
బహుళ లేఖలు
అద్భుతమైన కొన్ని లేఖలను చదవండి

కుప్పిలి పద్మ
మై డియర్...
చక్రవర్తీ రోడ్ అంతా వేకువనే లేచి నడుస్తూ సముద్రపు వొడ్డున నిలుచుని వుదయించే సూర్యున్ని చూస్తూoటే నువ్వు పక్కనుంటే అనుకున్నా.. అప్పుడు చూడాలి నీ గవ్వరేకుల కళ్ళని.. వాటిలో ప్రవహించే కరుణని.. మొన్న లాక్ డౌన్ తరువాత నువ్వు చిన్నగా కురుస్తోన్న వానలో గ్రాండ్ రోడ్ రాత్రి మిలమిలల్ని పట్టిచ్చావు చూడు.. గుడి ముందు అప్పటికే రధం పనులు మొదలు పెట్టారని.. షాప్స్ .. హోటల్స్ అన్నీ మూసేశారని.. మొత్తం మూసుకుపోయిన ఆ వానాకాలపు రాత్రులు.. యెన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే చిక్కని జనసందోహం..
మాస్క్ లు లేని వాళ్ళే యెక్కువ.. మాస్క్ తో బరువులు యెత్తటం కష్టంగా అనిపించి బస్తాలు మోసే వాళ్ళంతా మాస్క్ లు పెట్టుకోవటం లేదనుకొంటా.. ఆ కిటకిటని చూడాలని నిన్న రాత్రివేళ గ్రాండ్ రోడ్ కి వెళ్లాను. నీ అడుగులు.. నీ మాటలూ మనసులో మెదల్తుంటే చ్చెన్న పొద వొకటి తిన్నా.. తీయ్యగా. రసగొల్ల నోటిలో పెట్టుకోగానే భలే కరిగిపోతోంది. బెంగాల్ ల్లో వొడిస్సా లో రసగొల్లాలు భలే వుంటాయి. అప్పుడు నువ్వు తిన్నావా.. నీకు స్వీట్స్ అంటే యేమంత యిష్టంలేదు కదా.. అయినా నీకోసం వీటిని పట్టుకొస్తా. నువ్వు వొక ముక్క తినటం గొప్ప.. ఆఫ్ కోర్స్ పేరుకి నీకు.. కానీ తినేది నేనే అనుకో.. పంచదారని పంచధారతో అద్దుకు తినే బ్యాచ్ కదా...
అలా పూరీ సూర్యరశ్మిని మనసునిండా నింపుకొని అటూయిటూ తిరిగితిరిగి యిప్పటికి కటక్ చేరాను. యుగాల చరిత్రని గుండెల్లో దాచుకొని నర్మగర్భంగా అత్యంత నమ్రతగా ప్రవహించే మహానదీ ప్రవాహాన్నీ అలా మునివేళ్ళతో స్పర్శిస్తే తూర్పుతీరపు గంగా సామ్రాజ్యపు వైభవాన్ని.. వుద్ధన పతనాన్ని.. కళింగ యుద్దపు కత్తుల సవ్వడిని.. మిగిల్చిన నెత్తుటి చారికల్ని గాధలుగా మన ముందుకు తెచ్చాయి. బరువెక్కిక గుండెలతో తలెత్తి చూస్తే గాయం మిగిల్చిన మచ్చలా యెర్రటి బరపాటికోట కాలగర్భంలో కలిసిపోయిన చరిత్రకి సాక్ష్యంగా సగర్వంగా నిల్చి కనిపిస్తోంది.
వెండి పూజా సామాగ్రిని తయారు చేసే కళాకారుల అద్భుత నైపుణ్యం కట్టి పడేస్తోంది. ముఖ్యంగా గంధం గిన్నెల చుట్టూ అల్లుకొన్న లతలు.. చూపుల్ని పరిమళింప చేస్తూ.. వొక ఆధునాత పురాతన నాగరికతలకి మధ్య వేసిన వారధిగా కటకం అణువణువూ మనకి తారసపడుతూనే వుంది.
కటక్ నుంచి మహానది తీరాన ఆ 10వ శతాబ్ధంనాటి శివుని ఆలయం ధబలేశ్వర్ చుట్టూ అందమైన ఆకుపచ్చని సౌందర్యం.. చిన్నిచిన్ని పడవల్లో.. బల్లకట్టుపై ప్రయాణిస్తూ.. ఫుట్ వోవర్ బ్రిడ్జి మీద నుంచి వస్తూ ఆధునిక సాంకేతిక విజ్ఞానానికి అబ్బరపడుతూ ఆలయంకి చేరుకుంటున్నారు యెందరో. నది వొడ్డున రెల్లుపూల సందడి లేకపోవటం చూడగానే. ‘నది ఒడ్డున రెల్లుపూల ఉత్సవం ముగించుకొని శరత్తు వెళ్ళిపోయింది’.. అని‘రాలిపోయిన చందమామ’ లో మాటలు గుర్తొచ్చాయి. శిశిరంలో కదా యిప్పుడు.. అయినా నాధం గుర్తొస్తూనే వున్నారు.
మహానదీ ఆవలి నుంచి అరణ్య సీమల మీదుగా గుంపులుగా తరలి వచ్చే వలస పక్షులు యేవో సుదూర సీమల తాలూకూ యెడతెగని బెంగని మన మనోసీమల్లో వదిలి వెళుతున్నాయి. గోధూళివేళ నునులేత చీకట్లతో పాటు మహానది మీదుగా తేలివచ్చే సుందర్ బన్ తేమగాలులు మన యింటి బెంగని రెట్టింపు చేస్తున్నాయి. మన జ్ఞానదాహార్తిని తీర్చే కటకసీమ చరిత్రకి.. సంస్కృతికి మాత్రమేకాక అద్భుత సాహిత్యానికీ నెరవు కూడా. గొప్ప సాహితీవేత్తలూ.. వుద్దoడ నేతలూ పుట్టిన నేల యిది. కాళీందీ చరణ్ పాణిగ్రాహి.. గోపీనాధ మహంతి..కాన్పూ చరణ్ మహంతి.. అసలు గోపీనాధ మహంతి గారు రాసిన ‘అమృత సంతానం’ నవల ఆదివాసీ జీవితాల చరిత్ర కదా. యెన్నెన్ని ఆకులు యెంతెంత వాన.. ఆ తడిసి ముద్దైన ఆకుల పరిమళాలు మనలోకి నిండిపోయి మన చుట్టూ వాన కురుస్తూ నానినాని చదువుతున్న పుస్తకం కూడా నాని చివికిపోతోన్నట్టు వుండేది.
యిందాక శివుని ఆలయం ధబలేశ్వర్ చూస్తుంటే ‘రాలిపోయిన చందమామ’ గుర్తొచ్చింధన్నాను కదా.. యెందుకంటే కటక్ అనగానే మన సాహితీమనోవీధుల్లో చప్పున గుర్తొచ్చే రచయిత ఉపేంద్ర కిశోర్ దాసు గారు. వారి ‘రాలిపోయిన చందమామ’ నవలని యింట్లో చూసి ‘నాధం’ అన్నావు కళ్ళ నిండా వెలుగుతో. గొంతులో ప్రేమ. అవును.. నాధంలా సున్నితమైన మనసున్నవాడివి కదా...
పుస్తకాల్ని ఆత్రంగా చదివే కాలంలో యెప్పుడో ఆ నవల అనుకోకుండా నా కంట పడింది. పెద్దగా యే expectation లేకుండా మొదలు పెట్టానా.. సత్య తన జీవితం గురించి చెప్పుతుంటుంది. పెళ్లి బై ఛాయస్ అనే మాటే వూహకందని కాలమది. అలాంటి కాలంలో వో గ్రామీణ యువతి యిష్టం లేని పెళ్లి చేసుకోవటం.. ఆ బంధo అనుబంధంగా కాకుండా వూపిరాడని బంధనంగా మారిపోయినప్పుడు సత్య హృదయ వేదనకి మన మనసు బరువెక్కిపోతుంది. నాధంలాంటి స్నేహితుడున్నా పల్లెపిల్ల కదా త్వరగా కట్టుబాట్లని తెంచుకోలేకపోతుంది. అంతేనా ఆమె తనని తాను కూడా సరిగ్గా అర్ధం చేసుకోలేకపోతుంది. నాధంకి ఆమెకి మధ్య యెంతో చక్కని స్నేహం వుంటుంది. కానీ యెప్పుడు చూసినా అపార్ధాలే వాళ్ళ మధ్య. అయినా మళ్ళీ యిద్దరూ ఆ స్నేహాన్ని విడిచిపెట్టరు..
సత్య నాధంని యెంత ప్రేమించినా ఆమె అతనికి తన మనసుని చెప్పలేకపోతుంది. సత్యా తండ్రి కూతురు పెళ్లిని వో రెండో పెళ్లి జమీందార్ తో కుదురుస్తారు. జమీందార్ కి వొక కొడుకుంటాడు. ఆ పెళ్లి యెలాగ జరిగిందో కూడా సత్యాకి తెలియకుండానే నిద్ర మత్తులో వుండగా జరిగిపోతుంది. ఆమెకి ఆ పెళ్లికొడుకు నచ్చలేదు కూడా. భయంగా అనిపించింది. పెళ్లి అయినా ఆమె అతనికి శారీరకంగా దగ్గర కాలేకపోయింది. కానీ జమీందార్ మొదటి భార్య కొడుకుని మాత్రం బాగ శ్రద్ధగా.. యిష్టంగా చూసుకునేదే. అత్తగారికి యిష్టంగా సేవలు చేసేది. ఆమెకి మెల్లగా తన భర్తకి ఆ యింట్లో పని చేసే స్త్రీతో శారీరక సంబంధం వుందని తెలుస్తుంది. ఆ జమీందర్.. ఆ యింట్లో పనిఅమ్మాయి కలిసి సత్యనే ఆ యింటికి పనిచేసే పనిమనిషిని చేసైటం చూసి అత్తగారు యిల్లు వదిలి కాశీ వెళ్ళిపోతుంది.
జాతరకి వెళ్ళినప్పుడు జమీందార్.. అతనితో సంబంధం వున్న స్త్రీ కలిసి సత్యాని జాతరలో వదిలించుకొంటారు. అక్కడ ఆమెకి తారసపడిన నాధం ఆ రాత్రి వో పంచన సత్యాని వుంచి తెల్లార్నే భర్త యింటికి తీసుకొని వెళ్ళతాడు. సత్యాని భర్త నిందించి తిరస్కరిస్తాడు. సత్యా పేరెంట్స్ కలరా వచ్చి యీ ప్రంపంచం నుంచి వెళ్ళిపోయారు. యేమి చెయ్యలేని స్థితిలో నాధం ఆమెని తనతో కటక్ తీసుకొచ్చి తన యింట్లో పెట్టుకుంటాడు. కొన్నాళ్ళకి నాధం వుద్యోగం పోతుంది. నాధం సత్యాని తీసుకొని తన వూరికి వస్తాడు. నాధం ఆమెని తనతో తన యింట్లోనే వుంచుకుంటాడు. సత్యా యెప్పుడూ సంఘం కట్టుబాట్ల నుంచి బయటకు రాదు. కానీ వీళ్ళిద్దర్నీ వూరి వాళ్ళు వెలివేస్తారు. సత్య యీ వెలిని తీసైమని వూరివాళ్ళని వేడుకొంటుంది. ఆమె నాధాన్ని వదిలి వెళ్ళిపోతే అతని మీద వున్న వెలిని తీసేస్తాం అంటారు వూరివాళ్ళు. నాధం కోసంసత్యా అతనికి చెప్పకుండా యిల్లు విడిచి వెళ్లి నదిలో పడిపోయే ముందు తన జీవిత కథని చెపుతుంది.
సత్యా జీవితంలో యెంతో సున్నితమైన మనసున్న స్నేహితుడు నాధం వున్నా ఆమె తన హృదయాన్ని యెప్పుడు విప్పదు.. తనే తన హృదయపు మాటని స్పష్టంగా వినదు.. సత్యా సంఘ నియమాల్ని విడిచిపెట్టదు. అలాగని వున్న జీవితంలోనూ యిమడలేదు. తన మనసు కోరుకుంటున్నదాన్ని తన జీవితంలో వొంపుకోడానికి సంఘ నియమాల్ని నిబంధనలని విడిచీపెట్టలేకపోతుంది. యింతగా సత్యా సంఘంకి కట్టుబడి వున్నా బోలెడంత అపవాదుల్ని మోస్తుంది. వీటన్నిటి వల్ల చందమామలా వెలిగిపోవల్సిన సత్యా జీవితం అపకీర్తి చందమామై రాలిపోతుంది.
కటక్ లో నిలబడగానే చందామామలాంటి సత్యా.. వెన్నెలలాంటి నాధం తెగ మెదుల్తున్నారు...
1901లో ఉపేంద్ర కిశోర్ దాస్ గారు కటక్ లో సంపన్న కులీన కుటుంబంలో పుట్టారు. కటక్ లో స్తిరపడిన దాస్ గారు 1922లో వొడియాలో రాసిన నవల ‘మాలా జాన్హ’. ఆ నవల తెలుగులోకి 1973లో వచ్చిన నాటికి యిప్పటి మన చుట్టూ జీవితాల్లో బోలెడన్ని మార్పులు వచ్చాయి. ముఖ్యంగా స్త్రీల జీవితాల్లో. బై ఛాయిస్ పెళ్లి చేసుకోవటం. చదువుకోవటం. నచ్చిన పని చెయ్యటం. తన సంతోషం కోసం తన చుట్టూ జీవితాల్లో మార్పు కోసం పోరాటం చేసే ధైర్యo యిప్పుడు స్త్రీలలో చూస్తున్నాం.
వొక వైపు స్త్రీలు అత్యంత వేగవంతంగా అన్ని రంగాల్లోకి ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో స్త్రీలపై హింస పెరగటం చూస్తున్నాం. అత్యంత విషాదం యేమిటంటే స్త్రీలపై జరుగుతోన్న హింస వారు ప్రాణాల్ని కోల్పోయేట్టు చేస్తోంది. సమాజంలో రోజురోజుకి పెరుగుతోన్నఅనేక లైంగిక దాడులకి ప్రధాన కారణం రోజురోజుకి విషంలా వ్యాపిస్తోన్న పురుషాధిక్య ఆలోచనా ధోరణే .దీన్ని అడ్డుకోడానికి కేవలం చట్టాలు.. రక్షణ చర్యలే కాకుండా సాంస్కృతిక భావజాల విప్లవం అత్యవసరం.
ఆనాడు కిషోర్ దాసు గారు చెప్పింది స్త్రీలకి మహిళలకు హక్కులు లేకపోవటం అంటే సగం సమాజం ‘రాలిపోయిన చందమామ’లా వెలవెలబోతున్నట్టే.
మనసంతా బరువుగా అయిపోయింది.. నువ్వు పక్కన వుంటే బాగుండును.. యిద్దరం అలా కాసేపు యినుపరజనుతో యెర్రగా మెరుస్తోన్న యీ రోడ్ల మీద నుంచి నడుస్తూ నడుస్తూ.. మహానదీ ఘాట్ లో కూర్చుని నదిలోంచి వుదయించే పున్నమినాటి నిండుచందమామని చూడాలి.. కాసేపు నీ కవిత్వం వినాలి..
నీ..
నేను
కుప్పిలి పద్మ

జ్వలిత
లేఖలతో ఖండన… ఎందుకంటే..?
ప్రియమైన పాఠక మిత్రులారా…
ఉభయకుశలోపరి… కొన్ని ముచ్చట్లాడుకుందామా…
దేని గురించి అంటారా… చదవండి మరీ
'రవి గాంచని చోటు కవి గాంచును' అన్నారు కదా! కవి చూస్తున్నాడో లేదో ఒకసారి అంచనా వేయడం కోసం ఈ లేఖలకు ఆహ్వానం పలికాను్
మరీ విడ్డూరం కాకపోతే అది తెలుసుకోవడం కోసం ఒక పుస్తకం వెయ్యాలా అంటే… డబ్బు జబ్బు చెయ్యని, కీర్తి దురద అంటని కొందరు నిశ్శబ్దంగా తమ వంతు పని తాము చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళతో కలిసి నడుద్దామనే ప్రయత్నమిది.
రవీంద్ర భారతి సాక్షిగా 'నిన్ను మేమెవ్వరం పట్టించు కోవటం లేదు' అన్న అక్కుపక్షి అజ్ఞానపు హాస్యంతో కలిగిన ఆనందాన్ని పంచుకుంటూ పదిమందితో కలిసి ఫక్కున నవ్వడమే ఈ ప్రయత్నం. హింసించే సమాజంలో మూలాలను వెదికి మూలికా వైద్యానికి ప్రారంభమే ఈ "లేఖావలోకనం". అత్యాశ, అతిశయోక్తి అనిపించిందా మీకు.. అనిపించాలి మరి…. అయితే ఒక విషయం వినండి.
'బొండుమల్లెలు' అనే కథానికను, ది.15-9-1943, ప్రజాశక్తిలో చాసో (చాగంటి సోమయాజులు) రాశారు. అందులో పేదరికంతో ఆనారోగ్యంతో నిరాదరణకు గురై ఒక ముసలివ్యక్తి మరణిస్తాడు. "అతనికి ఒక బిడ్డ ఉన్నది. కానీ, డబ్బివ్వనిదే అన్నం పెట్టదు. బిడ్డకు పెట్టాలని ఉన్నా.. పెట్టేందుకు తనకు ఉన్నదో లేదో… తనకే లేని ఇంట్లో తండ్రికి పెట్టేందుకు, అల్లుడు ఒప్పుకోవాలి కదా" అంటారు రచయిత. "ప్రభుత్వం వారు వృద్దాప్యపు పెన్షన్ వంటిది ఇచ్చి ఆదుకోవాలి" అని సూచన కూడా ఇచ్చారు.
మరి ఆ పెన్షన్ వృద్దులకు వివిధ ప్రభుత్వాలు గత రెండు దశాబ్దాలుగా అందిస్తూ ఆదుకుంటున్నాయి కదా… (వృద్ధుల పెన్షన్లు కూడా మింగుతూన్న తిమింగిలాల గురించి ఆ రచయితకు తెలియదు, నాక్కూడా తెలియదు).
అదిగో అటువంటి సూచనలు, ఆలోచనలు లైంగిక హింసను అరికట్టేందుకు సాహితీ మిత్రులు పంచుకుంటారని ఆశతో లేఖలకు ఆహ్వానం పలికాను. నా ఆశను నిరాశ పరచకుండా అరవైమూడు లేఖలు పంపారు మిత్రులు. అందులో రెండో మూడో తప్ప మిగలిన లేఖలన్నీ నా కోరికను నెరవేర్చాయి.
లేఖావలోకనంలో మొత్తం 63 లేఖలున్నాయన్నాను కదా! ఇందులో స్నేహితులకు రాసిన లేఖలే ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత తల్లికి రాసిన లేఖలు ఆరు, కొడుకులకు రాసినవి ఆరు ఉన్నాయి. ఎక్కువమంది లేఖకులు టీచర్ల అయినందువల్లేమో, తమ శిష్యులకు లేఖలు రాశారు. బిడ్డలకు ఐదుగురు రాశారు, మనవరాలికి ఒకరు. అక్కకు ఒకరు, అన్నయ్య ఒకరు, ఆత్మకు ఒకరు, శత్రువుకు ఒకరు, కాలానికి ఒకరు, కొత్త సంవత్సరం 2021కి ఒకరు, వెళ్లిపోయిన శార్వరి నామసంవత్సరానికి ఒకరు, భార్యకు రాసిన వారిద్దరూ, జోగుళాంబ తల్లికి విన్నపం ఒకరు, భయంకర కరోనాకు ఒకరు రాశారు, క్రాంతి జ్యోతి సావిత్రిబాయికి రాసారొకరు మళ్ళీ నువ్వు రావాలని ఆహ్వానిస్తూ.
మొత్తం మీద రెండో మూడో లేఖలు తప్పించి మిగిలినవన్నీ ప్రస్తుత సమాజంలో లైంగిక హింసలను అరికట్టేందుకు సూచనలతో కూడినవే.. కర్తవ్య బోధన చేసినవే… మరి ఆ లేఖల్లో ఎవరేమన్నారో చూడండి మరి.
ఎవరేమన్నారంటే:-
◆ విద్యతోపాటు ఆత్మస్థైర్యం కలిగించాలి. అందుకు అవరమైన ఆత్మరక్షణ/ స్వీయరక్షణ విద్యలు నేర్పించాలన్నారు - ఆచార్య సూర్యధనుంజయ్, కె.ఎ.ఎల్.సత్యవతి, గోళ్ళమూడి సంధ్య, జోషి పద్మావతి, డా. దాసోజు పద్మావతి, డా.విజయశ్రీ, డా.శ్రీదేవి, డా.అనురాధ, తులసి, జయశ్రీ, కిరణ్మయి, సుమతీ, జమున, భవానీ లీలావతమ్మ, ధరణీప్రగడ వెంకటేశ్వర్లు.
◆ స్వీయ రక్షణకు ఆయుధాలు కావాలన్నారు- అనిశెట్టి రజిత, జ్వలిత. డా.కె.గీత, రాజీవ.
సాంస్కృతిక భావజాల విప్లవం రావాలన్నారు కుప్పిలి పద్మ.
◆ మార్షల్ ఆర్ట్స్ నేర్పాలి, దేహధారుడ్యం కోసం వ్యాయామశాలలకు వెళ్ళాలి అన్నారు రమాదేవి బాలబోయిన, మహతి తేజశ్వి.
◆ కుటుంబం, పెంపకం, ఇరుకైన ఇళ్ళు, అదుపు లేని తండ్రుల బూతుపురాణాలు, మద్యం మత్తులో పిల్లల ముందే సరసాలు అన్నీ అరికట్టాలిసినవే అంటారు శిలాలోలిత.
◆ ప్రభుత్వ పనితీరు, కుటుంబ పనితీరు, సమాజ తీరు మారాలి అన్నారు డా.తిరునగరి దేవకీ దేవి.
మద్యనిషేధం అవసరమన్నారు శాంతారెడ్డి.
◆ పునర్మూల్యాంకనం కావాలన్నారు డా. కొండపల్లి నీహారిణి.
◆ సంఘటిత ఉద్యమం అవసరమన్నారు రంగనాథ్ సుదర్శనం, డా.ప్రతిభా లక్ష్మీ.
◆ ఇంట్లో స్త్రీలను గౌరవించడం నేర్పితే వివక్ష లేకుండా చేయవచ్చన్నారు సిస్టర్ అనసూయ, సరోజన.
◆ వివక్ష లేని పెంపకం, సమదృష్టితో గౌరవించడం ద్వారా దేహాలను చూసే దృష్టి మార్చాలన్నారు: చల్లా సరోజిని, ఎన్నెల, వినోద, ఝాన్సీ కె.వి.కుమారి, పొన్నాడ వరప్రసాదరావు, డా.సి.హెచ్.సుశీల, పద్మశ్రీ, సైదులు.
◆ సమయస్ఫూర్తితో ఆత్మస్థైర్యం ఆయుధంగా కలిగి ఉండాలి అన్నారు: నాంపల్లి సుజాత, జ్యోత్స్నదేవీ, వనపర్తి పద్మావతి, చీదెళ్ళ సీతాలక్ష్మీ. యడవల్లి శైలజ.
◆ బాధ్యతాయుత యువత కావాలి అన్నారు హాసినీ విఠల్. సరితా నరేష్.
◆ పరువు కోసం బలిపెట్టద్దు ఆత్మవిశ్వాసంతో బతకనివ్వండన్నారు పెద్దపల్లి తేజశ్వి.
◆ కవిత్వమైన జీవితమైన సొంతకళ్ళతో చూసి, వ్యవస్థ లోపాలను పేల్చాలి... ఆత్మస్థైర్యమే ఆయుధమన్నారు కట్టా శ్రీనివాస్.
◆ దేహ, దేశ, కాలం తో నిమిత్తం లేకుండా గౌరవించడమే మార్గమంటారు బి.వి.వి.ప్రసాద్.
మొత్తం చదివిన నా అభిప్రాయం ఏమిటంటే… పితృస్వామ్యం చూపిన శతాబ్దాల వివక్షను వదలడమే మార్గం. సమదృష్టితో స్త్రీని మానవిగా గౌరవించి ప్రేమించడమే తరుణోపాయం. కుటుంబ వ్యవస్థ మానవీయ విలువలు కలిగి సామజిక సాంస్కృతిక మార్పు అనివార్యం. ఆయుధాలివ్వడం, శిక్షలు పెంచడం కంటే పరస్పర గౌరవంతో జీవించే దృక్పథంతో పిల్లలను స్త్రీలను ప్రేమతో ఆదరించడము అవసరం. మద్యం, అంతర్జాలం, మీడియా ప్రభావం ఎక్కువే కనుక వాటి నియంత్రణ అవసరం. లైంగిక హింస లేని సమాజం సమిష్టి బాధ్యత. అందరూ చిత్తశుద్ధితో నిజాయితీగా మెలగాలి. నేరస్తులతోపాటు నేరాలను సమర్దించే వారికి శిక్షలు వెయ్యాలి అంటాను. మరి మీ అభిప్రాయం ఏమిటో ఒక లేఖ రాయండి.
నేస్తాలు అసలు లేఖా సాహిత్యం గురించి మాట్లాడుకుందామా మరి…..
లేఖ - ఉత్తరం - పత్రం పేరేదైన మనుషులు తమ క్షేమసమాచారాలు, భావోద్వేగాలు పంచుకోడానికి ఉపయోగపడే ప్రక్రియ ఇదని తెలుసు కదా..
మొదట లేఖలు మౌఖికంగా మనుషులే చేరవేసేవారు. వాళ్ళనే వార్తాహరులు, రాయబారులు అనే వారు. ఆ తర్వాత
పాలకుల తమ ఆజ్ఞలను, పాలితులు తమ అర్జీలను సమర్పించేందుకు లేఖారూపం సౌకర్యంగా ఉండేది.
ఉత్తరం రాయడానికి ఒక సంప్రదాయం ఉంటుంది, అది ఒక కళే, ఆ కళనే గ్రీకులు పూర్వకాలంలో Epistolography అన్నారట. ప్రాచీన కాలంలో తూర్పు రోమన్ రాజ్యాన్ని బైజాంటియమ్ అనేవారు. (తర్వాత 'కాన్ స్టాంట్ నోపిల్' అన్నారు. ప్రస్తుతం అది 'ఇస్తాంబుల్'గా మారింది.) పూర్వం బైజాంటియమ్ రాజులు శాశనాలను, చట్టాలను ప్రజలకు ఉత్తరాల రూపంలో తెలిపేవారట. రాజశిక్షణలో యుద్ధవిద్యలతో లేఖలు రాయడం నేర్పేవారట. దీనిని బట్టి లేఖలకు ఎంత చరిత్ర ఉందో చూడండి మరి…
(క్రీస్తుశకం:50 -120) ఆచార్య నాగార్జున శాతవాహన చక్రవర్తి రాసిన సృహుల్లేఖ అంటే మిత్రునికి ఒక లేఖ అర్థం మొదటి ఉత్తరంగా గుర్తించారు. సంస్కృత కవి కాళిదాసు 'మేఘసందేశం' లేఖా సాహిత్యమే.
అనగనగా కాలంలో మనుషులు పక్షులు జంతువులు సమాచారం చేరవేసేవారు. మన దేశంలో 1853లో రైళ్ల రాకతో 1854లో తపాలా అదే పోస్టు మొదలైంది. ఆ విధంగా పాలకులు, ఆధిపత్య వర్గాలకే కాక సామాన్య ప్రజలకు కూడా ఉత్తరాల చేరవేత అందులో అందుబాటులోకి వచ్చింది.
1863-1902 స్వామి వివేకానందుడు,
1876-1938 శరత్ చంద్ర చటోపాధ్యాయ,
1889 -1965 జవహర్లాల్ నెహ్రూ,
విశ్వకవి రవీంద్రుడు విక్టోరియా ఓకేంపో మధ్య లేఖలు ప్రపంచ చరిత్రలో నిలిచిపోయాయి.
తెలుగు సాహిత్యంలో అల్లసాని రచన విజయనగర చరిత్రలో పద్యలేఖ., రాయపోలు రచన 'స్నేహలతా దేవి లేఖ', గుర్రం జాషువా రచనలు గబ్బిలం, ఫిరదౌసి, తిరుపతి వేంకట కవుల 'గీరతం',
తిలక్ 'సైనికుని ఉత్తరం', గోపీచంద్ 'పోస్ట్ చేయని ఉత్తరాలు', 'పరమేశ్వర శాస్త్రి వీలునామా',
బోయి భీమన్న 'జానపదుని జాబులు' లేఖాసాహిత్యాన్న సుసంపన్నం చేశాయి.
పుట్టపర్తి నారాయణాచార్యుల 'మేఘదూతం' గేయరూపంలో సాగిన లేఖే.
యద్దనపూడి 'ప్రేమ లేఖలు', మరో హాస్య నవల 'ఉత్తరాయణం' , మల్లాది 'దూరం', చలం 'ప్రేమలేఖలు' నవలరూపంలో వచ్చిన లేఖలు.
సాహిత్య సంస్కృతికపరమైన గౌరవాన్ని కలిగిన లేఖల్ని లేఖా సాహిత్యంగా చెపుతారు.
వాస్తవమైన వ్యక్తుల మధ్యగాని లేదా ఊహాజనితమైన వ్యక్తుల మధ్యగాని లేఖలద్వారా సంభాషణ జరుగవచ్చు.
తెలుగులో లేఖల్ని స్వీకరించిన మొదటి వ్యక్తి చార్లెస్ పిలిప్ బ్రౌన్.
లేఖలకు సంబంధించి భారతీయ సాహిత్యంలో మొట్టమొదటి ప్రస్తావన "అభిజ్ఞానశాకుంతలం"లో ఉంది.
లేఖలకు సంబంధించి తెలుగులో మొట్టమొదటి ప్రస్తావన పింగళి సూరన "ప్రభావతిప్రద్యుమ్నము"లో ఉంది.
గుడిపాటి వెంకటాచలం ఉత్తరాల పేర్లు ప్రేమలేఖలు.
కనుపర్తి వరలక్ష్మమ్మ ఉత్తరాల పేర్లు శారద లేఖలు.
నెహ్రూ లేఖల్నితెలుగులోకి అనువదించినది కాటూరి వేంకటేశ్వరరావు.
బెంగాలీ రచయిత శరత్ చంధ్ర చటర్జీ లేఖల్ని తెలుగులోకి అనువదించినది పురాణరాఘవ శాస్త్రీ.
జానపదుని జాబులు రచయిత బోయి భీమన్న.
గీరతం రచయితలు తిరుపతి వేంకటకవులు.
పోస్ట్ చేయని ఉత్తరాలు, ఉభయకుశలోపరిలను రచించినవారు త్రిపురనేని గోపీచంద్. తెలుగులో ఉత్తరాల రచనలో ప్రసిద్ధుడు డా.సంజీవ్ దేవ్.
పోస్ట్ మ్యాన్ మీద కవితలు రాసినవారు తిలక్.
తెలుగులో లేఖా సాహిత్యంపై పి.హెచ్.డి చేసినవారు 1.మలయశ్రీ 2.సి.హెచ్.సీతాలక్ష్మీ.
ప్రసిద్ధ లేఖల్లో సమాజానికి దారి చూపేవి... సావిత్రిబాయి పూలే జ్యోతిబా పూలేకు రాసినవి, క్రాంతి జ్యోతి సావిత్రిబాయి శిష్యురాలు ముక్తా సెల్వె లేఖ. అబ్రాహం లింకన్ అతని కుమారుడి టీచర్ కు రాసిన లేఖ మొదలైనవి.
ఉద్యమ సాహిత్యంలో శ్రీశ్రీకి ప్రముఖ హేతువాది సీవీ రాసిన 'ఏకలవ్యుని బహిరంగ లేఖ', కేజీ.సత్యమూర్తి (శివ సాగర్) రాజీనామా లేఖ, విరసాన్ని ఉద్దేశిస్తూ రాసిన లేఖలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి..
కొడవంటి కుటుంబరావు , శ్రీశ్రీ, చలం, సంజీవ్ దేవ్ ఉత్తరాలు పుస్తాకాలుగా వచ్చాయి.
యశస్వి భార్యకు రాసిన ప్రేమలేఖలు 'పరాంసుందరి' పేరున పుస్తకమయింది. 2012లో అంతర్జాతీయ బాలల దినోత్సవం వేడుక గురించి ఒక విద్యార్థి తన మేనమామకు రాసినట్టు ప్రస్తుత సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ రాసిన లేఖ సాహిత్యంలో నిలుస్తాయి.
మహిళా లేఖకులు: కనపర్తి వరలక్ష్మమ్మ మహిళలను చైతన్య పరిచేందుకు రాసిన "శారదలేఖలు" ప్రసిద్దమైనవి.
కుప్పిలి పద్మ రాసిన 1993లో వచ్చిన "అమృత వర్షిణి" మొదటి ప్రేమలేఖలు, వారివే 2015లో వాకిలిలో శీర్షికగా వచ్చిన లేఖలు"ఎల్లోరిబ్బన్" 2020 పుస్తకంగా వచ్చింది. శిలాలోలిత భూమికలో రాసిన లేఖల పుస్తకం, ఆకాశవాణి ఉద్యోగిని సంవత్సరం పాటు రేడియోలో ప్రసారం చేసిన లేఖలు 'కొత్త ప్రేమ లేఖలు' మొదలైనవి పుస్తకాలుగా వచ్చాయి. యడవల్లి శైలజ 'హృదయరాగం' పేరున లేఖాసంపుటి తెస్తున్నారు. కె.మల్లీశ్వరి, షాజహాన, విమల లేఖలు రాస్తూన్నారు. నమస్తే తెలంగాణ, పాలపిట్ట, భూమిక, వాకిలి, చినుకు, సంచిక, కళాతపశ్వి వంటి పత్రికలు లేఖలను ప్రోత్సహిస్తున్నాయి. మీరూ రాయండి లేఖలు.
చూశారుగా లేఖలకు ఎంత చరిత్ర ఉందో… ఇప్పుడు 'లేఖావలోకనం' పేరుతో మీ ముందుకు వచ్చిన ఈ ఉత్తరాలు, పసి పిల్లలపై జరిగే లైంగిక హింసను ఖండిస్తూ తెలుగులో వచ్చిన మొట్టమొదటి లేఖా సంపుటి.
ఈ ప్రయత్నం 2020 నవంబర్ లో ప్రారంభించి 2021 ఫిబ్రవరిలో… అంటే నాలుగు నెలల కాలంలో పూర్తి చేయడమైనది.
లేఖావలోకనం ద్వారా నేను ఆశించినది ఏమిటంటే? లేఖలు అంతరించిపోయి మెసేజ్ లై… ఎస్ఎంఎస్ లై మిగులుతున్న ఆలోచనలను, మరొక్కసారి.. ప్రియమైన…. పూజ్యులైన...తో మొదలు పెట్టి, ఉభయకుశలోపరి... మేము ఇక్కడ బాగున్నాం… మీరు అక్కడ బాగున్నారు అనుకుంటున్నా… అంటూ కొనసాగించి.. మీ శ్రేయోభిలాషి, నీ ఉత్తరానికి ఎదురుచూస్తూ.. అంటూ ముగించే కొన్ని పద్ధతులను గుర్తు చేసుకుంటూ… వీలైతే ఆ ఆనందాన్ని కొనసాగిద్దామని ఆకాంక్ష ఆన్నమాట.
మీరందరూ… అసలు విషయం మర్చిపోకుండా..
లేఖల్లో రాసినట్టుగా లైంగిక హింసను నిరోధించడం, అరికట్టడం మన సమిష్టి బాధ్యతగా భావిస్తారుగా… కవిత్వం, కథ, లేఖల రచనతో పాటు ఆచరణలో చూపిస్తారని ఆశిస్తూన్నాను...
(కవిత అంటే… గుర్తొచ్చింది పసిపిల్లల ఫై, లేఖల ప్రయోగశీలి 'యశస్వి' రాసి కవిత ఈ లింకులో చదవండి
https://www.facebook.com/groups/kavisangamam/permalink/885639338155486.
అంతేనా మరికొందరి కవితల గురించి నేను రాసిన ఆర్టికల్
https://m.facebook.com/story.php?story_fbid=3462798293762983&id=100000985399037 వీలైతే ఓ లుక్ వెయ్యండి మరి…)
విసుగు పుట్టించానా మిత్రాస్… కావచ్చు లెండి.. అయితే మీరూ ఒక లేఖతో రివెంజ్ తీర్చుకోండి మరి..
ఇట్లు
మీ
జ్వలిత,
9989198943.
( లేఖావలోకనం- సంకలనం సంపాదకురాలి ముందుమాట)

మేఘ రాగమ్
ఇంట్రో
నీలాంజనా… అపుడపుడూ ఇలాగే ఉత్తరాలు వ్రాసుకుందాం. కలలను విశ్లేషించుకుందాం. ఆకాంక్షలను వెల్లడించుకుందాం.మనసు విప్పి అనేక విషయాలు ముచ్చటించుకుందాం. మనచుట్టూ కమ్ముకుంటున్న భయానక వాతావరణాన్ని చెదరగొట్టుకుందాం. అపోహలు తొలగించుకుందాం. జీవితాల చుట్టూ అలుముకున్న వేదనలను కరిగించుకుందాం. ఇతరుల కోసం కురిసే కన్నీరవుదామ్ చిలకరించుకునే పన్నీరవుదామ్.
ఇదే మేఘ రాగమ్.
మేఘ రాగమ్
ప్రియ నేస్తం నీలాంజనా..
ఎలా వున్నావు! మనసారా మాట్లాడుకుని చాలా కాలమైంది కదా.. అందుకే ఈ ఉత్తరం. అయినా ఉత్తరాలు చదువుకునే తీరిక ఎక్కడుంది చెప్పు. మన వాట్సాప్ స్టేటస్ చూసుకుని ఓ మెసేజ్ అటునిటూ ప్రవహిస్తూ వుంటే చాలు ఎంతెంత దూరమైనా చెంతనే వున్నట్టు అదో భరోసా నిశ్చింతానూ! మన తరం ఒక విధంగా దురదృష్టవంతులం. నిన్నైతే అనలేను కానీ నా గురించే నేను చెబుతున్నా. ముందుగా నీతో పోల్చుకుంటూ.. నా ఆలోచనలు నీతోనే పంచుకుంటూ..
ఎనబై యేళ్ళు దాటిన అత్తగారైన వృద్దురాలి సేవలో అంకితమైన నిన్ను చూస్తుంటే.. గర్వం కల్గుతుంది. నా ఊహాచిత్రంలో పసిపాపల సేవలో నిమగ్నమైన ఓ తల్లి గోచరిస్తుంది.
కానీ నన్ను నీతో పోల్చుకుంటే సిగ్గేస్తుంది. ఎందుకంటావా? డెబ్బై పైబడిన నాన్నను ఎనబై దాటేసిన అత్తమ్మను చూసుకో లేనందుకు. వారికి కనీసం ఓ కప్పు కాఫీ నో టీ నో తయారుచేసి చేతికి అందివ్వలేని స్థితిలో వున్నందుకు. వారు వారి గృహాలను అలవాట్లను వారికి నచ్చిన మెచ్చిన సౌకర్యాలనూ వొదిలి ఈ అపార్ట్మెంట్ సంస్కృతిలో ఇమడలేమని బాహాటంగా అంటుంటారు.ఆర్దిక బలిమి వున్న వారిద్దరూ వారి ఇగోలను వొదలలేరు. అందుకే వారిని నేను బలవంతం చేయడం లేదు. అలా అని వొంటరిగా మిగిలిన నేనూ వెళ్ళి వారివద్ద వుండనూలేను. అటు బిడ్డలకు ఇటు పెద్దలకూ మధ్య మన తరం వారు వారధులమే కానీ ఎవరూ ఎవరితోనో కలిసి జీవించలేని కాలంతో యాంత్రికంగా బ్రతకడం అలవాటైపోయింది. ఇది ఆర్ధికంగా ఇబ్బందులు లేని వృద్దజీవనంలో ఒక పార్శ్వమైతే మరొక పార్శ్వం బీదరికంతో అలమటిస్తున్న వృద్దుల జీవితాలు.
నన్ను ఈ మధ్య అతిగా కదిల్చివేసిన సంఘటన ఏమిటంటే వృద్దాప్యంలో వున్న తల్లిని ఆదరించలేక కన్నబిడ్డే స్మశానవాటికలో వదిలివెళ్ళిన కథనం చూసి మనసు విచలితమైపోయింది. అది చూసిన తర్వాతే చాలా విషయాలు నీతో పంచుకోవాలనిపిస్తుంది. అసలు మన వృద్దాప్యం గురించి మనమేమి జాగ్రత్తలు తీసుకుంటున్నామో తెలుసుకుంటూ ఇంకేమి తీసుకోవాలో అని ఆలోచిస్తూ వున్నాను.
పూలను సృష్టించినవాడే తుమ్మెదలను సీతాకోకచిలకలను సృష్టించాడు కానీ గొడ్డలిని సృష్టించలేదు.. అన్నానొక సందర్భంలో. ప్రకృతిని గౌరవించినట్లే మన ఉనికికి కారణమైన తల్లిదండ్రులను గౌరవించడంలో సంరక్షించుకోవడంలో మనమెందుకు నిర్లక్ష్యం వహిస్తున్నాం నిర్దాక్షిణ్యంగా వుంటున్నాం!? నిజంగా అంత అసహాయతలో మునిగిపోయామా లేక అశ్రద్ద చేస్తున్నామా? అనిపిస్తుంది.
పెద్దలున్న పంచన సిరులు తాండవిస్తాయని పెద్దల మాట. అది నిజమని చాలామంది అంగీకరిస్తారు. కానీ బిడ్డలెందుకు ఇంత కాఠిన్యంగా వుంటున్నారు? నానాటికి లక్షలమంది జీవితాలు ఎందుకింత దుర్భరంగా మారుతున్నాయి. నిరుద్యోగం పేదరికం నియంత్రణ లేని ధరలు ఆర్ధిక అసమానతలు ఉగ్రవాదం ప్రకృతి వైపరీత్యాలు కాలుష్యం ధన వ్యామోహం విశృంఖలమైన స్వేచ్ఛా జీవనం మత్తుపదార్దాల సేవనం ఇంకా ఇంకా అనేక కారణాలతో మనిషి జీవితం నానాటికీ కుంచించుకుపోతుంది. మానసిక శారీరక అనారోగ్యాలతో మనిషి విలవిలలాడుతున్నాడు. వృద్దాప్యం అయితే ఇక చెప్పనవసరం లేదు.
ముడుతలు పడిన శరీరంతో శక్తి సన్నగిల్లబడిన దేహంతో వొకింత వేగం మందగించిన నడకలో నరాల మధ్య ప్రవహించే రక్తంలో ఆవేశం అణిగి నెమ్మది సంతరించుకున్న ఆలోచనల్లోని అనుభవసారాన్ని విప్పి చెప్పే గళాలను వినే ఆసక్తి సమయం మనకు లేవు. వృద్దాప్యాన్ని బాల్యాన్ని ముడిపెట్టి నిశ్చింతగా మనగల్గే కుటుంబ భద్రత మనకు కరువైంది. వ్యక్తి స్వేచ్ఛకు దాసోహం అయిపోయిన మనం చిన్న మందలింపును తట్టుకోలేకపోతున్నాం. ఎడగారు పిల్లలే కాదు ఎడగారు తల్లిదండ్రులు అయిపోతున్నారందరూ..
ఊరు పొమ్మంటుంది కాడు రావద్దు అంటుంది ఏం చెయ్యాలి అని దీనంగా వేడుకునే పేద వృద్దుల ఆవేదన కలచివేస్తుంది. కనిపెంచిన బిడ్డలే తల్లిదండ్రులను ఆదరించక రాక్షసుల మాదిరిగా ప్రవర్తిస్తుంటే వారికి ఎంత వేదన. ఆ మూగరోదనలు నిస్తేజంతో కన్నీరు ఇంకిన గాజు కళ్ళు మేమింకా ఎందుకు బ్రతికివున్నాం భగవంతుడా! అని విలపించే రోదనలు వారి వేడికోళ్ళు హృదయఘోష వినగల్గే బిడ్డలు అయినవాళ్ళు ఎందరు? వృద్దాప్యం ఎంత శాపం!?
మనుషులు ఇంత కరుడుగట్టిన కాఠిన్యంతో ఎలా బ్రతకగల్గుతారు అనే ఆశ్చర్యం వేస్తుంది. పుట్టుకముందు మనచుట్టూ కొన్ని ఆశలు మమకారాలు అల్లుకునివుంటాయి. పుట్టాక యెదుగుదల క్రమంలో జాగ్రత్తలు ఆంక్షలు ఆకాంక్షలు వుంటాయి. అధికారాలు అహాలు అసక్తతలూ నిస్సహాయాలు ప్రేమరాహిత్యం అన్నీ భరిస్తూనే వృద్దాప్యపు వొడ్డుకు యెప్పుడొచ్చి చేరుకుంటారో కదా! తరచిచూసుకుంటే యెన్నో అసంత్రుప్తులు ఆవేదనలూ ఆరోపణలూనూ. ఎవరిమీదో ఒకరిమీద ఆధారపడే స్థితిలో ఎన్ని ఆలోచనలూ ఎంత వేదన!
వృద్ధాప్యం ఓ శాపం కాదు, వ్యాధి కాదు, అది రెండో బాల్యం’’ అన్నారట తిరుపతి వేంకట కవులు.
మన భారతదేశంలో పదహారు కోట్ల మంది వృద్ధులు బిడ్డల నిర్లక్ష్యాలకు గురైన వారు అనాధలగా వున్నారట. తల్లిదండ్రులను దేవతలుగా భావిస్తారనుకునే ఈ దేశంలో కుటుంబజీవనానికి గొప్ప చిరునామా అనుకున్న మనదేశంలో ఉన్న పరిస్థితి ఇది. ప్రపంచ వ్యాప్తంగా కూడా వృద్దులను నిర్లక్ష్యం చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఇది ఉగ్రవాదం లాంటి ముఖ్యమైన సమస్య.
వృద్దులు పిడికెడు మెతుకుల కోసం పెట్టే ఆకలి కేకలు రోగగ్రస్త శరీరాలతో వారి ఆలాపనలు అరుపులు ఈ ప్రపంచానికి వినబడదు వినిపించుకోదూ. వారి అరుపులు వారికే ప్రతిధ్వనులతో వినబడి జీవితంపై అసహనం అసహ్యం పుట్టిస్తుందట. ఆ అసహాయ జీవం పిడికెడు ప్రేమ కోసం తహతహలాడుతూ చకోరంలా ఎదురుచూస్తుంది. తుదకు ఏదో ఒకనాడు మరణిస్తుంది.
మా పక్కన నివసించే ఒక వృద్దజంటను గమనిస్తూ వుంటాను. బిడ్డలతో అంటీముట్టనట్లు వుంటారని అనుకునేదాన్ని. కానీ కరోనా కాలంలో బిడ్డల క్షేమం కోసం వారు ఎంత అలమటించారో. బిడ్డలు వారి క్షేమసమాచారం ఎలానూ విచారించలేదు కానీ వారు ఎంత ఆత్రుత ప్రదర్శించారో తెలుసా! వారికి అయినవాళ్ళపై బిడ్డల ప్రవర్తనపై విసుగు విరక్తి రెండూ వచ్చాక మనుషులను వద్దనుకోవటం మరణించడం కన్నా తక్కువేమీ కాదు. చుట్టూ వున్న మనుషులు చెప్పాపెట్టకుండా మాయమైపోతున్నప్పుడు మనతో అనుబంధం వున్న మనుషులు హఠాత్తుగా గుర్తుకు వచ్చి అయినవారికి గుబులు పుట్టిస్తారనుకుంటా. ఆ వృద్దులిరువురూ ఆత్రుతగా వారి కుశలం అడగాలని ఫోన్ పట్టుకుని మళ్ళీ అంతలోనే ఆగిపోవడం. అపుడు నాకనిపించింది మనుషులు సంకోచాలను జయించడం అనుకున్నంత తేలికైన విషయం కాదు. సంకోచం జయించినపుడు వచ్చే స్వేచ్ఛ ఆనందాన్ని ఇవ్వకపోవచ్చు కానీ కచ్చితంగా సంతోషాన్ని మాత్రం ఇస్తుంది కదా అని.
తల్లిదండ్రులను ధనం కోసం పీడించే పిల్లలూ వున్నారు. వారు ఆశించినవి
ఇవ్వడం కూడా అంత తేలికైన విషయమూ కాదు. అది శారీరక శ్రమా వస్తు రూపమా వడ్డీ రూపమా స్థిరచరాస్తులా అన్నది కాదు. అన్నింటి మీద తన హక్కులో ఇతరుల హక్కులో ఇష్టాలో అయిష్టాలో యెన్ని కలగాపులగమై వుంటాయసలు. ఇవ్వలేదని నిరసన అలక ఆరోపణ అన్నీ ఏదో ఒక రూపంలో వ్యక్తమవుతూ వుంటాయి. అవి వృద్దుల మనసుకు తెలుస్తుంటాయి. మేమేం బండరాళ్ళం కాదుగా. బిడ్డల మాటలు ప్రవర్తన లోపలి మనిషిని పట్టిస్తాయి. ఒకవేళ వాటిని అవసరం మేర దాపెట్టినా మేము చూసింది విన్నది నిజం కాదనీ తెలుస్తూనే వుంటుంది. ఎందుకు ఇంత బాధని వున్నదంతా ఇచ్చేసాము, ఇక తర్వాత మా ముఖం చూసినవాళ్ళే లేరు అని వాపోయారు. ఇలా అన్నీ బిడ్డలకిచ్చేసి అనాదరణకు గురైన అనాధలైన వృద్దుల గుండెల్లో చెప్పలేని కథలెన్నో.. అందుకే అంటున్నా, మన పూర్వులు చేసిన తప్పులు మనం చేయకుండా మనకోసం మనం కొంత సమయం కేటాయించుకుని అందులో లీనమైపోదాం.వీలైనంతగా బిడ్డల మీద ఆధారపడకుండా గౌరవంగా జీవనం సాగించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలి అని. ఉరుకుల పరుగుల జీవనంలో యెపుడైనా మన కోసం మనం ఆగి చూసుకున్నామా అని విచారపడుతున్నాను కూడా.
కూటికిగుడ్డకు నోచుకోని నిరాదరణ పాలైన వృద్దులు దిక్కులేని రెక్కలు విరిగిన పక్షులై దీనస్థితిలో పుట్ పాత్ లపైన స్మశానాల పంచన కాలం వెళ్ళదీస్తూ యెంతకూ రాని మరణం కోసం దుఃఖిస్తూ కన్నీరు కూడా రాని గాజుకళ్ళతో నిర్వేదంగా చూస్తున్న చూపుతో కలవరపెడతారు. ఎవరిదీ నిర్లక్ష్యం. ఎవరిదీ పాపం!? ఎక్కడుందీ మానవత్వం. వీరిని సేవించడానికి ఆకలి నింపడానికి యెన్ని ఆపన్నహస్తాలు కావాలి.అమెరికాలో మరికొన్ని దేశాలలో లాగా వృద్ధుల భాద్యతను ప్రభుత్వాలు తీసుకుంటే బాగుంటుందేమో!
పిల్లలు కూడా ఎంతసేపూ వారి వారి వ్యక్తిగత అభిరుచులకూ ఆకాంక్షలకూ అనుగుణంగా నడుచుకోవడమే తప్ప ఇతరుల గురించి ఆలోచించడం అంటే మానేసారు సరే.. కన్న తల్లి తండ్రి రక్త సంబంధం గురించి కూడా ఆలోచించకుండా వుండటం యెంతవరకూ సబబు అనుకుంటున్నాను. వృద్దురాలైన తల్లికి గ్లాసుడు పాలు కొనడానికి డబ్బులేదన్న కొడుకు పట్టుమని పదేళ్ళు లేని తన పిల్లల కోసం మేకప్ కిట్ ల కోసం వేలకువేలు ఖర్చు పెట్టడం వింతగా తోసింది. ఏ ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నాం మనం. ఎంత విచారంగా వుంటుందో ఇవ్వన్నీ చూస్తుంటే.
ఇంకొక విషయం చెబుతాను విను. ఒక స్త్రీ మూర్తి కథ ఇది. నాకు పిన్ని వరుస అవుతారు ఆమె. కొడుకు ఆమె ఆశలకు విభిన్నంగా వివాహం చేసుకున్నాడు. దానిని ఆమె దశాబ్దాలుగా అంగీకరించలేదు జీర్ణం చేసుకోలేదు. అనారోగ్యం కల్గితే ఆసుపత్రికి కూడా వెళ్లదు.ఆమెకు పిసినారితనం లేదా డబ్బు వెసులుబాటు లేకపోవడమేమో కాదు. తనకు తనమీద శ్రద్ద లేకపోవడం, ఆసుపత్రికి వెళ్ళడం పట్ల అయిష్టత,బద్దకం, నిర్లిప్తత కూడా కావచ్చేమో. కానీ ఆమె పెదవులపై ఎపుడూ ఆరోపణ కొడుకుపై కోడలిపై భర్తపై ఆఖరికి ఆమెపై ఆమెకు కూడా. మనకు వొకరు చేసే అన్యాయం కన్నా మనకు మనం చేసుకునే అన్యాయం ఎక్కువ అని చెప్పాలనిపించింది. మనుషులు పైకి కనబడేదానికన్నా అంతర్గతంగా విభిన్నమైన వాళ్ళు. వాళ్ళు హఠాత్తుగా షాక్ యిస్తూ వుంటారు. నిజమా నిజమా అని మనం పదే పదే గిచ్చి చూసుకునేంతగా. అందుకే ఎవరిపైనా కచ్చితమైన అంచనాలు పెట్టుకోకూడదు. బిడ్డలైనా సరే వారిని గుడ్డిగా నమ్మకూడదూ. నమ్మకం పక్కన అపనమ్మకం వుండాలి పొర క్రింద పొరలా. మనుషుల మధ్యే కాదు బంధాల మధ్య కూడా ధనం ప్రవేశించి నీకింత సేవ చేస్తే నాకెంత ఇస్తావు అని అడగటాన్ని సహజంగా తీసుకోవాల్సి వస్తుంది. అమ్మనాన్నలంటే ఆఖరి రక్తం బొట్టు వరకూ ఉదాత్తంగా ఇచ్చేవారే కదా..అది మరుస్తుంది పిల్లల లోకం.
అప్రయత్నంగా ఎప్పుడో చదివిన కథలు గుర్తొచ్చాయి “రుకైయ్యా రీహానా” ఉర్దూ రచయిత వ్రాసిన “తల్లి” కథను నేనెప్పటికీ మర్చిపోలేను. ఇంకో కథ “జహీదా హీనా” అనే రచయిత వ్రాసిన “తితిలియోం దూండ్నే వాలే” అన్న కథ తెలుగు అనువాదంలో “నిష్క్రమణం” అనే శీర్షికతో చదివినపుడు ఎంత కదిలిపోయానో. అలాగే ఇటీవల చదివిన తమిళ రచయిత “పెరుమాళ్ మురుగన్” వ్రాసిన అమ్మ కథ ఎంత హృద్యంగా వున్నాయో! వాటిని చదివిన మనుషులెవ్వరూ అమ్మనాన్నలను నిర్లక్ష్యం చేయరు అనిపించింది. నేను చదివిన అత్యుత్తమ తల్లిదండ్రుల కథలను సంపుటిగా వేసి పంచిపెట్టాలనిపిస్తూ వుంటుంది. ప్రేమ కథలు కాదు ఇపుడు కావాల్సింది. తల్లిదండ్రులను వృద్దులనూ ప్రేమించి ఆదరించే విధంగా కఠినశిలగా మారిన హృదయాలను తుత్తునియలు చేసే సాహిత్యం సినిమాలు చిన్న చిత్రాలు రావాల్సిన అవసరం వుంది. వీధి కుక్కల కళేబరాలవలె దిక్కుమొక్కు లేని అనాధ శవాలుగా మనుషులు మిగలకూడదని నా ఆశ ఆకాంక్ష. మీ అత్తగారితో పాటు అమ్మను కూడా మీ ఇంటికి తెచ్చుకుని ఆమెకూ నీ సేవనూ ప్రేమాప్యాయతలనూ పంచిపెట్టాలని కూతురివైతే మాత్రం ఏమిటీ అమ్మను చూడటం కూడా నీ భాద్యతే కదా అని నీకు గుర్తుచేయాలని అనిపించింది.
జీవిత తీరం దాటడానికి ఏం కావాలి చెప్పు? ఓ రెండు చాలు. పిడికెడంత ప్రేమ చిటికెడంత ఓదార్పు. వృద్దాప్యాన్ని అదే రెండో బాల్యాన్ని మన బిడ్డల బాల్యాన్ని కాపాడినట్లు పదిలంగా కాపాడుకుందాం. అదే మనం చూపే అసలైన ప్రేమ భాద్యత. వృద్దులను వినడం ఒక వరం చాదస్తపు కబుర్లు అని కొట్టి పడేయకుండా మనసుపెట్టి వింటే ఎన్నెన్ని అనుభవపాఠాలు అనుకున్నావు. వారి కబుర్లలో చరిత్ర దాగివుంటుంది.లోకరీతి వుంటుంది.వారు అధిగమించిన అవరోధాలు వారి త్యాగాలు కఠినమైన మాట వెనుక దాగున్న మంచి విషయాలు ఇలా ఎన్నెన్నో.
వృద్దుల అనుభవాలు జీవనసారం. వారి మాటను పెడచెవిన పెట్టకుండా విని ఆలోచిస్తే మంచి జరుగుతుంది అని నమ్మేదాన్ని. ఇప్పటికీ నమ్ముతాను. వృద్దుల కౌన్సిలింగ్ యువతను పెడత్రోవ పట్టకుండా కాపాడుతుంది. నాయనమ్మలను అమ్మమ్మలను తాతయ్యలను మీ పిల్లలకు కానుకలుగా ఇవ్వండి అని విదేశీ తల్లిదండ్రులకు చెప్పి చెప్పి వెగటు కల్గిస్తున్నానట. నా కొడుకు హాస్యంగా చేసే ఆరోపణ. ఇపుడు నువ్వేమంటావో!
చివరగా మనుషులైన వారందరిని ఒకటే కోరుకుందాం...
“మిమ్మలను ప్రేమించే వారి హృదయాలను ఎప్పుడూ గాయపర్చకండి.
ఎందుకంటే వారు మిమ్మల్ని యేమీ అనలేరు.
మౌనంగా మీ జీవితం నుండి నిష్క్రమించడం తప్ప.” అని.
వృద్దుల యొక్క సంతోషపు జీవనసూచికతో మాత్రమే కుటుంబానికి అర్దాన్ని దేశానికి అభివృద్దిని ప్రపంచానికి శాంతిని కనుగొనగల్గం అనిపిస్తుంది.
ఉంటాను మరి
ప్రేమతో నీ ప్రియ నేస్తం
“అమృత”