సంపాదకీయం
అమ్మలూ మనదే బాధ్యత
"నీ కథను చెప్పాలనుకుంటే
నువ్వెలా స్వేచ్ఛనొందావో చెప్పు
అది నీకు మాత్రమే ప్రత్యేకం"
(థేరీగాథలు- బొల్లోజు బాబా)
థేరీగాథల్లో 'ఉపచాల' చెప్పినట్టు మన ప్రయాణం గురించి చెప్పేటప్పుడు మనం ఓడిగెలిచిన నెత్తుటి గాయాలను గురించి మాట్లాడాలి.
'పదుగురాడు మాట పాడియై ధర జెల్లు', 'మెజారిటీ ఈజ్ రూల్' అంటారు కదా.. అయితే ఏ మెజారిటీ చెప్పింది రూల్ అవుతుంది ఈ పితృస్వామ్యంలో.. 'ఏ పదుగురు ఆడిన మాట న్యాయంగా చెప్పబడుతుంది ?' ఈ స్వార్ధ ప్రపంచంలో.. అత్యాచార భారతంలో మహిళలకు రక్షణేది.. పసిపిల్లల నుండి వృద్ధురాళ్ళ వరకు అందరూ మాంసపు ముద్దలుగా లైంగిక హింసకు గురవుతున్నారు. వీటి మూలాలు పురుషాహంకార మెదళ్ళలో ఉన్నాయి. సవరించాల్సిన బాధ్యత మన పైనే ఉన్నది.
'ఎంత పెద్ద ప్రయాణమైనా ఎవరో ఒకరు వేసే తొలి అడుగుతోనే మొదలవుతుంది'. ముళ్ళు, రాళ్లు, బురద ఉన్న నేలను తొక్కుతూ అడుగులు వేసిన వారందరూ మనకు కొత్త తొవ్వలు వేశారు.
మరి మనమేమి చేస్తున్నాం మనం అంటే అమ్మలు అమ్మమ్మలు నానమ్మలు అత్తమ్మలు పెద్దమ్మలు టీచరమ్మలు డాక్టరమ్మలు లాయరమ్మలు పోలీసమ్మలు రచయితమ్మలు.. అదేనండీ.. అమ్మలందరం ఏమి చేస్తున్నాం..? అమ్మాయిలకు జాగ్రత్తలు చెపుతున్నా.. వారితోపాటే మనమే కని, పెంచుతున్న అబ్బాయిలను ఉపేక్షిస్తున్నాము.. అమ్మాయిలతో ఎలా మసులుకోవాలో నేర్పటం లేదు. అమ్మాయిలకు తోడు వెళ్ళమని కాపలా పంపుతున్నాం.. అమ్మాయిల ఆత్మవిశ్వాసాన్ని గౌరవించమని, వారిపట్ల మర్యాదగా ఉండమని నేర్పడం లేదు. 'నేను మగాణ్ణి' అని ఒక పసివాడి వీడియో హల్చల్ చేసింది ఈమధ్య సోషల్ మీడియాలో.. ఎక్కడ నేర్చుకున్నాడు వాడు. మగాడు ఏమైనా చెయ్యచ్చు అనే కుటుంబ వాతావరణంలో.. మగాళ్ళకే ప్రవేశమనే గుళ్ళలో…మగరాయుడిలా ఆ మాటలేంటి అరుపులేంటి అనే సమాజంలో.. తమ్ముడితో పోటీ ఏమిటి అనే అమ్మల దగ్గర. కాదంటారా..
ఒకామెను రాళ్ళతో కొట్టిచంపారు, ఒకామె ముక్కు చేవులు కోసారు, ఒకామె పాలుతాగుతూ ప్రాణాలు పీల్చి చంపారు, కాపాలాఉన్నామెను సంహరించారు, వేదాలు చదివినందుకు చంపారు, ప్రశ్నించినందుకు చంపారు అని పాఠాలు చెప్పి అబ్బాయిలకు హింసనునేర్పి, అమ్మాయిలకు భయపడి బతకడం నేర్పే బదులు.. చట్టాల పట్ల అవగాహన కలిగించాలి..
అమ్మాయిలు అణకువగా మర్యాదగా ఆత్మగౌరవం లేకుండా, తమ హక్కులు తెలియకుండా పెరుగుతున్నారు.. వారి పక్కనే అహంకారంతో మగపిల్లలం మాకేంటి.. అర్థరాత్రి వరకు రోడ్లమ్మట తిరగచ్చు.. ఎదురైన ప్రతి ఆడపిల్లను అవమానపరచొచ్చు.. స్మార్ట్ ఫోన్ అంతర్జాలంలో దొరికే ఉచిత అశ్లీల వీడియోలు రేకెత్తించే ఉన్మత్తతతో అత్యాచారాలు చేయొచ్చు అనే హామీ ఇస్తున్నాం.. ఎక్కడైనా దొరికితే భవిష్యత్తు పాడవుతుందని కేసులు పెట్టకుండా వదలేస్తారు.. జైలుకెళ్ళినా క్షమభిక్షతో వదులుతారు.. సన్మామానాలు చేస్తారు.. కానీ అమ్మాయిల పట్ల అమానవీయంగా వ్యవహరిస్తే ఫోక్సో చట్టం ఉంటుందని.. దాని ద్వారా కఠినమైన శిక్షలు పడతాయని చెప్పము..
2012లో వచ్చిన ఫోక్సో చట్టం (The Protection of Children from Sexual Offences Act, 2012) 18 ఏళ్లలోపు పిల్లలందరికీ లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తుంది. 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికలపై అత్యాచారానికి పాల్పడే నిందితులకు కఠినమైన శిక్ష అమలయ్యేలా ఈ చట్టాన్ని రూపోందించారు . వారిపై అత్యాచారం పాల్పడ్డ దోషులకు మరణశిక్ష విధిస్తారు. అనే అవగాహనను కలిగించాలి
అది మనమే చెయ్యాలి.. తల్లిదండ్రులు పిల్లలకు ర్యాంకుల కోసం తరమకుండా.. బాధ్యత గల పౌరులుగా పరస్పరం గౌరవంగా వ్యవహరించేట్టు పెంచాలి.. పిల్లలే రేపటి దేశాభివృద్ధికి మూలస్తంభాలు. అత్యంత విలువైన మానవవనరులు వారిని కాపాడే బాధ్యత మనదే అమ్మలూ..
పసిపిల్లల ముందు వెలిగే దీపాన్ని పెడితే అందమైన పువ్వనే భ్రమతో పట్టుకుంటారు. రోగనిరోధక శక్తి లేని శరీరాలు సకల రోగాలకు ఆహ్వానం పలుకుతాయి. అజ్ఞానంతో వెలిగే మెదళ్ళు అనేక సమస్యలకు, నేరాలకు పరికరాలుగా మారుతాయి. తాము నష్టపోవడమే కాక సమాజానికి కూడా నష్టం కలిగిస్తాయి. కానీ మేధావులు, సిద్ధాంతాలను వల్లించేవారు స్వార్థపుటాలోచనలతో ఒకతరం సమూహాలను దారులు మళ్ళిస్తాయి. జరిగినది అవగాహన చేసుకునేందుకు, వెళ్లాల్సిన దారులు తెలుసుకునేందుకు జీవిత కాలం చాలదు. లంచం తీసుకునే వాడు ఎంతటి అవినీతిపరుడో లంచం ఇచ్చేవాడు కూడా అవినీతికి అంతే బాధ్యుడు. చట్టాలు ధర్మాలు న్యాయవ్యవస్థ అన్నీ ఈ సమాజ శ్రేయస్సును కోరేవే. కానీ స్వార్థంతో బాధ్యత విస్మరించిన వారంతా సంఘవిద్రోహులే. మౌనంగా ఉన్న మేధావులు, పదవులకు బిరుదులకు అవార్డులకు అమ్ముడు పోయేవారు, సంఘ శ్రేయస్సును విస్మరించిన సమూహాలలో భాగస్వామ్యలే. నేరం చేసే వాడితో పాటు నేరం జరుగుతుంటే మౌనంగా చూస్తూ ఉండేవాడు కూడా నేరస్థుడే. వారిని సమర్ధించే వారు కూడా..
ఎండా వాన నుండి రక్షక చర్యలు (గొడుగు వంటివి) లేకుండా ఎండలో వానలో బయటికి పోయి తడిచి లేదా ఎండ దెబ్బ తగిలి బాధపడ్డట్టే. బయట భద్రతా సమాజం లేనప్పుడు అర్ధరాత్రి ఒంటరిగా బయలెల్లి ఆపదలకు గురవుతున్న స్వేచ్ఛా జీవుల వలెనే.. మొదటిసారి ఒక బాలుడు ఏనుగెక్కి దెబ్బతిని పాఠం నేర్చుకున్నా.. విజయం పొందినట్టే. మరోసారి జాగ్రత్త పడతాడు. ఈవ్ టీజింగ్ కు గురైన బాలిక భయపడకుండా జాగ్రత్తపడినట్లే.. విషాదం ఏమిటంటే కత్తులు సుత్తులు కొడవళ్ళు తమ వేళ్ళను గాయపరుస్తాయనే సత్యం బోధపడక, సిద్ధాంతాల రాద్దాంతాల మధ్య అయోమయానికి గురవుతారు. వయసుతో సంబంధం లేకుండా దోపిడీకి వివక్షకు గురవుతున్నట్టే.. అనేక మంది పిల్లి కళ్ళుమూసుకుని పాలుతాగినట్టు. పబ్బం గడుపుకొని 'కెరీరిజం' కోసం పరిగడుపని ప్రచారం చేస్తూంటాయి.. రంగునీళ్ళలో మునిగిన నక్కలను గుర్తించాలి. అమాయకులు బలికాకుండా జాగ్రత్త పడాలి..
జ్వలిత,
ప్రధాన సంపాదకురాలు,
ఫోన్: 9989198943.