
నేను
వకుళవాసు
హన్మకొండ, 9989198333
ఎవరికీ అర్థంకాని భావగీతాలాపాన్ని...
కవితా కాన్వాసుపై నర్తించె కావ్య శిల్పాన్ని...
ఒక్కోసారి నాకే అంతుపట్టని అగాధ సంద్రాన్ని...
నీ హృదిలో కమ్మిన చీకట్లను పారద్రోలే వెన్నెల కిరణాన్ని...
స్వచ్ఛ స్నేహాన్ని కాంక్షించే పరిమళ పారిజాతాన్ని...
వల్లిన మోమును పూయించే చల్లని వర్షాన్ని...
నీ కనుదోయికి అపురూపంగా కనిపించే మంచుబొమ్మని...
కాలపు వాకిలిలో ప్రేమ వెన్నెల కురిపించే చుక్కల ముగ్గుని...
అనురాగాల తోరణాలను కట్టి అనుబంధాలను పెనవేయ....
తరాలకు వారధినై పుట్టిన "అమ్మ"ని....
***

అమ్మనై పుట్టినందుకు..
నిర్మలారాణి తోట-9154767654
కరీంనగర్.
ఇల్లంతా తీపికబురని సంతోషంలో
తేలిపోతుంటే
నాసికను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వాసనల్లో
వరుసవాంతులతో ముద్దమింగలేని
మూడంకెనయ్యాను
సీమంతమని ముత్తైదులు సింగారం చేస్తుంటే
నడుము మీది బిందె
ముందుకు జారిన భారంతో ఓపలేని ఆయాసమయ్యాను
పొద్దులు పడ్డాయని అందరూ ఆత్రంగా ఎదురుచూస్తుంటే..
పక్కపొర్లలేని పొంగినపొట్టతో
అతలాకుతలమయ్యాను
లోలోపల తంతుంటే మాతృత్వపు కలకంటూ పంటిబిగువున నొప్పిని నవ్వైపూయించాను
రోకలిపోట్లో ,కత్తుల కోతలో
పసిగుడ్డుకు ప్రపంచమివ్వాలని
ప్రాణాలతో చెలగాటపు పునర్జన్మనయ్యాను
ఒళ్ళంతా పచ్చిపుండై సలుపుతున్నా
నా నిద్రనెత్తుకెళ్ళిన రాత్రుల్లో
తెల్లవార్లూ నీకడుపునింపే పాలధారనయ్యా
నే పళ్ళెం ముందు కూర్చున్న ప్రతిసారీ
నువ్ మలమూత్రాల రాగమెత్తితే
సానిటైజరైనా లేని పాకీ చేతులయ్యాను
బుడిబుడినడకల బడి ఘట్టంలో
యూనిఫాం రాజసానికి
సాయంత్రాలు సాక్సుల్లో కంపు కడిగి
పొద్దున్నే నీ బ్యాగులో లంచ్ బాక్సునయ్యా
చదువుల కిరీటం నీ శిరసునుంచే
పరీక్షల ప్రస్థానంలో
పట్టాలేని కష్టభద్రనయ్యా
ఉద్యోగపు సోపానం నిన్నెక్కించాలని
బోసిమెడల నిచ్చెనయ్యా !
పాతికేళ్ళు ప్రాణంలా పెంచుకొని
పరాయింటిపిల్లకు కన్యుడిదానం చేసి
నీ జీతం జీవితం నాదికాదంటే
నువ్ కన్న పిల్లలకు దాసీనయ్యా !
నడీడుదాటి నడుంవంగిపోయినా
బొడ్డుతాడు తెంపుకోలేని అశక్తనై.. రోగాలపుట్టనై
పంపకాల గడపల్లో బుక్కెడుబువ్వకై
కొంగుచాచే బిచ్చగత్తెనయ్యా !
****
రేయ్ !ఎవడ్రా అక్కడ ?
అపుత్రస్య గతిర్నాస్తని కూస్తున్నది !
మాతృత్వపు మహాకావ్యాన్ని అందంగా నా నెత్తుటి కన్నీళ్ళతో రాస్తున్నది ?
***
అక్షర నదం
సుమన ప్రణవ్
8919696972
నేనో అసంపూర్ణ వాక్యం......
కన్నీళ్ళతో కలల పలకపై తుడిచి తుడిచి
కొత్త ఆశల సుద్దముక్కై చీకటి రాత్రుల వేదనలో
వెలుతురు లతలు అల్లుకొన్న అక్షర పల్లకిలో ఊరేగుతుంటాను...
మౌనాలను మాటలుగా మలిచి
తలుపుల నదంలో
వెన్నెల జలతారును పదాల ప్రవాహానికి అద్దుకోవాలని
అక్షర నావకు లంగరేసి సుదీర్ఘ రాత్రుల తీరాలలో
ఇసుక తిన్నెలపై ఓ విరామ చిహ్నమై చిగురేస్తూనే ఉంటాను....
ఉన్నట్టుండి నిశి విషాదాశృవు నుండి పురుడోసుకొన్న
ఆకాశం వేవేల సూరీళ్ళను పొత్తిల్లలో పొదువుకొన్నట్టుగా...
కాంతి కువకువనై సరికొత్త భూపాళమాలపిస్తాను.....
ఘనీభవించిన మనసు కొలను అంచుల నుండి
కరిగి విడివడి జారిన అక్షర ముత్యంలా
సంధ్యలలో మునిమాపువేళ ఎర్రబడిన
పడమటి కొండ లోయలలో ప్రజ్వలించే
చైతన్య రాగ దీపమవుతాను....
నవ పరిమళాలంటిన భావ తరంగం ఎదురవుతుందేమోనని
యామినిని పలకరించే శరదృతువు వెన్నెల దారుల్లో
శూన్యమయిన మనసు వేణువును
కలం పెదాలపై మోస్తూ తచ్చాడుతుంటాను...
అక్షరం ఎందుకో అలయని బాటసారిలా
పయనిస్తూనే ఉంటుంది జీవనదిలా!
నేనో దాహం తీరని అసంపూర్ణ వాక్యంలా...
దోసిలొగ్గి అడుగులేస్తూనే ఉంటాను శరణార్థిలా!

సంకెళ్ళు
సౌజన్య వేముల
హన్మకొండ
అమ్మా !
చిన్న పాపగా ఉన్నప్పుడు
నాకు ఎక్కడ దిష్టి తగులుతుందో
అని కాటుకతో పెద్ద బొట్టు
గుండ్రంగా పెట్టావు.
కాస్త పెరిగి పెద్దయ్యాక
రంగురంగుల తిలకంతో
డిజైన్ బొట్లతో సింగారించావు.
పరికిణి వేసే సమయంలో
మిరమిట్లు గొలిపించే
తీరొక్క బొట్టు పిల్లలు పెట్టి
మురిసిపోయావు.
నాన్న !
పెళ్లికూతురుని చేసి
కళ్యాణ తిలకం దిద్ది
అతనే నీ తోడు అంటూ
అత్తారింటికి సాగనంపావు.
పాపిట్లో సింధూరం ధరించి
నుదుట కుంకుమను ధరించి
చేతినిండా గాజులు వేసుకుని
నిత్య సుమంగళిలా నిలుస్తిని .
కానీ.......
విధి వక్రీకరించి, కాలం కలిసి రాక
వివాహ బంధంతో తోడైన మనిషి
కనుమరుగై, తిరిగిరాని లోకానికి వెలితే
అది నా తప్పా.... ???
పుట్టుకతో పెరుగుదలతో వచ్చిన
బొట్టు, పువ్వులు, గాజులు
వితంతువు అనే దుర్మార్గపు పేరుతో
నాకెందుకు దూరం కావాలి ఓ సమాజమా ??
ఓహో.....!
బొట్టు పువ్వులు గాజులతో
నేను పరపురుషునికి
అందంగా కనిపిస్తానని
ఇవన్నీ నాకు దూరం చేసారా...!
కానీ నా అమ్మ నాన్న !
నాకు తెలుసు
ఇది మీకు ఇష్టమైన విధానం కాదు అనీ
ఓ స్త్రీ !
నీవు ఇలా -
ఎవరికో అందంగా కనిపిస్తావని
ఎవరికో ఆశలు పుట్టిస్తావని
వితంతు అనే మూఢచారాన్ని
అంటగట్టి చీకట్లోకి నెట్టివేయడం
న్యాయమా ఈ సమాజానికి... ???
కానీ ఓ మహిళా !
సరిగ్గా తెలుసుకో ! !
ఆ ఆభరణాలే అందానికి ప్రేరకాలైతే
మగవాడికి బానిసలా ఆకర్షించేవైతే
ఆ సంకెళ్ళే సమాజానికి కొలబద్దలైతే
అవి ఏవి లేని ఏ అనవసర ఆచ్ఛాధన లేని
స్వచ్చమైనా వ్యక్తిలా నువ్వుండు
తుచ్ఛమైన గుంపు తొలగిపోయి
నిన్ను నీలా వెచ్చగా స్వీకరించే
అచ్ఛమైన మనిషొకడు కదిలి వస్తాడు
నీకు అమ్మ నాన్న సమాజం అన్నీ అవుతాడు.

మహిళా మణిపూసలు
శ్రీమతి. జి. శాంతా రెడ్డి,
పెద్దచింతకుంట, నారాయణపేట 8008177325
బాల్యమెంతో మోదము
యవ్వన మెంతో ముదము
బరువు బాధ్యత చట్రాన
ముదిమి యెంతో ఖేదము
ఇల్లంటేనే హద్దు
జీవితమంటే పద్దు
సామరస్య జీవితాన
సంయమనమే ముద్దు
నాడు గీతలో సీత
నేడు బరిలోన గీత
పంజరంలో పక్షిలా
మారదుగా నీ రాత
వక్రబుద్దులును మారని
మగ దురహంకారాన్ని
పాతాలానికి తొక్కేస్తుంది
ఓరోజు ఈ పిశాచిని
ఆకాశంలోన సగము
అవకాశాలు శూన్యము
మహిళా సాధికారతనే
నాకో రక్షణ కవచము
జగతికి జీవం పోస్తూ
ఊహలను ఆవిరిచేస్తు
అబల కాదు సబలంటూ
సకల విజయాల సాదిస్తూ
మహిళనని మేలుకొంట
మహిళగా కోలుకుంట
సమాజమంటె నాదేనని
మనసార పాడుకుంట
నాలా బతుకనీయండి
నాకూ బతుకునీయండి
వంశవృక్ష ఛాయల్లో
నన్నూ ఎదగనీయండి
వినిపింతు మౌనగీతం
కనిపించగ మనోగతం
ఎదురీదిన కాలంలో
రూపుకట్టు నా చిత్రం

వనితా తెలుసుకో నీ ఘనత
చంద్రకళ. దీకొండ,
మేడ్చల్ జిల్లా, 9381361384
సహనంలో అవనివి నీవు
త్యాగంలో తరువువు నీవు
లోకానికి చాటు నీ విలువ
వనితా తెలుసుకో నీ ఘనత...!
వంటింటి కుందేలు నాడు
మింటిలో సగం ఈనాడు
సాటిలేనిది కదా నీ సామర్థ్యం
వనితా తెలుసుకో నీ ఘనత...!
రాయంచ నడకలు నీవి
రాశిపోసిన సుగుణాలు నీవే
రాణకెక్కిన కీర్తి నీదే
వనితా తెలుసుకో నీ ఘనత...!
సమస్యలలో సలహాయై మెరిసేవు
విపత్తులలో స్థితప్రజ్ఞవు నీవు
సాధించని విజయాలు కలవా ధరలో
వనితా తెలుసుకో నీ ఘనత...!
మనసు తెలిసి మసలేవు
మనములోనే కుమిలేవు
మనోధైర్యం పెంపొందించుకో
వనితా తెలుసుకో నీ ఘనత...!
అలుపెరుగని శ్రామికురాలు నీవు
సమస్యలతో పోరాడే సైనికురాలు నీవు
వండి వడ్డించే అన్నపూర్ణవు నీవు
వనితా తెలుసుకో నీ ఘనత...!
సంసార చోదకురాలు నీవు
సర్దుబాటు ఎరుగుదువు నీవు
స్వాభిమానం నిలుపుకో
వనితా తెలుసుకో నీ ఘనత...!
సృష్టికి మూలం నీవు
కుటుంబ వేరుమూలం నీవు
సాధికారతను సాధించు
వనితా తెలుసుకో నీ ఘనత...!
తీసివేతగా తేల్చేరు నిన్ను
గణిత శకుంతలను మరిచేరు
లెక్కలు తేల్చి చూపించు
వనితా తెలుసుకో నీ ఘనత...!
మమతల మాగాణివి నీవు
చిరునవ్వుల సిరివి నీవు
చిన్నమాటకే క్రుంగెదవేల...?
వనితా తెలుసుకో నీ ఘనత...!
అందరి గురించీ పట్టించుకుంటావు
కుటుంబానికై నిరంతరం తాపత్రయపడతావు
నీ ఆరోగ్యంపై శ్రద్ధ చూపవెందుకు...?
వనితా తెలుసుకో నీ ఘనత...!
బాధలన్నీ గొంతులో దిగమింగుతావు
బాధ్యతల బరువుతో క్రుంగేవు
బ్రతుకులో ఆనందాన్ని నింపుకో
వనితా తెలుసుకో నీ ఘనత...!
పరిచయం లేని మెట్టినింటిలో పాదుకుంటావు
పదుగురినీ నీతో కలుపుకుంటావు
నీ అస్తిత్వాన్ని నిలుపుకో నీవు
వనితా తెలుసుకో నీ ఘనత...!
ఆదివారమంటే అందరికీ విశ్రాంతి
నీకు మాత్రం పనులతో అవిశ్రాంతి
శ్రమించే శక్తిని కూడగట్టుకో నీవు
వనితా తెలుసుకో నీ ఘనత...!
నీ కోసం సమయం కేటాయించుకో
నీలోని నైపుణ్యాలకు పదునుపెట్టుకో
నీ అభిరుచులతో ఉత్తేజం పొందు
వనితా తెలుసుకో నీ ఘనత...!
పారిపోతే వెంటపడును లోకం
వెంటపడితే పారిపోవును లోకం
వెనుదిరిగి ఒక్క చూపుతో నిలవెయ్యి
వనితా తెలుసుకో నీ ఘనత...!
జీవితమంతా పరులకై ధారపోయకు
నీ ఇష్టాలను అణచివేయకు
అప్పుడప్పుడూ సంతోషాన్ని అందిపుచ్చుకో
వనితా తెలుసుకో నీ ఘనత...!
నీ అభిప్రాయాలను వెల్లడించు
నీ నిర్ణయాన్ని ప్రకటించు
కుటుంబానికి మూలస్థంభం నీవు
వనితా తెలుసుకో నీ ఘనత...!
అందాన్ని పొగిడితే మైమరవకు
మాయమాటలకు లోబడిపోకు
నీ జాగ్రత్తలో నీవుండు
వనితా తెలుసుకో నీ ఘనత...!
నీకు అసాధ్యమైనదేదీ లేదు
అంతరిక్షానికి సైతం పయనమైనావు
పరిశోధనల్లో ప్రథమం నీవు
వనితా తెలుసుకో నీ ఘనత...!
ఆత్మన్యూన్యతతో వెనక దాక్కోకు
ఆత్మస్థైర్యాన్ని వదులుకోకు
ఆత్మవిశ్వాసపు ఆయుధం ధరించు
వనితా తెలుసుకో నీ ఘనత...!
మంచితనం చూపి మోసపోకు
అన్యాయాన్ని ఆదిలోనే ఎదిరించు
ముసుగులోన ఉంచితే ముదిరిపోవు
వనితా తెలుసుకో నీ ఘనత...!
పెంపకంలో వివక్షను ప్రశ్నించు
చదువులో నీవే మెరుగని చాటు
నీ గొప్పతనం అందరి మెదళ్ళలో నాటు
వనితా తెలుసుకో నీ ఘనత...!
పనిచేసే చోట వేధింపులను సహించకు
బయటకు తెలిస్తే ఏమగునోయని భరించకు
కంటిచూపుతో కట్టడి
చేయడం నేర్చుకో
వనితా తెలుసుకో నీ ఘనత...!
అబలవనే సానుభూతిని ఆశించకు
సమస్యలను సామరస్యంగా పరిష్కరించు
సబలవు నీవని నిదర్శనం చూపు
వనితా తెలుసుకో నీ ఘనత...!
**************************************