top of page
shanthi prabodha

నీలాకాశంలో నిధి
- శాంతి ప్రబోధ 

పైన నీలాకాశం 

కింద నీలి సముద్రం 

నెమ్మదిగా కదులుతున్న తెల్లని మేఘాలు 

ఆ మధ్యలో రెక్కలల్లార్చుకుంటూ ఎగిరే పక్షి లాగా  విహరిస్తూ మామయ్య. 

వావ్..  

ఎంత అద్భుతమైన ఆ దృశ్యం!?

మనసులోనే అనుకుంది నిధి. 

కళ్ళు మూసినా తెరిచినా ఆ దృశ్యమే నిధి తలపుల్లోకి వస్తున్నది. మళ్ళీ మళ్ళీ వస్తున్నది.  

 

అటువంటి దృశ్యం మీరెప్పుడైనా చూశారా?  లేదు కదూ.. 

కానీ నిధి చూసింది. 

 

నీలాకాశంలో ఎన్నెన్నో పక్షులు ఎగురుతూ ఉంటాయి. అది అందరికీ తెలిసిన విషయమే. 

నీలి సముద్రంలో రకరకాల చేపలు, పీతలు, పాములు, కప్పలు ఇంకా ఏవేవో చాలా జీవరాశులు ఉంటాయి. అది కూడా అందరికీ తెల్సిన సంగతే.   

నిధికి ఎందుకో గానీ చేపలాగా నీలి సముద్రంలో ఈత కొట్టాలి అని అనిపించలేదు. 

నీలాకాశంలో పిట్టలాగా ఎగరాలని కోరిక మాత్రం అలా అలా పెరిగిపోతున్నది.  

ఈ విధంగా అనిపించడం పదకొండేళ్ల నిధికి ఇది మొదటిసారి కాదు . 

ఇప్పటికి ఎన్ని సార్లు అంటే.. లెక్కపెట్టలేనన్ని సార్లు పక్షిలా గగనంలో విహరించాలని అనుకుంది. 

మామయ్య పిట్టలాగా ఆకాశంలో షికారు చేసిన సుందర దృశ్యం నిధి కళ్ళలో  ఎప్పుడూ మెదులుతూనే ఉంది. 

ఏం చేసినా, ఎక్కడున్నా ఆ దృశ్యం ఆమెను వెన్నంటి వస్తూనే ఉంది.  

అయస్కాంతంలా ఆకర్షిస్తూనే ఉంద. అస్సలు వదలడం లేదు.   

 

నిధి అందరు పిల్లల్లాంటి పిల్ల కాదు.  ఆమె ఆలోచనలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఆమె పనులు కొత్తగా కనిపిస్తాయి.  ఒక్కోసారి చాలా అల్లరిపిల్ల అనిపించుకుంటుంది. ఒక్కోసారి పొందికైన పిల్ల. నిధిని చూసి నేరుకోండి అని పెద్దలు అనేలా ఉంటుంది. 

నిధికి తనకు ఏది అనిపిస్తే అది చెప్పడం, చేయడం అలవాటు. 

ఆ చిన్నారి మనసులో కొత్త కొత్త ఆవిష్కరణలు జరిగిపోతుంటాయి.  కలలు కంటుంది. వాటిని సాకారం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. 

కానీ ఏమిటో.. ఈ కోరిక తీరుతుందో లేదో నన్న బెంగ నిధి కళ్ళలో. 

 

అప్పుడప్పుడు , రెక్కలున్న హ్యాంగ్  గ్లైడర్ కళ్ళముందు కదులుతుంది.  మామయ్య స్థానంలో ఆమె ఉన్నట్లు ఊహించుకుంటుంది.  

ఆ ఊహ రాగానే ఆమె కళ్లలో  కొత్త వెలుగులు నిండుతాయి.  

నక్షత్రాల్లా మిల మిల మెరిసే ఆ కళ్ళు మరిన్ని ఊహల్లో తేలిపోతూ ఉంటాయి.  

శరీరమంతా గాలిపటంలా ఎగిరి పోతున్నట్టు ఉంటుంది.  కాసేపటి తర్వాత  ఎప్పటికో ఈ లోకంలోకి వస్తుంది నిధి.  

 

ఇప్పుడూ అంతే .. 

తన ఊహ ప్రపంచంలో  కాసేపు తిరిగి వచ్చింది. 

తన కాళ్ళను చూసుకుంది. చేతులు తడిమింది. 

అయ్యో .., నేను నింగికి నేలకు మధ్య గాలిలో  రివ్వున ఎగిరి పోవట్లేదా?

ప్చ్ .. ఈ కాళ్ళు నేల మీదే ఉన్నాయి అని చిన్నగా నిట్టూర్చింది.  

కొద్ది క్షణాలు కళ్ళు మూసుకుంది.  

తెల్లటి మబ్బు తునకలను ముద్దాడుతూ, హ్యాంగ్రె గ్లైడింగ్ ని హత్తుకుని ఆకాశం లో ఎగిరిపోతున్న దృశ్యం మళ్ళీ కళ్ళ ముందు మెదిలింది.   

కళ్ళు తెరిచి చూసింది. తన ఇంట్లోనే ఉంది. 

 

ఇది ఏంటి? నేను ఆకాశంలో కదా ఉండాల్సింది.  ఇంట్లో ఉందేమిటి అని మళ్ళీ కళ్ళు మూసుకుంది . 

మళ్ళీ  ఆ అద్భుత దృశ్యం. గాలిలో గిరికీలు కొడుతూ కేరింతలు కొడుతున్న దృశ్యం కళ్ళ ముందు నిలిచింది.  

మూసిన కళ్ళు తెరవాలని అనిపించడం లేదు.  కళ్ళు తెరిస్తే కమ్మని కల కరిగిపోతుంది.. అలా జరగడం ఇష్టం లేదు. కళ్ళు మూసుకుని ఊహల్లో ఊరేగుతూ ఉన్నది నిధి. . 

అంతలో, చెల్లి రిధి వచ్చి "కూర్చుని నిద్రపోతున్నావా .. అక్కా అక్కా" అంటూ చెయ్యి పట్టి లాగింది . 

 

"ఏంటే .. ఎందుకు అలా అరుస్తావు? "అని చెల్లిని కసిరింది నిధి. 

అక్క మొహం చూసి రిధి మూతి ముడుచుకుని అమ్మ దగ్గరికి పరిగెత్తింది.

 

నిధీ..

ఊహల్లో ఎన్ని రోజులు ఉంటావ్. 

కలలో ఎన్ని రోజులు తేలిపోతావు. చందమామ భూమి చుట్టూ తిరుగుతుంది.  అట్లా నీవు కూడా  ఆకాశమంత చుట్టేసేయ్. వెన్నెల మడుగుల్లో స్నానం చేసేయ్ .  మెత్తని చుక్కల చుట్టూ చక్కర్లు కొట్టేయ్. 

ఎన్నాళ్ళు, ఈ నేల మీద నడుస్తావు. పరుగుపెడతావు. దూకుతావు అని ఆమె మనసు మెత్తగా మొట్టికాయ వేసింది. 

నేలపైన నడిచినట్లు, నీటిలో ఈదినట్లు గాలిలో కూడా ఎగిరితే ఎంత బాగుంటుంది. 

 

అప్పుడప్పుడు ఎగిరిపోవాలని గాల్లోకి దుముకుతుంది నిధి. తన ఆశ ఎప్పుడు నెరవేరదు.  

ఇప్పుడు కూడా దూకింది.  కానీ కాళ్ళు మళ్ళీ నేలను తాకాయి. తన కాళ్ళను చూసుకుంది.  

అయ్యో.. గాల్లోకి గెంతినా కొన్ని క్షణాలే.  కాళ్ళు మళ్ళీ నేలనే అంటి పెట్టుకుంటున్నాయి. 

పక్షులు, తూనీగలు, ఈగలు, దోమలు, గబ్బిలాలు రెక్కలు అల్లారుస్తూ గాలిలో ఎంచక్కా ఎగురుతాయి . షికారు చేస్తాయి.  నేనెందుకు ఎగరలేక పోతున్నాను. అని ఎప్పటిలాగే ప్రశ్నించుకుంది. 

ఎగరడం లో ఎంత స్వేచ్ఛ ఉంది.  ఆ షికారులో ఎంత ఆనందం ఉంటుంది అని అనుకుంది ఆ చిన్నారి. 

నువ్వు కూడా ఎగురు. గాలిలో ఈత కొట్టు. 

చందమామతో చేయి కలుపు, నక్షత్రాలతో స్నేహం చెయ్యి.  

నీ కలల్ని నిజం చేసుకో అంటూ నిధి మనసు మరోసారి మొట్టికాయలు వేసింది . 

 

అమ్మ పిలుపుకు, చెల్లెలి అరుపులకు విసుగ్గా కళ్ళు తెరిచింది నిధి.  

నిజమే,  కరిగిపోయే కలలు ఎన్ని రోజులు కనడం  అనుకుంది. 

మామయ్య కల కనకుండానే గాలిలో గిరికీలు కొట్టాడు. నేను కలగంటున్నా . 

మరి.. నా కల నిజం చేసుకోవాలంటే అంత సులభమా .. ప్చ్ కాదు . చాలా కష్టం. 

కష్టమని ఊరుకుంటే ఎలా.  సాధించుకోవాలి . 

ఎంత కష్టమైనా సాధించుకోవాలి.  ఎన్ని అవస్థలు అయినా పడతా. ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గను.  తనకు తాను చెప్పుకుంది. 

 

నిధి తనలో మొలకెత్తిన ఊహలను  నిజం చేసుకోవాలి అని తహతహ లాడుతుంది. 

ఆ నిర్ణయం, ఆ ఆలోచన ఆమెలో  కొత్త ఉత్సాహం ఉరకలు వేయిస్తూ ఉంది . ధైర్యాన్ని ఇచ్చింది. 

అందుకు  ఏం చేయాలి? అని తనలో తాను ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం మొదలు పెట్టింది.  

ఇట్లా చాలా సార్లు అనుకుంది. ప్రణాళికలు వేసుకుంది.  కానీ నిజం చేసుకునే ప్రయత్నం మాత్రం చేయలేదు. 

ఇప్పుడు అట్లా కాదు.  ఎలాగైనా తను అనుకున్నది సాధించుకోవాలి.  ఊహను వాస్తవం చేసుకోవాలి. నిధి చాలా పట్టుదలతో ఉంది. 

 

రెండేళ్ల క్రితం నిధి మామయ్య నీలాకాశంలో పక్షిలాగా విహరించి వచ్చాడు.  ఆ ఫోటోలు , వీడియోలు నిధి చూసింది .  

అట్లా వాటిని చూసిన తర్వాత ఆమెకు నీలాకాశం మీద నీలి సముద్రం మీద ప్రేమ పుట్టింది అని అనుకుంటున్నారేమో... అదేమీ కాదు. 

నిధికి చిన్నప్పటి నుంచి నీలి రంగు ఆకాశం అంటే చెప్పలేనంత ప్రేమ.  పిచ్చి ఇష్టం. 

ఎంతంటే... ఎంతని చెప్పను? 

ఊ.. ఆకాశమంత ఇష్టం. అవును, ఆకాశమంత ఇష్టం. 

 

నిధి లాగే మీక్కూడా అనిపిస్తుంది కదా. నాకు తెల్సు, చాలా మంది పిల్లలు  రెక్కలుంటే ఎంత బాగుండు.  ఆకాశంలో ఎంచక్కా  ఎగిరిపోవచ్చు. 

ఎప్పుడూ నేలమీద నడవడమేనా .. పక్షిలాగా గాలిలో ఎగిరిపోవాలని గింగిరాలు కొడుతూ నీటిని ముద్దాడి మళ్ళీ పైకి పైపైకి స్వేచ్ఛగా ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అని  పిల్లలందరూ ఎప్పుడో ఒకసారి అనుకుంటూనే ఉంటారు. 

పిల్లలే కాదు, పెద్దలు కూడా అనుకుంటారు. కానీ, అది సాధ్యం కాదని మౌనంగా ఉండి పోతారు. 

కానీ నిధి అలా కాదు. అందరిలా సరిపెట్టుకుని ఉండలేక పోతున్నది. 

నిధికి  ఎప్పుడూ అదే ధ్యాస.  అదే శ్వాస అయింది. 

నిధి తన కల నిజం చేసుకోవడానికి రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంది. 

  

ముందే చెప్పాను కదా .. నిధికి ఆకాశమంటే ఆకాశమంత ఇష్టమని. 

ఆకాశాన్ని ఏ సమయంలో చూసినా, ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూస్తుంది. 

ఒక్క మాటలో చెప్పాలంటే ఆకాశమంటే ప్రేమలో పడిపోయింది ఆ పిల్ల. 

పక్షులు ఎగిరినట్లు తాను ఎందుకు ఎగురలేదు అని చాలా సార్లు ప్రశ్నించుకుంది. అమ్మని నాన్నని టీచర్లని అందరినీ అడిగింది.  పక్షులకు ఉన్నటువంటి కండరాలు లేవని, మన శరీరం బరువుగా ఉండడం వల్ల ఎగరలేమని ఏవేవో చెప్పారు. అవేమీ ఆమె చిన్ని బుర్రకి ఎక్కేవి కాదు. 

 

ఎప్పుడైతే మామయ్య హ్యాంగ్ గ్లైడింగ్ చూసిందో అప్పటి నుంచి నిధి తాను కూడా ఆకాశంలో ఎగుర గలనని నమ్మకం వచ్చింది. 

ఆమె ఊహలు, కలలకు రెక్కలు వచ్చాయి.  కలల్ని నిజం చేసుకొమ్మని తొందర పెడుతున్నాయి. 

 

మరి, నిధి తన కలల్ని, ఆశల్ని, ఊహలను నిజం చేసుకుంటుందా? కలలుగానే , ఊహలు గానే , ఆశలుగానే మిగిలిపోతాయా .. ?

ఏమో మరి!

అసలు అది  తెలుసుకోవాలంటే ముందు నిధి చిన్ననాటి సంగతులు, మామయ్య  చేసిన హ్యాంగ్ గ్లైడింగ్ అనుభవం, ఆయన చెప్పిన కబుర్లు  నిధితో ఏమేమి చేయించాయో   

తెలుసుకుందాం. పదండి.  

 

***                                       ***

ఆ ఆకాశంలో  ఏముందే .. కళ్ళు అప్పగించి చూస్తూ ఉంటావ్ అంటుంది నిధి వాళ్ళమ్మ . 

అమ్మా .. అంత పెద్ద దానివి అయ్యావు. అది కూడా తెలియదా. ఇంకా అట్లా చిన్న పిల్లలా మాట్లాడతావు . 

చూడు, అటు చూడు ఆకాశాన్ని.  

నిన్న చూసినట్లు ఇవ్వాళ ఉందా ..? 

పొద్దున్న చూసినప్పుడు ఉన్నట్లు ఇప్పుడు ఉందా .. ఎప్పుడు చూసినా కొత్తగా ఉంటుంది కదా .. అంటుంది వాళ్ళమ్మని . 

అందరికీ మామూలుగా కనిపించే దృశ్యాలు, చూసీ చూడకుండా మరచిపోయే దృశ్యాలు నిధికి అపురూపంగా కనిపిస్తాయో.. ఎందుకు అసాధారణంగా కనిపిస్తాయో ..అర్ధం కాదు అనుకుంటుంది అమ్మ.  

అలా ఆలోచిస్తూ .., వాటి లోతుల్ని చూడగలిగే దృష్టి కోణం నిధి ది. వాటిని ఆస్వాదించే మంచి మనసు తన చిట్టితల్లి ది అని మురిసిపోతుంది అమ్మ.  

 

ప్రకృతిలో అనుక్షణం సరికొత్తగా జీవం పోసుకునే దృశ్యాలు, అందాలు ఎప్పటికప్పుడు ఒడిసి పట్టుకునే బిడ్డ మాటలకి, సునిశిత పరిశీలనకు, సృజనకు  అమ్మ మురిసిపోతుంది.  ముసిముసి నవ్వులు నవ్వుతుంది.  

ఆ తర్వాత నిధి నెత్తి మీద మెచ్చుకోలుగా చిన్న మొట్టికాయ వేస్తుంది. 

అబ్బా .. అని తల మీద చేత్తో నెమ్మదిగా రుద్దుకుంటుంది.  అమ్మకేసి కొరకొరా చూస్తుంది నిధి. 

అప్పుడు అమ్మ కూతురిని దగ్గరకు తీసుకుంటుంది. కుడి చేతి వేళ్ళతో  భుజంపై  తడుతుంది .  

అమ్మ చేతి మెత్తటి స్పర్శ  నిధికి కొండంత బలాన్ని ఇస్తుంది .  

మళ్ళీ ఆకాశం కేసి చూపు విసురుతుంది.  

మనిద్దరం ఫ్రెండ్స్ కదా.. నాకు అందనంత ఎత్తులో ఎందుకు ఉన్నావు? 

ఏయ్ నింగీ.. నిన్ను తాకాలని అనిపిస్తుంది.  ఒక్క సారి వంగి నాకు షేక్ హాండ్ ఇచ్చి పో అంటూ ముద్దు ముద్దుగా అడుగుతుంది.  

ఎగిరే పక్షుల్ని చూస్తూ ఎప్పుడూ మీరే ఎగురుతారా.. నన్ను కూడా మీతో తీసుకుపోవచ్చుగా.. 

నాకు మీతో వచ్చి లోకమంతా చుట్టేయాలని అనిపిస్తుంది. మీరేమో నన్నిట్లా వదిలేసి ఎంచక్కా పోతారు.. ఒక్కసారైనా మీ రెక్కలపై కూర్చోపెట్టుకుని ఊరేగించొచ్చుగా అంటుంది. 

ఇంటి ముందు మెట్ల పై కూర్చుని బారులు తీరి పోతున్న పక్షుల గుంపులను ఆరాధనగా చూస్తుంది.  

 

అప్పుడు అక్కడ నిధి నాన్నమ్మ ఉందనుకోండి.  

నవ్వుతూ నిధి వైపు చూస్తూ ఏదో చెప్పడం మొదలు పెడుతుంది. 

పో నాన్నమ్మా .. ఇంకా ఎన్ని సార్లు చెబుతావ్ . ఇక చాల్లే అంటూ నిధి బుంగమూతి పెట్టింది. 

 

నాన్నమ్మ ఊరుకుంటుందా.. ఊహూ.. ఊరుకోదు.  నీ చిన్నప్పుడు... అంటూ నవ్వుతుంది నాన్నమ్మ.  

నిధికి అర్ధమై పోతుంది. నాన్నమ్మ తనని ఏడ్పించాలని అట్లా అంటున్నదని. 

అందుకే నాన్నమ్మ మాటలు పట్టించుకోదు. 

ఆకాశంలో మారిపోతున్న రంగుల్ని చూస్తూనో,  రూపం మార్చుకుంటున్న మేఘాల్ని చూస్తూనో, ఆకాశంలో ఎగిరే పక్షులు చూస్తూనో , లేదా సీతాకోకచిలుకలు, తుమ్మెదలు చూస్తూ ముచ్చట్లాడుతూనో ఉంటుంది నిధి. 

 

అయినా నాన్నమ్మ చెప్పడం ఆపదు. ఎవరుంటే వాళ్ళకి మనవరాలి ముద్దు ముచ్చట్లు చెప్పడం మొదలు పెడుతుంది.  

మీరు వింటారా..  వినండి. 

 

***                                 ***

 

నిధికి అప్పుడు నాలుగేళ్లు ఉంటాయేమో ..

అప్పుడే నర్సరీకి వెళ్లడం మొదలు పెట్టింది.  

నిధి అమ్మ, నాన్న ఇద్దరు టీచర్లు కదా.  వాళ్ళు వాళ్ళ బడికి వెళ్లేవారు.  

అందుకే నిధిని నాన్నమ్మ  ప్రీ స్కూల్ కి తీసుకు పోయేది.  తీసుకు వచ్చేది. 

రోజూలాగే ఆ రోజు కూడా సాయంత్రం ప్రీ స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది.  ఇంటి తాళం తీస్తున్నది. 

నిధి ఆకాశాన్ని, ఆకాశంలో ఎగిరే పక్షుల్ని చూస్తున్నది. 

అంతలో  నాన్నమ్మా అటు చూడు గట్టిగా అరిచింది . 

నాన్నమ్మ గాభరా పడిపోయింది. ఇంట్లోకి పో బోతున్న నాన్నమ్మ నిధి దగ్గరకి పరిగెత్తుకొచ్చింది.  చుట్టూ చూసింది. ఏమీ కన్పించలేదు. 

 

ఏమైందే.. ఏదో కొంపలు అంటుకు పోయినట్లు అరుస్తున్నావ్ అన్నది నాన్నమ్మ. 

అయ్యయ్యో ..నాన్నమ్మా ..  అటుచూడు 

ఆకాశం చూడు ముక్కలై పోతాంది.  అయ్యో.. పాపం. 

 ఆకాశం ముక్కలై పోతాంది. ఇప్పుడెట్లా .. ? ఏడుపు మొహంతో అరుస్తున్నది నిధి . 

 

నాన్నమ్మ  కంగారు కంగారుగా ఆకాశాన్ని చూసింది.  ఏమీ కనిపించలేదు . 

మనవరాలి వైపు చూస్తూ.. ఆకాశం ముక్కలవడం ఏమిటే తింగిరి అన్నది. 

అదిగో అటు చూడు. ఆకాశాన్ని అది ముక్కలు చేస్తూ ఉన్నది . 

నాన్నమ్మకి  ఏమీ అర్థం కాలేదు.  ఆకాశాన్ని ముక్కలు చేయడం ఏమిటే పిచ్చి మొహమా..  అని నిధి చెయ్యి పట్టుకుని లోపలికి నడవబోయింది.  

నాన్నమ్మ చెయ్యి నుంచి తన చెయ్యి  విదిలించుకుని బయటకు పరిగెత్తింది నిధి. 

 

అదిగో .. అటు చూడు 

ఆకాశాన్ని ముక్కలు చేస్తున్నది.  తెల్లగా గద పట్టుకుని వచ్చింది.  ఆకాశాన్ని కొట్టేస్తున్నది అని ఏడుపు మొహం పెట్టింది నిధి.  

అది చూసి నాన్నమ్మకు నవ్వాగలేదు.  పడి పడీ నవ్వింది. పొట్ట చెక్కలయ్యేలా నవ్వింది. 

నాన్నమ్మ ఎందుకు నవ్వుతుందో నిధికి అర్థం కాలేదు.  నానమ్మ మీద చాలా కోపం వచ్చింది . 

ఆకాశాన్ని హనుమంతుని గద ముక్కలుగా చితక కొట్టేస్తున్నది.  ప్చ్ ..  పాపం.  ఆకాశానికి ఎంత నొప్పిగా ఉందో.. ఎంత ఏడుపు వస్తున్నదో..  ప్చ్ పాపం ఎట్లా .. ఎట్లా సహాయం చేయాలి అని ఆలోచన చేస్తూ ఉంది నిధి.  

 

మనవరాలి బిక్క మొహం చూసిన నాన్నమ్మ వస్తున్న నవ్వుని ఆపుకుంది.  నిధిని చంకన ఎత్తుకొని, బుగ్గలు నిమిరి ముద్దు పెట్టింది.   మనవరాలిని మురిపెంగా చూసింది .  ఆ తర్వాత ఇంట్లోకి తీసుకు పోయి ఒళ్ళో కూర్చో బెట్టుకుంది . 

నాన్నమ్మ ముద్దు చేయడం నిధికి నచ్చడం లేదు . అక్కడ ఆకాశం పగిలి పోతుంటే సహాయం చేయకుండా నాన్నమ్మ  నన్ను ముద్దు చేసిందేంటి అని ముఖం చిట్లించి చూసింది . 

నిధి తల నిమురుతూ అది హనుమంతుని గద కాదు తల్లీ .. మేఘం .   

ఆకాశాన్ని ఎవరు ముక్కలు చేయలేదు.  మేఘాలు ఆకాశంలో అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటాయి అని ఇంకా ఏవేవో చెప్పింది . 

ఆ మాటలు  నిధి బుర్రలోకి వెళ్ళలేదు.  

ఆకాశానికి ఏమీ కాలేదు అని మాత్రం అర్థమైంది . 

వెంటనే, అప్పుడు హనుమంతుడి గద అని చెప్పావుగా .. 

నేనెప్పుడూ చెప్పానే.. ఆ రోజు  మనం పార్క్ కి వెళ్ళేటప్పుడు చెప్పావ్ అంటూ నిలదీసింది నిధి. 

నాన్నమ్మకేమో తను ఎప్పుడు చెప్పిందో అస్సలు గుర్తులేదు. 

కొద్దిసేపటి తర్వాత, శనివారం రాత్రి అమ్మ నాన్న చూసిన సినిమాలో  హనుమంతుడి గద గుర్తొచ్చింది. అయితే సినిమాలో గద ఆకాశాన్ని కొట్టిందేమో అనుకుంది. 

అది నిజం కాదని తెలిసింది.  హమ్మయ్య అని హాయిగా ఊపిరి పీల్చుకుంది. 

ఇంట్లోంచి  బయటికి వచ్చి మళ్ళీ ఆకాశంలోకి చూసింది.  మేఘం ఇంకా పెరిగి ముక్కలు ముక్కలుగా అయినట్లుగా కనిపిస్తున్నది. 

ఆకాశంలో మేఘాలు అప్పుడప్పుడు వస్తాయి అని  నానమ్మ చెప్పింది.  నన్ను ఎప్పుడూ ఎత్తుకోని నాన్నమ్మ ఇప్పుడు ఎత్తుకుంది.  ఆకాశం కూడా అలాగే  మేఘాల్ని అప్పుడప్పుడు ఎత్తుకుంటుందా.. నిధికి మరో సందేహం వచ్చింది.  

తన వెనకే బయటికి వచ్చిన నాన్నమ్మను చూసింది . 

నాన్నమ్మ, నేను బరువైతే నన్ను దింపుతారు కదా .. 

మరి, ఆకాశం మేఘాన్ని ఎత్తుకుంటే దానికి బరువైతే ఎక్కడ దింపుతుంది?  అని ప్రశ్నించింది. 

 

నిధి మాటలకు నాన్నమ్మకి చాలా నవ్వు వచ్చింది .  

వచ్చే నవ్వును ఆపుకుంటూ ఆకాశానికి మేఘం బరువే కాదు. అవి వస్తే దానికి సంతోషమే . మేఘం బరువు అయితే తన దగ్గర ఉన్న నీటిని కిందికి వంపేస్తుంది అని చెప్పింది నాన్నమ్మ  

అవునా ..! ఆశ్చర్యంగా చూసింది నిధి. అలా చూసినప్పుడు నిధి పెద్ద కళ్ళు మరింత పెద్దగా బాదం కాయల్లా కనిపించాయి.  

మనవరాలి బాదంకాయ కళ్ళు అంటే నాన్నమ్మకి ఇష్టం .  

ఆ కళ్ళలోకి  చూస్తూ, ఆ ..అవును, దాన్ని వర్షం అంటారు. వాన అంటారు అని చెప్పింది నానమ్మ.  

ఓ అవునా..  ఏదో అర్ధమయినట్లు తలూపి ఇంట్లోకి వెళ్ళింది నిధి . 

 

మరి కొన్ని రోజులకు నిధి నాన్నమ్మ తో డాబా ఎక్కింది. నాన్నమ్మ సన్నజాజి మొగ్గలు కోస్తున్నది.  నిధి నానమ్మతో ఏవో కబుర్లు చెబుతూ పచార్లు చేస్తున్నది. 

 

నాన్నమ్మా... మంటలు మంటలు. అగ్గి అంటుకున్నది.  ఫైరింజన్ కి ఫోన్ చెయ్యి  అని గట్టిగా అరిచింది.

కంగారు పడిన నాయనమ్మ ఎక్కడ మంటలు అంటే పడమటి దిక్కు చూపింది. 

అది సూర్యాస్తమయ సమయం. 

ఆకాశమంతా ఎరుపు నారింజ రంగుల్లో.. ఎగుస్తున్న మంటల ఆకారంలో.. వాటిని చూసి నానమ్మ నవ్వేసింది. 

నవ్వుతున్న నాన్నమ్మను చూసి నిధికి కోపం వచ్చింది.  మూతి ముడుచుకుంది. 

 

దీపావళి పండక్కి అవతలి బజారులో టపాకాయలు అమ్మే షాప్ లో మంటలు వచ్చాయి. అచ్చం అలాగే ఆకాశంలో మంటలు కనిపిస్తున్నాయి. 

అప్పుడు, గంటలు కొడుతూ ఫైర్ ఇంజన్ వచ్చింది. మంటలు ఆర్పింది. ఆ విషయం గుర్తొచ్చింది నిధికి . 

నాన్నమ్మా.. అట్లా నవ్వుతావేంటి?

ఓ పక్క మంటలు మండిపోతుంటే.. 

మంటలు వస్తే ఫైరింజన్ కి ఫోన్ చేయాలి నాన్నమ్మా.. ఫోన్ చెయ్యి.  గట్టిగా నాన్నమ్మకి ఆర్డర్ వేసింది. 

ఇంత పెద్దగా అయింది. ఈ నాన్నమ్మకి ఏమీ తెలియదు.  గబగబా హాలు లో ఉన్న లాండ్ లైన్ ఫోన్ తీసుకుంది.  

హలో  హలో.. ఇక్కడ మంటలు వస్తున్నాయి . ఫైరింజన్ .. ఫైరింజన్ పంపండి అని చెప్పి పెట్టేసింది. 

 

మనవరాలి ని చూసి మెటికలు విరుస్తూ , మా అమ్మే .. మా తల్లే .. నీకెంత తెలివి అంటూ మురుసుకుంది. 

ఓ పక్క మంటలు మండిపోతుంటే, నాన్నమ్మ నవ్వడం, తీరికగా కూర్చోవడం చూసి నిధికి చాలా బాధ కలుగుతున్నది.  దుఃఖం పొంగి వస్తున్నది.

 

మళ్ళీ ఫోన్ దగ్గరకి వెళ్లి హలో హలో అన్నది. 

అవతల ఎవరి గొంతు వినిపించడం లేదు. నాన్నమ్మా నేను చిన్న పిల్లను అని వాళ్ళు మాట్లాడడం లేదు.  

నువ్వు  ఫైరింజన్ కి ఫోన్ చేయ్యి .  మళ్లీ మళ్లీ అరుస్తూ నాన్నమ్మని చెయ్యి పట్టుకుని లాక్కొని వెళ్ళింది. 

సరిగ్గా అప్పుడే నిధి నాన్న ఇంటికి చేరాడు  

నిధి అరుపులు విన్నాడు.  పైకి వచ్చాడు.

నిధి పరుగెత్తుకుంటూ నాన్ననుఁ చేరింది. నాన్నమ్మ ఫైరింజన్ కి ఫోన్ చేయడం లేదని ఫిర్యాదు చేసింది. 

చూడు, అటు చూడు నాన్నా..  ఎట్లా మంటలు వస్తున్నాయో చూడు అంటూ కిటికీ లోంచి చూపింది.   

అవి మంటలు కాదురా బంగారు తల్లీ.. అంటూ నాన్న  ఒళ్ళో కూర్చోపెట్టుకుని వివరించి చెప్పేవరకూ చాలా హంగామా చేసింది. 

 

ఆ రెండు సంఘటనలు నాన్నమ్మ ఎప్పటికీ మరచిపోదు.

ఇంటికి వచ్చిన అందరికీ చెబుతుంది. అమ్మ నాన్న అందరికీ చెప్పరు.  కానీ ఆకాశం చూసినప్పుడల్లా  గుర్తొచ్చి లోలోనే నవ్వుకుంటారు.   

 

అలా ఆకాశంతో పాటు మేఘాన్ని చూడడం, అది రకరకాల ఆకారాల్లో  మారిపోవడం గమనిస్తున్నది నిధి.  

ఆ ఆకారాలకు ఎన్నెన్నో పేర్లు పెడుతుంది. ఆ పేరుతో వాటిని పిలుస్తుంది. ఆనందిస్తుంది. పరవశిస్తుంది. అవి కదులుతూ కిందకు వస్తుంటే తన దగ్గరకు వస్తున్నాయి అని  భావిస్తుంది. చప్పట్లు కొడుతూ రమ్మని కేరింతలు కొడుతుంది  

చిక్కగా , దట్టంగా ఉన్న మేఘాన్ని చూసి ఇది ఎక్కడో నీళ్లు కుమ్మరిచ్చేస్తుంది అనుకుంటుంది. 

వాన చినుకులు మొదలవగానే సంతోషంగా చప్పట్లు కొట్టేస్తుంది.  వాకిట్లోకి వెళ్లి నోరు తెరిచి నాలుక చాపుతుంది. వాన చినుకు నోట్లో పడగానే ఇంట్లోకి పరిగెత్తుతుంది. అమ్మతో నాన్నతో  తన ఆనందం పంచుకుంటుంది. 

ఎప్పుడు చూసినా అదే ఆకాశం. అందులో అంతగా చూసేది ఏముంటుంది అంటావుగా నానమ్మా.. 

దా...  నాతో రా..  అంటూ బయటికి లాక్కొని వస్తుంది . నానమ్మని తాను చేసినట్లు చేయమంటుంది . 

నోరు తెరిచి నాలుక బయట పెట్టు నాన్నమ్మా.  ఇదిగో ఇట్లా చేతులు చాచి వానా వానా వల్లప్పా అంటూ గుండ్రంగా   తిరుగు నాన్నమ్మా అని ఆవిడను కూడా తిప్పుతుంది. 

నోట్లో వాన చినుకు టప్ మంటూ పడగానే నా నోట్లో పడింది. నా నోట్లో పడింది అంటూ సంబరపడిపోతుంది.  

నాన్నమ్మా.. ఇంకా నీ నోట్లో చినుకు పడలేదా.. అంటూ ఆరా తీస్తుంది. 

నానమ్మ.., చూడు, చల్లగా ఎంత బాగుంది కద నానమ్మా .. అంటుంది నిధి. 

తన మీద చినుకు పడగానే వర్షం నన్ను ముద్దు పెట్టుకుంది అని కేరింతలు కొడుతుంది. 

 

నానమ్మ ఎప్పుడూ ఇంట్లో ఉంటుంది.  వాన చినుకులు పట్టుకోవడం, వాటిని ముద్దు పెట్టుకోవడం కూడా తెలియదు.  పాపం, తన ఫ్రెండ్స్ ఎవరూ చెప్పలేదేమో.. .ఆశ్చర్యపోతూనే ఉంటుంది నిధి.  

అందుకే నాన్నమ్మను తన స్నేహితురాలిగా మార్చేసుకుని తనకు తెల్సినవన్నీ నేర్పించాలని తాపత్రయ పడుతుంది నిధి. 

 

చీకటి దాటి అందంగా వచ్చే సూర్యోదయాన్ని చూస్తే  సంబురం.  నెమ్మదిగా మాయమయ్యే సూర్యాస్తమయాన్ని చూడడం నిధికి  చాలా సంభ్రమం.  

అబ్బ..  ఎంత అందంగా ఉన్నావే ఆకాశం.  ఎన్ని రంగుల బట్టలు వేస్కుంటావు. 

మాటి మాటికీ ఆ బట్టల రంగులు మార్చేసుకుంటావు ఎందుకు ?  

నీకు ఈ బట్టలన్నీ ఎవరు ఇస్తారు అని అడుగుతుంది. 

ఏంటో.. నాన్నమ్మ ఎప్పుడు చూసిన ఇంట్లో పని పని అంటుంది.  లేకపోతే టీవీ అంటుంది.  కానీ అద్భుతమైన ఆకాశాన్ని, అది వేసుకునే రంగురంగుల బట్టల్ని, మేకప్ ని గుర్తించదు. ఆనందించదు.  ఇట్లా ఎట్లా ఉంటారు అని ఆశ్చర్యపోతుంది. 

అమ్మకి, నాన్నకి సమయమే ఉండదు.  

మబ్బులు పట్టి ఆకాశమంతా చిక్కటి బూడిద రంగుల్లోకి మారిపోయినప్పుడు కూడా కదిలే మేఘాల్ని కళ్లప్పగించి చూస్తుంది. మేఘాలలో రకరకాల రూపాలు చూస్తుంది. తను విన్న కథల రూపాలను ఆ మబ్బు తునకల్లో వెతుక్కుంటుంది. వాటితో మాట్లాడుతుంది.  

 

ఆరేళ్ళు వచ్చేసరికి నిధి చేతికి బొమ్మల పుస్తకాలు వచ్చాయి.  బొమ్మలకు రంగులు వేయడం మొదలు పెట్టింది.  ఆ బొమ్మల్లో, గీతల్లో సూర్యుడు, చందమామ, ఆకాశం, మేఘాలు , పక్షులు తనకు తోచిన విధంగా వేసేది.  వాటికి తాను చూసిన రంగులు పులిమి ఆనందించేది. 

ఆకాశంలో మారే రంగుల్ని చూస్తూ  నీకు ఈ రంగులు ఎవరు వేశారు..  నీ రంగులు భలే ఉన్నాయి అనేది. 

నిధి వయసు పెరుగుతున్న కొద్దీ ఆమెతో పాటు ఆ ఇష్టం కూడా పెరిగిపోతూనే ఉంది.  చక్కటి ఊహలు ఆమెకు తోడుగా వస్తూనే ఉన్నాయి. 

 

అంతులేని నీలాకాశం, అందులో మెరిసే చందమామ, మినుకు మినుకు మెరిసే చుక్కలు ఎన్నిసార్లు చూసినా అద్భుతమే ఆ చిన్ని బుర్రకి . 

 

చందమామ రావే 

జాబిల్లి రావే 

కొండెక్కి రావే 

కోటి పూలు తేవే 

అంటూ గోరుముద్దలు అమ్మ పెట్టినప్పుడే వాటి మీద ఆకర్షణ మొదలైంది. అది ఆమెతో పాటు పెరిగిపోతూ ఉంది.  పెరుగుతున్న కొద్దీ అనేక ప్రశ్నలు, సందేహాలు తలెత్తడం మొదలైంది. ఆ సందేహాలకు, ప్రశ్నలకు జవాబుల కోసం వెతకడం కూడా ప్రారంభమైంది. 

 

ఆకాశానికి ఆవల ఏముందో అని ఆలోచిస్తుంది.  పగలు సూరీడు వెలుతురు ఇస్తున్నాడు. రాత్రి ఎక్కడికి పోతున్నాడు. ఎక్కడ పడుకుంటాడు.  చందమామ పగలంతా ఎక్కడ ఉంటుంది. ఒక్కోసారి రాత్రి కూడా కనపడదు. అప్పుడు ఎక్కడ ఉంటుందో .. అని సందేహ పడుతుంది. 

అమ్మని  నాన్న ని అడిగి తెలుసుకోవాలని ఉబలాట పడుతుంది.  తనకి తృప్తి ని ఇచ్చే సమాధానం వచ్చే వరకు మళ్ళీ మళ్ళీ ఆ ప్రశ్న వేస్తూనే ఉంటుంది. 

రాత్రిపూట చుక్కలు పై నుండి టార్చ్ లైట్ వేసి తమకు వెలుతురు ఇస్తున్నాయి  ఎంత మంచివో అనుకునేది ఒకప్పుడు. వాటి గురించి రకరకాల ఆలోచనలు చేసేది.  ఇప్పటికి కూడా ఆ ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి. ఆగలేదు. 

 

నిధికి ఐదేళ్ల వయసులో అమ్మమ్మ తాతయ్య కారు ప్రమాదంలో చనిపోయారు.

అమ్మమ్మ తాతయ్యల గురించి అడిగేది.  వాళ్ళని ఎక్కడికి తీసుకు పోయారు అని ప్రశ్నించేది.  

అలా అడుగుతుంటే ఒకరోజు, మామయ్య ఆకాశంలో చుక్కలు చూపించాడు.  ఆ చుక్కల్లో అమ్మమ్మ తాతయ్య ఉన్నారని చెప్పారు.  

అప్పటి నుంచి ఎప్పుడు ఆకాశంలో  నక్షత్రాలు  చూసినా అమ్మమ్మ, తాతయ్య ఆకాశంలో చుక్కై తనను చూస్తున్నారని భావిస్తుంది నిధి. 

నాకు చీకటంటే భయం కదా. అందుకే చీకట్లో భయం లేకుండా టార్చి వేస్తున్నారని అనేది.  చీకటిలో బయటికి వెళ్లడానికి ఎప్పుడు అమ్మమ్మ తాతయ్య తనకు తోడుగా ఉంటారని అనుకునేది.  అప్పటి నుంచి చీకటి అంటే భయం పోయింది చిన్నారి నిధికి. 

తన మాటలకి  అమ్మ నాన్న నవ్వితే  నిధి చిన్నబుచ్చుకుని, అత్తిపత్తి ఆకు లాగా ముడుచుకు పోయేది. 

 

ఒక సారి  పక్కింటి వాళ్ళ కుక్క పిల్ల చనిపోయింది.  ఆ కుక్క పిల్ల చనిపోయి ఆకాశంలో చుక్క అవుతుంది అని అమ్మకు  చెప్పింది నిధి. 

కాదు మట్టిలో కలిసి పోతుంది అని చెప్పింది అమ్మ. 

నిధి ఒప్పుకోలేదు. నాన్నని అడిగింది. నాన్న కూడా మట్టిలో కలిసిపోతుంది అని చెప్పాడు. 

మరి మనుషులు ఏమవుతారు అని అడిగింది. 

మనుషులు కూడా మట్టిలో కలిసిపోతారు అని చెప్పాడు నాన్న . 

ఏం కాదు ఆకాశంలో చుక్కలు అవుతారు. అమ్మమ్మ తాతయ్య అయినట్లుగా .. 

నీకేం తెలియదు. మామయ్యకు చాలా తెలుసు అని వాదించేది. 

 

నీలి మేఘాల తో కలిసి విహరించే విహంగాలని, విమానాలను అలా కళ్లప్పగించి చూస్తూ ఉంటుంది నిధి.  

అవి భూమి మీద నిలవకుండా గాలిలో ఎగరడం ఎప్పుడు అద్భుతమే .. అలా ఎలా ఎగురుతున్నాయి ..  అర్థం కాని ప్రశ్నే .  

తను కూడా పక్షిలా ఎగరాలని ప్రయత్నం చేస్తుంది. 

చేతులు చాపి ఊపుతూ ఎగరాలని ప్రయత్నిస్తుంది . అది సాధ్యం కావడం లేదు.  

ఎన్ని సార్లు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. మరి పక్షులు ఎలా ఎగురుతున్నాయి 

విమానం ఆకాశంలో ఎలా ఎగరగలుగుతున్నది  ఎన్నో ప్రశ్నలు ఆ చిట్టి బుర్రలో తాడు లేని బొంగరం లాగా గిరగిరా తిరుగుతుంటాయి. 

 

అప్పుడప్పుడు తన ప్రశ్నలు అమ్మనో నాన్న నో అడిగేది.  అమ్మ పనిలో ఉంటే విసుక్కునేది.  లేదంటే చెప్పేది . 

ఒకరోజు ఎప్పట్లాగే అడిగింది పక్షిలా నేనెందుకు ఎగరలేదు అని. 

మనం మనుషులం కదా  .. మనకి రెక్కలు ఉండవు . 

అవి పక్షులు కదా .. వాటికి రెక్కలు ఉంటాయి . వాటి శరీరం ఎగరడానికి వీలుగా తయారయింది.  ఆకాశంలో ఎగర గలవు అని చెప్పింది అమ్మ. 

నేను పక్షినైతే .. పక్షి నేనైతే.. ?! అని కాసేపు ఆలోచిస్తుంది 

 

ఏడేళ్ల నిధిలో మన శరీరం ఎగరడానికి వీలుగా తయారు చేసుకోకూడదా అనే ప్రశ్న మొదలైంది.

పక్షిలా తోక, ఈకలు పెట్టుకుంటే తను కూడా ఎగుర వచ్చేమో.. అనుకుంది.

వెంటనే అమ్మకు చెప్పింది. 

మిక్సీ లో పప్పు రుబ్బుకుంటూ అమ్మ పకపకా నవ్వేసింది.  అప్పుడు నిధి మొహం చిన్నబోయింది. 

నాన్న నిధిని చూశాడు. అమ్మను అడిగింది విన్నాడు. 

బంగారు తల్లీ... రా.. మనం కబుర్లు చెప్పుకుందాం అంటూ హాల్ లోకి తీసుకెళ్లాడు. 

వంటపనిలో వత్తిడిలో ఉన్న అమ్మ వీళ్ళని పట్టించుకోలేదు.  

 తల్లీ.. పక్షిలా ఎగరాలని ఉం ది కదూ అడిగాడు నాన్న. 

'అవును, నాన్నా .. 'అంటూ నాన్న వైపు చూసింది.   

'రెక్కలు ఉంటే చాలదు. పక్షుల ఎముకలు తేలికగా ఉంటాయి . బోలుగా ఉంటాయి. వాటి కాళ్ళు బలంగా ఉంటాయి. పక్షి కాళ్లను భూమి నుంచి గాల్లోకి నెట్టేస్తుంది . గాలిలో ఉండడానికి రెక్కలు ఊపుతుంది . దాని రెక్కలు గమనించావా అవి తలకిందులుగా ఉండే చెంచాలాగా వక్ర ఆకారంలో ఉంటాయి.  పక్షి ఆకారం గాలి రెక్కల పైన , కింద కదలడానికి , గాలిలో ఉంచడానికి సహాయపడుతుంది పక్షులు ఎప్పుడు రెక్కలు కట్టుకోవు' అని వివరించారు నాన్న 

 

మరి నేనెలా ఎగరాలి? నిధిలో ఆలోచనలు.  

(నిధి ఆలోచనలేంటో వచ్చే సంచికలో .. )

©2021 © 2021 Bahula International Magazine

bottom of page