top of page
WhatsApp Image 2022-09-12 at 9.02.01 AM.jpeg

సంపాదకీయం 

"ధర్మో రక్షతి, రక్షితః"

-జ్వలిత

బహుళ ప్రధాన సంపాదకురాలు

 

         అజాదీ అమృతోత్సవాలు జరుగుతున్న సందర్భంలో "ధర్మో రక్షతి, రక్షితః" అనే నినాదాన్ని పునర్నిర్వచించుకోవాలి. ఏ ధర్మాన్ని రక్షించాలి…? అంటే.. రాజ్యాంగ ధర్మాన్ని అంటాను. రాజ్యాంగాన్ని మనం రక్షించుకుంటే, రాజ్యాంగం మనని రక్షిస్తుంది.

        భారతదేశ 48వ ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకటరమణ గారు 26 ఆగష్టు 2022న తమ పదవీ విరమణ సందర్భంగా " మన దేశ న్యాయవ్యవస్థ భారతీకరణ జరగాలి" అన్నారు. ఆ మాటలను ప్రతి ఒక్కరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి.

        అట్లా అని వంద శాతం మనని రాజ్యాంగమే రక్షిస్తుందని నిశ్చింతగా ప్రశాంతంగా ఉండటం కాదు. రాజ్యాంగ హక్కులను పరిరక్షించే న్యాయవ్యవస్ద అప్పుడప్పుడు అనారోగ్యం పాలవుతుంది.  చాలా ఎక్కువ నీరస పడుతుంది బలహీనమైనప్పుడే కదా అనేక అసాంఘిక శక్తులు రెచ్చిపోతుంటాయి. అందుకే న్యాయ పరంగా రక్షించబడవలసిన వారు అభద్రతకు గురియై ప్రాణభీతితో పరుగులు పెట్టవలసిన పరిస్థితి వస్తుంది. శిక్షింపబడ వలసిన నేరస్థులు విడుదలయి అధికారులచే సన్మానించబడతారు. సన్మానమంటే అత్యాచారం కంటే అసహ్యమైన జుగుప్సాకరమైనదిగా మారి పోయింది. గుజరాత్ రాష్ట్రంలో బిల్కిస్ బాను కేసులో జరిగింది అదే. ఆ మహిళపై పదకొండు మంది అత్యాచారం చేసి ఆమె కళ్ళముందే తన పసి బిడ్డను చంపేస్తే.. ప్రాణులుగ్గ పట్టుకొని పోరాటం చేసి, న్యాయస్థానం ద్వారా శిక్ష పడిందని ఊపిరి పీల్చుకుంటుంటే.  వజ్రోత్సవాల సందర్భంగా.. న్యాయ సూత్రాలను పక్కకు పెట్టి నేరస్తులను విడుదల చేసి వారికి సన్మానం చేసింది ప్రభుత్వం. 

          బాలలంటే అమూల్యమైన విశ్వమానవ వనరులు. ఒక దేశపు బాలలు, ఆ దేశం యొక్క భవిష్యత్తుకు మూల స్తంభాలు. అటువంటి బాలుడొక్కడు రాజస్తాన్ రాష్ట్రంలో ఒక ప్రభుత్వ పాఠశాలలో తన దప్పిక తీర్చుకోడానికి మంచినీటి కుండను ముట్టుకున్నాడని, ఉపాధ్యాయుని ధారుణ దండనకు గురై జీవించే హక్కును పోగొట్టుకొని మరణించాడు... కేవలం తక్కువ కులంలో పుట్టిన కారణంగా మృత్యువు ఒడికి చేరుకున్నాడు. ఇక్కడ కూడా హంతకుడయిన గురువును రక్షించేందుకు ఒక సమూహం ధర్నాలు చేసింది..

          స్వాతంత్ర్యోద్యమకారులను వందలమందిని 'జలియన్ వాలా బాగ్'  మారణఖాండలో మట్టుపెట్టిన జనరల్ డయ్యర్ కు బంగారు ఖడ్గాన్ని బహూకరించింది బ్రిటిష్ ప్రభుత్వం... అదే పునరావృతమౌతోంది పై రెండు కేసుల్లో.. మీరు నేరాలు చేసినా రక్షింప బడతారని హామీనిస్తోంది. ఇటువంటి భయానక సంక్లిష్ట సమయంలో రాజ్యాంగమే మనకు రక్షణ.. దానిని రక్షించుకోవటమే మన కర్తవ్యం.

     ఇక మన రాష్ట్ర పరిస్థితి. మన రాష్ట్రంలో ఏటా 154 వేల కుటుంబ నియంత్రణ జరుగుతుండగా 3 శాతం పురుషులు మాత్రమే కు.ని. సర్జరీలు చేసుకుంటారట. ఇందులో ఉన్న పితృస్వామ్య ధాష్ఠీకం అర్థమవుతుందా..ఇది స్త్రీలు ఆకాశంలో సగం అంటూ మహిళా సాధికారత.. సాధించినా.. వివక్షకు గురయ్యే మరో కోణమన్న మాట. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సెంటర్లో ఆగష్టు రెండవ వారంలో 34 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ సర్జరీలు జరిగితే, నలుగురు మహిళలు చనిపోయారు. అంటే 10 శాతంకంటే ఎక్కువే.. గతంలో కూడా కు.ని.క్యాంపుల్లో ఇటువంటివి జరిగాయి. ఎవరి నిర్లక్ష్యం ఖరీదు నాలుగు ప్రాణాలు.

మేధావులు మౌన వహించే జాతి ప్రమాదంలో ఉన్నదని చరిత్ర చెప్పిన సాక్ష్యాలు చాలా ఉన్నాయి.

©2021 © 2021 Bahula International Magazine

bottom of page