవడం. సమస్త జీవావరణం పట్ల విముఖతా ధోరణులను 'ఇంజెక్ట్' చేస్తున్న పితృస్వామ్య వలసవాద ధోరణులను తిప్పికొట్టడం. కేవలం 3 కంపెనీలు 60% ప్రపంచ విత్తనాలపై చేస్తున్న పెత్తనాన్ని ధిక్కరించడం. ఉద్గారాలతో కుములుతున్న భూమమ్మ తాపాన్ని తగ్గించడం. భూమికి అండగా నిలబడ్డం. మన ఆహారమే మన ఆరోగ్యమని తెలుసుకోవడం. అన్నిటికీ మించి మన ఆహార సార్వభౌమత్వాన్ని తిరిగి సాధించుకోవడం. సర్కారు తుమ్మల్లాగా ప్రబలిన వలసవాద ప్రపంచీకరణ ధోరణులను ఎదురించాలంటే మనందరం నాటు విత్తనాలను పెంచుకొని పెంచాల్సిందే. నాగళ్లు పట్టి దున్నాల్సిందే. శారీరక శ్రమ మేధో శ్రమకు యే మాత్రం తక్కువ కాదనే అవగాహనకు వచ్చిన తరం మనది. బతుకు అమ్మను పదిలంగా ముందు తరాలకు అందించాలనే బాధ్యత తెలిసిన ఉ ద్యమకారుల తెలంగాణా మనది. పేటెంట్ల విష వలయాన్ని బద్దలు కొట్టి నవధాన్యాలను నాగేటి సాళ్లకు సాక పోయాల్సిన తరుణమిది. ప్రకృతికి దూరమైన పురుషుల విముఖతాధోరణులను ధిక్కరించే అమ్మ లకాలమిది. అక్కల ఆచరణ ఇది. బతుకమ్మ సందర్భమిది. 'యే ఇంటి వంట - ఆ ఇంటి పంటతో' అనే నినాదంతో మన వ్యవసాయ క్షేత్రాలను కాపాడుకుందాం. నాటు విత్తనాలు-నేటి అవసరం - రేపటి ఆరోగ్యం అని ఎలుగెత్తి చాటుదాం. స్థానిక వాతావరణ పరిస్థితులూ, బహుళ పంటల మన జ్ఞానాలను పరిగణలోకి తీసుకునే; biopiracyని రద్దుచేసే తెలంగాణ విత్తనచట్టం సాధించుకుందాం. దేశీ /నాటు విత్తన కేంద్రాలను ఊరూరా అందుబాటులో వుంచే వ్యవస్థలకై డిమాండు చేద్దాం .
పోయిన నెల శ్రీలంక ప్రభుత్వం రసాయన ఎరువుల దిగుమతులూ -వాడకంపై నిషేధం విధించినట్లు మన ప్రభుత్వాలు సైతం కదిలేలా ఉద్యమిద్దాం. ప్రకృతి సేద్య రాష్ట్రంగా తెలంగాణాను తీర్చిదిద్దుకుందాం.
ముగించే ముందు మరొక్క మాట-పాట. వినగల్గాలే గానీ భూమి మనతో పంచుకునే ఊసులెన్నో. చెప్పే సుద్దులెన్నో. హెచ్చరించే సూచనలెన్నో. 'గ్లోబల్ వార్మింగ్' సంకేతాలతో ప్రస్తుతం భూమి మన 'భవిష్యత్ వాణి' గా హెచ్చరిస్తున్న సంగతి మనకి తెలిసిందే.
"ప్రేమ కొండకు బోయి ఉయ్యాలో-రేప సూలలు దెచ్చి ఉయ్యాలో
బుట్టొక్కటల్లరే ఉయ్యాలో-భూమి ఎరుకతకు ఉయ్యాలో
బుట్టలో తంగెళ్ళు ఉయ్యాలో - బతుకమ్మ తల్లికీ ఉయ్యాలో’’
అంటూ మన అమ్మలు పాడుకునే పాట సరిగ్గా ఇదే విషయాన్ని చెబుతుంది. భూమిని ప్రాణమున్న అమ్మగా మన భవిష్యత్తుకు సంబంధించిన సంకేతాలు అందించే ఎరుకత' గా (భవిష్యవాణి) రూపుగట్టిస్తుంది. మట్టి సంస్కృతుల్లోని ఇలాంటి భావనలు బహుజనులకు అందించిన గొప్ప వారసత్వం మట్టితో చెలిమి-ప్రకృతి మాలిమి. ఈనేపథ్యంలో ప్రకృతి వ్యవసాయం చేయడమంటే వెనకకు మళ్లమనో ముందుకు తోసుకుపోమనో చెప్పే ఛాందస వాదం కాదని అర్థం చేసుకోవాల్సి వుంటుంది. అట్లే ఇది కేవలం 'పరిరక్షణ' వాదమూ కాదు. ఇది ప్రకృతి పెంచి పోషిస్తున్న వేల జీవాల్లో మనం ఒకరం అన్న ఎరుక. సహజీవన విలువలను ఆచరించడం. శ్రమ జీవన సౌందర్యాన్ని ఆవాహన చేసుకోవడం.కార్తెను బట్టి భూమితో సంభాషించగల్గిన ప్రకృతి శాస్త్ర జ్ఞానం. చలనశీల దృక్పథాలను అనుభవం ద్వారా అందుకోవడం. అందుకే ప్రకృతి వ్యవసాయం అంటే సార్థక జీవన తాత్వికత-భౌతిక వాస్తవికత - బౌద్ధ జీవితం. 'గడ్డిపరక' తో విప్లవానికి దారులు వేయడం. ఇది ఇప్పటి అవసరం.
ఇటువంటి చారిత్రక మలుపులో భూవమ్మను బంతిపూల తెప్పమీద పొదివి పట్టుకొని అచ్చం 'భూమి ఎరుకత' వోలె బుట్టపట్టుకొని బయలుదేరిన విమలక్క బృందాన్ని మనస్ఫూర్తిగా అభినందిద్దాం. మనవంతుగా 2 నాటు విత్తనాలను ఇచ్చిపుచ్చుకుందాం. రండి - బహుజన బతుకమ్మతో కలిసి అడుగులేద్దాం.
(‘‘ప్రకృతి వ్యవసాయం – రక్షిత ఫలసాయం’’ అన్న నినాదంతో ‘బహుజన బతుకమ్మ’ బైల్దేరిన సందర్భంగా – అభినందనలతో)
ముక్త-తెలంగాణా మహిళల అధ్యయన వేదిక

స్త్రీవాద రాజకీయాలు: దళిత స్త్రీవాదం
నందిగామ. నిర్మలకుమారి
వందల ఏళ్ళుగా ఈ సమాజం మీద పురుషుడు ఆధిపత్యాన్ని చెలాయించాడు. పురుషాదిఖ్యత వ్యవస్థీకృత మై తన ఆదిపత్యాన్ని చెలాయించడం మొదలు పెట్టింది. ఆదిమ సమాజాల నుండి మనిషి ఆధునికుడిగా మారేదాకా “న స్త్రీ పూజ కనర్హం” అనే పేరుతో స్త్రీని విద్యకు బహిరంగ నాగరిక జీవనానికి దూరంగా ఉంచారు. ఇది కేవలం ఒక్క భారతదేశం లో మాత్రమె లేదు ఆసియా, ఐరోపా, అమెరికా, మొదలు ప్రపంచం అంతటా వ్యాపించి ఉంది. దానిని అదిగమించడానికి కొన్ని వందల ఏళ్ళుగా అనేక పోరాటాలు జరిగాయి జరుగుతూనే ఉన్నాయి. మనిషి ఆలోచన, ఆహార్యం, ఆహారం, పని, కట్టు, బట్ట, నైతికత, నియమ నిబందనల మీద నియంత్రణ, లింగ బేధం తర తరాలుగా వ్యాప్తి చెందుతూ పలు పాయలుగా విస్తరిల్లింది.మొదట స్త్రీల పట్ల ఈ అణిచివేత బలప్రయోగం ద్వారా పెత్తనం చెలాయించింది మతం . స్త్రీ అణిచివేతకు మూలాలు అనేక మతాలలో ఉన్నాయి. హిందూ మతం లో స్త్రీలు వేద అధ్యయనానికి దూరంగా గుడిలో ప్రవేశం కూడా లేకుండా చేసింది.ఇలా స్త్రీని అనిచివేసే ధోరణి అన్ని ధార్మిక పాయల్లోనూ ఉంది. పదిహేడో శతాబ్దం చివరిదాకా స్త్రీలను విద్యకు ముఖ్యంగా క్రైస్తవం మహిళల మీద అనేక ఆంక్షలు పెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా స్త్రీల సమాన హక్కుల కోసం సమాన గౌరవం కోసం గుడిలో బడిలో ప్రవేశాల కోసం అచంచల విశ్వాసంతో పనిచేసిన స్త్రీవాదులు ఎంతో మంది ఐరోపా అమెరికా దేశాలలో త్యాగాలు చేసారు. పదహారు పదిహేడో శతాబ్దాల చివరినాటికే స్త్రీల కోసం ప్రత్యేక విద్యాలయాల నిర్మాణం జరిగింది. పద్దెనిమి పందొమ్మిదో శతాబ్ద చివరినాటికి భారతదేశంలో సతీ సహగమనం, కన్యాశుల్కం కు వ్యతిరేకంగా వితంతు పునర్ వివాహ వ్యవస్థకోసం అనేక సంస్కరణలు మొదలయ్యాయి. మొదట స్త్రీని మనిషిగా గుర్తించడానికి, పనిలో సమాన వేతనం కోసం, రాజకీయ స్వావలంబన కోసం కుటుంబ ఆస్తిలో హక్కుకోసం అంతిమంగా రాజకీయ ప్రాతినిధ్య పోరాటం. ఇది కేవలం ఒక్క రోజులో జరిగిన పోరాటం కాదు. దాని వెనక అమెరికా, ఆసియా ఐరోపా దేశాలలో జరిగిన మేధో చర్చలు వలస దేశాలలోకి వ్యాప్తి చెందాయి.
వీటి అన్నిటికన్నా ముఖ్యంగా ఆడ-మగ అనే రెండు జీవుల మధ్య శారీరక మానసిక అంశాల ను శాస్త్రీయంగా పరిశోధన చేయడం మొదలు అయ్యింది.ఇలా లింగ బేధం అనేది పుట్టుకతో ఆపాదించబడినా, తన వైయుక్తిక అలవాట్లు అభిరుచులకు అనుగుణంగా తన లింగ మార్పిడి చేసుకునే క్రమం కేవలం శారీరక సర్దుబాటు మాత్రమె కాకుండా సాంస్కృతికంగా ఉత్తమ లేదా అధమ అనే పేరుతో జరుగుతున్న లింగ వివక్షను మేధోపరంగా ఎదుర్కొనే క్రమానికి ఈ చర్చలు దొహదపడ్డాయి. పందొమ్మిది వందల అరవై వ దశకంలో అమెరికా కేంద్రంగా అనేక ప్రత్యామ్నాయ ఆలోచనలు బయలుదేరాయి.
1982 లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం చాలా దేశాలలో స్త్రీవాదులను మేల్కొలిపింది. తర తరాలుగా పితృస్వామిక భావదాస్యం, పీడనను,స్వేచ్చా రాహిత్యాన్ని ఎండగట్టారు సంఘటితం అయ్యారు. సామాజిక సాంస్కృతిక వెనకబాటు తనాన్ని ప్రశ్నించారు.
“60వ దశాబ్దంలో పౌరహక్కుల,నల్లజాతివారి హక్కుల,యుద్ద వ్యతిరేక ఉద్యమాలలో చురుగ్గా పనిచేసిన పాశ్చాత్య దేశాల మహిళలు తాము పనిచేస్తున్న సంఘాల్లోనే, తమ కామ్రేడ్లే, తమ పట్ల వివక్ష చూపుతున్నారని బాధపడ్డారు. ఈ స్త్రీలలో చాలామంది వామపక్షాలకు చెందినవారు. వాళ్ళ పార్టీలలో పురుషాదిపత్యాన్ని గురించీ,సెక్షిజమ్ గురించి ప్రశ్నించడం, పోట్లాడడం మొదలు పెట్టారు.” (ఓల్గా. నీలి మేఘాలు. 26: 2007).
ఈ వివక్ష అణిచివేత వెనక తరతరాలుగా వ్యవస్థీకృత అయిన పురుషాదిపత్య అహంకారం ఉంది అని నాడు కొందరు స్త్రీవాదులు గ్రహించారు. స్త్రీల సమాన హక్కుల కోసం జరిగిన పోరాటం కావొచ్చు, అవాంచిత గర్భ విచ్చిత్తి హక్కు కావొచ్చు, పనిలో సమాన గౌరవం కోసం తాము పనిచేస్తున్న కార్యాలయాలలో ఇంట బయటా ఆ అణచివేతను ప్రశ్నించడం మొదలు పెట్టారు. అమెరికా ఫ్రాన్స్, బ్రిటన్ లాంటి దేశాలలో సామాజికంగా రాజకీయంగా తమ కలాలను గళాలను బలంగా వినిపించడం మొదలుపెట్టారు. దాని మొదలు స్త్రీవాద రాజకీయాలు ఒక బలమైన తాత్విక పాయగా బయలుదేరాయి . ఆనాడు పలు దేశాల్లో స్త్రీల పట్ల ఉన్న అప్రకటిత వివక్షకు వ్యతిరేకంగా చట్టాలు మొదలు పెట్టాయి . దేశ శాస్త్ర సాంకేతిక రంగాలలో రక్షణ రంగం లో సైతం మహిళలకు ప్రత్యేక విభాగాలు ఉండాల్సిన ఆవశ్యకతను పౌర సమాజం గుర్తించింది. మొత్తంగా స్త్రీవాద రాజకీయాలు ఎక్కడ మొదలు అయినా వాటి ప్రాసంగికత మాత్రం తగ్గలేదు. పురుష ఆధిక్యతను ప్రశ్నించడానికి ఎక్కడినుండో వాదాలను అరువు తెచ్చుకోవాల్సిన అవసరం లేకున్నా తెలుగు నేల మీద స్త్రీవాద రాజకీయాలు ఆలస్యంగా నే మొదలు అయ్యాయి అని చేప్పుకోవచ్చు.
తెలుగు సమాజాన స్త్రీ సాహిత్యం లో పురుషులతో సమానంగా కావ్య రచనలో ఉన్నప్పటికీ ఆధునిక స్త్రీవాద దృక్కోణం నుంచి స్త్రీల సమస్యలను కవిత్వంలో భాగం అవడం పందొమ్మిది వందల డెబ్బైల తర్వాతనే మొదలు అయ్యింది అనుకోవచ్చు. వీటికి తోడుగా వామపక్ష, విప్లవ శిభిరాలలో సైతం స్త్రీల హక్కుల మీద చర్చలు మొదలు అయినవి. స్త్రీ శక్తి సంఘటన, ప్రగతిశీల మహిళా సంఘం, చైతన్య మహిళా సంఘం, మొదలు అనేక రాజకీయ పార్టీల లోనూ మహిళా విభాగాలు ఏర్పాటు జరిగినవి. అనేక కులసంఘాలు వాటికి అనుబంధంగా మహిళా కమిటీలు వేయడం కూడా తీవ్రతరం అయ్యింది. ఏది ఏమయినా అన్ని రంగాలలో స్త్రీల హక్కుల కోసం ఒక సానుకూల వాతావరణం మొదలైనది. పాక్షికంగా అయినా స్త్రీవాద రాజకీయాలకు అదొక సానుకూల ఘట్టం. కానీ ఆయా నిర్మాణాలలో ఆచరణలో సాధిం చాల్సింది మిగిలే ఉంది.
తెలుగు సాహిత్యం లో ప్రబంధ కవిత్వం మొదలు నవ్య, అభ్యుదయ కవిత్వం అనేక వందల సంకలనాలుగా ప్రచురించిన బడినప్పటికీ ఆయా సంకలనాలలో స్త్రీల కవిత్వానికి చోటే లేదు.1910-35 మధ్యల వచ్చిన కవిత్వాన్ని సామినేని ముద్దు కృష్ణ “వైతాళికులు” పేరుతో ప్రచురించాడు అందులో చాలా మంది కవుల పేర్లు చేరనివి చేరాల్సినవి ఎన్నో ఉన్నా అందులో ముగ్గురు స్త్రీలకు మాత్రమె ప్రాతినిత్యం దొరికింది. ఆ తర్వాత ‘మహోదయము’ అనే సంకలనం వచ్చినా పరిస్థితి మారలేదు. ఆ క్రమం లో స్త్రీల కు జరుగుతున్న అన్యాయం అప్రకటిత వివక్ష ముఖ్యంగా కవితాలోకం సహించలేక పోయింది. 1990 డిసెంబర్ లో కవిత్వం ప్రచురణలుగా త్రిపురనేని శ్రీనివాస్ “గురిచూసి పాడే పాట” గా ప్రచురించే నాటికి రాజకీయంగా, సామాజికంగా, సాంస్కృతికంగా స్త్రీవాద స్పృహ తో కొంతమంది మహిళా కవయిత్రులు ఆ సంకలనం లో తమ కవిత్వాన్ని నమోదు చేసారు. కొండేపూడి నిర్మల “హృదయానికి బహువచనం” అనే కవితతో మొదలైన ఆ కవితా సంకలనం లో విమల,ఓల్గా, వసంత కన్నభిరాన్, ఘంటశాల నిర్మల, జయప్రభ, సావిత్రి, శిలాలోలిత తదితురుల కవిత్వాన్ని మొదటిసారి ఆ సంకలం లో ప్రచురించారు. ఆ క్రమం లోనే అస్మిత రీసోర్స్ సెంటర్ ఫర్ విమెన్ 1972-92 మధ్యలో వచ్చిన స్త్రీవాద సాహిత్యాన్ని “నీలిమేఘాలు” పేరుతో చారిత్రకమైన కవితా సంకలనం తెచ్చారు. తెలుగు సాహిత్యం లో అందునా స్త్రీవాద రాజకీయాల లో అది ఒక మైలురాయి.
తెలుగు సాహిత్యం లో ఇదొక సంచలనం. నీలి మేఘాల ఆగమనం మొదలు స్త్రీవాద సాహిత్యం చిరుజల్లు గా మొదలై జడివాన గా మారింది. కవిత్వం లో స్త్రీవాద పాయ ఒక బలమైన వ్యక్తీకరణ గా మారింది. అన్వేషి, అష్మిత, స్త్రీ శక్తి సంఘటన లాంటి సమూహాల స్త్రీవాద సాహిత్యానికి అనువైన పరిశోధనాత్మక వ్యాస సంకలనాలు, చర్చలు సెమినార్ల నిర్వహణ, అనువాదాలు మొదలు పెట్టాయి. విశ్వవిద్యాలయాలలో స్త్రీవాద సాహిత్యం పరోశోధనా అంశంగా మారింది. దేశవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాల లో సామాజిక శాస్త్రాల సంస్థల్లో ‘సెంటర్ ఫర్ విమెన్ స్టడీస్ డిపార్టుమెంటు’ లాంటి స్త్రీ వాద అనుకూల శాఖ ల ఏర్పాట్లు మూలంగా స్త్రీవాద రాజకీయాల చర్చలు ఊపందుకున్నాయి.
అనుభవాల పునాదిగా స్త్రీవాద జ్ఞాపకాల చరిత్రలు ముందుకు వచ్చాయి. మొదటి తరం స్త్రీవాద నాయకత్వం “మనకు తెలియని మన చరిత్ర” పేరుతో ఒక పుస్తకాన్ని తీసుకొని వచ్చారు. జాతీయ ఉద్యమం లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలం లో పాల్గొని చరిత్ర పుస్తకాల లో నమోదు కాని కొందరి జీవితాలకు చరిత్ర రచనలో స్థానం కల్పించే ప్రయత్నం చేసారు. స్త్రీవాద రాజకీయాలను మరింత ముందుకు తీసుకొని వెళ్ళడానికి ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషలలో సైద్దాంతిక గ్రంధాలను అనువాదం చేసి ప్రచురించారు. ఇంత విస్తృతంగా బలమైన పాయగా విస్తరిల్లిన స్త్రీవాద సాహిత్యం ఒక రకంగా సాహిత్య వీధుల్లో ప్రకంపనలే సృష్టించింది. అది ప్రజా ఉద్యమాలను నిర్వీర్యం చేయడానికి అంతర్జాతీయ కుట్రగా అభివర్ణించిన కొందరి వాదనలను తిప్పికొట్టారు. స్త్రీవాదం అది నీలి కవిత్వం అనీ, వార కవిత్వం అనీ, రక్తస్రావ కవిత్వం అనీ, వొళ్ళు బలిసిన కవిత్వం అనీ, స్త్రీల కవిత్వాన్ని వారి శరీర ధర్మాలనూ మళ్ళీ హేళన చేసారు. అంతే కాకుండా స్త్రీవాద కవిత్వం లో “శరీర స్పృహ తప్ప సామాజిక ధర్మం లేదని” ఈసడించిన పురుష మేధావులూ ఉన్నారు. వాస్తవానికి అది ఏటికి ఎదురీదడం లాంటిది.
ఒకవైపు స్త్రీవాద చర్చలు బలంగా ముందుకు వచ్చిన సందర్భం లోనే భిన్న వ్యక్తిత్వాలు భిన్న అస్తిత్వాలు తమ అనుభవాలు జ్ఞాపకాలు మిగతావారి కంటే ఎందుకు భిన్నమైనవో వాదించడం మొదలు పెట్టారు. కొంత మంది మహిళా కవయిత్రులు ఏర్పాటు చేసుకున్న ‘ప్రజాస్వామిక రచయిత్రుల వేదికలో’ భాగం కాని కొందరు దళిత బహుజన స్త్రీవాద రచయిత్రులు తమ అనుభవాలు హైజాక్ చేయబడుతున్నాయి అనీ, తమ సమస్య లను తామే పరిష్కరించు కుంటాము అని “మట్టి పూలు” అనే సాహిత్య వేదిక ఏర్పాటు చేసుకున్నారు ఈ ఆవిర్భావం చారిత్రాత్మకం. ఈ చర్చ కేవలం ఒక ప్రత్యామ్నాయ ఆలోచన మాత్రమె చేయదు అనీ దళిత బహుజన మహిళల కష్టసుఖాలు ఆధిపత్య స్త్రీల కు ఏనాటికీ అర్ధం కావనీ, వాళ్ళకు కేవలం సానుభూతి సహానుభూతి మాత్రమె సరిపోదు అనీ ఆ జీవితాన్ని అనుభవించిన వాళ్లకు మాత్రమె అర్ధం అవుతుంది అని వాదించారు. అగ్రవర్ణ స్త్రీవాదులు చెబుతున్న స్త్రీవాదం కేవలం వాళ్ల ఆధిపత్య కులాల సమాజాలు కల్పించిన వెసులుబాటు మాత్రమే అనీ దళిత స్త్రీలు ఒక వైపు కుల అణిచివేతను పితృస్వామిక దురహంకారాన్ని అనుభవిస్తున్నారు అని రెండు భిన్న ప్రపంచాలు అనీ, అవి ఎన్నటికీ కలవవు అని భిన్నమైన అభివ్యక్తిని తమ కవిత్వం లో భాగం చేసారు. జూపాక సుభద్ర, గోగుశ్యామల, షాజహానా, జాజుల గౌరీ, దెంచనాల జ్వలిత,వినోదిని,విజయ లక్ష్మి, చంద్రశ్రీ, మేరి మాదిగ, రాగరాజేశ్వరి , తదితరులు ‘మట్టి పూలు’ దళిత స్త్రీవాద సాహిత్య పాయను విజయవంతంగా నడుపుతున్నారు. అస్తిత్వ ప్రాతిపదికన నిలబడ్డ సమూహాలు పీడక పీడిత స్పృహ ఎరిగినప్పుడు మాత్రమే ఆ అస్తిత్వ సమూహానికి ఒక చారిత్రక విలువ సామాజిక ప్రాసంగికత ఉంటాయి. ఆ రకంగా చూసినట్టయితే ఆధిపత్య స్త్రీ అనుభవించే పీడన కింది సమూహాల నుంచి వచ్చిన స్త్రీలు అనుభవిస్తున్న వేదన పీడన ఒకటే అని మనం అనలేము. అవి రెండు భిన్నమైన సమూహాలు భిన్న అస్తిత్వాలు ఆ రెండు సమూహాలు అనుభవించే ఘర్షణ మాత్రం ఒకటే అనలేము. మొత్తంగా స్త్రీవాదం ఒక బలమైన పాయగా మొదలైనా ఒక సమస్య నిర్దిష్టత నుండి అతి నిర్దిష్టత గా ప్రయాణించి నట్లు స్త్రీవాదం దళిత, వెనకబడిన ముస్లిం అస్తిత్వం రూపంలో సారంలో ఒకటి కావనీ, శిల్ప సాదృశ్యం కావనీ, వేటి అస్తిత్వ ఉనికి వాటిదే అని పోరాడి నిలబడ్డారు. ఇది నిజానికి ఒక గుణాత్మకమైన మార్పు ఆహ్వానించ దగిన చర్చ. వర్తమాన సామాజిక సాంస్కృతిక చర్చల్లో, వాదాల లో మరింత జాగురూకతతో మమేకం అవడం మాత్రమే ఆ వాదానికి సార్ధకత ఇచ్చిన వాళ్ళం అవుతాం.
ఉపయుక్త గ్రంధ సూచి
ఓల్గా: నీలి మేఘాలు. స్త్రీవాద కవిత్వం.అస్మిత రిసోర్స్ సెంటర్ ఫర్ విమెన్. సికింద్రాబాద్,2007.
త్రిపురనేని శ్రీనివాస్. గురిచూసి పాడేపాట స్త్రీవాద కవితలు, కవిత్వం ప్రచురణలు, హైదరాబాదు,1990
ముదిగంటి సుజాతా రెడ్డి, తెలంగాణ తొలితరం కథలు రోహణం పబ్లికేషన్స్. హైదరాబాదు,2002
ఏ.కె.ప్రభాకర్. బహుళ : సాహిత్య విమర్శ, సిద్దాంతాలు. ప్రమేయాలు.పరికరాలు: పర్స్పెక్టివ్స్ ప్రచురణలు, హైదరాబాదు. 2018
ఎస్.వి సత్యనారాయణ. స్త్రీవాద వివాదాలు, విశాలాంధ్ర ప్రచురణలు, హైదరాబాదు,1997.
Asst.Prof.of Telugu
ప్రభుత్వ డిగ్రీ & పీజి కళాశాల, సిద్దిపేట
తెలంగాణ
చరవాణి : +91-9490369252

వందేళ్ల నిరీక్షణ తప్పదా?
నస్రీన్ ఖాన్
ఆకులూ అలములు చుట్టుకునే దశలోనే నిర్ణయాత్మక పాత్ర పోషించింది మహిళ. అటువంటి మహిళ ఇప్పుడు సాధికారత దిశగా అడుగులు వేస్తోంది. అయినా సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా మరో వందేళ్లు గడిచినా సమానత్వం అనేది ఎక్కలేని కొండేనని ఇటీవల వెలువడిన నివేదికలు చెబుతున్నాయి. పురుషులతో సమాన హక్కులను రాజ్యాంగం కల్పించినప్పటికీ ఆచరణ శూన్యం. ఇక ఉద్యోగ రంగాల్లో సమానత్వం సాధించడం అంటే ఇసుక నుంచి తైలం తీయడంలాంటిదన్నమాట. ఇవే కాదు అసమానతా ప్రపంచంలో కొట్టుమిట్టాడే మహిళ తన స్థానాన్ని మార్చుకోవాలని ఎంత ప్రయత్నించినా అడ్డంకులు ఎన్నెన్నో ఉన్నాయని `వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్` స్పష్టం చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళల స్థితిగతులపై `వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్`వాస్తవ స్థితిని తెలుసుకునేందుకు గత సంవత్సరం ఒక అధ్యయనం చేపట్టింది. స్త్రీ పురుష సమానత్వం నిరాశాజనకంగా ఉన్నట్లు నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో రెండు శతాబ్దాలు గడిచినా మహిళ కోరుకునే సమానత్వం దక్కుతుందనేది కల్ల అని అనుమానం వ్యక్తం చేసింది. ఈ అసమానత ఇలాగే పెరుగుతూపోతే మహిళల ఉనికి ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం పొంచి ఉంది.
ఎందుకిలా?
మొక్కై వంగనిది మానై వంగునా? సామెత ఎంత పాతదో ఆడపిల్లల పట్ల వివక్షా అంతటి పాతది. ఆధునికత వైపు పరుగులు తీస్తున్న మన సమాజం అత్యంత అధునాతన సాంకేతికతను వినియోగించడంలో ముందుంటుంది. భూతద్దం అక్కరలేని బంగరు భవితను సృష్టిస్తున్నామని నిపుణులు, పాలకులు కలలుగంటున్నారు. ఒక్కసారి బాలలకు అందించే విద్యావిధానాన్ని గమనిస్తే ఆ భ్రమలు పటాపంచలు అవుతాయి. బాలలకు బోధనాంశాలను ఎంపికచేసే మేధావులు చేసిన తప్పిదాలు బాల్యం నుంచే ఆడపిల్లలపట్ల వివక్షను ప్రోత్సహించేలా ఉండడమే ఇందుకు కారణం.
తెల్లటి పేపరు వంటి బాలల మనోఃఫలకంపై ఏది లిఖిస్తే వారు పౌరులుగా ఎదిగాక అదే ప్రతిఫలిస్తుంది. ఇటువంటి స్థితిలో పిల్లలకు నేర్పించే పాఠాల రూపకల్పనకు పంచేంద్రియాలు నిమగ్నం చేయగలిగే మేధావులనే ఎంపిక చేస్తారు. అయినప్పటికీ విద్యాబోధనకు ఉపయుక్తమయ్యే పాఠ్యపుస్తకాలలో ప్రాథమిక స్థాయి నుంచే లింగవివక్ష ప్రారంభమవుతోంది. ఈ వివక్ష ఒక్క భారత్ లోనే ఉందనుకుంటే పొరపాటు. ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి బోధనే కొనసాగుతుండడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసినా ఇదే వాస్తవం. ప్రాథమిక విద్యను బోధించే ఒక పాఠ్యపుస్తకాన్ని పరిశీలిస్తే... ఇది ఎటువంటి ఆందోళనో అర్థమవుతుంది.
ఉదాః *అమ్మ - పిల్లల సంరక్షణ చూసుకుంటూ అన్నం వండుతుంది.
*నాన్న- ఆఫీసుల్లో పని చేస్తారు.
*పురుషుడు - పోస్ట్ మాన్ నుంచి వైద్యుడి వరకు విభిన్న వృత్తులకు సూచికగా.
*స్త్రీ - వంట చేయడం నుంచి బట్టలు ఉతకడం, పిల్లలు, వృద్ధుల సంరక్షణ, ఇంటిని చూసుకోవడం, ఇంటి పనుల్లో నిమగ్నమై ఉంటుందనేలా చిత్రీకరణ.
ప్రాథమిక విద్యను అందిస్తున్న పాఠ్యపుస్తకాల్లో ఇటువంటి ఉదాహరణలు ప్రపంచవ్యాప్తంగా ఉండడం విచారకరం. పాఠాల్లోని వాక్యాలు, పేర్లు పెట్టిన పాత్రలు, శీర్షికలు, సూచనల్లో ప్రస్తావనలలోనూ ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే విషయంపై యునెస్కో గత ఏడాది ఒక హెచ్చరిక జారీ చేసింది. పాఠ్యపుస్తకాల్లోని లింగ వివక్ష ధోరణులు ఎంత లోతుగా ఉన్నాయంటే... అవి బాలికల విద్యను నిర్లక్ష్యం చేయడంతోపాటు వారి వృత్తిపరమైన, జీవనపరమైన ఆకాంక్షలను చాలా వరకు కబళించి వేస్తున్నాయని, లింగ సమానత్వాన్ని సాధించడానికి అవి పరోక్షమైన అడ్డంకిగా ఉన్నాయని స్పష్టం చేసింది. అంతేకాదు పాఠ్యపుస్తకాలు, పాఠ్యాంశాల రూపకల్పనలో మహిళల ప్రాతినిథ్యం తక్కువగా ఉండడం కూడా ఒక కారణమని యునెస్కో 2016 గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్(జీఈఎం) నివేదికకు డైరెక్టర్ గా పని చేసిన బెనావట్ అభిప్రాయం.
భాష కూడాః
సామాజికాభివృద్ధికి వాడుక భాష ముఖ్యమైనది. అటువంటి భాషను రోజువారీ కార్యకలాపాలలో వినియోగించడంలోనే ఎన్నో అపశృతులు దొర్లుతుంటాయి. ఎలా అంటే... మానవాళి మొత్తానికి ప్రతినిధిగా పురుషుడిని మాత్రమే గుర్తించడం, పురుషులకు ఏవైతే పదాలు వాడతామో అవి ప్రత్యక్ష,పరోక్ష సందర్భాలలో వినియోగం అవుతుండడం. అంతేకాదు రోజువారీ జీవితంలో మహిళల పాత్రలు పురుషుల పాత్రలతో కలగలిసి అలా అనామకంగా అదృశ్యమవుతుండడం వంటి అనేక అంశాలు పరిగణలోకి తీసుకుని ఈ అధ్యయనాన్ని విశదీకరించారు. మహిళల పరిస్థితి విశ్వ వ్యాప్తంగా ఇలాగే ఉండడం విచారానికి గురి చేసే అంశమే.
విద్యా రంగంలోనూ వెనుకబాటే!
ఇన్నాళ్లూ సంప్రదాయ సామాజిక శాస్త్రాలైన భాష, సాహిత్యం, లలిత కళలు, సామాజిక శాస్త్రం, చరిత్ర వంటి పరిమిత అంశాలనే ఎంచుకునే ఆడపిల్లలు ఇప్పుడు శాస్త్ర సాంకేతిక, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సుల్లో చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాగే ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఐఐటీ, ఎయిమ్స్‌లలో చదివే మహిళల శాతం ఏటా పెరుగుతూ వస్తోంది. ఈ పరిణామాలు మహిళల సాధికారతకు నిదర్శనంగా నిలుస్తున్నప్పటికీ
పురుషులతో పోల్చిచూస్తే విద్య, సామాజిక, ఆర్థిక రంగాల్లో స్త్రీల పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఆశించిన స్థాయిలో లేదనేది కఠోర సత్యం. ఇందుకు దిల్లీలోని ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ 2016లో రూపొందించిన విజన్ డాక్యుమెంటే నిదర్శనం. ఈ డాక్యుమెంట్ ప్రకారం భారత్‌లో ఉన్నత విద్యారంగంలో మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉంది. ఆర్ట్స్, సామాజిక శాస్త్రాల కోర్సుల్లో 40శాతం చేరితే; ఇంజినీరింగ్, టెక్నాలజీలో కేవలం 16.34శాతం ఉన్నారు. సైన్స్‌లో 12.6శాతం, ఐటీ-కంప్యూటర్స్‌లో 4.11శాతం, మెడిసిన్‌లో 2.87శాతం చొప్పున ఉన్నారు.
వివక్షను రూపుమాపే అంశంపై చిత్తశుద్ధిగా కృషి చేయాల్సని అవసరం ఎంతైనా ఉంది. లింగ వివక్షను ప్రోత్సహించే విద్య, భాష, ప్రవర్తనల పట్ల ప్రజలకు స్పష్టమైన నిర్దేశకాలు జారీ చేయడంతోపాటు వివక్షను ఎదుర్కొనే సామర్థ్యం పట్ల ఆడవారికి అవగాహన కలిగించే అవసరాన్ని ప్రభుత్వాలు తక్షణమే గుర్తించి ఆ దిశగా చర్యలు చేపట్టాలి.
సమానత్వంలో భారత్ ఎక్కడుంది?
- స్త్రీ-పురుష సమానత్వం విషయంలో భారతదేశం 21 పాయింట్లు దిగజారి 108 స్థానానికి పడి పోయింది.
- పొరుగు దేశాలైన చైనా, బంగ్లాదేశ్ కూడా భారత్ కంటే మెరుగ్గా ఉన్నాయి.
- మహిళలకు తక్కువ వేతనాలు, ఆర్థిక వ్యవహారాల్లో వారి భాగస్వామ్యం లేకపోవడం దీనికి ప్రధాన కారణంగా డబ్యూఈఎఫ్ అంచనా వేసింది.
- 170 అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదిక తయారు చేశారు.
- మహిళలకు గోవా సురక్షిత ప్రాంతమని, బీహార్‌లో స్త్రీలకు రక్షణ తక్కువగా ఉందని ఈ నివేదిక పేర్కొంది.
- మహిళా ఆరోగ్యం విషయంలో కేరళ టాప్ ప్లేస్‌లో ఉంది. ఆ తర్వాత తమిళనాడు, సిక్కిం, కర్ణాటక, ఏపీ, గోవా, మహారాష్ట్ర ఉన్నాయి.
- ఈ విషయంలో బిహార్ అట్టడుగు స్థానంలో ఉంది.
- విద్య, వైద్యం, ఆర్ధిక రంగాల్లో మొత్తంగా చూస్తే తెలంగాణ 11వ స్థానంలో, ఏపీ 12వ స్థానంలో ఉన్నాయి.

తెలంగాణ స్త్రీవాద కవిత్వం సాధికారత
డా|| వి. త్రివేణి
‘సమానత్వం, సమానత్వం అంటూ ఉంటే నా చిన్ని బుద్ధికి అదే అందకుండా ఉంది. ఆనకుండా ఉంది. అర్థం కాకుండా ఉంది నాకు. ఒక వేళ పురుషులు పురుషులకి పుట్టినట్టయితే, స్త్రీలు స్త్రీలకు పుట్టినట్టయితే సమానమనడంలో అర్థం ఉంది. అట్లా కాదే... సృష్టే సృష్టిని ఆడవారి చేతిలో పెట్టింది. అంటే సృష్టే.. సృష్టి అంటే దేవుడనే వాడు ఒకడుండి సృష్టిని సృష్టించి ఆ సృష్టిని ఆడవాళ్లకి పెట్టిందని నా దృక్పథం. కనుక మరి ఆడవారికి జన్మ ఆడదే ఇస్తుంది. మగవారికి జన్మ ఆడదే ఇస్తుంది. మరి శరీరంలో ఉండే రక్తమాంసాలన్నింటిని కరిగించి వారికి జన్మనిచ్చే ఆడది గొప్పదా? జేబులో చేతులు పెట్టుకొని తిరిగే మగవాడు గొప్పవాడా? కనుక నా దృక్పథంలో... నా దృక్పథంలోనే కాదు అది యదార్థం, సత్యం, ఒప్పుకొని తీరాల్సిందే సమాజం ఒకరోజు‘.
టి.ఎస్.సదాలక్ష్మి - నల్లపొద్దు సంకలనం (1952 సాధారణ ఎన్నికలలో కరీంనగర్ లోని సుల్తానాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి రిజర్వుడు సభ్యురాలిగా పోటీచేశారు)
She is not born, She is made - Saiman D Bihevar
‘స్త్రీ స్త్రీగా పుట్టదు/ స్త్రీగా పెంచబడుతుంది’. - సైమన్ డి బిహేవర్
17, 18వ శతాబ్దంలో చెప్పిన ఈ నినాదమే అసలైన స్త్రీవాదానికి లేదా స్త్రీ సాధికారతకు తెరతీసింది. జర్మనీ దేశానికి చెందిన ప్రముఖ ఫెమినిస్ట్ సైమన్ డి బిహేవర్. ఆమె చూపిన ఉద్యమ భావజాలం పునాదిగా చేసుకొనే ప్రపంచ వ్యాప్తంగా మహిళా పోరాటాలు జరిగాయి.
సెక్స్ - జండర్ మధ్య వ్యత్యాసముంది. సెక్స్ : పుట్టుకలో శారీరకంగా పురుషుల మధ్య ఉన్న అవయవ నిర్మాణంలో ఉ న్న తేడా సెక్స్. జండర్ : బాల బాలికలు పెరిగే కొద్ది అలవాట్లలో, ఆచారాలలో, నీతులలో ఆపాదిస్తున్న తేడా. పితృస్వామ్యం - లింగ వివక్ష స్త్రీవాద అస్తిత్వ ఉద్యమంలో ప్రధాన అంశాలుగా నిలిచాయి. పితృస్వామ్యం : వందల సంవత్సరాలుగా సమాజంలో పురుషుడితే అధికారం, అన్ని రంగాలతోపాటు సమాజానికి కేంద్ర బిందువుగా నిలిచిన కుటుంబంలో కూడా పురుషుడిదే అధికారం అన్న న్యాయం కొనసాగుతూ వస్తుంది. లింగవివక్ష : పితృస్వామ్య సమాజం నడవడికను, నీతులను, సూత్రాలను, ధర్మాలను విడివిడిగా నిర్దేశించింది. దుస్తులు, ఆటలు, పాటలు ఇంటా బయట చేయవలసిన పనులు, వివాహం వంటివి విడివిడిగా నిర్దేశించబడ్డాయి.
ఫెమినిజమ్ అనే ఆంగ్ల పదానికి సమానార్థకంగా తెలుగులో వాడుకలో ఉన్న శబ్దం స్త్రీవాదం. మానవ సమాజంలోని సగభాగమైన స్త్రీలు లైంగిక వివక్ష కారణంగా అణచివేతకు గురి అవుతూ పురుషుల కంటే తక్కువ సాంఘిక స్థితిలో ఉండడాన్ని ప్రశ్నిస్తూ స్త్రీ విముక్తిని కాంక్షిస్తూ అభివృద్ధి చెందిన సిద్ధాంతం.
పితృస్వామ్య వ్యవస్థకు, సాహిత్యానికి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని గుర్తించడం, పితృస్వామ్య సమాజాన్ని ధిక్కరించడం స్త్రీవాద కవిత్వంగా భావించవచ్చు. స్త్రీ అస్తిత్వం, ప్రయోజనం వంటి వాటిని పునాదిగా చేసుకొని, తదనంతరం స్త్రీవాదం బలంగా ముందుకొచ్చింది. సంస్కరణ, జాతీయోద్యమాలు, అభ్యుదయ, విప్లవ చైతన్యాల నుండి మార్పుకు అనువైన నేపథ్యాన్ని ఏర్పరుచుకొని స్త్రీలు ముందుకొచ్చారు. స్త్రీవాద కవిత్వాన్ని వెలువరింపజేశారు. ఈ ఉద్యమాలు స్త్రీలలో ఒక సిద్ధాంతపరమైన ఆలోచనాశక్తి, ప్రాపంచిక జ్ఞానం, పోరాట స్ఫూర్తి, ఉద్యమ భావజాలం పెంపొందింపజేశాయి. స్త్రీవాద సాహిత్యం 1975 తర్వాతనే ఒక నిర్దిష్ట రూపాన్ని దాల్చింది. 1975 కంటే ముందున్న సాహిత్యం కూడా స్త్రీ చైతన్యం, స్త్రీ అభ్యుదయం మీద వెలువడింది. తెలుగులో వచ్చిన మొదటి ప్రక్రియ ‘కవిత్వం’. కవితా ప్రక్రియ ద్వారా స్త్రీవాద అస్తిత్వ ఉద్యమం ఒక సమగ్రమైన రూపాన్ని ఏర్పరచుకొని, విస్తృతమైన నేపథ్యాన్ని సంతరించుకొంది. ఆధునిక తెలుగు కవిత్వం స్త్రీ సమస్యలలోని రాజకీయ స్వభావాన్ని గానీ, పితృస్వామ్య భావజాల మూలాలను గానీ, జండర్ రాజకీయాలను గానీ లోతుగా అధ్యయనం చేశాయి. స్త్రీవాద రూపురేఖల్ని బహుముఖాలుగా విస్తరింపజేశాయి.
స్త్రీవాద కవితా ధోరణులతో వెలువడిన కవితా సంకలనం ‘నీలిమేఘాలు’. 1972-92 మధ్యకాలంలో రచించబడినవి ఇందులోని కవితలు. వీటికంటే ముందుగానే ‘మాకు గోడలు లేవు’, ‘మూడుతరాలు’, ‘సవాలక్ష సందేహాలు’, ‘మనకు తెలియని మన చరిత్ర’ వంటి పుస్తకాలు వెలువరింపబడ్డాయి.
స్త్రీవాద కవిత్వం ప్రదర్శించిన వస్తుతత్త్వం సాహిత్యాన్ని విభిన్నమైన కోణాల్లో నిలబెట్టాయి.
స్త్రీవాద కవిత్వాన్ని ప్రభావితం చేసిన అంశాలు :
- శరీరం, శరీర రాజకీయాలు, సౌందర్యాత్మకహింస
- స్త్రీ, పురుష సంబంధాలు, లైంగిక స్వేచ్ఛ
- భావజాల రూపంలో స్త్రీలు చేసే చాకిరి, శ్రమ
- రకరకాల రూపాల్లో స్త్రీలు అనుభవించే హింస, వేదనలు, భ్రూణహత్యలు, అబార్షన్
- మాతృత్వం, రజస్వలకావడం
- లైంగిక దోపిడి, అత్యాచారాలు, వ్యభిచారాలు
- గృహహింస, వరకట్న సమస్య, లైంగిక వేధింపులు
- కవిత్వంపై దాడి, అణచివేత పట్ల తిరుగుబాటు
- పునరుత్పత్తి శక్తి, అస్తిత్వ పునర్వివేచన
- స్త్రీ జీవితంలోని ‘ఆర్థికం’, ఆర్థిక స్వావలంబన
తెలంగాణలో వివిధ అస్తిత్వ ఉద్యమాలలో స్త్రీవాదం బలంగా ప్రస్ఫుటమవుతుంది. ఈ కాలంలో స్త్రీవాద సాహిత్యం బహుముఖాలుగా విస్తరించింది. వచన కవిత్వంలో స్త్రీవాద భావజాలం కులమత అస్తిత్వాలకు ప్రాతిపదికంగా నిలిచింది. విభిన్న కవిత్యోద్యమాలు స్త్రీవాదంలో చోటుచేసుకున్నాయి. పితృస్వామ్య వ్యవస్థను ధిక్కరిస్తూ వచ్చిన స్త్రీవాదకవిత్వంలో దళిత స్త్రీవాదం, మైనారిటీ స్త్రీవాదం, బీసీ స్త్రీవాదం వంటివి ప్రవేశించాయి. అదేస్థాయిలో స్త్రీల మీద జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, హత్యలపై ధిక్కారం కవిత్వంలో బలమైన గొంతుకగా మారాయి.
అనిశెట్టి రజిత పితృస్వామ్య సంస్కృతి మీద తన కవితలతో తిరుగుబాటు చేశారు. స్త్రీల జీవితాలు ఏ విధంగా శాసింపబడుతున్నాయో, సంప్రదాయం ఆచారాలు, సనాతన సంస్కృతికి హేతువులైన స్త్రీల ప్రాతినిథ్యాన్ని ఆమె ఒక విధంగా ఖండించారు. స్త్రీల జీవితాలు ఈ కాలంలోనే బానిస స్థితిలోకి దిగజార్చుతున్నాయని ఆమె ఆరోపించారు. ఆమె కవితా సంపుటిలో ‘గులాబీలు జ్వలిస్తున్నాయి’. ‘నేనొక నల్లమబ్బునవుతా’, ‘చెమట చెట్టు’, ‘ఉసురు’, ‘అనగనగా కాలం’, ‘నిర్భయాకాశం కింద’ వంటివి పురుషాధిపత్య సమాజంపై ధిక్కార స్వరాన్ని పలికించినవి.
ఈ సందర్భంలోనే అనిశెట్టి రజిత రచించిన కవిత్వం ‘అవును మౌనాన్ని మాట్లాడుతున్నాను”. “నిత్యగాయాల జ్యోతిలా మండుతూ, ఉద్యమ భాషపై మాట్లాడుతున్నాను”.అంటూ ఆక్రోశాన్ని ప్రకటించారు.“ఉద్విగ్న, జిగార్” వంటి కవితా సంకలనాలకు సంపాదకత్వం వహించి రుద్రమ ప్రచురణల పక్షాన ప్రచురించారు.“నిర్భయాకాశం కింద” కవితా సంపుటిలో స్త్రీల జీవితంలో గల ఆశను, ఆకాంక్షను పెంపొందింపజేశారు. నిర్భయ చట్టం అమలు, పునరావాస కేంద్రం, పనితీరు పట్ల ప్రత్యేక శ్రద్ధను తీసుకొని సక్రమంగా నిర్వహించే విధంగా చర్యలు, సూచనలు చేశారు. నిర్భయ చట్టంలో డొల్లతనాన్ని, ఆ చట్టం వచ్చికూడా అత్యాచారాలు ఆగకపోవడాన్ని ఆమె నిరసించారు. నిర్భయాకాశం కింద శరీర సౌందర్యం, పురుషాధిపత్య ధోరణి, బానిస బతుకు, చిత్రహింసల జీవనం, అణగారిన జీవనఛాయ, సుఖతత్త్వం వంటి భావజాలం నుండి విప్లవ పిడికిళ్ళు ఎత్తిన చేతుల వరకు పరోక్ష పోరాటం చేసింది. అందులోని ఒక ఖండిక : ‘గులాబీలు జ్వలిస్తున్నాయి’.
‘చలింపజేసే సౌందర్యం తమ సొత్తని
మత్తెకించే మాధుర్యం తమ నైజమని
అనుభూతీ అనుభవాలే తమ ఉనికియని
మృదువైన తాజా స్పర్శతో
తన్మయులజేసే ఆ పూతా...
చిదిరి వేయబడిన అత్తరు కావడమే
వాటి జీవిత ధ్యేయం కాబోలని
అందరివలె నేనూ భావించిన - ఆ రోజులో
ఆడజన్మ మీద ఉన్న ఆంక్షలు, స్త్రీ ఒక సౌందర్యరాశిగానో, శరీర కాంక్షను తీర్చే ఒక మోహనాంగిగానో భావించే స్థితి నుండి బయటపడాలనే ఒక ఉత్తేజం, చైతన్యం మనకు కనిపిస్తుంది. దేశం కట్టుబొట్లు, సనాతన ఆచారాల వల్ల ఆడపిల్ల జన్మ మీదనే వక్రభాష్యం ఏర్పడిన స్థితిని ఆమె తన కవితల్లో పేర్కొన్నారు. ప్రపంచమంతా ఆడజన్మ పట్ల ఒక బానిస గొడుగు కింద నిరసిస్తుందని, స్త్రీవాదం సైద్ధాంతిక నేపథ్యంలో ప్రపంచ నిర్ణీత సందర్భాలు నిలిచి ఉంటాయని చిత్రీకరించారు. అది మనకు ‘ఒక ఆడపిల్ల జన్మించిన వేళ!’ అనే కవితలో తెలుపబడింది. ప్రపంచ ప్రమాణాల మీద ఏర్పడిన స్త్రీవాదానికి PURD రచించిన ‘INSIDE THE FAMILY’ అనే కవిత్వాన్ని అనువదించి అంతర్జాతీయ స్థాయిలో కవితా కోణాల్ని ఆవిష్కరించారు.
‘నీవు పుట్టిన రోజున నా చిన్నితల్లి
ఓహ్ దేవుడా ! నా కడుపు లోయల్లోకి
ఏదో కూరుకుపోతున్న అనుభూతి
నీవు పుట్టిన ఆ రోజున నా చిన్నితల్లీ!
అది నీరసించిన చీకటిరాత్రి
నా అత్తా ఆడబిడ్డా దీపాలు
వెలిగించడానికి కూడా నిరాకరించారు
మరి నా పతిదేవుడూ యజమాని
నన్ను కఠినంగా ఏమేమో అన్నాడు
ఓహ్ నీ పుట్టుకకు వైభవం
చేకూరనియ్ నా చిన్నితల్లీ!
ఆ సమయాన దేవుళ్ళంతా
ఈ భూమ్మీద నుండి వలసబోయారు’
స్త్రీ, పురుష సంబంధాలలో ఉన్న డొల్లతనాన్ని ప్రశ్నిస్తూ ప్రగతిశీల భావజాల కవయిత్రిగా గుర్తింపు పొందినవారు జ్వలిత. స్త్రీవాద కవిత్వానికి స్పష్టమైన రూపురేఖల్ని నిర్దేశించింది. సబ్బండ వర్ణాల స్త్రీల సమస్యలను, యాంత్రికీకరణ దాంపత్యం, కార్పొరేట్ మోజులో పడి కొట్టుమిట్టాడుతున్న కుటుంబాలు, ఆర్థిక వ్యవస్థ వంటివి స్త్రీ జీవితాలపై అనితర ప్రభావాలను చూపింది. కవిత్వం ఆ దిశగా దృష్టి సారించింది. జ్వలిత రచించిన ‘కాలాన్ని జయిస్తూ నేను’, ‘సుధీర్ఘ హత్య’, ‘అగ్నిపాపి’ వంటివి స్త్రీవాదాన్ని బలంగా చూపిన సంపుటాలు. ఆడ శిశువులు బాల్యంలోనే అనాధలుగా మిగిలిపోతున్న స్థితిని, దానికి గల పరిస్థితులను స్త్రీవాద కవిత్వం సమస్యా అన్వేషణ సాగించింది. దీనికి ఆర్థిక రాజకీయ కారణాలు గానే చిత్రీకరించే ప్రయత్నం సమకాలీన కవిత్వం చేసింది. అనాధ బాల్యంగా ఆడపిల్ల గడుపుతున్న జీవితం, ఆమెపై గల ఆంక్షలు సమాజం సృష్టించిందా? లేక పరోక్ష రాజకీయ ప్రతిబంధకమా? ఈ సమస్యను చాలా గట్టి గొంతుకలలో స్త్రీవాద కవయిత్రులు వెల్లడించారు. అనంతసాగరాల చెలియలికట్టలు అధిగమించే స్వేచ్ఛ లైంగికత్వం ఒక శిశువుని ఏ విధంగా అనాధగా మార్చుతుందో నేటి కవిత్వం చూపుతుంది. దీనినుంచి బాల్యపురోదన విశ్వమహిషి చెవిన వీణాగానంగా చిత్రీకరించింది. నాన్నమ్మల, అమ్మమ్మల అరణ్య రోదనగా నిలిచింది. ‘బాల్యాన్ని పాతరేసిన చోట’ జ్వలిత ఆక్రోశించిన కవిత.
అత్యాధునిక యాంత్రిక యుగంలో సమాజంలో చోటుచేసుకున్న విషమ సంస్కృతి ఎంతటి వికృత పరిణామాలకు దారి తీస్తుందో స్త్రీవాద కవిత్వం స్పష్టం చేసింది. స్వేచ్ఛా లైంగికత, వివాహం కాకుండానే తల్లికావడం, తల్లి వివాహిత కాకపోవడం, తల్లి సమాజం నుండి వెలివేయబడటం, ‘సరోగసి’ విధానం, ‘గే’ సంస్కృతి వంటివి ఆడ శిశువు పుట్టుకకు గుదిబండలాగా మారినాయి.
ఆడపిల్లల కిడ్నాపింగ్, ట్రాపింగ్ వంటివి ఈ రోజుల్లో స్త్రీవాద కవిత్వానికి ఒక పెద్ద సవాలుగా మారింది. కవిత్వం ఆడ పిల్లలు కనుమరుగవుతున్న వైనాన్ని ప్రదర్శించింది. ఏకపక్షంగా ముక్తకంఠంగా కవయిత్రులు ఈ సమస్య మీద స్పందించారు. కిడ్నాప్, యాసిడ్ దాడి, అత్యాచారం, వేట కొడవళ్ళతో హత్య చేయడం, వరకట్న కోరల్లో చిక్కుకోవడం అంతర్జాతీయ స్థాయిలో రక్షణ చట్రాన్ని కబలిస్తున్న సమస్య “కిడ్నాపింగ్”. “కనుమరుగవుతున్న నేను”లో జ్వలిత “నవ నాగరికత నగ్న నృత్యమాడుతున్నది కిడ్నాపింగ్ అంతర్జాతీయ క్రీడ” అంటూ ఎద్దేవా చేశారు. రాజ్య అలక్ష్యం, స్త్రీ రక్షణ మార్గంలో విబేధింపబడుతున్న రాజ్యంగ చట్టాలు స్త్రీవాద కవిత్వానికి వస్తువులుగా మారాయి.
అందమైన పువ్వులను
రెక్కలు రెక్కలుగా ముక్కలు ముక్కలుగా
కుత్తుకలు కత్తిరించడం
కొత్త ప్రక్రియ ఇప్పుడు
యాసిడ్ బాంబులు
ఉగ్రవాదుల ఆయుధం గతంలో
ఆమ్ల జల్లులు
అబలలను మార్చడం చూస్తున్నాం.
‘స్త్రీకనుమరుగవుతుంది..!’ ఈ హెచ్చరిక భవిష్యత్తు మానవ జన్మకు ప్రశ్నార్థకంగా మారింది. భారత జనాభా గణన ప్రకారం కొన్ని నిర్దేశిత ప్రదేశాలలో మగవారి కంటే ఆడవారి నిష్పత్తిరేటు తక్కువగా ఉన్నట్లు గుర్తించింది. ఈ సూచిక రాబోయే తరానికి హెచ్చరికగా భావిస్తుంది. అందుకే చెట్టు, చెరువులను సహజవనరులుగా ఏ విధంగానైతే కాపాడుకుంటున్నామో, సృష్టికి సహేతుకులైన స్త్రీలు కనుమరుగు కాకుండా రక్షించుకోవాలనే ఆకాంక్ష స్త్రీవాద కవిత్వం అంతర్గతంగా సూచించింది.
స్త్రీవాద కవిత్వం అంటే పురుషాధిపత్య సమాజంపై ధిక్కారస్వరం ప్రకటించడమే అవుతుంది. అనేక విధాలుగా స్త్రీ పడుతున్న బాధ, వారిపై హింస, పీడన అది పురుషాధిపత్య భావజాలం నుంచే కలుగుతుంది. కుటుంబ పెత్తనం నుండి రాజకీయ వ్యవస్థ వరకు ప్రతి నిర్ణయాత్మకశక్తి పురుషుడి ఆధిపత్యం పైనే ఉంటుంది. పౌరహక్కులు, పంచాయతీ వ్యవస్థ, రాజ్యాంగ సవరణలు పురుషుడి భావజాలం దిశగా సాగుతున్నాయని స్త్రీవాదులు ప్రతిఘటిస్తున్నారు. రాజకీయ ప్రభావంతో ధ్వంధ్వవైఖరిని ప్రదర్శిస్తున్న వివిధ పార్టీలు, ప్రభుత్వం అన్ని స్త్రీల హక్కుల మీద నీళ్ళు చల్లుతున్నాయని విమర్శించారు. జ్వలిత ‘రోగగ్రస్త స్తన్యం’ కవితలో....
వెనకకు నెట్టబడి నెట్టబడి
నేను శతాబ్దాలుగా
రోగగ్రస్త స్తన్యాన్ని కుడుస్తున్న శాపగ్రస్తను
కూటికి గుడ్డకే కాదు
బ్రతికే హక్కును కోల్పోతున్న
గంధర్వ పతులు లేని సైరంధ్రిని
కొత్త కలలు కంటున్న త్రిజటని
జండర్ అంటే వర్గం కాదని
రాయితీలు రిజర్వేషన్లు
మనకు చెందబోవడం లేదని
కొత్త కాంక్షకాని పాత అవసరాన్ని
నిజం చేసుకోవటానికి
చట్టం చెయ్యి కాల్చక ముందే
ఆకులు వెదకాలి రండి
అంటూ రాజ్యం మహిళలపై చూపుతున్న అలసత్వాన్ని, నిర్లక్ష్యాన్ని స్త్రీవాద కవిత్వం దుయ్యబట్టింది. పార్లమెంట్ లో మహిళా బిల్లును ఆమోదించలేకపోవడానికి రాజకీయంగా పురుష సంస్కృతి బలమైన ప్రభావాన్ని చూపుతుందని తెలియజేసింది. మహిళల రిజర్వేషన్లపై అవకతవకలకు పాల్పడడం, మహిళల ఆత్మగౌరవాన్ని, హక్కులను కాళ్ళరాయడమే అవుతుందని మండిపడింది. సంవత్సరాలుగా కొనసాగుతున్న రాజకీయ హక్కుల సాధన మీద పోరాటాన్ని అంతమొందించడానికి కుట్ర జరుగుతుందని, మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ఆంక్షలు ప్రతిబంధకాలు రాజకీయ పార్టీలు సృష్టిస్తున్నాయని ఖండించింది. సాలెగూళ్ళ లాంటి రాజ్యపాలన ఈ దుర్భర పరిణామానికి నిదర్శనం. ‘కోటాలో కోటా లేదంటూ... కొల్లగొడుతున్న కొల్లాయి వాదం’ అనేది మహిళా బిల్లుపై చూపుతున్న అవ్యక్త ప్రతిపాదిత కవిత్వం.
పురుషాధిపత్య సమాజంలో ఆడవాళ్ళు ఎలా అవమానాలకు, అత్యాచారాలకు గురవుతున్నారో పై కవిత నిరూపిస్తుంది. రాజకీయ వ్యవస్థను తీవ్రంగా పరిగణిస్తూ, రాజ్యాంగం ఇచ్చిన హామీని నిలబెట్టుకోని సందర్భాలను గుర్తుచేశారు. స్త్రీల సంక్షేమం పట్ల రాజ్యవ్యవస్థ ద్వంద్వ వైఖరిని కవిత్వంలో వ్యతిరేకించారు. పురుషుడిలో అసందర్భంగా పుట్టే వికృత కామవాంఛను భండారు విజయ తన కవిత్వంలో చాలా గట్టిగానే ప్రతిఘటించారు.
‘వాడికి ఒళ్ళంతా అంగాలే
వాడి మనసంతా రాటుదేలిన విషపు ముళ్లే
వాడికి మనోవికారం ఎప్పుడు పుడుతుందో
వాడి అంగం ఎప్పుడు నిక్కబొడుస్తుందో
ఎప్పుడు మొనదేలి ఎగిరి పడుతుందో
ఎవరివైపు తిరిగి చీల్చివేస్తుందో
వాడిని చిత్రించిన వాడికి కూడా తెలియదు’
‘ధిక్కార’ సంకలనాన్ని చంటి ప్రసన్న కేంద్రం ట్రస్ట్ వారు ప్రచురించారు. ఇది అత్యాచారాలపై అగ్నిధార, అంకుశం సంధించి ఉరి బిగించిన ఘీంకారగా అభివర్ణించారు. ‘ఉద్విగ్న’ కవితా సంకలనాన్ని రుద్రమ ప్రచురణల వారు వెలువరించారు. అత్యాచార భారతంపై ఓరుగల్లు కవుల నిరసనను ప్రకటించారు.
దళిత స్త్రీ వాదం :
కులం పుట్టిన నాటి నుండి కుల పితృస్వామ్య పీడనకు గురి అవుతూ దళిత స్త్రీవాదం వెలువరింపబడింది. దళిత స్త్రీలు అనుభవిస్తున్న శారీరక, మానసిక హింసను కవిత్వంగా నివేదించారు. స్త్రీవాదం జండర్ వర్గంతో పోరాడితే దళిత స్త్రీవాదం జండర్ వర్గంతో పాటు కుల వర్ణాలను కూడా ఎదురుకోవలసి వచ్చింది. సాంఘిక ఆర్థిక సామాజిక అంశాలను జండర్ దృక్పథంలో దళిత స్త్రీవాద ఉద్యమానికి అనుసరణీయంగా నిలిచాయి. ఈ నేపథ్యంలోనే దళిత స్త్రీవాదం ఒక సాహిత్యంగా బయటపడింది. దళిత కవయిత్రుల జండర్ స్పృహకు శతాబ్దాల పోరాటాలలో చాలా దగ్గరి సంబంధం ఉంది. సామాజిక ఉద్యమాలు, దళిత పోరాటాల ఉద్యమం నుంచి నేటి ఆత్మగౌరవ ఉద్యమాలు, దళిత మానవ హక్కుల ఉద్యమాలు, వాటి లక్ష్యాలు, లక్ష్యసాధనకు అవలంభించిన విధానాలు, వాటి భావజాలాలన్నీ కూడా దళిత కవయిత్రులు తమ భావాలను వ్యక్తీకరించడానికి నేపథ్యాన్ని అందించాయి.
గోగు శ్యామల, జాజుల గౌరి, జూపాక సుభద్ర, చల్లపల్లి స్వరూపారాణి, మేరీ మాదిగ వంటివారు వర్తమాన దళిత స్త్రీవాద కవిత్వాన్ని వెలువరిస్తున్నారు. ‘మాకు గోడలు లేవు’ అన్న స్త్రీవాదులు కులం గోడలను వదిలి పెట్టలేకపోయిన స్థితిని దళిత స్త్రీవాదులు ఎత్తిచూపారు. దళిత స్త్రీ తాము తమ కుటుంబ పురుషాధిపత్య సమాజం నుండి గాక, అగ్రవర్ణ స్త్రీల ఆధిపత్యం నుండే పీడన, హింస ఎదుర్కొంటున్నారని వారి వాదన.
అదే నీలిమేఘాలలో ప్రచురింపబడిన జయప్రభ ‘పైటను తగలెయ్యాలి’ కవిత్వానికి నిరసనగా జూపాక సుభద్ర ‘కొంగున బొబ్బెమీద కావలుండే బొంత పేగ్గాడు’ దళిత స్త్రీవాద నేపథ్యంలో కవిత్వాన్ని వెలువరించారు.
జయప్రభ - పైటను తగలెయ్యాలి
పైట | ఊబిలో నన్ను గుంజేస్తూ ఉంటుంది
పైట | సుడిగాలిలా నన్ను తోసేస్తూ ఉంటుంది
నామీద | తరాల నుండే మోపిన | అపనిందపైట
నన్ను అబలని చేసిన | పితృస్వామ్య
అదృశ్యహస్తం పైట
దోపిడీ సంస్కృతి | నా వ్యక్తిత్వాన్ని శవంగా
చేసిన దాని పైన కప్పిన తెల్ల దుప్పటి పైట
నేను నడితే శవాన్ని కాకుండా ఉండాలంటే
ముందుగా పైటని తగలెయ్యాలి
పైటని తగలెయ్యాలి.
జూపాక సుభద్ర - కొంగు నా బొచ్చెమీద కావలుండే బొంత పేగ్గాదు.
కొంగు నా ఆకలిని ముడేసుకొని
నా గడుపు కర్సుకొని కట్టుమీని మైసమ్మోలె
కావలి బంటది
కూలినాలికి నేను సెమట కాల్వనైతే
పిల్లగాలై అద్దుకుంటుంది
కాయగడ్డలకు, గాసం గింజలకు
కోమటి దినుసులకు
సుక్కల్ని పొదుపుకున్న సందమామోలె
నా నెత్తిన మాటై మెరస్తది
సేండ్లల్ల సెల్కల్ల అలిసి సొలిసి పుల్ల సీలితె
పక్క బట్టై పుర్సతిస్తది
దళిత స్త్రీ చైతన్యాన్ని తెలిపే కవితలున్నాయి. స్త్రీవాదులు దళిత కోణంలో అణగారిన జాతి విముక్తి కోసం స్పష్టమైన పోరాట స్ఫూర్తిని చూపారు.
మైనార్టీ స్త్రీవాదం :
దళిత స్త్రీల తిరుగుబాటు విధంగానే ముస్లిం మైనార్టీ స్త్రీలు నిరసనలు ప్రకటించారు. ముస్లిం కవయిత్రులు తమ సంస్కృతిలో ఉన్న స్త్రీ అవిద్య, బుర్క, తలాక్, గృహ హింస వంటి సమస్యలకు స్పందించి కవిత్వం వెలువరించారు. మత శక్తుల దాడులను, స్త్రీల మీద జరిగే అత్యాచారాలను ఖండించారు. షహనాజ్ ఫాతిమా, షాజహానా, షంషాద్, యాస్మిన్ బేగం, జరీన్ బేగం, జాకేరా, ఎం.ఎస్.బేగం, రజియాసుల్తానా వంటి కవయిత్రులు కవిత్వం రచించారు. ముస్లిమేతరులైన రాజ్యలక్ష్మి, గీతాంజలి వంటివారు ముస్లిం స్త్రీవాద కవిత్వం రచించారు. షాజహానా రచించిన ‘అమ్మ నవ్వేది నాన్న’ కవితలో ముస్లిం స్త్రీల ఆవేదన కనిపిస్తుంది. సామాజికంగా, ఆర్థికంగా చితికిలబడిన ముస్లిం కుటుంబాలలో ప్రతి ముస్లిం గృహిణి అనుభవిస్తున్న స్థితి కళ్ళకు కడుతుంది.
నాన్నా... నాన్నా...!
అమ్మ మొహంలో జీవం లేదేం?
ఎప్పటిదో మీ ఇద్దరి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో అమ్మ
నెలవంకలా నవ్వుతుంటే
ఎంతందంగా నవ్వుతుందో
మళ్ళీ ఒకసారి అమ్మని నవ్వమని
అచ్చం అలానే నవ్వమని చెప్పవా...!
ఇప్పుడిక ఎవరూ అలా నవ్వలేరు
రేష్మా నవ్వింది చిన్నప్పుడు
కల్తీ లేని నవ్వు
ఇప్పుడు దానికి ఇరవయ్యేళ్ళు
అప్పటికీ ఆ నవ్వులో ఎన్ని రంగులో కలిసి
దాన్నవ్వు అది మర్చిపోయింది
అందరం ఎక్కడ మర్చిపోయామో...!
ఇన్ని నవ్వుల్ని ఒక్క దగ్గరే పోగేస్తే ఎలా ఉంటుంది
స్వర్గం అంటారే... అది కనబడదు!!
కానీ ఇలాంటి స్వర్గాలు నీకక్కర్లేదు నాన్నా!
నీకు పక్కింటి ఆంటీ నవ్వు కావాలి
ఖాదర్ బీ డబ్బు కోసం నవ్వే కక్కుర్తి నవ్వు కావాలి
ఆ ప్లాస్టిక్ నవ్వులకు పాకులాడ్డం
అలవాటయిన నీ కళ్ళకి
అమ్మ నవ్వు రెక్కర్రాల్చుకుందని గానీ
అమ్మమనసు కన్నీళ్ళు రాలుస్తుందని గానీ
అక్కర్లేదు నాన్నా...
ముస్లిం కుటుంబాలలో ఉన్న బహుభార్యత్వం, బుకఖా పద్ధతి, అసంఖ్యాక సంతానం, పేదరికం, గల్ఫ్ వలసలు, ముస్లిం ముసల్మాన్ వృద్ధులలో ముస్లిం బాలికల షాదీలు, తలాఖ్ వ్యవస్థ, పురుషాధిపత్యం, పితృస్వామ్యం వంటివి కవితా వస్తువులుగా ముస్లిం స్త్రీవాద కవిత్వం వెలువరింపబడింది.
ఉపసంహారం :
స్త్రీవాదం అంతిమ లక్ష్యం పురుషాధిపత్య సమాజంపై తిరుగుబాటు ధోరణిని వహించడం. అది తెలుగు కవిత్వంలో బహిర్గతమైంది. జండర్ అసమానతలను తుడిచివేస్తూ లింగవివక్షతను స్త్రీవాదులు నిరసించారు. సమానత్వ భావనను కల్పించడమే స్త్రీవాద సాహిత్యం ప్రధాన ధ్యేయం. మహిళా సాధికారతకు; స్వేచ్ఛా, సమానత్వం, ఆర్థిక స్వావలంబన కోసం ప్రయత్నం చేయడం కూడా ఒక అంశమే. స్త్రీ అనుభవం, మనస్తత్వ నిర్దేశాల మూలంగా స్త్రీ అభ్యున్నతిని కాంక్షించారు. స్త్రీ, పురుషుల సంబంధం శారీరకమైందా? సామాజికతకు కొలబద్దగా నిర్ణయించబడిందా? స్త్రీవాదం అధ్యయనాలు జరిపింది. రాజకీయ, అధికార సంబంధాలు, ఆలోచనలు, ఆచరణ విధానాలు స్త్రీవాదాన్ని విషవలయంలోకి నెట్టివేశాయి. ఆర్థికంతో ముడిపెట్టాయి. పర్యవసానాల పునర్విశ్లేషణలో స్త్రీవాద అస్తిత్వ ఉద్యమం పురోగమించింది.
డా|| వి. త్రివేణి
అసోషియేట్ ప్రొఫెసర్,
తెలుగు అధ్యయన శాఖ, తెలంగాణ విశ్వవిద్యాలయం,
ఫోన్ : 9951444803,
email : telugutriveni@gmail.com
నిజామాబాద్ - 503322

రాజును ధిక్కరించిన కవి కుమార్తె ఆత్మగౌరవం
డా॥కొండపల్లి నీహారిణి
రాజు మరణించె నొక తార రాలిపోయె
కవియు మరణించె నొకతార గగనమెక్కె
రాజు జీవించె రాతి విగ్రహములందు
సుకవి జీవించే ప్రజల నాలుకల యందు.
ఎంత సత్యం ! అక్షరం కదా నశించకుండా ఉండేది! కవిత్వ విలక్షణతనే గదా ఆకట్టుకునేది. ఏ దేశచరిత్ర పుటలను త్రిప్పినా రాజులూ, రాజ్యాల చరిత్రే. రాజ్యాలూ వీగిపోయాయి గాని కవిత్వమొక్కటే, సాహిత్యమొక్కటే చిరస్థాయిగా నిలిచి ఉన్నది. పేరుకు 'ఫిరదౌసి' కోసం రాసిన పద్యమే కావచ్చు కాని జాషువా మహాకవిగా స్థిరపడిపోయేంత అద్భుత భావాన్ని ఇముడ్చుకొని సుకవిగా ప్రజల నాలుకల మీద సులక్షణంగా నిలిచిపోయిన పద్యమిది. ఎలా? ఇందుక్కారణమేమిటో పూర్వాపరాలేమిటో తప్పక తెలుసుకోవాలి.
లోకంలో ఎందరో తల్లిదండ్రులు ఉన్నారు. కాని ఎవరి సంతానమైతే మంచి సంతానంగా, కీర్తిప్రతిష్టలు తెచ్చుకున్న సంతానంగా మనగలుగుతారో వాళ్ళ తల్లిదండ్రుల పేర్లూ వారి సంతానం పేర్లతో బాటు సాహిత్యంలోకి, చరిత్రలోకి ఎక్కుతాయి. అట్లాగే గుర్రం వీరయ్య, లింగమాంబల పేర్లను సాహిత్య చరిత్ర పుటల్లో నిక్షిప్తం చేయించాడు గుర్రం జాషువా. తను జన్మించిన స్థితి నుండి లోకుల హృదయాల్ని గెలుసుకునే స్థితికి ఎదిగిన జాషువా ఛాందసవాదాన్ని తన అక్షర ఖడ్గంతో ఖండించి విజయం సాధించాడు. తన కులంవారి నుండి, ఇతర కులాల వారినుండి, ఆధిపత్యభావజాలమున్న అగ్రవర్ణాల వారినుండి తనదైన ధిక్కార స్వరంతో సుస్థిరత సాధించుకున్నాడు. అంటరానితనమనే అన్యాయపు గాలి దుమారాలను సహిస్తూ ఒక వటవృక్షంలా నిలదొక్కుకున్న జాషువా గొప్ప పండితుడు.
అనాథ, స్వప్న కథ, గబ్బిలం, కాందిశీకుడు, నేతాజీ, బాపూజీ, స్వయంవరం, రాష్ట్రపూజ, కొత్తలోకం, ముసాఫిరులు, నాగార్జునసాగర్ వంటి ఖండకావ్యాలను రచించినా, యుద్ధ ప్రచార గీతాలుగా ప్రసిద్ధికెక్కిన 'రక్తగానం' వంటి ఖండికలు రాసినా, హిమధామార్కధర పరిణయం, కన్యకా పరమేశ్వరి, శివాజీ ప్రబంధం వంటి పద్య కావ్యాలు (అముద్రితాలు) రాసినా, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, క్రీస్తు చరిత్ర వంటి లఘుకావ్యాలు రాసినా జాషువా కవిత్వ పటుత్వమంతా తరతరాల సాహితీ సుగంధాలను విరజిమ్మేదే ! కుశలవోపాఖ్యానం, చిన్ననాయకుడు వంటి గద్యకృతులు రాసిన జాషువా 'నా కథ' అనే స్వీయ చరిత్రను పద్యంలో రచించాడు. రుక్మిణీ కల్యాణం, చిదానంద ప్రభాతం, ధ్రువ విజయం, వీరబాబు, తెరచాటు వంటి దృశ్యకావ్యాలను రచించిన జాషువా ఆనాటి కాలంలో ఎదుర్కొన్న అసమానతలు ఎప్పటికైనా ఆ పరిస్థితులు ఇంకా మారనంతవరకు కాలాన్ని నిలదీస్తూనే ఉంటాయి.
ఫిరదౌసి కావ్యంలోని జాషువా రచనా నైపుణ్యాలతో బాటు తెలుగు సాహిత్యంలో అగ్రతాంబూలమందుకున్న కావ్యాలను గుర్తుకు తెచ్చి తెలుగులో కవిగా అతనెదగడానికి ఎంత శ్రమించాడో అతని భాషా పాండిత్యాలెంత గొప్పవో ఉదాహరణగా తెలిపి నేటి కవులకూ ఆదర్శంగా నిలుస్తున్నది. ఫిరదౌసి కావ్యం నాలుగు ఆశ్వాసాలు గల కావ్యం. కృతి ఆరంభంలో కృతిపతి ప్రశంస చేస్తూ
“బ్రహ్మ కులమున్న గల యన్వవాయములను
రాణఁ జెన్నారు శ్రీ సింగరాట్కులమునఁ
బ్రథితయశుఁడైన మల్లపరాజు గారు
ప్రభవమందెను గొనములు పరిమళింప
ఆరవ్యకీర్తి శాలికి
గోరికలు ఫలింప ముద్దుఁ గొమరుఁడు లక్ష్మీ
నారాయణుండు పుట్టెఁ బ
యోరాశికి, బూర్ణ హిమమయూఖుండు బలెన్”
అంటూ తన 'ముద్దుల కృతి'ని 'కావ్య కన్యామణి'ని ఇస్తున్నట్లు అంకితంగా ప్రకటించేప్పుడు ఆవిధంగా ప్రశంసించాడు జాషువా. తన కావ్యాలలో అంకిత పద్యాలను జాషువా అగ్రవర్ణాల కవుల విధంగానే రచించేవాడు.
'ఫిరదౌసి' కావ్య కథా విశేషాలు గమనిస్తే గజనీ మహ్మద్ తన నిండు కొలువులో పారసీ కవులలో గొప్పవాడైన ఫిరదౌసిని పిలిపించి 'షానామా'ను తన వంశ రాజచరిత్రను రచించి తనకు అంకితం చేయమన్నాడు. ఒక్కో పద్యానికి ఒక్కో దీనారను, అంటే బంగారు నాణెం ఇస్తానని వాగ్దానం చేస్తాడు. అందుకోసం ఫిరదౌసి ముప్పైఏళ్ళు శ్రమించి అరవై వేల పద్యాలతో 'షానామా'ను రచించి తీసుకొని రాజసభకు వస్తాడు. రాజు సంతోషించి చదవమంటే తాను రాసిన షానామాను పండితులున్న నిందు సభలో పఠిస్తాడు ఫిరదౌసి కవి. తర్వాత రాజు కవి ఇంటికి బంగారు నాణేలకు బదులు వెండి నాణేలను పంపిస్తాడు.
బంగారు నాణాలను ఇస్తానన్న పాదుషా వెండి నాణేలు పంపినందుకు అప్రతిభుడై బాధపడి ఫిరదౌసి కొన్ని పద్యాలలో తన అభిప్రాయాన్ని రాసి పంపిస్తాడు. అది పాదుషాకు కోపం తెప్పిస్తుంది. కవిని పట్టి చంపండని భటులకు ఆజ్ఞ వేస్తాడు. ఈ విషయం తెలిసిన వెంటనే ఫిరదౌసి గజనీ పట్టణాన్ని విడిచి భార్యా పిల్లలతో తన స్వగ్రామమైన 'తూసు' పట్టణానికి వెళ్ళిపోతాడు. భయంకరమైన అడవులను దాటుకుంటూ ఎంతో ప్రయాసతో ప్రయాణించి పోయిన ఫిరదౌసి అక్కడే తూసులోనే జీవిస్తుంటాడు.
సామంతరాజులందరు కవిని దుఃఖ పెట్టవద్దని చెప్పడంతో పాదుషా మనసు మార్చుకొని భటులతో అరవైవేల బంగారు నాణేలు ఇచ్చి పంపిస్తాడు కవికి ఇచ్చిరమ్మని. కాని ఏం లాభం? ధనరాశి తూసులోకి తూర్పు ద్వారం నుండి ప్రవేశిస్తూంటూంది. ఇటు పడమటి ద్వారం నుండి పిరదౌసి శవము ప్రేతభూమికి పోతూ ఉంటుంది. వెంటనే రాజభటులు ఆ ధనాన్ని కవి కుమార్తెకు ఇవ్వబోగా, “నా తండ్రిని నిరంతరం దుఃఖ పెట్టిన ఈ నీచమైన ధనాన్ని నేను ముట్టను” అని నిరాకరిస్తుంది. ఈ ఘోరవార్తను విన్న మహ్మద్ కవి పేరుతో ఒక నక్షత్రశాలను తూసు పట్టణంలో కట్టిస్తాడు. ఆ చిహ్నాలు నేటికీ ఇందుకు రుజువుగా నిలుస్తున్నాయి. కాని ఒకరికి కీర్తి, ఒకరికి అపకీర్తి దక్కింది. ఇద్దరూ కాలగర్భాన కలసిపోయారు. కీర్తి అపకీర్తులు కీర్తనల్లో నిలిచాయి అంటూ జాషువాగారు ఒక చారిత్రకాంశాన్ని లోకమనస్తత్వ చిత్రీకరణలతో కావ్యంగా చిత్రించి శాశ్వత పరిచారు. ఈ పద్య విశేషాలలోని జాషువా పాండిత్య శక్తిని, భాషావధూటి సౌందర్యాన్ని తెలుసుకుందాము.
మును గజినీ మహమ్మదు, డభూత పరాక్రమశాలి, వీర వా
హినుల బలంబుతో, బదియు నెన్మిదిమాఱులు కత్తిదూసి చి
క్కని రుధిరంబులో భరతఖండము నార మొనర్చి సోమనా
థునిఁ బెకలించి, కైకొనియె, దొమ్మిదివన్నెల రత్నరాసులన్.
భారతదేశ సిరిసంపదలను దోచుకునేందుకు పద్దెనిమిది మార్లు యుద్ధాలు చేసినాండంటే గజనీకి “బంగారు నాణెముల్ బస్తాలకెత్తించి... గుట్టాల మూపులగుస్తరించిన విధానం తెలిసిపోతుంది” సమస్త దేశ సంపదనంతా ఎత్తుకెళ్ళిన గజనీ
పదియునెనిమిది విజయరంభల వరించి
గాంగజలమున నెత్తుటి కత్తి గడిగి
సర్వము హరించి హిందుదేశంబు విడిచి
గజిని మామూదు గజనీకిఁ గదలిపోయె. అంటూ చారిత్రకాంశాలను కవిత్వంలో శాశ్వతం చేస్తూ జాషువా ఆనాటి చరిత్రను రాస్తూనే
భారత క్షోణిఁగల్గు దేవస్థలములు
చెదరి గజనీ పురాన మసీదులయ్యె
నిప్పటి మసీదు లేరూప మెత్తఁగలవొ
కాలమెఱుగును, ధారుణీ గర్భమెఱుగు అంటారు జాషువా కాలమహిమను ప్రస్తావిస్తూ.
అటువంటి గజనీ క్రమంగా భారతదేశ ఔన్నత్యాన్ని హరిస్తూ తనదైన నిర్దయ పాలనను కొనసాగిస్తూ తన భోషాణాన్ని నింపుకొన్నాడు. ఇక్కడ కవిగా జాషువా గారు చమత్కరించిన విషయాన్ని గమనిస్తే..
హిందువుల దోర్బలము నాశ్రయించి బ్రతుకు
ద్రవ్యసంపద, తురక భూధవునిఁజేరి
కాపురంబుండె నతని ఖడ్గమును వలచి
సిరి నిజమ్ముగ వట్టి టక్కరిది సుమ్ము" అంటారు.
ప్రాబల్యం ఉన్నవాడి చెంతకే డబ్బు చేరుతుందన్న సామాజికాంశాన్ని ఆనాటి సమాజంలో జరిగిన విధానానికి ఆపాదించి చెప్పారు. పిరదౌసి కవిని సభకు పిలిపించుకుని తన గొప్పనంతా గ్రంథస్థం చేయమని నిండుసభలో చెప్పిన సందర్భంలో అతని మాటలు విని “యద్భుతావేశ మంగంబు నాక్రమించే స్వాంతమునఁ దోఁచె నూత్న నిసర్గ కవిత” అని పిరదౌసి హృదయంలో సహజ కవిత పుట్టిందని జాషువా అంటారు. ప్రభువు చరిత్ర రాయడమంటే, అందులోనూ స్వయంగా అతనే కోరినందున రాయడమంటే నిజంగా గొప్ప విషయం కదా! అందుకే ఒక చెప్పలేని ఆవేశం అతని శరీరంలో కలిగిందనీ, మనసులో ఒక కొత్తదైన త్యాగశీల స్వభావం కవితలాగా కదలాడింద”ని, ఆ నిసర్గ కవిత్వం కోసం ఫిరదౌసిలో ఉప్పొంగిన భావాలన్నింటినీ అందంగా పద్యరచనలో పొదిగారు జాషువా!
ఫిరదౌసి కావ్యంలోని కవితాభివ్యక్తిని పరిశీలిద్దాం. స్వర్ణకారుడు బంగారాన్ని మూల వస్తువుగా తీసుకొని నగ చేసినట్లు కవులు మూలకథను తీసుకొని కథను అల్లుకుపోతారు. జాషువాగారు చారిత్రకాంశానికి ప్రాణం పోసి కావ్యమల్లారు. ఇంతగా కాన్సెప్ట్ కు దగ్గరగా ఇలా కావ్యం రాసి కవిప్రపంచంలో పేరెన్నిక గన్న కవులు అరుదుగా ఉంటారు. రాజులను మంచిమంచి విషయాలతో వర్ణించాలని ఎంతో గొప్ప వర్ణనలతో వారి వంశం పైనా, వారి ప్రజాపాలనపైనా, వారి యుద్ధనైపుణ్యాల పైనా అతిశయిస్తూ రాస్తారు కవులు. ఫిరదౌసి రాసినట్టే ఆ వర్ణనలకు రూపమిస్తూ జాషువా యుద్ధతీవ్రతను వర్ణించేప్పుడు గంగా జలంలో కత్తిని కడిగాడని చెప్పడమనేది మహమ్మదీయ దండయాత్రల పరంగా కాజ్ అండ్ ఎఫెక్ట్ Cause and Effect తెలుపడమన్నట్టు ఇది హిందువులను పరోక్షంగా జాగృపరచటమే.
ఇలాగే జాషువా గారి భాషా పాండిత్యాలెంత గొప్పగా యో ఉదహరించడానికి ఈ ఫిరదౌసి కావ్యంలో అనేక వాక్యాలు ఉన్నాయి.
“విత్తనంబున మహావృక్షంబు నిమిడించి
సృష్టించి గారడీ సేయువాఁడ
కడుపులో శిశువును గల్పించి పదినెలల్
మోయించి యూపిరి వోయువాఁడ”
అంటూ రాసిన ఈ సీసపద్యంలోని విశేషాలైతేనేమి,
సంజకెంజాయలో జలకంబు సవరించి
పటెతెంచు సూర్యబింబమ్ములోన
పదునాఱు దినముల పరువు వచ్చిననాఁటి
చంద్రుని ధవళ హాసములలోన...” అంటూ వర్ణించిన ఈ వర్ణనలైతేనేమి భాషపై జాషువాకున్న పట్టును, భావనాశక్తి ప్రకటన శైలిని తెలుపుతాయి.
అట్లాగే ద్వితీయాశ్వాసంలో ప్రకృతి వర్ణనలో
ఉ॥ ఈ తొలికోడి కంఠమున నే యినబింబము నిద్రపోయెనో
రాతిరి, తూర్పుగొండ అభిరామములైనవి, దీని వక్రమం
గూఁతలమ్మా మేమి? కనుఁగొమ్మని యల్లన హెచ్చరించి ప్రా
భాత సమీర పోతములు పై కొనియెం దొలి సంజకానుపుల్”
అంటారు జాషువా. ఈ కవిత్వ రచనా శిల్పం గానీ, వర్ణనా నైపుణ్యంగానీ శాశ్వత కీర్తిని తెచ్చి పెట్టేలా ఉన్నవి. తొలికోడి కంఠంలో ఏ సూర్యబింబమో నిద్రించిందట. రాత్రి అనడమిది. తూర్పుకొండ అభిరామంగా వుందనడం ఎంత గొప్ప ఊహతో రాసారో జాషువా గారు! ఫిరదౌసి ఎంతో కష్టానికోర్చి కావ్యాన్ని రాసి ఇస్తే రాజు తాను అన్న మాటను నిలుపుకొంటూ బంగారు నాణేలు ఇవ్వకుండా, వెండి నాణేలు ఇవ్వడమనేది ఈ కావ్యంలోని ముఖ్య విషయం. రాజుల ప్రలోభాలు ఎలా ఉంటాయో, రాజు మనస్తత్వాలు ఎలా ఉంటాయో ఈ కావ్యం ద్వారా తెలుస్తుంది. What is జాషువా అనే గాదు! What is Poetry అనేది తెలుస్తుంది. కవిత్వం అభివ్యక్తీకరించిన భావాలతో పాటు ఆనాటి సామాజిక స్థితిగతులు తెలుస్తాయి.
తనకు బంగారు నాణేలు ఇస్తానని చెప్పి వెండి నాణేలు ఇచ్చాడని, తెలిసి వాటిని తాను తీసుకోనని తిరస్కరించి తక్షణమే నగరం విడిచి చెప్పి వెళ్ళిపోయాడని ఫిరదౌసి మీద కోపగిస్తాడు వెంటనే కవి మనసు ఎలా ఉంటుందో చెప్తూ,
చ|| కృతియొక బెబ్బులింబలె శరీర పటుత్వమునాహరింప, శే
షితమగు నస్థిపంజరము జీవ లవంబున నూఁగులాడఁగా
బ్రతికియుఁ జచ్చియున్న ముదివగు మహమ్మదు గారి ఖడ్గదే
వతకు రుచించునా? పరిభవవ్యథ యింతటనంతరించునా?
నన్ను చంపడానికి రాజు పూనుకున్నాడూ అంటే, నేను ధిక్కరించినానని కదా, కావ్యరచనతోనే చిక్కినటువంటి నేను, ఎముకలగూడుగా మిగిలిన నా శుష్కించిన శరీరం రాజు ఖడ్గదేవతకు రుచిస్తుందా? అని ఫిరదౌసి అనుకున్నట్టు రాయడం జాషువా గారి ప్రతిభకు నిదర్శనం. 'ఏదో జీవలవంబుతో' అంటాడు. జీవ లవంబు అంటే అతితక్కువ ప్రాణమున్నది అనడం. అట్లాగే “ఈ కావ్య సముద్రం ముత్యాలను అందిస్తుందని మునకలేసి ముత్యాలు ఏరుకున్నానా అని చెప్పిన సందర్భంలోనూ ఒక్క ముత్యాన్ని నేను పొందలేదు చివరకు సముద్రం నన్ను మింగటానికే నోరు తెరచింది అనుకుంటాడు ఫిరదౌసి” అని రాయడంతో ఫిరదౌసి చరిత్రను అజరామరం చేసిన జాషువాగారి కవితా శైలిని ఎన్నివిధాలుగానో ప్రశంసించవచ్చు. ప్రతిభను ఎత్తి చూపవచ్చు. ఇక్కడ జాషువా గారు మనుషుల మర్మాలను ఒక మనస్తత్వ శాస్త్రవేత్తగా చెప్పిన విధానం గమనించాలి. 'ఒక్కో రాజుల కీర్తి ఒక్కో విధము” ఇక్కడ రాజు వాగ్దానం ఇచ్చి అది తీర్చలేదు. తీర్చని కారణం కేవలం రాజదర్పం. ఇక కవి నిర్లక్ష్యాన్ని సహించకపోవడం. ఇంత జరిగినా మిగతా ముస్లి దొరలు రాజునేమీ అనకపోవడం, కిక్కురుమనని విధానాన్ని రాసాడు జాషువా. ఫిరదౌసి కావ్య రచనా ప్రౌఢిమకు రాణివాసం మొత్తం ఆశ్చర్యపోతుంది. కాని సభలోని రాజులే ఈ అన్యాయాన్ని చూసి మాట్లాడనప్పుడు ఇక రాణివాసం ఎట్లా ఎదిరిస్తుంది?
సభ అంతా భేష్ భేష్ అని ఊగిపోయింది. అటువంటిది తర్వాత రాజు ఇట్లా ఎందుకు చేసాడో అని ఫిరదౌసి అనుకున్నప్పుడు “పండితులేమి చెప్పిరో” అని అనుకోవడం ప్రతిభావంతుల పట్ల ఉండే నిర్లిప్తతను మానవ నైజాన్ని నిరూపింపజేయడం అనే ఒక క్లూను జాషువా గారు చక్కగా వ్యక్తీకరించారు.
పూర్వకవుల రచనాగరిమకు తీసిపోకుండా, కావ్య ప్రయోజనం చెడిపోకుండా కవి గౌరవాన్ని అభివ్యక్తం చేస్తూ కావ్యాన్ని ముగింపుకు తీసుకురావడంలో సహృదయ పండితులకు జాషువా నైపుణ్యం తెలుస్తుంది. పాలక పాలిత వ్యవస్థలోని ఈ ఘట్టాన్ని బట్టి రాజు ధర్మం తప్పడం అనేది ఈ కథకు ముఖ్యమైంది. ఫిరదౌసి రాజ్యాన్ని విడిచివెళ్ళడం. ఆ బాధతో శుష్కించి మరణించడం అదే సమయానికి రోజులో కనువిప్పు కలగడం, తాను ముందు చెప్పినట్లు బంగారు నాణేలను అతనికి పంపడం ఆ ధనంతో భటులు వచ్చే సమయానికి, కవి మరణించాడనీ – శవం అటునుంచి వెళ్ళిపోయే సమయానికి బంగారునాణేలు ఇటు నుంచి వచ్చాయని రాస్తే పాఠకుల కళ్ళు చెమరించవూ! ఇది కదా కావ్యకల్పనా నల్ప శిల్పమనిపించదూ!
అయితే ఇక ఇక్కడ చెప్పాల్సిన ముఖ్య విషయం ఫిరదౌసి కుమార్తె దగ్గరికి వెళ్తుంది. తండ్రి లాగానే ఆమె కూడా అభిమానవతి! తన తండ్రిని వేదనకు, దుఃఖానికి గురిచేసిన ఆ ధనం నాకక్కరలేదని తిప్పి పంపిస్తుంది. ఫిరదౌసి కావ్యానికి ఇదే కేంద్రమైన స్థానం. గురజాడ రచించిన పూర్ణమ్మను తలపిస్తుంది. “రాజుకు అపకీర్తి భావనం ఏర్పడింది, కన్యకకు కీర్తిభావనం ఏర్పడింది” అని చెప్పిన గురజాడ గారి పంక్తులు గుర్తుకువస్తాయి. ఫిరదౌసి కుమార్తె రాజును ధిక్కరించి ఉండకపోతే, ఆ బంగారు నాణాలను తీసుకొన్నట్లైతే ఈ చరిత్ర కథగా ఇన్ని మలుపులతో రాయబడకపోయేది. ఆ ధనమంతా ఫిరదౌసి సంతానానికి ఎట్లాగూ హక్కు ఉంటుంది కాబట్టి ఆమె తీసుకోదగినవే! కాని తీసుకోదు. ఇది తండ్రి ఆత్మాభిమానాన్ని పుణికిపుచ్చుకున్న ఆమె ఆత్మాభిమానాన్ని సూచిస్తుంది. ఆమె తిరస్కరించినందుకే కవి కీర్తి అజరామరమై మనముందు ఈ కావ్యంగా నిలిచింది.
ఇంత చక్కని కథలను కావ్యంలో మలిచిన జాషువా గొప్పతనం అభినందనీయ జాషువా నాటి పండితలోకం అబ్బురపడి జాషువా గారి కాలికి గండపెండేరం తొడిగిన ఘట్టం, గజారోహణం చేయించిన ఘట్టం, స్వర్ణ కంకణ సమర్పణల సార్థకములేనని అంగీకరించక తప్పదు గాక తప్పదు. 'కవి కోకిల' బిరుదును సార్థకం చేసుకున్న జాషువా గారి రచనా పాటవాన్ని మొత్తం అధ్యయనం చేసి ఆనందించాలి అంతేగాని, ఏదో ఒక గాటన కట్టేయకూడదు. కవి ప్రతిభ, పాండిత్యం మరుగున బడకూడదు.
'ఫిరదౌసి' కావ్యం జాషువాగారి రచనా కౌశలంతో కావ్యం ముగింపులో మహాజ్వాలగా మెరిసింది. రాజు ఆ ధనరాశితో ఫిరదౌసి పేరున సత్రం గట్టించి చిరస్థాయిగా నక్షత్రశాలను సృష్టించిన విషయాన్ని కావ్యం యొక్క ప్రధాన ఉద్దేశాన్ని విస్మరించకుండా కవి కీర్తికి న్యాయం జరిగినట్టుగా ముగించాడు జాషువా. భౌతికంగా శరీరంతో ఆనందించ లేకపోయినా అతడు కీర్తి శరీరం చేత ఆనందించేట్లు మనచేత చదివేటట్టు చేసిందీ రచన. ఇందుకు కారణం రాజును ధిక్కరించిన కవికుమార్తె ఆత్మగౌరవం ఆదర్శమైందని నిరూపితమైంది! పులి కడుపున పులిబిడ్డ పుట్టినట్లు ఫిరదౌసి కూతురు అబ్బురమైన అభిమానపు బెబ్బులికూనగా చిరయశస్సును సంపాదించుకున్న ధన్యురాలు.

మహేతిహాసంలో మహిళా మణి
డాక్టర్ దాసోజు పద్మావతి
భారతీయ పురాణాల్లో వందలాది స్త్రీ మూర్తుల గాథలున్నాయి.ఆ చరిత్రలన్నీ అధ్యయనం చేయదగ్గవే. పురాణాల్లోని స్త్రీ మూర్తుల జీవనపథం తెలుసుకుంటే మనకు ఏమిటి ప్రయోజనం ? అనే ప్రశ్న ఈ నాటిది కాదు. కానీ మనం నిశితంగా పరిశీలిస్తే వారు సత్య- ధర్మ తత్పరులు, స్వేచ్ఛగా తమ అభిప్రాయాన్ని ప్రకటించినవారు. పురుషులతో సమానంగా వ్యవహార జ్ఞానం కలిగి ఉన్నారు. క్లిష్ట సమయాల్లోధైర్యంగా వ్యవహరించారు. అన్యాయాన్ని అనుక్షణం ఎదురిస్తూనే ఉన్నారు. జనహితం కోసం, దేశక్షేమం కోసం త్యాగం చేశారు. జ్ఞానజ్యోతులై నేటి ఆధునిక వనితలకు ఆదర్శ ప్రాయులైనారు.
మహాభారత మహేతిహాసములో మహిళలు అనగానే మనకు మొదట స్ఫురించే పేరు ద్రౌపది.ఆ తరువాత
రాజమాత కుంతి, గంగా,సత్యవతి మాత. గాంధారి ఇలా ఎందరో ఉన్నారు. ఆయా సందర్భాల్లో కనిపించే వీరికి వారివారి ప్రత్యేక వ్యక్తిత్వాలున్నాయి. ఆ వివరాలు మనకు తెలియాలంటే భారత హృదయం తెలియాలి. వ్యాసుని వేదన అర్థం కావాలి.
మహాభారతంలోని పాత్రలన్నీ ధర్మం చుట్టూ పరిభ్రమించేవే,ఇది భారతీయ ధర్మం. భారత ధర్మం. ఈ ధర్మాన్ని అనుసరించి అందరూ సుఖంగా, ప్రశాంతంగా జీవించాలన్నది ఆకాంక్ష..
యాజ్ఞసేని:-
మహాభారతంలో మహిళామణులు ఎందరున్నా ద్రౌపదిని గూర్చి చెప్తేనే ఈ మహిళా భారతం పూర్ణత్వాన్ని సంతరించుకుంటుంది.
ద్రౌపతి యజ్ఞంలో పుట్టింది. యాజ్ఞసేని. ఆమె కృష్ణవర్ణ. పాంచాల రాజపుత్రిక పాంచాలి. దృపదుని తనయ. ఆమె వర్చస్వి, తేజస్వీ, ఓజస్వీ, తపస్వీ ,ధర్మాధర్మ ప్రజ్ఞా వచస్వి.
పంచ భూతాలే ఐదుగురుగా జన్మించారనుకుంటే శరీరాలు వేరైనా ఒకే ప్రాణంగా మెలిగిన పంచ పాండవుల సతియామె.
ద్రౌపదిని ధర్మరాజు మాయాజూదంలో ఒడ్డాడు. మొదట జూదంలో అన్ని కోల్పోయాడు. తర్వాత తన గర్వానికి కారణమైన సోదరులను ఆ తర్వాత ద్రౌపదిని జూదంలో ఫణంగా పెట్టి ఓడిపోయాడు. ద్రౌపదిని నిండు సభలో కి లాక్కొని వచ్చాడు దుర్యోధనుని ఆజ్ఞ మేరకు దుశ్శాసనుడు. అప్పుడు ద్రౌపది అడిగిన ప్రశ్న ఈ నాటికీ ప్రశ్నార్థకంగానే నిలిచింది.
ద్రౌపది పంచ పాండవులకు పత్ని.ధర్మరాజు తాను మొదటి ఓడిపోతే ఆమెను పణంగా పెట్టడానికి వీలు లేదు. ఎందుకంటే ఓడిపోయిన తర్వాత ఆమెపై అధికారం లేనట్లే లెక్క. మొదట ఫణంగా పెట్టడానికి వీలు లేదు. ఎందుకంటే తన నలుగురి సోదరుల అనుమతి తీసుకోకుండా, పైగా ఆమె అనుమతి కూడా లేకుండా పందెం కాయ రాదు.కనుక ఆమె అంగీకారం తీసుకొక పోవడం పెద్ద తప్పు. ద్రౌపది వస్తువు కాదు.అంతేకాదు ధర్మరాజుకు తన తమ్ములను కూడా పణంగా పెట్టే అధికారం లేదు. ధర్మరాజుకు తన మీద, తనకు లభించిన అర్ధ రాజ్యం మీద తప్ప మరి దేని మీద అతనికి అధికారం లేదు. అందుకే ద్రౌపది పరమ విజ్ఞతతో పై ప్రశ్నలను లేవనెత్తింది.
నిర్భయంగా నిండు సభలో ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానం లేదు.ద్రౌపది వస్త్రపహారణ తర్వాత
దుర్యోధన దుశ్శాసనులను భీముడు సంహరిస్తానన్న ప్రతిజ్ఞ చేసాడు.ఆ ప్రతినతో కౌరవ సభ దద్దరిల్లింది. ద్రౌపది ఆవేదనతో శపించడం మొదలుపెట్టింది.
ద్రౌపదిని శాంత పరిచారు గాంధారి, కుంతి. ధృతరాష్ట్రుడు బెదిరిపోయి ద్రౌపదిని వరాలు అడగమన్నాడు. ఆమె కోరిక మేరకు పాండవులకు విముక్తిని ప్రసాదించాడు. వారి రాజ్యాన్ని వారికి ఇచ్చేశాడు . పాండవులకు తమ భూమి మీద హక్కు లభించడానికి,
వారు దాస్యం నుండి విముక్తులు
కావడానికి కారణం ద్రౌపది.
అరణ్యవాసంలోను భర్తలతో పాటు అష్టకష్టాలు పడింది. అజ్ఞాతవాసంలో కామకుడైన కీచకుని హడలు కొట్టిన తీరు స్త్రీ జాతికే శౌర్య పరాక్రమాలు నేర్పినట్లు అనిపిస్తుంది.
కీచక ఉప కీచకుల వధకు ప్రధాన కారకురాలై నిలిచింది.
అరణ్య అజ్ఞాత వాసాల
తరువాత శ్రీ కృష్ణుడు రాయబారానికి వెళ్లడానికి ముందు పలికిన పలుకుల వల్ల ఆమె మండే అగ్నిగోళంలా కనిపిస్తుంది.
దుశ్శాసనుని వేళ్ళుతగిలి తెగిన వెంట్రుకలను రాయబారానికి నువ్వు వెళ్లినప్పుడు గుర్తుంచుకో మని శ్రీకృష్ణుడికి చెప్పిన తీరు ఆమె వేదనను తెలియజేస్తుంది. చివరగా ఒక మాట అంటూ నేను ఇన్నాళ్లు అగ్ని ఒడిలోనే కూర్చొని ఉన్నాను అంటుంది. పాండవులు ఎవరు ఇంత గట్టిగా అనలేదు. వారిలోని చైతన్యానికి శక్తిని ప్రసాదించింది ద్రౌపదే. జూదం తర్వాత స్వర్గారోహణ పర్వం వరకు పాండవులను నడిపింది ద్రౌపది. అశ్వద్ధామ కారణంగా ఐదుగురు కొడుకులు చనిపోయినప్పుడు ఆమె గర్భశోకం వర్ణనాతీతం. కానీ తనలాగా పుత్రశోకంతో అశ్వత్థామ తల్లి మనగలగడం తనకిష్టం లేదని అతని క్షమించి వదిలిపెట్టమని భీమార్జునులను వేడుకుంది. ఎంత వీరత్వమొ అంతటి దయ.
ఎంత స్వాభిమానమొ అంతా ఆత్మ ప్రత్యయం
భారత ఇతిహాసంలో త్రిమూర్తులు అందరూ ఆ యుగానికి సరిపడా వేదనను అనుభవించిన వారే ధైర్యసాహసాలతో ఎదుర్కొంటూ ధైర్యం గా నిలిచిన వారే
కృతయుగంలో సత్యానికి తలవంచి చంద్రమతి అమ్ముడుపోయింది.
త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని ధర్మపత్ని సీతమ్మ రావణాసురుని
చే అపహరణకు గురి అయింది.
ఇక ద్వాపరంలో నిండు సభలో విజ్ఞులైన పెద్దల సమక్షంలో వస్త్రాపహరణకు గురి అయ్యింది ద్రౌపది.ఆధునిక మహిళా -అన్నింటికి
గురౌతుంది.కాని సంయమనంతో సమయస్పూర్తితో సమస్యలను ఎదుర్కొంటుంది ఆధునిక మహిళ.
మహాభారతంలో ద్రౌపదిదీ కీలక భూమిక.అందుకే భారతాన్నీ ద్రౌపదీ యమని పిలుస్తారు.అసలు భారతమే
మహిళా భారతం.ఏపాత్ర తన వ్యక్తిత్వాన్ని వదులు కోలేదు.
స్వాభిమానాన్నీ చంపుకోలేదు.
కాలానుగుణమైన మార్పులను అర్థం చేసుకొని నాటి పరిస్థితులను బేరీజు వేసుకుని-ఆధునికతతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతోంది ఆత్మాభి మానతో ఆధునిక మహిళా.
ఎన్ని సమస్యలు ఎదురైన ధైర్యం గా తన ఆత్మాభిమానాన్ని కాపాడు కుంటున్న స్త్రీ మూర్తులకు స్పూర్తి ప్రదాత ద్రౌపది.
తెలుగు అధ్యాపకులు గురుకుల డిగ్రీ కళాశాల-
ఇబ్రహీంపట్నం.

తరతరాల తెలంగాణ -1
నిజాం కాలంలో భూములు - వివరాలు
తంగెళ్ళశ్రీదేవిరెడ్డి
సమాచారం : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి
భూమి స్థిరాస్తి. ఏ కాలంలో అయినా భూమికి ప్రాధాన్యత ఉన్నది. నిర్ణయించబడిన లేదా కేటాయించబడిన భూముల వివరాలు ఒక చరిత్ర. ఈ క్రమంలో నిజాం సర్కారు కాలంలో భూములు చరిత్ర గతినే మార్చాయి.వాటి వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది.. మరి వాస్తవానికి నిజాం రాజ్యంలో ఉన్న భూములు.... వాటి వివరాలు ఏమిటీ?
భారతదేశం దేశీయ సంస్థానాలు అన్నింటిలో హైదరాబాదు సంస్థానం అతిపెద్దది. ఇది 82.698 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో, పంచకోణం ఆకృతిలో. ఉండేది. దీనికి అనుబంధంగా 14 చిన్నా పెద్దా సంస్థానాలు ఉండేవి.. సంస్థానం మొత్తం ఆదాయం లో భూములదే మొదటి స్థానంగా ఉండేది. భూములు దొరలు దేశ్ముఖ్ ల అధీనంలో అధికారికంగా ఉండేవి.. ప్రభుత్వం తమ ఆదాయ మార్గం కోసం భూములను కొన్ని షరతుల ప్రకారం దొరలకు కేటాయించేది..
భూముల కేటాయింపు సర్కారు నిబంధన అయినప్పటికీ, కొందరు దొరలు సర్కారుకు సంబంధం లేకుండా భూములపై అధికారం పొందేవారు.
అప్పుల కిందికి పొలాలు జమచేసుకోవడం, ఎదుటి వాళ్ళ సమస్యను అవకాశంగా తీసుకొని భూములు చౌకగా కొనుక్కోవడం , అట్లాగే అవసరాలకు అమ్మిన పొలాలు కూడా కొనుక్కో వడం జరిగింది.
ప్రజల భూములు పంటపొలాలు గా మాత్రమే ఉండేవి. పంట నిబంధనలు కూడా కొనసాగేవి. సర్కారు భూములు మాత్రం వివిధ రకాలుగా విభజన జరిగి ఉండేవి.
1.దివానిపొలాలు :
నిజాం రాజ్యంలో భూస్వామ్య వ్యవస్థ అమలులో ఉండేది. వ్యవసాయం కింద 5 కోట్ల 30 లక్షల భూములు ఉన్నాయి. వీటిలో 3 కోట్ల ఎకరాలు ప్రభుత్వ భూమి శిస్తు వ్యవస్థ కింద ఉండేవి. అంటే 60% పొలాలు నిజాం ప్రత్యక్ష పాలన కింద ఉండేవి అన్నమాట. వీటినే దివాని లేదా ఖల్సా పొలాలు అనేవారు.
2.జాగీర్దారీభూములు :
కోటి యాభై లక్షల ఎకరాలు జాగీర్దారీ పొలాలు. అంటే ఇవి మొత్తం 30%భూములు. ఇవి సంస్థానాధీశులు, జాగీర్దార్లు, ఖజానాదార్లు, ఇనాందార్లు,పైగాలు, అగ్రహారీకులు వంటి భూస్వామ్య వర్గాల కింద ఉండేవి. సంస్థానాలు నిజాం రాజ్యానికి సామంత రాజ్యాలుగా ఉండేవి.
3 సర్ఫ్ ఎ ఖాస్ :
10% పొలాలు ఈ విభాగం కింద ఉండేవి. ఇవి నిజాం సొంత కమతం.వీటి కింద వచ్చే ఆదాయం నిజాం సొంతం ఖర్చులకు వినియోగించబడేది.హైదరాబాద్ చుట్టుపక్కల ఈ పొలాలు ఉండేవి. వీటిని 'అత్రాఫ్ బల్దా ' అనికూడా పిలిచేవారు. అత్రాఫ్ అంటే పరిసరాలు అని, బల్దా అంటే నగరం అని అర్థం. ఇవి 8.100 చదరపు మైళ్ళ వరకు 18 తాలూకాల్లో విస్తరించి ఉండేవి.
4 పైగాలు లేదా పాయోగాలు
జాగీర్ భూముల్లో పైగాలు లేదా పాయోగాలు అనేవి కేవలం రాజ బంధువులకు సంబంధం ఉన్న పొలాలు. వీరు ఈ భూములను అనుభవిస్తూ సొంతంగా సైన్యాలను పోషించేవారు. యుద్ధ సమయాల్లో రాజుకు తోడ్పడేవారు. ఇట్లా తెలంగాణ మొత్తం మీద 10 వేల గ్రామాల్లో 2600 గ్రామాలు జాగీరు గ్రామాలుగా ఉండేవి. జాగిరుల్లో ఒకరైన సంస్థానాధీశులు దొరలకు సొంతంగా పన్నులు విధించే అధికారం ఉండేది. పన్నులు వసూళ్లు చేసేందుకు సొంత రెవెన్యూ అధికారులు కూడా ఉండేవారు. ఈ క్రమంలోనే కొందరు తెలంగాణ దేశ్ముఖ్ లు దేశ్ పాండేలు రైతుల నుండి విపరీతంగా పన్నులు వసూళ్లు చేసారు.పన్నులు కట్టని రైతుల నుండి పన్నుల కిందికి భూముల్ని ఆక్రమించుకున్నారు కూడా. కొందరు దొరలు పంటలు పేరుతో అధిక వడ్డీకి ఋణాలు ఇచ్చారు. అవి చెల్లించని రైతుల నుండి భూములు తీసుకున్నారు. ఇక్కడ వడ్డీ అనేది ఆ కాలంలో చాలావరకు ''నాగు '' పేరుతో కొనసాగేది. అంటే ఒకటికి రెండింతలు తిరిగి చెల్లించడం. చెల్లించుకోలేక పోయినా భూములు సమర్పించు కోవాల్సిందే.
బగీలా పొలాలు
ఇక '' బగీలా '' అనేది అనేది అట్టడుగు ప్రజలను బానిసలుగా పరిగణించిన విధానం. ఈ పద్దతిలో ఇంటికి ఒక్కరు తప్పనిసరిగా ఊడిగం చేయవలసిందే. చేయక పోతే జరిమానాలు కట్టుకోవాలి. కఠినమైన శిక్షలు అనుభవించాలి. ఈ బగీలా విధానంలో దొరల యాజమాన్యం కింద ఉన్న పొలాల నుండి ఒకటి నుండి రెండు లేదా మూడు ఎకురాలు కేటాయించేవాళ్లు. వాళ్ళు ఆ పొలాలను సాగుచేసుకోవాలి. కౌలు కిందికి ఎట్టి చేయాలి. శిస్తు సదరు దొరలే చెల్లించుకోవాలి. కాగా భూములు ఇచ్చామనే జులుంతో కొందరు భూస్వాముల హయాంలో గ్రామాల్లో శ్రమదోపిడి అనివార్యంగా జరిగింది. ఒకటికి నాలుగింతల పని తీసుకోవడం జరిగింది. ఎట్టి మనిషి మరణించినా, ఆరోగ్య పరిస్థితుల్లో ఎట్టి మానేసినా, ఎట్టి పొలాలు ఎనక్కి తీసుకోవడం జరిగింది. అయితే చరిత్రలో వెట్టిచాకిరి వికృత రూపాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఆవిష్కరణ చేశారు. కానీ ఎట్టి పొలాలు గురించిన వివరాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. మరుగున పడేసారు.
ఇంకో ముఖ్య విషయం.... వెట్టి కిందికి కొన్ని కులాలు మాత్రమే కేటాయింపబడేవి.
దళితులు పొలాల్లో పనిచేయాలి. గడి బయట పనులు చేయాలి.
బెస్త వాళ్ళు కావడిలు మోయాలి. దేవాలయాలు శుభ్రం చేయాలి. దొరసాని పల్లకి మోయాలి.
గొల్ల వాళ్ళు గడి మొత్తం తిరుగొచ్చు. వీళ్ళు వంట పని, ఇంటి పని చేయాలి. దొరసానికి కాలక్షేపం కూడా వీళ్ళే. ఒకరకంగా గొల్ల కులస్థులు దొర ఇంటి మనుషులుగా వ్యవహరించబడే వాళ్ళు.
ఇనాం భూములు
ఈ భూములను ఎక్కువగా బ్రాహ్మణులు, కోమట్లు, సైనిక దళాలు ఎక్కువగా అనుభవించాయి. ఇవి శాశ్వత కానుకలు. వెనక్కి తీసుకునే ఆస్కారం లేనివి. ఈ పొలాలు మొత్తం సంస్థలు, సంఘాలు, దేవాలయాల పేరుమీద నమోదు చేయబడ్డాయి. పెద్ద మొత్తంలో కూడా ఉంటాయి. బ్రాహ్మణులు ఇనాం భూముల్ని అనుభవిస్తూ దేవాలయాలను పరిరక్షించాలి. ఎవ్వరు పౌరోహిత్యానికి కుదిరితే వాళ్ళే ఈ భూముల్ని అనుభవించాలి. ఇక కోమట్లు ఆనాటి సహకార సంఘాలు. వీళ్ళు ప్రజల ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, కష్టకాలంలో ఉద్దెరలు ఇవ్వాలి, పంటలకు నాగులు ఇవ్వాలి. ఇక సైనికులకు ఇతర అధికారులకు, కేటాయించే ఇనాం భూములు చేసిన సహాయానికి కృతఙ్ఞతలుగా లేదా చూపెట్టిన ప్రతిభ / సాహసానికి గుర్తింపుగా ఉండేవి.
ఉత్పత్తి కులాలకు కూడా శ్రమ ఫలితంగా ఇనాం భూములు కేటాయించబడ్డాయి.
ఇవన్నీ చరిత్ర ఆధారంగా అట్లాగే ఇప్పటికీ బతికి ఉన్న అప్పటి తరం చెప్తున్న ప్రకారంగా, మనకు తెలుస్తున్న నిజాలు. మరి ఇక్కడ కనిపిస్తున్న పొలాల ముఖచిత్రంలో ఎక్కవ మొత్తం పెద్ద తలకాయల అధీనంలో ఉన్నాయి. భూములు కలిగి ఉండటం ఎంత పరపతో, ఆ భూములు నుండి ప్రభుత్వానికి పన్ను చెల్లించడం కూడా అంతే పరపతి !! ఎవ్వరి నుండి ఎంత ఆదాయం వస్తుంది అనేది రికార్డు అయ్యేది. ఎక్కువ మొత్తంలో చెల్లించే అట్లాగే సకాలంలో చెల్లించే దొరలకి సర్కార్ వద్ద ఎక్కువ పరపతి ఉండేది.
+91-8555895827
రచయిత్రి / సామజిక వేత్త / చరిత్ర పరిశోధకురాలు

ఆధార్ కార్డ్
లావణ్య
ఈ దేశంలో ఆధార్ కార్డ్ కి ఎంత విలువ వుందో మనకు తెలుసు! అది మనకు ఒక identity card ఒక బ్యాంక్ ఖాతాకి వంటి ఎన్నో వాటికి identity అవుతుంది.. ప్రాణం లేని ఆధార్ కార్డ్ కే అంత విలువ వుంటే , ప్రాణం వున్న , ప్రాణం పోస్తూ వున్న మగువకి తగినంత విలువ లేదు.
జీవితంలో ప్రతి స్థాయిలో అతి ముఖ్యపాత్ర వహించేది స్త్రీ.. పుట్టుకతో మొదలు పెడితే ప్రాణం గాలిలో కలిసి పోయే వరకు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటుంది. తన మనసుని, తనువును , తన ఆలోచనలను, కలబోసి ఎన్నో రకాల మనస్తత్వాలను అర్థం చేసుకుంటూ, తనకు తానుగా నిలబడే శక్తి మగువ... ఈ సమాజం లో ఆమె ఎన్నో వివక్షలు ఎదుర్కొంటూన్నది.
పుట్టినపుడు మహాలక్ష్మి అంటారు కొందరు దరిద్రం ఆడపిల్ల అంటారు కొందరు...ద్వేషిస్తారు… పుట్టక ముందే అంత మొందించే వారు కొందరు.. పుట్టిన తర్వాత మట్టు పెట్టే వారు కొందరు.
అమ్మో ఆడపిల్ల ఖర్చు అంటారు... అమ్మాయి అంటే మైనస్ అని, అబ్బాయి అంటే ప్లస్ అని లెక్కలు వేస్తారు,
అమ్మాయిని దరిద్రం అనడం ఎంత తప్పో… లక్ష్మీ దేవి అనడం అంతే తప్పు.
అమ్మాయిలను , అబ్బాయిలను ఒకే రకంగా పెంచాలి, సమాన అవకాశాలు, సమాన గౌరవం ప్రాధాన్యత ఇవ్వాలి.
ఆడపని మగపని కాకుండా అందరూ అన్ని పనులు నేర్చుకోవాలి.. శ్రమను గౌరవించడం చిన్నతనం నుండీ తల్లి తండ్రులు అలవాటు చేయాలి.
ఇక అమ్మాయిల విషయం లో చిన్న చూపుతో ---, పెట్టుబడి తప్ప రిటర్న్స్ వుండవు అనుకొనే వాళ్ళు కొందరు. అయితే అమ్మాయి అంటే పరువు అనుకొనే వాళ్ళు కొంత మంది, మారి కొందరు అమ్మాయి అంటే పిల్లలను కనడానికి తప్ప ఎందుకూ పనికి రాదు అనే భావన కొందరిది, ఏది ఏమైనా ప్రపంచం లో అమ్మాయికలకు భద్రత లేదు అని మాత్రం అందరికీ తెలుసు !! వయస్సుతో నిమిత్తం లేకుండా స్త్రీల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. హింస పెరిగింది.
ఇప్పుడు ఆడపిల్లలు కూడా సంపాదిస్తూ ఉన్నా ఆర్థిక స్వాతంత్ర్యం లేకుండా ఉన్నారు.. ఇంటికి ఆసరాగా చేతోడో గా వుంటున్నా హింసను ఎదుర్కొంటున్నారు...
ఆడపిల్లలను సుకుమారంగా కాకుండా ఆత్మవిశ్వాసం కలిగి ఉండేలా.. స్వీయ రక్షణ శిక్షణలిచ్చి పెంచాలి..
ఆకాశంలో సగం ప్రచారం నిజం కావాలంటే పరస్పర గౌరవంతో స్త్రీలందరూ మెలగాలి.
మన దేశానికి ఆధార్ కార్డు వలే మన సమాజ మనుగడకు ఆధారం మగువ.

శాస్త్రీయ దృక్పథం ఆచరనీయం..!
నాంపల్లి సుజాత
ఏ విషయం పట్లనైనా శాస్త్రీయ స్పృహను,
పరిశీలనా తత్వాన్ని కలిగిఉండడాన్నే ..శాస్త్రీయ దృక్పథం అనొచ్చు.!
శాస్త్రీయ అంటే సరియగు.. ఉన్నది ఉన్నట్లుగా చూడటం, దృక్పథం అంటే చూసే తీరు. వాస్తవాలను ఆధారంగా చేసుకొని చూడటం,మరియ తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమైన వైఖరి ..!
ఈ నడుమ ఎక్కడ చూసినా చదువుకున్న ఆధునికుల్లో(ఏది చదువు... ఎవరు ఆధునీకులు అన్నది అకాడమీ చదువులకి సంబంధించిన చదువు కాదు ) సైతం శాస్త్రీయ దృక్పథం,పరిశీలనా తత్వం ఎందుకనో బాగా లోపించింది .ఆ కారణంగానే ప్రజల్లో తెలియని ఆశాస్త్రీయ భావనలు మూఢనమ్మకాలు వెనుకబాటు తనమూ అంధ విశ్వాసాలు పెరిగి చీకట్లో మగ్గిపోతూ.. వాళ్లకు వాళ్లే మోసపోతున్నారు.మరెన్నో సమస్యల సుడిగుండాల్లో ఇరుక్కుంటున్నారు..ఇంకెన్నో సంక్షోభాలకు కారణభూతులైతున్నారు
క్షుద్రపూజలూ చేతబడులూ మాయా మంత్రాల పేరిట వాళ్ళని వాళ్ళే మోసగించుకుంటూ అవాస్తవమైన అంశాల పట్ల ఆకర్షితులైతూ లేనివి ఉన్నట్లుగా భ్రమపడి ప్రలోభాలకు గురైతున్నారు ..
కోరుకున్నవన్నీ తేరగా సిద్ధిస్తాయనే వెర్రిఆశలతో బురిడీ బాబాలనీ మంత్రగాళ్లనీ స్వామీజీలని ఆశ్రయిస్తూ.. నిలువునా దోపిడీకి గురై మోసపోతున్నారు.వాళ్ళూ మనలాంటి మామూలు మనుష్యులేనన్న సంగతి మరచి వాళ్ళ నీటిమూటల మాయ మాటలు నమ్ముతూ వారికి ఏవో అతీంద్రియ శక్తులున్నాయని నమ్మి వాళ్ళ ఆదేశాలను ఆచరిస్తూ దేనికైనా సిద్ధపడుతున్నారు.. కర్మలూ పునర్జన్మలూ వుంటాయంటే తర్కించు కోకుండా విశ్లేషించుకోకుండా గుడ్డిగా వాళ్ళని వాళ్లు అంతమొందించు కుంటున్నారు తలలు నరుక్కొని గుడ్లు పీక్కోని ఆ శక్తులకు నైవేద్యం గా సమర్పించుకుంటున్నారు..మళ్లా పుడుతామనే వెర్రి భ్రమలతో..వాళ్ల మీద వాళ్ళకే నియంత్రణ లేకుండా నేరాల్లో మునిగి తేలుతూ ఎంతకైనా దిగజారుతున్నారు.. మరెంతటి దుర్మార్గాలూ దుశ్చర్యల కైనా సాహసిస్తున్నారు.. ఇంగిత జ్ఞానం కొరవడి చెప్పిందల్లా చేసేస్తున్నారు...
ఇవ్వన్నీ ఏమీ తెలియని ఆనాటి రాతియుగాల్లో జరుగాయంటే..తెలియని తనమో మరింకే అజ్ఞానమో అనుకోవచ్చు.. కానీ ఇప్పుడు ఈ అధునాతన రాకెట్ యుగంలో...ఈ ఆత్యాదునిక అనబడే విద్యావంతుల్లో..ఇంతటి సాంకేతిక విజ్ఞానం పరిఢవిల్లుతున్న ఈ రోజుల్లో కూడా..
శాస్త్రీయఆలోచనలు కొరవడి మూడాంధ విశ్వాసాల్లో మునిగి తేలుతూ...అవే నిత్యసత్యాలని తలచి వాటినే ఆచరిస్తూ వాటిలోనే దినదిన ప్రవర్ధమానమై మూడుమూర్ఖులూ ఆరుఅజ్ఞానులుగా తయారయ్యారు
కొందరు ఎలాంటి సాక్ష్యాదారాలూలేని ఊహాగానాలను నమ్మినంతగా అన్ని ఆధారాలూ కళ్ళముందే సుస్పష్టంగా కనబడ్డప్పటికీ వాటిని తిరస్కరించి,ఏ విషయాన్నీ
పరిశీలించుకోకుండా ,ప్రశ్నించుకోకుండా విశ్లేషించు కోకుండా.. మూర్ఖులను గొర్రెల గుంపుగా అనుసరిస్తూండడమ్ విచారించదగ్గ
విషయం.
ఇంతకీ... ఎందుకు ఇంతటి మూఢనమ్మకాల్లోనే మునిగితేలుతున్నారో అంతుపట్టని విషయమేమీ కాదు ..! బహుశా..రాకెట్ ప్రయోగిస్తున్న శాస్త్రవేత్తలే..పూజాలూ పునస్కారాలతో పనులు ఆరంబిస్తున్నారనో..! దయ్యాలూ భూతాల సినిమాలను చూసో మతబోధనలూ,జాతకాలూ జ్యోతిష్యాలూ శకునాలు..రంగురాళ్ళూ అంటూ బుల్లి తెరల్లో చూస్తూనో..అవి నిజమే నని నమ్మి
చీకట్లోకి తిరోగమిస్తున్నారు.
ఏ విజ్ఞానమూ తెలియని ఆదిమరోజుల్లో ప్రకృతి వైపరీత్యాలకు,ఉరుములకూ మెరుపులకు భయపడి..వాటి గమనం తెలియక ఆ అంతు చిక్కని వింత పరిణామాలకు కారణమేమిటో తెలియక
ఏదో ఒక అతీత శక్తి ఉందనినమ్మి,
అందువల్లే అవన్నీ జరుగుతున్నాయనీ, భీతిల్లి తనకు తానుగా మానవాతీత అదృశ్య శక్తినో ఇంకదేన్నో మరోదేవున్నో సృష్టించుకున్నారు.
ఇక ఆ తర్వాతే..
ఒకదానివెంట..మరొకటి నమ్మకాలూ ఆచారాలు ఆలయాలూ మతాలు మత వైషమ్యాలు, విద్వేషాలు లెక్కలేనన్ని ఊహాగానాలు పుట్టుకొచ్చాయి.
అయినా మంత్రాలూ మాయలతో ఈ విశ్వం సృష్టించబడలేదు.ఏ దేవుని వరాలవల్లో ఈ భూమి,
ఆవిర్భవించలేదు. భూగోళం మీద జీవిని ఒక్కసారిగా ఎవరూ పుట్టించలేదు.ఒక్కొక్కటిగా పరిణామక్రమంలో కాలగమనంలో వాటంతటత అవే ఏర్పడ్డాయి.. ఎందరో శాస్త్రవేత్తలూ పరిశోధించి పరిశీలించి జీవిపుట్టుకా,పరిణామం తెలియజేశారు.పై అన్ని విషయాలూ పాఠ్యపుస్తకాల్లో కూలంకశంగా చదివి కూడా గాలికి వదిలివేస్తూ ఉంటారు..! మనిషి ఆవిర్భవించాకే
మతాలనీ, కులాలనీ,దేవుళ్ళని పుట్టించాం.!
అయినా ఇంకా ఏవేవో అతీతశక్తులూ మహిమలూ ఉన్నాయని భ్రమల్లో కాలం వెళ్లదీస్తున్న వారి సంఖ్య తక్కువేమీలేదు..నేటి ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఎందుకూ..ఏమిటీ ఎట్లా ఎక్కడా ఎప్పుడూ అని నీరూపించి చూపుతూనే ఉంది..అయినా మనిషి వెర్రితలలతో వెనక్కే వెల్లుతున్నాడు.. పూజించడం,ప్రార్ధించడం తోనే మహత్యాలు జరిగిపోతాయని స్వార్థ చింతనతో ఈనాడు మనిషి దిగజారుతున్నాడు..కాల్పనిక ఘటనలను,గాథలను జీవింపచేస్తూ ఏదోలోకాల్లో విహరిస్తూ ఊబిలోకి కూరుకుపోతున్నాడు..సరే..అది వారివారి ఆలోచనలూ, ఇష్టాలూ వాళ్ళ సంతృప్తి అనుకున్నా
ముఖ్యంగా వాళ్లే ఏదోరకంగా మోసాలకు దోపిడీలకూ గురవుతున్నారు.
అందుకే..మన "రాజ్యాంగంలో అధికరణ 5(a)హెచ్ ప్రకారం శాస్త్రీయ స్పృహను కలిగి ఉండడంతో,స్థిరత్వాన్ని,మానవతావాదాన్ని,పరిశీలనా తత్వాన్ని, సంస్కరణాభిలాషనూ పెంపొందించడం ప్రతి భారతీయ పౌరుని విధి"అని చేర్చబడింది.
అంటే మన దేశ పరిస్థితుల్లో దానికో ప్రాధాన్యత ఉందన్నది వాస్తవం .. స్వాతంత్రానంతరం దేశం పురోగమించాలనీ,ప్రజల ఆలోచనా విధానాల్లోఅభివృద్దికారమైన మార్పు రావాలనే ఉద్దేశం
చివరగా తెలుసుకోవలసింది ఏమిటంటే
మతగ్రంధాల సారం వల్లగానీ, మత విశ్వాసాలవల్ల గానీ ఈ ప్రపంచం పుట్టలేదూ..ముందుకు నడవడం లేదు..
ఏ వైజ్ఞానిక సాంకేతికాభివృద్ధినీ సాధించలేదు.సాధించబోదు.. ఒకే ఒక్క శాస్త్రీయ పరిశోధనా శక్తి మాత్రమే మనిషికి తిండి బెట్టి బ్రతికిస్తోంది..జబ్బు చేస్తే నయం చేస్తుంది..వైద్య శాస్త్రాన్నీ ఆవిష్కరించింది, వైరస్ లకి వాక్సీన్లని కనిపెడుతోంది.అంతరిక్షం నుంచీ అగాధం వరకూ అన్నిరంగాల్లో ప్రయోగాలు చేస్తుంది..కొత్త కొత్త ఆవిష్కరణల నెన్నింటినో కనిపెట్టిచూపుతోంది..
కాబట్టి..
మనిషన్నవాడు మానవీయతను కలిగిఉండి
మేలైన సరైన ఆలోచనలతో శాస్త్రీయ అవగాహనతో ముందుకెల్లినట్లైతేనే..ఆరోగ్యకరమైన సమాజం
సాధ్యపడుతుంది..దేశమూ పురోగమిస్తుంది..!
+91- 98480 59893